Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

16    ఏ పురుషుడు నిన్ను స్వప్నమందు, ఎవడు నిన్ను అంధకారమున మోసపుచ్చదలచుచున్నాడో, ఎవడు నీ సంతానమును నష్టపరచుచున్నాడో అట్టి వానిని 'నాశయామసి"
   
17.    నీ కనులనుండి, నాసారంద్రముల నుండి, కర్ణపుటములనుండి, ముఖము నుండి, మస్తిష్కము నుండి, జిహ్వనుండి సమస్త వ్యాధులను తొలగించుచున్నాను.
   
18.    నీ గ్రీవము నుండి, ఉష్టిహములనుండి, కీకసముల నుండి, అనూక్యములనుండి, అంసముల నుండి, బాహువుల నుండి యక్ష్మాదోషమును నివారించుచున్నాము.
   
19.    నీ యొక్క హృదయము నుండి, క్లోమము నుండి, హలీక్ష్ణమునుండి, పార్శ్వములనుండి, మతంస్నములనుండి, యక్నము నుండి యక్ష్మాదోషమును నివారించుచున్నాను.
   
20.    నీ యొక్క ఆంత్రముల నుండి, గుదములనుండి, వినిష్టము నుండి, ఉదరమునుండి, కుక్షుల నుండి, ప్లాశము నుండి, నాభుల నుండి యక్ష్మాదోషమును నివారించుచున్నాను.
   
21.    నీ యొక్క ఊరువుల నుండి, అష్టీవములనుండి, పార్షిణ్యముల నుండి, ప్రపదములనుండి, భవనములనుండి, శ్రోణుల నుండి, భాసద భంససములనుండి యక్ష్మా దోషమును నివారించుచున్నాము.
   
22.    నీ యొక్క అస్థుల నుండి, మజ్జల నుండి, స్నావుల నుండి, ధమనుల నుండి, పాణుల నుండి, అంగుళుల నుండి నఖములనుండి యక్ష్మా దోషమును నివారించుచున్నాను.
   
23.    మిగిలిన అవయవములనుండి, సంపూర్ణ దోమకూపములనుండి, కీళ్ళ నుండి, చర్మమునుండి, నేత్రాది సమస్త అవయవములనుండి, కశ్యపుని వివర్హమంత్రముచే సమస్త వ్యాధులను నివారించుచున్నాము.
   
24.    మనసులోన పీఠము వేసిన రోగమా! దూరమునకు పొమ్ము. పరిగెత్తుము. అతి దూరమున సంచరించుము. జీవించి ఉన్న ఇతని మనసునకు దూరమున ఉండుమని నిర్రుతిలో చెప్పుము.
   
    (సర్వావయములనుండి నివారణ జరిగినపుడే వ్యాధి దూరమై ఆరోగ్యము కలుగుచున్నది.)
   
                                   తొమ్మిదవ అనువాకము
                                     మొదటి సూక్తము - 93

   
1.    నిన్న మేము ఇంద్రునకు సోమము సమర్పించి పుష్టి కలిగించినాము. నేడు మీరు మనోహరమగు సోమము సమర్పించండి. స్తోతలారా! ఈ మాట వినండి. మీరు ఇంద్రుని స్తుతులతో అలంకరించండి.
   
2.    ఇంద్రుని శునకము వృకమనబడుచున్నది. అది శత్రువును తొలగించగలది. మృగములను అణచగలది. ప్రజ్ఞానులకు భూషణమగుచున్నది.
   
    ఇంద్రా! మా స్తుతులను ఆలకించుము. కమనీయమనమున ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
   
3.    ఇంద్రుడు సాధించని పురుషార్దమేది? ఇంద్రుడు వృత్రసంహారియను మధురవచనము విననివాడెవడు?
   
                                     రెండవ సూక్తము - 94
   
1.    మేము స్తోతలము. అన్నము ఆశించువారలము. ఇంద్రా! సత్పతివి, వృత్రహంతవగు నిన్ను ఆవాహనము చేయుచున్నాము.
   
2.    వజ్రహస్త ఇంద్రా! శౌర్య ప్రదాత్రియగు ఈ స్తుతిచే స్తుతుడవగుము. ఇతడు విజయము కోరుచున్నాడు. ఇతనికి గో, అశ్వ, రథ, అన్నాదులు ప్రసాదించుము.
   
                                    మూడవ సూక్తము - 95
   
1.    ఇంద్రా! మానవులు, ఋభువులు, రుద్రులు నిన్నే ప్రథమునిగ ఎంచి సోమపానము చేయమని స్తుతించుచున్నారు.
   
2.    ఇంద్రుడు యజ్ఞమున సోమము సేవించి, మత్తెక్కి, యజమానికి బలమును, ధనవర్ణమును కలిగించుచున్నాడు. మానవులు అట్టి ఇంద్రుని మహిమను పూర్వము వలనే స్తుతించుచున్నారు.
   
                                  నాలుగవ సూక్తము - 96

   
1.    ఇంద్రా! జలమును జలమునకే అర్పించినట్లు నిన్ను అర్ధించు మేము సోమాత్మక జలములను నీకు చేర్చుచున్నాము.
   
2.    వజ్రధారి, శూర ఇంద్రా! నిన్ను రోజు రోజు స్తుతించుచున్నాము. వర్ధిల్లగోరుచున్నాము. నిన్ను నీరు పొంగున రీతి వర్ధిల్ల చేయుచున్నాము.
   
3.    ఇంద్రుని యుద్దగాథలు - మంత్రములు విని ఇంద్రుని మహా హర్యశ్వములు ఇంద్రుని రథమునకు జతయగుచున్నవి.
   
                                   ఐదవ సూక్తము - 97
   
1.    దూతయగు అగ్నిని వరించుచున్నాము. అతడు హోత. విశ్వవేత్త. ఈ యజ్ఞమును సుక్రతువును చేయునుగాక.
   
2.    అగ్ని విశ్వపతి. హవ్యవాహనుడు. అందరకు ప్రీతుడు. అట్టి ప్రజ్వలనాగ్నిని సదా హవిస్సులచే అర్చించండి.
   
3.    అగ్నిదేవా! నీవు మాకు పూజ్యహోతవు. ప్రత్యక్షమగుము. దేవతలను తోడ్కొని రమ్ము.
   
                                  ఆరవ సూక్తము - 98
 

1.    అగ్ని స్తవనీయుడు. ప్రణామాయోగ్యుడు. ఫలవర్షి. అతడు వంకర పోగల నుండి ప్రదీప్తుడు అగుచున్నాడు.
   
2.    అగ్ని అశ్వము వంటి దేవతలను వహించువాడు. ఫలవర్షకుడు. దీప్తుడు. హవిష్మంతులు అగ్నిని యజించుచున్నారు.
   
3.    మేము హవి వర్షకములము. నీవు ఫల వర్షకుడవు. అగ్నిదేవా! మేము నిన్ను ప్రదీప్తుని చేయుచున్నాము. నీవు ప్రజ్వలితుడవగుము.
   
                                 ఏడవ సూక్తము - 99
   
1.    నరుడా! వ్యాపక, తాపక అగ్నిని అన్నము కొరకని గాథలతో అర్చించుము. సుందరుడు, దీప్తుడు, ధనప్రదాత, శరణ్యుడగు అగ్నిని పూజించుము.
   
2.    అగ్నీ! మేము నిన్ను శరణు వేడుచున్నాము. హోతలగు ఇతర అగ్నుల సహితుడవై విచ్చేయుము. యజనీయులు ఆసీనులగునట్టి హవిష్మతీ బర్హి సిద్దముగ ఉన్నది.
   
3.    అగ్ని బలసూనుడు. అంగిరుడు. స్రువములు యజ్ఞములందు అగ్ని కొరకే కదలుచున్నవి. జలపౌత్రుడు, ఘ్రుతకేశి యగు అగ్నిని యజ్ఞములందు ప్రథమముగ అర్చించుచున్నాము.
   
                                       ఎనిమిదవ సూక్తము -100
   
1.    మహాధనసంపన్న ఇంద్రా! మా స్తుతులు అగ్ని సమములు, సువర్ణలు, పవిత్రములు, పరిశుద్దములు అవి నిన్ను వర్ధిల్లచేయునుగాక. విప్రులారా! స్తుతులచే ఇంద్రుని కీర్తించండి.
   
2.    అతడు సముద్రమంతటి విశాలుడు. వందలమంది ఋషులచే కీర్తించబడువాడు. అతనిది సత్య మహిమ. సత్యబలము. అది విప్రరాజ్య యజ్ఞములందు వ్యక్తమగుచున్నది.

3.    హవ్య ఇంద్రా! సమస్త యజ్ఞములందు మమ్ము భూషితులను చేయండి. నీవు అపరిమితుడవు. అయినను ఋక్కులందు ఇముడుచున్నావు. అట్టి ఇంద్రుడు, వృత్రసంహారకుడు, సవనములను ధనుస్సులను శోభిల్లచేయునుగాక.
   
4.    అగ్నిదేవా! నీవు ధనదాతలందు ప్రథముడవు. అత్యంత ప్రకాశకుడవు. జలపౌత్రుడవు. మేము నిన్ను ఆశ్రయించుచున్నాము.
   
                                   తొమ్మిదవ సూక్తము - 101

   
1.    ఇంద్రా! నీవు సమస్త హింసాయుద్దములందు స్పర్ధించుచున్నావు. నీవు అప్రశస్తిని నాశము చేసి కళ్యాణమును ప్రకటించుచున్నావు. నీవు తొందరపడువారిని హతమార్చుము.
   
2.    ఇంద్రా! త్వరపడు నీవెంట, బిడ్డ వెంట తల్లిదండ్రులవలె, ద్యావాపృథ్వులున్నవి. నీవు వృత్రుని సంహరించినపుడు అతని సర్వశక్తులు నిన్ను వధించ స్పర్ధించినవి.
   
3.    ఇచటి మంత్రములు నిన్ను అజరుని, ప్రహేతారుని, అప్రతిహతుని, ఆశుని, జేతను, హేతను, రథితముని, అతూర్తుని, తుగ్య వర్ధనుని చేయుచున్నవి.
   
4.    ఎవడు మానవ ప్రభువో, ఎవడు రథములమీద మంత్రాభిముఖుడు అగుచున్నాడో, ఎవడు సమస్త సేనలను దాటగలవాడో, ఎవడు వృత్ర సంహారియో అతనిని నేను స్తుతించుచున్నాను.
   
5.    పురుహన్మా! ఈ మహత్వ యజ్ఞమున, అన్నము కోరుచు, ఇంద్రుని కీర్తించుము. ఇంద్రుని మహిమ ద్యావాపృథివ్యంతరిక్షములందు వ్యాపించి ఉన్నది. దర్శనీయ ఇంద్రుడు ఆటకని చేత పట్టిన వజ్రము సూర్యుని వలె ప్రకాశించుచున్నది.
   
                                   పదవ సూక్తము - 102
   
1.    ఇంద్రా! నీది బృహద్బలము - బృహత్ బుద్దిబలము. దానితో నీవు వజ్రమును తీక్ష్ణము చేయుచున్నావు.
   
2.    ఇంద్రా! నీకు ద్యులోకము బలము, పృథ్వి అన్నము పర్వతములు ప్రేరకములు అగుచున్నవి.
   
3.    నిన్ను మహా విష్ణువు, సూర్యుడు, యముడు, వరుణుడు ప్రశంసించుచున్నారు. వాయువును వెన్నంటిన బలము నీకు శక్తి ప్రదము అగుచున్నది.
   
                                పదకొండవ సూక్తము - 103
   
1.    నదులు సముద్రమునకు ప్రణమిల్లినట్లు కర్మలొనర్చు సకల ప్రజ ఇంద్రునకు ప్రణమిల్లుచున్నది.
   
2.    ఇంద్రుడు ద్యావాపృథ్వులను చర్మమును చుట్టినట్లు చుట్టినాడు. అతని ఆ వీరకృత్యము వెలుగొందుచున్నది.
   
3.    ఇంద్రుడు క్రోధ భరితుడగు వృత్రుని శిరమును పర్వవంత, రుథిర వర్షక వజ్రమున ఖండించినాడు.
   
4.    ఇంద్రుడు ధనవంతుడు. బలవంతుడు. సర్వ ప్రథముడు. అతడు శత్రువులను సంహరించినపుడు సమస్త శక్తులు ఆనందించుచున్నవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.