Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    6. ఇంద్రుని మేము ప్రశంసించుచున్నాము. ఇంద్రుడు మమ్ము అనుగ్రహించుచున్నాడు. ఇంద్రుని శత్రువు అతని దరిచేరుటకు భీతిల్లును గాక. జనులు ఇంద్రునకు ప్రణమిల్లుదురు గాక.

    7. పురుహూత ఇంద్రా! నీ ఉగ్రవజ్రము దూరమున ఉన్న, దగ్గర ఉన్న శత్రువును పరిమార్చును గాక. మమ్ము యవాది అన్నవంతులను, గోమంతులను, గోమంతలను చేయుము. మా బుద్ధులను కార్యోన్ముఖులను చేయుము.

    8. మఘవా! నీకు బహులాంతస, వృషసవాన సోమము సమర్పించు వారి ధనమును అడ్డగించకున్నావు. మరియు సోమాభిషకర్తకు భోగ్య ధనమును బహుళముగ ఇచ్చుచున్నావు.

    9. ఒక జూదరి గెలుపు పాచిక వేసి ప్రతికక్షిని ఓడించుచున్నాడు. అతడు దేవకామియైన అట్టి వాని ధనము వ్యర్ధము కాకున్నది. అది ఇంద్రునకు ఉపయుక్తమై అతనిని స్వధావంతుని చేయుచున్నది.

    10. పురుహూత ఇంద్రా! మేము దారిద్ర్యమును పశవులతోను, ఆకలిని అన్నముతోను తరింతుము గాక. రాజులందలి ధనమును, ఓటమి పాలుకాక బలముతో జయింతుము గాక.

    11. బృహస్పతి మమ్ము పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల పాపముల నుండి, రక్షించును గాక. ఇంద్రుడు తూర్పు దిక్కు పాపముల నుండి రక్షించును గాక. మా మిత్రుడగు బృహస్పతి మమ్ము మిత్రులను మించు వారిని చేయును గాక.

                                    పందొమ్మిదవ సూక్తము - 86

    1. ఎవడు మేఘభిన్నకుడో, ఎవడు ప్రథమ సంజాతుడో, ఎవడు సత్య స్వరూపుడో అతడు అంగిరగోత్ర బృహస్పతి హవికి అర్హుడు అగుచున్నాడు. అట్టి వాడు ద్విబర్హజ్మ, ప్రాఘర్మసత్, పాలకుడు వర్షకుడు అగుచున్నాడు. అతడు ద్యావాపృథ్వులందు మరల మరల శబ్దము చేయుచున్నాడు.

    2. బృహస్పతి మానవుల కొరకు వ్యవహరించుచున్నాడు. దేవహూతి యందు లోకములను కల్పించినాడు. ఆవరక మేఘములను భిన్నము చేసినాడు. పురధ్వంసియైనాడు. శత్రుంజయుడు, పరసేనా విజేత అయినాడు.

    3. బృహస్పతి మహా మహా గోష్ఠములను, ధనములను జయించినాడు. జలమును అందించుటకు అప్రతీతముగ స్వర్గమునకు చేరుచున్నాడు. మిత్రుల ద్వారమున శత్రునాశము చేయుచున్నాడు.

                                   ఎనిమిదవ అనువాకము

                                  మొదటి సూక్తము - 87


    1. మమ్ము పాలించు బృహస్పతి సత్యసంజాతమగు సప్తశీర్ష బుద్ధిగలవాడు అయినాడు. విశ్వజన్య 'అయాస్యుడు' ఇంద్రునితో చెప్పి 'తురీయు' ని వ్యక్తపరచినాడు.

    2. సత్యవచనులు, సత్యధ్యానులు, ప్రాణశక్తి యందు వ్యక్తమైన వారలగు దివస్పుత్ర అంగిర గోత్రజులు విప్రత్వమును సాధించినారు. వారు యజ్ఞమున ప్రథమ మాన్యులు అయినారు.

    3. బృహస్పతి హంసవంటి మాటలవాడు. మిత్రులకు మబ్బుల ముడి విప్పువాడు. వాణిని ఉచ్చరించువాడు. స్తుతించువాడు. విద్వాంసుల గానములందు వ్యక్తమగుచున్నాడు.

    4. అన్నము తొలుత రెండుగ, తదుపరి ఒకటిగ చేరి హృదయ కుహరము నుంచి వాక్కును వెలువరించుచున్నది. బృహస్పతి చీకట్లందు వెలుగులు కోరుచు మూడు రకముల ప్రకాశములు కలిగించుచున్నాడు.

    5. బృహస్పతి పురములను విదీర్ణము చేసి పశ్చిమమున శయనించుచున్నాడు. సముద్రమును వర్షముచే నింపుచున్నాడు. ద్యులోకమున మెరసి ఉష, సూర్య, గో, మంత్రములందు చేరుచున్నాడు.

    6. కోరికలు తీర్చు ధేనువుల రక్షకుడగు ఇంద్రుడు తన బలమున మబ్బులను చీల్చినాడు. దధిని కోరుచున్నవాడై గోవులను దొంగిలించిన పణులను ఏడ్పించినాడు.

    7. మిత్రరూప, యజ్ఞాత్మక, ధనప్రద మేఘములను ఇంద్రుడు యజ్ఞతాపముచే భూమికి పుష్టి కలిగించు వర్షముగ మార్చుచున్నాడు. బ్రహ్మణస్పతి మేఘరూపమున ధనములందు వ్యాపించుచున్నాడు.

    8. మేఘములు సత్యమనస్క గోపతులై ఆబోతులు గోవును చేరురీతి గోవులను చేరుచున్నవి. బృహస్పతి తన శబ్దమును మేఘములందు చేర్చి గోవులందు ప్రవేశించుచున్నాడు.

    9. విశ్వరూప యవాది ధాన్యములు అన్నము ప్రసాదించ దలచినపుడు ద్యులోకరూప భవనమును అధిరోహించుచున్నవి. అప్పుడు బృహస్పతి బహురూపములు ధరించినవాడై జ్యోతిని దాల్చి, వర్షము కలిగించి ధాన్యమును వర్థిల్లచేయుచున్నాడు.

    10. అన్నములు వర్థిల్లును గాక. కోరికలు ఫలించును గాక. స్తోతలు రక్షింపబడుదురు గాక. యుద్ధములు వెనుక పడును గాక. ఈ ప్రార్థనను ద్యావాపృథ్వులు ఆలకించును గాక.

    11. ఇంద్రుడు తన మహా మహిమచే జలదపు తలను విచ్చుచున్నాడు. అతడు మేఘములను కొట్టి ప్రకాశించు జల బిందువులచే సప్తనదులను ఏర్పరచినాడు.

    ద్యావాపృథ్వులారా! మమ్ము రక్షించండి.

                                         రెండవ సూక్తము - 88

    1. ఇంద్రుడు సత్యసూనుడు. సత్పతి. గోపతి. అతడు మమ్ము అనుగ్రహించురీతి ఇంద్రుని స్తుతించండి.

    2. ఇంద్రుని హర్యశ్వములు సుందరములు. అవి - మేము కూర్చుండి స్తుతించుచున్న కుశల మీదకు ఇంద్రుని రథమును చేర్చును గాక.

    3. వజ్రి ఇంద్రుని కొరకు గోవులు మధుర దుగ్ధములను ఇచ్చుచున్నవి. అప్పుడు మధుమంత సోమము ఇంద్రునకు అన్నిదిశల నుండి అందుచున్నది.

    4. బ్రధ్నుని గృహమగు స్వర్గమునకు మేము, ఇంద్రుడు చేరుదుము గాక. మేము ఇరువది యొక్క మార్లు మధుసేవనము చేసి ఇంద్రునకు మిత్రులము అగుదుము గాక.

    5. ప్రియమేధులారా! ఇంద్రుని అర్చించండి. బాగుగ అర్చించండి. పుత్రులారా! ఇంద్రుని అర్చించండి. శత్రుంజయ ఇంద్రుని అర్చించండి.

    6. ఇంద్రుని మంత్రము ఉచ్చరించబడునపుడు గర్గర కలశ శబ్దమగుచున్నది. నారీటంకార శబ్దమగుచున్నది. పిశంగ వర్ణ సోమము వెడలుచున్నది.

    7. ఆ వచ్చుచున్న తెల్లని యావులు అనశ్వరములు, అక్షయములు, వానిని గ్రహించండి. ఇంద్రుని పానమునకు సోమము అందుకొనండి.

    8. ఈ సోమమును ఇంద్రుడు పానము చేసినాడు. అగ్ని సేవించినాడు. విశ్వేదేవతలు సోమమును సేవించి ఆనందించినారు.

    జలమా! వరుణ స్థానమును స్తుతించుము.

    9. వరుణా! నీవు సుదేవుడవు. నీవు సప్తసింధువులు గలవాడవు. నీరు పల్లమునకు వలె - నదులు ప్రవహించుచున్నవి.

    10. హవిదాతయగు యజమానికి 'వ్యతీరఫాణయత్' వారు 'తక్వులు' నేతలు విడిచిపోయిన వారి ఉపమలు అగుచున్నారు.

    11. ఇంద్రుడు మహా భారమును వహించుచున్నాడు. సమస్త శత్రువులను అణచుచున్నాడు. అతడు మాటచేతనే ఉడికిన ఓదనమును భిన్నము చేసినాడు.

    12. అతడు మంచి బాలుని వలె క్రొత్త రథము ఎక్కుచున్నాడు. అతడు మాతా, పితల కొరకు విభృక్రతు, మహిష, మృగములను వండుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.