Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    5. పరివ్యాప్త ఇంద్రా! నీవు ద్యులోకమునుండి గాని, భూలోకము నుండి గాని విచ్చేయుము. నీలో వాణి వాసము చేయుచున్నది.

    6. మేము ఇంద్రప్రాప్తిని కోరుచున్నాము. ఇంద్రుడు భూలోక, స్వర్గలోక, మహర్లోకము లందు ఎచ్చట ఉన్నను విచ్చేయును గాక.

    7. గాధాగాయకులు ఇంద్రుని ప్రశంసించుచున్నారు. అర్చకులు ఇంద్రుని అర్చించుచున్నారు. వాణులు సహితము ఇంద్రుని కీర్తించుచున్నవి.

    8. ఇంద్రుడే హర్యశ్వుడు. అతని అశ్వములు మంత్ర ప్రభావమున రథమునకు జతపడుచున్నవి. ఇంద్రుడే హితకరుడు, రమణీయుడు, వజ్రధారి యగుచున్నాడు.

    9. ఇంద్రుడు విశ్వదర్శనమునకు సూర్యుని ఆకసమునకు ఎక్కించినాడు. సూర్యుడు కిరణములచే మేఘములను విదీర్ణము చేయుచున్నాడు.

    10. ఇంద్రా! నీవు వేలకొలది మహా ధనవంతుడు. యుద్ధములందు మమ్ము రక్షింపుము. నీవు ఉగ్రుడవు. నీ ప్రచండ శక్తిచే మమ్ము రక్షించుము.

    11. మహా ధనమునకును, స్వల్ప ధనమునకును ఇంద్రునే అర్థించుచున్నాము. ఇంద్రుడు వజ్ర, వృత్రహంత.

    12. వరదుడవు, సత్యదాతవగు ఇంద్రా! నీవు స్థిరుడవు. చరు సేవింపుము. మమ్ము రక్షింపుము.

    13. వజ్రధారి ఇంద్రుని దాతనగు నేను నిరంతరము స్తుతించుచున్నాను. స్తుతులు తెగకున్నవి.

    14. ఇంద్రా! నీవు ఈశానుడవు. అద్వితీయుడవు. ఎద్దు చేనిలో దూరినట్లు నరులకు ఫలములు ప్రసాదించుచున్నావు.

    15. ఇంద్రుడు ఒక్కడే నరులకు, ధనములకు స్వామియగుచున్నాడు. అతడు పంచక్షితుల స్వామియు అగుచున్నాడు.

    16. జనుల కొరకు ఇంద్రుని సమస్త దిశలనుండి ఆహ్వానించుచున్నాము. "అస్మాకమస్తు కేవలః" అతడు కేవలము మావాడే యగును గాక.

    17. ఇంద్రా! నీవు హితకరుడవు. ధనికుడవు. బలశాలివి. సహనశీలివి. మమ్ము రక్షింపుము.

    18. ఇంద్రా! నీ రక్షణలందు మేము అశ్వవంతులమై శత్రువులను హతమార్తుము గాక.

    19. ఇంద్రా! నీ రక్షణలందు మేము వజ్రాయుధము ధరించి మాతో స్పర్దించువారిని యుద్ధమున గెలుచుచున్నాము.

    20. ఇంద్రదేవా! మేము నీతోడను, శరుల తోడను కూడిన వారమై, సేవా సమేతముగ మా మీద దండెత్తు వారిని అణచి వేయుదుము గాక.

                                      ఐదవ సూక్తము 67

    1. ఇంద్రుడు మహామహుడు. ఉత్తముడు. మహిమాన్వితుడు. అతని బలము ద్యులోకమంతయగును గాక.

    2. శూరుడవగు నేత తనకు ప్రీతిపాత్రుడగు పుత్రుని సహితముగ యుద్ధమున దూకుచున్నాడు.

    3. సోమపాయి యగు ఇంద్రుని ఉదరము - కకుదము గల వృషభము - విశాల జల సంద్రము వంటిది యగుచున్నది.

    4. ఇంద్రుడు హవిప్రదాతకిచ్చు విశాల భూమి స్తోతలకు కొమ్మమీద పండిన పండు వంటిది అగుచున్నది.

    5. ఇంద్రా! నీ రక్షణ విభూతులు హవి సమర్పించు యజమానులకు శీఘ్రముగ చేరుచున్నవి.

    6. ఇంద్రుడు సోమపానము చేయునపుడు స్తుతులు, ఉక్థలు, శంస్యలు అతనికి కమనీయములు అగుచున్నవి.

    7. ఇంద్రదేవా! విచ్చేయుము సోమమును, సోమాన్నమును సేవింపుము. ఆనందించుము. నీ అభీష్టి ఓజస్సును మించినది.

    8. ఇంద్రునకు హర్షము కలిగించుటకు మాదక సోమమును అభిషవించండి. అది ఇంద్రుని ప్రసన్నుని చేయును గాక.

    9. ఇంద్రా! నీవు సర్వసాక్షివి. సుందర చుబుకపు వాడవు. సవనముల సహితము ఆనందభరిత స్తుతులచే ఆనందమున పొంగి పొరలుము.

    10. ఇంద్రా! ప్రేమించని యువతులు భర్తను విడుచుచున్నారు. స్తుతులు నిన్ను అట్లు విడుచుచున్నవా? కాదు.

    11. ఇంద్రదేవా! కమనీయ ధనమును మావైపునకు పంపండి. మీ 'ప్రభు' 'విభు' ధనమును కూడ మా వైపు మరలించండి.

    12. పరమ ప్రకాశవంత ఇంద్రా! మాకు ధనము నిచ్చుటకు పరమ యశస్వియగు మహా పురుషుని పంపుము.

    13. ఇంద్రా! మాకు గోవులను, యజ్ఞాన్నమును, మహా యశస్సును కలిగించుము. "విశ్వాయుర్దేహ్యక్షితమ్" అక్షయమగు విశ్వాయువును ప్రసాదించండి.

    14. ఇంద్రా! అనుభవయోగ్యమగు బృహత్ ప్రకాశవంత యశస్సు కలిగించుము. రథ సంపద ప్రసాదించుము.

    15. ధనస్వామి, వసుపతి, ఋగ్మియుండగు ఇంద్రుని గీతములచే స్తుతించుచు అతని రక్షణలను పూజించుచున్నాము.

    16. తేప తేప ఇంద్రుని కొరకు సోమము అభిషుతమైనపుడు అరులు బలశాలి ఇంద్రుని ప్రశంసించుచున్నారు.

                                   ఏడవ అనువాకము

                                   మొదటి సూక్తము - 68


    1. ఇంద్రదేవా! మేము స్వర్గము కోరువారలము. ఫలములను ఆశించువారలము. అన్ని సవనములందును నిన్ను మాత్రమే దానము అడుగుచున్నాము. నీవు నావ వంటి వాడవు. అన్న స్వరూపుడవు. నిన్ను ప్రోత్సహించుటకు నరులు యజ్ఞములందు నిన్ను స్తుతించుచున్నారు.

    2. అన్నము కోరు మిథునము గోవ్రజమును దానము చేయునపుడు నిన్ను ధ్యానించుచున్నారు. నీ నుండి వరములు కోరుచున్నారు. స్వర్గమునకు సాగు గవ్యంత మిథునమును నీవు గుర్తించుచున్నావు. అప్పుడు నీవు నీ వజ్రపు ప్రకాశము కలిగించుచున్నావు.

    3. ఉషస్సు సూర్యుని పతాక. స్వర్గము కోరి హవనము చేయుచున్నాము. ఇంద్రా! యుద్ధము చేయు వారల మీదకు నీ వజ్రమును ఎత్తుచున్నావు. మానవ్యస్తోత్రములను ఆలకించుము.

                                   రెండవ సూక్తము - 69

    1. శూరఇంద్రా! మా సవనము లన్నియు మీ కొరకే యగుచున్నవి. మేము నీ మంత్రములనే వర్ధిల్లచేయుచున్నాము. నీవు నరుల ఆహుతులు అందుకొనువాడవు. అందరకు పుష్టి కలిగించువాడవు.

    2. ఇంద్రా! నీవు అభిమాన ధనుడవు. ఉగ్రుడవు. నీ మహిమలు, శౌర్యము, ధనము అనన్యములు.

    3. మహత్వము కోరువారు మహివర్థకుడు, ప్రచేతసుడగు ఇంద్రునకు హవిస్సులు అర్పించండి. మనసున ధ్యానించండి. నరుల కోరికలు తీర్చు ఇంద్రా! నీవు హవిని ఆరగింపుము.

    4. ఇంద్రుడు సర్వనియంత. యజ్ఞాన్నస్వామి. అఖండ కీర్తిమంతుడు. ధనవంతుడు. అతని హర్యశ్వములు వజ్రమును, రథమును లాగునపుడు ఇంద్రుడు రథమున ఆసీనుడు అగుచున్నాడు.

    5. మహావృష్టి ఇంద్రుని స్వంతము అగుచున్నది. సర్వసహాయక ఇంద్రుడు సోమముచే తన మీసములను తడుపుచున్నాడు. సోమము సిద్ధమైనంత ఇంద్రుడు ఇల్లు చేరుచున్నాడు. వాయువు వనములను వడకించినట్లు మధువును వడకించుచున్నాడు.

    6. ఇంద్రుడు వికృత భాషణులను తన మాటచే మృదుభాషణులను చేయుచున్నాడు. అశుభకారకులను హతమార్చుచున్నాడు. అతడు తండ్రి వలె మా బలములను పెంచుచున్నాడు. అట్టి ఇంద్రుని పురుషార్థములను మేము స్తుతించుచున్నాము.

                                        మూడవ సూక్తము - 70

    1. ఇంద్రా! నీవు సోమపాయివి. సత్యమవు. అనాశమవు. మా వేలకొలది గోవుల, అశ్వముల, శుభ్రులందు అనాశత్వుడవు అగుము.

    2. శచీపతి ఇంద్రా! నీవు ధనస్వామివి. నీచుబుకము సుందరము. నీయందు శత్రువును కాటువేయు శక్తి కలదు.

    ఆ తూవ ఇంద్ర శంసయ గోష్వశ్వేషు శుభ్రాషు సహస్రేషు తువీమఘ - మఘవా! ఆ శక్తిని వేల కొలది మా గోవుల, అశ్వముల, శుభ్రుల మీద ఉపయోగించుము.

    3. రెండు కనులను నిద్రపుచ్చుము. అబుధ్య మానములై కనులు నిద్రించును గాక.

        "ఆ తూన ఇంద్ర................"

    4. శత్రువులు నిద్రింతురు గాక. ఇంద్రా! ధనములు మేల్కొనును గాక.

        "ఆ తూన ఇంద్ర................"

    5. ఇంద్రా! పాపవృత్తిని లాగుచున్న గార్ధభమును సంహరించుము.

        "ఆ తూన ఇంద్ర................"

    6. కండుణాచి వలన వాయువు అరణ్యము నుంచి దూరమగుచున్నది.

        "ఆ తూన ఇంద్ర................"

    7. ఇంద్రా! నీవు సర్వ పరిక్రోశములను దూరము చేయుము. కృకదాశ్వమును నాశము చేయుము.

        "ఆ తూన ఇంద్ర................"

                                         నాలుగవ సూక్తము - 71

    1. 68 - 2 పునరావృతము.

    2. నరులు ఇంద్రుని శక్తిని తెలియుచున్నారు. ఇంద్రుడు శరత్తును దాటినంత సులభముగ శత్రువును దాటుచున్నాడు.

    ఇంద్రదేవా! నిన్ను భజించని నరులను నియంత్రించుము. విశాల పృథ్విని, అనంత జలమును ఆనందపరచుము.

    3. మేము ఇంద్రుని శౌర్యములను కీర్తించుచున్నాము :-

    కాంతివంత జలమా! ఇంద్రుడు మత్తిలినపుడు కాపాడండి. మిత్రభావము కలవారలను రక్షించండి. పృతనల సేవకు కృత్యలు చేయండి. ఇతర నదులతో కలవండి. అన్నము ప్రసాదించండి. స్నానములు చేయించండి.

                                        ఐదవ సూక్తము - 72

    1. అశ్వినులారా! ఇది మాయందలి స్తుతి. దోషరహితము. ఇది పిట్టపిల్ల తల్లి కొరకు వలె - ఇంద్రుని ఆశించుచున్నది. దీనిని ఇంద్రుడు బహుకాలముగ ఆశించుచున్నాడు.

    ఇంద్రుడు శూరులకు శూరుడు. సోమభాగస్వామి. ఈ స్తుతి అతనివైపు సాగుచున్నది.

    2. మేము మరొక ఉషస్సును దర్శింతుము గాక. శూరులకు శూరుడగు ఇంద్రుని మనసునందు ఉందుము గాక. "త్రిశోకుడు" నరులకు వందల ఉషస్సులు ఏర్పరచినాడు. "కుత్సుడు" సంసార రథమున అన్నము నింపినాడు.

    3. ఇంద్రా! ఏ స్తోమము నిన్ను ప్రసన్నుని చేయుచున్నది. మాకు నిన్ను దాతను చేయుచున్నది? నీవు స్తుతుల వైపు పరుగులిడుము. ఏ అశ్వము బుద్ధిగా నిన్ను నా వద్దకు చేర్చుచున్నది? నీవు నిరుపమానుడవు. నేను నీకు హవి సమర్పించ కలుగుదును గాక.

    4. ఇంద్రదేవా! నిన్ను శరణుజొచ్చిన నరులను ఏ మనసుచే ప్రకాశింప చేయుచున్నావు? ఆ మనసుతోనే మంచి మిత్రునివలె మా అన్నములను వర్థిల్లచేయుము.

    5. సూర్యదేవా! బిడ్డ కోరిక తీర్చు తల్లి వలె మా ఆర్ధిక అవసరములను తీర్చుము.

    ఇంద్రా! నీకు సంబంధించిన ప్రాచీన స్తుతులు యజమానికి అన్నములు కలిగించును గాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.