Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
6. ఇంద్రా! నిర్మాత సుమితుడు నీ కొరకు ద్యావాపృథ్వుల కావ్యము రచించినాడు. ఘృతప్లుత అభిషుత సోమము నీ పానమునకు రుచికరమగును గాక.
7. ఇంద్రుడు సత్యసాధ్యుడు. మానవ హితకారి. పురుషార్థి. విశ్వవర్ధనుడు. అతని కొరకు మధుపాత్రను నింపినాను.
8. మహా బలశాలి ఇంద్రుడు సేనలందు వ్యాపించినాడు. ఇంద్రుని మైత్రి కొరకు అనేక సేనలు ఆతురపడుచున్నవి.
ఇంద్రదేవా! నీ సుబుద్ధిచే ప్రేరణ కలిగించు రీతి రథము వలె మా సేనయందు స్థిరపడుము.
ఆరవ సూక్తము - 73
1. సత్యవంతుడు, ధనవంతుడు, సోమపాయి ఇంద్రుడు విచ్చేయును గాక. అతని అశ్వములు మా వైపు పరుగులిడును గాక. మేము ఇంద్రుని కొరకే సోమమును అభిషవించుచున్నాము. అందులకే స్తోతలు ఇచటనే స్నానాదులు చేయుచున్నారు.
2. శూరా! నీ మార్గము మా వద్ద నిలిచిపోవును గాక. నేడు ఈ యజ్ఞమున హర్షపులకాంకితుడవు అగుదువు గాక. వేధ, జ్ఞానవంతుడవగు నీ కొరకు ప్రాచీన ఉక్థలు ఉచ్చరించబడుచున్నవి.
3. వరదుడగు ఇంద్రుడు వర్షముచే భూమిని నింపుచు విచ్చేయును గాక. ఋత్విజులు యజ్ఞములు చేయుచున్నారు. సప్తహోతలు వ్యక్తమైనారు. వారు సుందరస్తుతులు ఉచ్చరించుచున్నారు.
4. మంత్రములు స్వర్గదర్శనము చేయించుచున్నవి. మంత్రములు మహాజ్యోతియగు సూర్యుని ప్రకాశింపచేయుచున్నవి. సూర్యుడు లేనపుడు అంధకారమున వెలుగులు పరచుచున్నవి. నరుల కోరికలను తీర్చి నరోత్తములను చేయుచున్నవి.
5. సోమపాయి ఇంద్రుడు అపరిమిత ధనమును ఇచ్చుచున్నాడు. తన మహిమచే ద్యావాపృథ్వులందు వ్యాపించుచున్నాడు. సమస్త భువనములందు వ్యాపించిన ఇంద్రుని ప్రభావము అనన్యమగుచున్నది.
6. విద్వాంసుడగు ఇంద్రుడు నరులకు మిత్రము వంటి జలమును వర్థిల్లచేసినాడు. ఆ జలము తన ధ్వనిచే రాళ్లను అరిగించి, విడదీయుచున్నది. కోరినపుడు గోవ్రజములను చుట్టుముట్టుచున్నది.
7. జలములు ఆక్రమించి మేఘములను విదీర్ణము చేసినవి. వజ్రమును కాపాడినవి. సముద్రమును రక్షించినవి. ఇంద్రుడు స్వమహిమచే జలముల ప్రభువు అయినాడు.
8. పురుహోత ఇంద్రా! నీవు మేఘములను జలముతో నింపుచున్నావు. అవి నీ కన్నముందే వ్యక్తమగుచున్నవి. అట్టి నేతవగు నీవు అంగిరుల స్తుతులు వినుచు, మేఘములను విదీర్ణము చేయుచు, మాకు మరింత అన్నము అందించుము.
ఏడవ సూక్తము - 74
1. సోమము అభిషవించి పురుహూత ఇంద్రుని స్తోత్రగానములు చేయండి. ఇంద్రుడు - గోవువలె, మాకు కళ్యాణకరుడు అగును గాక.
2. ఇంద్రుడు మా స్తుతులు ఆలకించిన వాడై యజమాని ధనమునకు, గోసంపదకు అడ్డునిలువకున్నాడు.
3. దస్యుహంత ఇంద్రా! నీవు గోవ్రజము వైపు రమ్ము. మమ్ము శక్తివంతులము చేయుము.
ఎనిమిదవ సూక్తము - 75
1. తండ్రి కొడుకునకు ఇచ్చిన రీతి మాకు యజ్ఞఫలములు కలిగింపుము. పురుహూతా! మాకు జీవన పదార్థములను ప్రసాదించుము. మేము పరిపూర్ణ జీవితము గడిపి జ్యోతియందు చేరుదుముగాక.
2. శూరా! అజ్ఞాత పాపములు మమ్ము ఆక్రమించకుండును గాక. దుష్టవార్తలు మమ్ము చేరకుండును గాక. దుష్టపరిణామములు సంభవించకుండును గాక. మేము మానవ సంపన్నులమై సర్వదా కర్మల సారము చేరుదము గాక.
తొమ్మిదవ సూక్తము - 76
1. ఇంద్రదేవా! జ్యేష్ఠము, ఓజిష్ఠము, పరిపూర్ణమగు ధనమును మాకిమ్ము. వజ్రహస్తా! నీవు ద్యావాపృథ్వులను ఏ ధనముతో నింపినావో దానిని మాకు ప్రసాదించుము.
2. దేవరాజా! నీవు మహా ఉగ్రుడవు. మమ్ము రక్షింపుమని నిన్ను ఆహ్వానించుచున్నాము. మాకు గల సమస్త భయకారణములను తొలగించుము. మమ్ము శత్రుదమనులను చేయుము.
పదవ సూక్తము - 77
1. ఇంద్రా! వందల ద్యులోకము, వందల భూలోకములు, వేలమంది సూర్యులు కలసినను వజ్రహస్తుడవగు నీకు సరిరాకున్నారు.
2. వజ్ర, శవిష్ఠ, మఘవ, ఫలప్రద ఇంద్రా! మా గోవ్రజమును రక్షించి మమ్ము రక్షింపుము. నీ మహిమచే నన్ను శక్తి వంతులను చేసి వర్ధిల్లచేయుము.
పదకొండవ సూక్తము - 78
1. ఇంద్రా! నేను నీ అంతటి ఈశ్వరుడను అగుదును గాక. స్తోతలకు దానము చేయుదును గాక. పాపములు నన్ను పీడించకుండును గాక.
2. ఇంద్రా! నాకు ధనము కలిగించుము. నన్ను మించు వానిని స్వర్గమున పంపుము. నిన్ను వినా మమ్ము రక్షించి వర్ధిల్ల చేయువాడెవ్వడు?
పన్నెండవ సూక్తము - 79
1. ఇంద్రా! మాకు తిధాతు, శరణ్య, తివరూధ, శుభంకర గృహమును ప్రసాదించుము. దానినుండి వజ్రమును, విద్యుత్తును దూరముగ ఉంచుము.
2. మేము శత్రువును బాధించకలుగుదుము గాక. శత్రువును దండించ కలుగుదుము గాక. ఇంద్రా! నీవు మా వెంట ఉండుము. మా తనువులను రక్షింపుము.
పదమూడవ సూక్తము - 80
1. చిత్రభాను ఇంద్రా! అది అభిషుత సోమము. వస్త్రముచే వడకట్టబడినది. ధన రూపము. ఇది నీదేయగుచున్నది.
2. హర్యశ్వ ఇంద్రా! నీవు త్వరత్వరగ స్తోత్రములవైపు సాగుము. మా అభిషుత సోమము వద్ద మీ అశ్వమును నిలుపండి.
పదునాలుగవ సూక్తము - 81
1. మిత్రులారా! మీరు మరొకరిని స్తుతించకండి. మరొకరిమీద మనసుంచకండి. మరొకరిని చేరకండి. వరములిచ్చి ఇంద్రునే స్తుతించండి. అతనికే సోమము అర్పించండి.
2. ఇంద్రుడు అవక్రక్షి, వృషభుడు, చర్షసీసహుడు, శత్రుద్వేషి, సంవననీయుడు, మంహిష్ఠుడు, ఉభయలోక రక్షకుడు అగుచున్నాడు.
3. ఇంద్రా! అనేకమంది తమను రక్షింపుమని నిన్ను అనేక స్తుతులచే ఆహ్వానించుచున్నారు. మా మంత్రాత్మాక స్తుతులు నిన్ను నిత్యము వర్థిల్లచేయును గాక.
4. ఇంద్రా! విద్వాంసులు, యజ్ఞకర్తలు, నరుల అంగుళులు తొందరపెట్టుచున్నవి. నీవు విరాట్ రూపమున రమ్ము. రక్షింపుము. మాకు దగ్గరనుండి అన్నములు అందించుము.
పదిహేనవ సూక్తము - 82
1. ఇంద్రా! నీ హర్యశ్వములు శీఘ్రగాములు. వానిని మంత్రములచే రధమునకు జోడించుచున్నాము. విద్వాంసుడవగు నీవు స్థిర, సుఖప్రద రథము మీద సోమము వద్దకు విచ్చేయుము.
పదహారవ సూక్తము - 83
1. అధ్వర్యులారా! ఇంద్రుడు పృథ్వికి వర్షకుడు. అతని కొరకు అరుణ దుగ్ధాంశమును ఆహుతి ఇవ్వండి. విద్వాంసుడు, విశ్వపాలకుడగు ఇంద్రుడు సోమము కొరకు దివినుండి దిగి వచ్చును గాక.
2. ఇంద్రదేవా! నీవు ద్యులోకమున స్వాదు అన్నములు కలిగియున్నావు. వినోదమునకు సోమము కలిగియున్నావు. నీవు హృదయము, మనసు రెండింటితో సోమమును ఆశించుచు దానిని రక్షించుము.
3. ఇంద్రా! నీవు ప్రాదుర్భవించగనే బలము కొరకని సోమము వైపు సాగినావు. అంతరిక్షము నీ మహిమలను ప్రశంసించుచున్నది. నీవు విశాల అంతరిక్షమున నిలిచి యుద్ధపు ధనమును దేవతలకు ఇచ్చుచున్నావు.
4. ఇంద్రా! నీవు గొప్పలు చెప్పుకొను వారితో యుద్ధము చేయుచున్నావు. నీ భుజములను ఆశ్రయించిన మేము యుద్ధమున గెలిచి కీర్తివంతులము అగుదుము గాక.
5. ఇంద్రుడు పూర్వము చేసిన మహా కార్యములను వర్ణించుచున్నాను. ధనవంతుడగు ఇంద్రుడు ఇప్పుడు చేసిన మహత్కార్యములను ప్రశంసించుచున్నాను. సోమము కేవలము అసుర మాయ సహించిన ఇంద్రునిదే యగుచున్నది.
6. ఇంద్రదేవా! నీవు సూర్యనేత్రముతో చూచు సమస్త పశుధనము నీదియే యగుచున్నది. నీవు ఒక్కడవే గోవులకు స్వామివి అగుచున్నావు. నీ అనుగ్రహముననే మేము ధనములు అనుభవించుచున్నాము.
7. ఇంద్ర, బృహస్పతులారా! మీరు ద్యావాపృథ్వుల ధనములకు అధిపతులు. మీరు మీ స్తోతలకు ధనములు ప్రసాదించండి. మమ్ము ఎల్లప్పుడు శుభములు కలిగించుచు పాలించండి.
పదిహేడవ సూక్తము - 84
1. తిసధస్ధ బృహస్పతి తన ఘోషచే పృథివ్యంతరిక్షములను స్తంభింపచేసినాడు. అట్టి వానిని ప్రాచీన ఋషులు నిత్యము ధ్యానించుచున్నారు. మంద్రజిహ్వుడగు అతనిని విద్వాంసులు అగ్రగణ్యునిగా నుతించుచున్నారు.
2. బృహస్పతీ! ఋత్విక్కులు సుస్వరమున, ఆనందభరితులై నిన్ను స్తుతించుచున్నారు. కావున గమనశీల అదాభ్య, దృఢ, ఘృతవంత పృథ్విని రక్షింపుము.
3. బృహస్పతీ! నీవు పరమ రక్షణలతో రక్షించుచున్నావు. అందువలననే ఋత్విక్కులు నీ ముందు కూర్చొని ఉన్నారు. నీ కొరకు చెట్టు నుండి తెంపిన, కొండనుండి రాలిన మధువు సకల దిశల నుండి నిన్ను చేరుచున్నది. నీ కొరకు మధువర్షము వర్షించుచున్నది.
4. బృహస్పతి ప్రథమ జాయమానుడగుచున్నాడు. అతడు జ్యోతిష్మంతమగు పరమ వ్యోమమున వ్యక్తమగుచున్నాడు. అతడు తు తువిజాత, సప్తాస్య, సప్త రశ్మియై అంధకారములను అంతము చేయుచున్నాడు.
5. బృహస్పతి సుస్తుతుడు. అతడు ఋత్విక్ గణములచే ఘోషించుచు వర్షము కలిగించుచున్నాడు. హవ్యము అందుకొన్న బృహస్పతి కోరినంత గోవుల కొరకు శబ్దించుచున్నాడు. గోవులను చేరుచున్నాడు.
6. బృహస్పతి విశ్వదేవత, పాలకుడు, వర్షి. అతనిని, అతని యజ్ఞమును, నమస్కారము, హవిస్సులతో సేవించుచున్నాము.
బృహస్పతీ! మేము సుప్రజావంతులము, వీరవంతులము, ధనపతులము అగుదుము గాక.
పద్ధెనిమిదవ సూక్తము - 85
1. బంతి విసరువాడు అందుకొను వానిని దృష్టిలో ఉంచుకొని విసరుచున్నాడు. స్తోతలారా! ఆ విధముగనే స్తుతులు ఇంద్రునకు అందునట్లు గానము చేయండి. మంత్రవాణితో వాణిని దాటండి. సోమముచే ఇంద్రుని రమింపచేయండి.
2. మిత్రరూపయగు వాణిని ఫలప్రదము చేయునట్లు బోధించండి. స్తోతలారా! శత్రుదమన ఇంద్రుని జాగృతుని చేయండి. ధనపూర్ణకోశము వంటి ధనప్రద ఇంద్రునకు పరిశుద్ధ సోమము సమర్పించండి.
3. మఘవ ఇంద్రా! నిన్ను భోగ పురుషుడనగా, శస్త్రకర్తనుగా చెప్పుచున్నారు. నన్ను క్షీణింపచేయకుము. మా బుద్ధి కార్యలగ్నమగును గాక. మాకు ధనము కలుగు భాగ్యమును ప్రసాదించుము.
4. నా యజ్ఞమున లేక యుద్ధమున నిలిచిన వారు ఇంద్రా! నిన్నే ఆహ్వానించుచున్నారు. నీ మైత్రి ఆశించుచున్నారు. నీకు హవి సమర్పించువారు నీ సఖ్యము కోరుచున్నారు. నీ కొరకు సోమము సిద్ధము చేయుచున్నారు.
5. హవి సంపన్నుడు ధనము పెంచుకొని ఇంద్రునకు సోమము సమర్పించనిచో ఇంద్రుడు అట్టివాని శత్రువు యొక్క వర్థిల్లు సేనతో కలియుచున్నాడు. వజ్రమున హతమార్చుచున్నాడు.





