Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

13.    సుశిప్ర, దంపతి ఇంద్రా! నీవు బంగారు రథము నెక్కుము. మేము సహితము సహస్రపద, సుందర, స్వస్తిమయ వాణి సంపన్న, నిష్పాప స్వర్గమును ఆరోహింతుము గాక.
   
14.    అతనిని ఈ విధముగ తెలిసి ప్రణమిల్లువారు స్వరాజ్యమున ఆసీనులు అగుచున్నారు. అతడు తనవద్ద గల ధనమును ఋత్విజులు, జయమానుల కొరకు తెచ్చుచున్నాడు.
   
15.    ప్రియమేధలు ఇతని భవనమున ఉండి, అన్నవంతులై, పూర్వ 'ప్రయతిక' ను అనుభవించుచున్నారు.
   
16.    ఇంద్రుడు మానవులకు ప్రభువు అగుచున్నాడు. అతడు రథమున సాగునపుడు సకల సేనలను దాటుచున్నాడు. శ్రేష్ఠుడు అగుచున్నాడు. నేను అతనిని స్తుతించుచున్నాను.
   
17.    పురుహన్మా! ఈ యజ్ఞము విశిష్టము. ఇందు అన్నము కలిగించుటకు ఇంద్రుని అలంకరించుము. ఇంద్రుడు ద్యావాపృథివ్యంతరిక్షములందుండువాడు. ఆట కొరకు వలె ఇంద్రుడు తన చేత ఎత్తిన వజ్రము సూర్యుని వలె ఉన్నది.
   
18.    ఇంద్రుడు ప్రచండుడు. వర్ధిల్లువాడు. ఋభ్వసుడు. అధ్రుష్టుడు. తేజోవంతుడు. అతనిని సేవించువానికి ఎంతటి వాడును హాని కలిగింపజాలడు.
   
19.    ఇంద్రుడు సేనలను దుర్జయుడు. ప్రచండుడు. శరణ్వుడు. వాక్కులచే స్తుతించబడువాడు. ద్యులోక, భూలోకములచే స్తుతించ బడుచున్నాడు.
   
20.    వజ్రిఇంద్రా! వందల ద్యావాపృథ్వులు, వేల సూర్యులు నీ జన్మ మాత్రమునకు సరిరాకున్నారు.
   
21.    వజ్రి, శవిష్ట, మఘవ, వర్షక ఇంద్రా! మాగోవ్రజములందు నీ శక్తిని ప్రవేశపెట్టుము - రక్షింపుము. నీ మహిమలచే మా బలములను వర్ధిల్ల చేయుము.
   
                                        మూడవ సూక్తము - 89

1.    వజ్రధారి ఇంద్రా! ఈ స్తుతి నీకు హర్షదాయకము అగునుగాక. మాకు ధనమును ప్రసాదించుము. బ్రహ్మ ద్వేషులను సంహరింపుము.
   
2.    నీవు మహానుడవు. నిన్ను ఎదిరించగలవాడులేడు. నీవు పణులను నిర్ధనులను చేయుము. సంహరించుము.
   
3.    ఇంద్రా! నీవు అభిషుత అనభిషుత సోమములకు ఈశ్వరుడవు మానవులకు ఈశ్వరుడవు.
   
4.    సోమాత్మక ఓషధులు శక్తివంతములై, జలమును ఆశించుచు ఇంద్రుని సేవించుచున్నవి.
   
5.    ఇంద్రా! నీవు ధర్షక బలమున వ్యక్తమైనావు. నీవు ఫలితములను వర్షించువాడవు అగుచున్నావు.
   
6.    ఇంద్రా! నీవు వృత్రుని సంహరించుచున్నావు. అంతరిక్షమున దాటుచున్నావు. నీ బలమున ద్యులోకమును స్తంభింపచేసినావు.
   
7.    ఇంద్రా! నీకు ప్రీతి కలిగించు మంత్రములను స్వీకరించుచున్నావు. వజ్రమునకు పదనుపెట్టి హస్తమున పట్టుచున్నావు.
   
8.    ఇంద్రా! వ్యక్తమగు సకలమును అణచి పెట్టగల వాడవు అగుచున్నావు. మాకు విరుద్దముగ ప్రవర్తించువారిని పరాభవించుము.
   
                                  నాలుగవ సూక్తము - 90
   
1.    ఇంద్రుడు బలవంతుడు. శీఘ్రతముడు. ధనికుడు అతడు మత్తు కొరకు వచ్చునుగాక. తన మహా బలమున అణచి వేయు వారిని క్షీణింపచేయునుగాక.
   
2.    ఇంద్రా! నీ రథమునందలిది సుఖాసనము. నీ అశ్వములు వశవర్తినులు నీ చేత వజ్రమున్నది. నీవు దివి నుండి దిగి రమ్ము. మేము సోమపాయివగు నీ అభివర్షక బలమును వర్ధిల్లచేయుచున్నాము.
   
3.    ఇంద్రుడు చేత వజ్రము పట్టువాడు. ఉగ్రుడు. శత్రు క్షయకారి. వరదుడు. సత్యబలశాలి. మహాబలవంతులగు అశ్వములు ఇంద్రుని ఈ యజ్ఞమునకు తెచ్చునుగాక.
   
4.    ఇంద్రుడు ద్రోణ పాత్రాభిమాని జ్ఞాని బలి, స్కంభుడు అతని మీద వర్షించండి. మీరు నన్ను గ్రహించండి. బలశాలిని చేయండి. 'కేనిపానము' ను వర్ధిల్లచేయండి.
   
5.    ఇంద్ర దేవా! ఇతనికి ధనమున నిమ్ము. మంత్రము చదువు వానిని ఆశీర్వదించుము. ఈ సోమాభిషవకుని ఇంటికి విచ్చేయుము. ఈ కుశాసనమున కూర్చుండుము. చషకము నిండి ఉన్నది.
   
6.    కొందరు దేవ పిత్రు యానములను అనుసరించదలచుచున్నారు. కొందరు దేవహుతమున యశస్సుగలవారు కాదలచుచున్నారు. కాని ఇంద్రా! నీ అనుగ్రహము లేనివారు యజ్ఞనావను ఎక్కజాలకున్నారు. వారు 'కేపయము'న ప్రవేశించుచున్నారు.
   
    (కేపయము పునర్జన్మ కావచ్చును. సాయన వ్యాఖ్య లేదు.)
   
7.    అశ్వములు ఉత్తమములు, దుర్జయములు అగునుగాక. దాత కొరకు అన్నము నిండిన మేఘము వర్షించునుగాక.
   
8.    ఇంద్రుడు సోమపానము చేసి భీషణుడైనంత పర్వతములను బ్రద్దలు చేయుచున్నాడు. ద్యులోకమును క్రందింపచేయుచున్నాడు. అంతరిక్షము మీద కోపించుచున్నాడు. పృథ్విని విష్కంభితము చేయుచున్నాడు. ఉక్దలను ప్రశంసించుచున్నాడు.
   
9.    మఘవా! గిట్టలు, గోళ్ళతో వినాశము కలిగించువానిని ధ్వంసము చేయు అంకుశమును నేను పట్టినాను. ఈ సవనమున నీకు మంగళమగునుగాక. సోమము సిద్దమైనంత మాకు ధనమును తెలియపరచుము.
   
10.    పురుహోత ఇంద్రా! మేము గోవుల వలన లేమిని ధాన్యము వలన ఆకలిని దాటుదుముగాక. మేము రాజులందు శ్రేష్టులమై స్వబలమున శత్రు ధనమును జయింతుముగాక.
   
11.    బృహస్పతి మమ్ము పశ్చిమ, ఉత్తర, దక్షిణ, అధో దిశ నుండి కలుగు పాపముల నుండి రక్షించునుగాక. ఇంద్రుడు పశ్చిమ మధ్య దిశల పాపముల నుండి రక్షించునుగాక ఇంద్రుడు మిత్రుడై మాకు ధనములు ప్రసాదించునుగాక.
   
                                    ఐదవ సూక్తము - 91
   
1.    ఇంద్రుడు పరమ బలశాలి యగు రాజు. త్రికద్రుక యాగమున యవ పదార్ధములచే తృప్తుడు అగుచున్నాడు. సోమము సేవించుచున్నాడు. విష్ణువు అభిషవించిన దానిని నియంత్రించుచున్నాడు. ఆ సోమము కర్మకారకుడగు ఇంద్రుని మదభరితుని చేయుచున్నది. సత్య సోమము సత్య ఇంద్రుని యందు చేరుచున్నది.
   
2.    ఇంద్రుని అర్చించండి. రథము ముందటి అతని బలమును పూజించండి. ఇంద్రుడు యుద్దము లందు జవహితుడు అగుచున్నాడు. శత్రువును ధ్వంసము చేయుచున్నాడు. వృత్రహంత మా స్తుతులను గ్రహించినాడు. అన్యులు బాణములు ఎక్కుపెట్టకుందురుగాక.
   
3.    ఇంద్రదేవా! నీవు మాకు స్వామివి. మా సమస్త శత్రువుల ఆలోచనలను నష్ట పరచుము. మమ్ము వధించదలచు శత్రువు మీద నీ మృత్యు ముఖ వజ్రమును విసరుము. నీ ధనమును మాకు ప్రదానము చేయుము. అన్యులు బాణములు ఎక్కు పెట్టకుందురుగాక. "అన్య కేషాం జ్యాకా అధిధన్వసు"
   
                                    ఆరవ సూక్తము - 92
   
1.    ఇంద్రదేవా! ఇతడు తీవ్ర హవి ముందు నిలిచి ఉన్నాడు. నీవు ఇతని రథికులను రక్షింపుము. హర్యశ్వములను ఇచట నిలుపుము. ఇచట సోమము అభిషుతమై ఉన్నది. ఇతరులు నిన్ను ఆనందింపచేయకుందురుగాక.
   
2.    ఇంద్రా! ఈ సోమము నీ కొరకు పిండబడి, అభిషవించబడినది. వాక్కులు నిన్ను వేగముగ రమ్మని ఆహ్వానించుచున్నవి. నీవు సర్వజ్ఞాతవు. ఈనాడు ఈ సవనమున సేవించుము. సోమ పానము చేయుము.
   
3.    దేవాకామియగువాడు మనసా ఇంద్రునకు సోమము అభిషవించినచో ఇంద్రుడు అతని ప్రార్ధనలను తిరస్కరించడు. అతని కొరకు రమ్య భాషణలు చేయుచున్నాడు.
   
4.    ధనికుడగు వాడు ఇంద్రుని కొరకు సోమము అభిషవించకున్న ఇంద్రుని ఆగ్రహమునకు గురియగుచున్నాడు. ఇంద్రుడు అతనిని పిడికిట పట్టుచున్నాడు. అట్టి బ్రహ్మ ద్వేషులను ఇంద్రుడు హతమార్చుచున్నాడు.
   
5.    అశ్వములు, గోవులు, అన్నములు ఆశించుచు నీ శరణు కోరి నిన్ను ఆహ్వానించుచున్నాము. నవీనమగు నీ సుమతులందు మేము నిలుతుముగాకయని సుఖముగ నిన్ను ఆహ్వానించుచున్నాము.
   
6.    రోగీ! నేను నిన్ను బ్రతికించుచున్నాను. అజ్ఞాత యక్ష్మ, రాజయక్ష్మను వదిలించుచున్నాను. "గ్రాహి" ఇతనిని పట్టినచో ఇంద్రాగ్నులారా! దానిని విడిపించండి.
   
7.    ఇతడు క్షతాయువైనను, గతాయువైనను, మృత్యువును చేరినను ఇతనిని నిర్రుతి వడినుంచి గుంజుచున్నాడు. ఇతనికి శతశరదాయువు కలుగుటకు ఇతనిని స్పృశించుచున్నాను.
   
8.    వందల బలములు, వేల ఉపాయములచే ఇతనికి నూరేళ్ళ ఆయువు కలిగించి మృత్యువునుంచి ఈడ్చి తెచ్చినాను. ఇంద్రుడు ఇతనిని సమస్త దురితములనుండి ఏండ్ల పర్యంతము దాటించునుగాక.
   
9.    శతాయు హవిస్సులిచ్చి ఇతనిని ఈడ్చి తెచ్చినాను. నీవు నూరు శరత్తులు జీవించుము. నూరేళ్ళు వర్ధిల్లుము. శతహేమంతములు. శత వసంతములు జీవించుము. ఇంద్ర, అగ్ని, సవిత, బృహస్పతులు నిన్ను శతాయుష్కుని చేయుదురుగాక.
   
10.    నేను నిన్ను మరల రప్పించుచున్నాను. రమ్ము, మరల నవ్యుడవగుము. నీ చక్షురాది అవయవములను, పూర్ణాయువును ఈ కర్మ వలన సాధించినాను.
   
11.    అగ్ని రాక్షస సంహారకుడు. అతడు మంత్రయుక్తుడై నీ బాధలను తొలగించునుగాక. నీ గర్భాశయమున నిద్రించు వ్యాధిని దూరము చేయునుగాక.
   
12.    అది పాడు పేరు గల రోగము నీ గర్భమును, యోనిని ఆశ్రయించి ఉన్నది. అగ్నిదేవత మంత్రయుక్తుడై పచ్చి మాంసమును తినునట్టి ఆ రోగమును పెరికి వేయునుగాక.
   
13.    పడచు, జరుగుచు, వెడలుచు నీ గర్భమును నష్టపరచు దానిని ధ్వంసము చేసినాము.
   
14.    ఏ రోగము నీ తొడలందు తిరుగుచున్నదో, మీ దంపతులందు శయనించుచున్నదో, నీ యోనిని తొలిచి బాధించుచున్నదో అట్టి దానిని నాశనము చేయుచున్నాము.
   
15.    ఏ భూతము నీ సోదరి, పతి, జారుని రూపమున చేరుచున్నదో ఏది నీ సంతానమును నష్టపరచుచున్నదో దానిని 'నాశయామసి'




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.