Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
8. ఇంద్రుడు పురుహూతుడు. పురుస్తుతుడు. అతనిని గీతములచే గానము చేయండి. ఇంద్రుని స్తుతులచే ఆచ్ఛాదించండి.
9. ఇంద్రుని మహిమ వలననే ద్యావాపృథ్వులు, పర్వతములు, వజ్రము, జలము అతనియందుచేరి ఉన్నది. అట్టి ఇంద్ర దేవుని కీర్తించండి.
10. పురుస్తుత ఇంద్రా! నీవు విజయుడవు. యశస్విని అగుటకు వంటరిగనే స్వశక్తిచే శత్రువులను పరిమార్చినావు.
ఇరువది ఆరవ సూక్తము - 59
1. సమస్త భువనములు, సమస్త దేవతలు, ఇంద్రుడు సుఖములు కొరకే ప్రవర్తించుచున్నారు. ఆదిత్య సహితుడై ఇంద్రుడు మా యజ్ఞములను, తనువులను, ప్రజలను సమర్థవంతములను చేయునుగాక.
2. దేవతలు దేవత్వమును కాపాడుటకు అసురులను హతమార్చి దేవత్వమును రక్షించినారు. ఆదిత్య, మరుద్గణ సహితుడగు ఇంద్రుడు మా తనువునకు రక్షకుడు అగును గాక.
3. దేవతలు సూర్యుని ఆకసమున నిలిపినారు. భూమిని అన్నపూర్ణను చేసినారు. మాకు దేవహితమగు అన్నము, సంతానము కలిగి మేము శతహిమములు ఆనందింతుము గాక.
4. ఇంద్రుడు అప్రతిహతుడు. ఈశానుడు. మానవ యజమానులకు ధనములిచ్చుట యందు అద్వితీయుడగుచున్నాడు.
5. స్తుతించని వారిని ఇంద్రుడు ఎప్పుడు త్రొక్కుచున్నాడు? ఎప్పుడు స్తోతల మాటలు వినుచున్నాడు?
6. ఇంద్రా! నీకు సోమము అర్పించి, నిన్ను బహు స్తుతించువాడు ప్రచండ బలసంపన్నుడు అగుచున్నాడు.
7. ఇంద్రా! నీవు సోమపానము చేయుచున్నావు. బలమును పెంచుచున్నావు. రాక్షసులను వధించుచున్నావు. మేము అట్టి బలమును యాచించుచున్నాము.
8. ఇంద్రా! ఏ ప్రభావమున నీవు 'దశగ్వు' ని 'అధ్రిగు' ని 'స్వర్ణరు' ని రక్షించినావో ఆ ప్రభావమును యాచించుచున్నాము.
9. తన ప్రభావమున నదులను రథము వలె సముద్రమునకు తరలించిన ఇంద్రుని అమృతమార్గమున నడిపించుమని ప్రార్థించుచున్నాము.
ఇరువది ఏడవ సూక్తము - 60
1. ఇంద్రదేవా! నీవు సత్యజితుడవు. దాగనివాడవు. పర్వతము వంటి వాడవు. స్వర్గనాధుడవు. మేము నీకు మిత్రులము మమ్ము మిత్రులనుగ పరిగ్రహింపుము.
2. ఇంద్రా! నీవు సత్యమవు. సోమపాయివి. ద్యావాపృథ్వులందు వ్యక్తమగువాడవు. స్వర్గస్వామివి. నీకు సోమము సమర్పించి వారిని వర్థిల్ల చేయుము.
3. ఇంద్రా! నీవు స్థిర పురధ్వంసివి. దస్యుసంహారకుడవు. నరులను వర్థిల్లచేయువాడవు. స్వర్గ స్వామివి.
4. మధువు కన్న అధిక శక్తిప్రద అన్నముచే ఇంద్రుని సంతృప్తుని చేయండి. యజమానులను వర్థిల్లచేయు ఇంద్రుని, అధ్వర్యులారా! స్తుతించండి.
5. హర్యశ్వ ఇంద్రా! నీవు పూర్వము మహాకార్యములు నిర్వహించినందున నీ వలె స్తుతులను, శుభమును అన్యులు పొందజాలకున్నారు.
6. మేము అన్నాభిలాషులము. అన్నస్వామి ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. శ్రద్ధగా చేయు యజ్ఞములచే ఇంద్రుడు వర్థిల్లుచున్నాడు.
ఇరువది ఎనిమిదవ సూక్తము - 61
1. ఇంద్రుడు స్తోతవ్యుడు. నేత. సకల కర్మ ప్రేరకుడు. మిత్రుని వంటి ఇంద్రుని ఇటురమ్మని స్తుతించుచున్నాము.
2. గోవులను నిరోధించని స్తుతిమంతుడగు ప్రకాశకుడగు ఇంద్రుని నేతికన్న, తేనెకన్న తీపి పదములచే స్తుతించండి.
3. ఇంద్రుని యందు కార్యసాధకమగు అమితశక్తి, జ్యోతి, అనంత దక్షిణ ఉన్నవి.
ఇరువది తొమ్మిదవ సూక్తము - 62
1. ఋత్విజా! అశ్వమును విడిచి స్థిరముగ యజ్ఞములకు వచ్చువాడును, ధనస్వామియు - ప్రశంసనీయుడును అగు ఇంద్రుని యజమానికి శుభములు కలిగించుటకు స్తుతించండి.
2. వైయశ్వా! నిత్యనూతనుడు, దశముడు, మహావిద్వాంసుడు, ప్రాణులందు చలనము కలిగించువాడగు ఇంద్రుని స్తుతించండి.
3. వజ్రహస్త ఇంద్రా! సూర్యుడు ప్రతినిత్యము తన కిరణములను తెలియురీతి నీవు ప్రజాపీడకులను గుర్తించుచున్నావు.
ఆరవ అనువాకము
మొదటి సూక్తము - 63
1. సోమాభిషవకర్త బహుగృహములు కలవాడు అగుచున్నాడు. తన శత్రువులను, దేవ శత్రువులను జయించుచున్నాడు. వేలదానములు చేయగోరుచున్నాడు. అన్నసంపన్నుడగుచున్నాడు. శత్రువులు అతనిని చుట్టుముట్టుకున్నారు.
అభిషవకర్తకు ఇంద్రుడు భువనమంత ధనము ప్రసాదించుచున్నాడు.
2. మరుద్గణములారా! మీ తేజములు తీక్ష్ణములు, శోషకములు. వానిని మా ముందునకు రానీయకండి. మమ్ము జరావస్థకు చేర్చకండి. చేర్చకండి. మీ ఘోష నవ్యము. అమృతము. దానిని మాయందు ప్రవేశపెట్టండి. మాకు శత్రువులను మించిన బలము ప్రసాదించండి.
3. అగ్ని దేవతల హోత. ధనప్రదాత. బలపుత్రుడు. జాతవేది అని ఎరుంగుచున్నాము. అగ్ని దేవతలకు చేర్చు ఉన్నత జ్వాలలచే యజ్ఞమును సుందరము చేయుచున్నాడు. అగ్ని ఘృతప్రకాశమును, ఘృత బిందువులను కోరువాడు అగుచున్నాడు.
4. మరుద్గణములారా! మీరు భరించగలవారు. ఇంద్రసోదరులు. ప్రియస్వభావులు శుభ్రులు. యజ్ఞఫల ప్రదానమునకు గాను పృషతాశ్వముల మీద వచ్చువారు. మీరు విచ్చేయండి. కుశాసనముల మీద ఆశీనులు కండి. పాత్రచషకమున సోమము సేవించండి.
5. అగ్నిదేవా! యజ్ఞమునకు దేవతలను కొనిరండి. వారిని పూజించండి. నీవు మూడు మూల స్థానములందు విరాజిల్లుము. దేవ భాగములను చేర్చి నీభాగమును అనుభవింపుము" అగ్నీధ్ర సౌమ్య మధువును సేవించుము. తృప్తుడవగుము.
6. మఘవా! ఈ సోమము నీ తనువును వర్థిల్లచేయునది. బాహు బలప్రవర్ధకము అగుచున్నది. ఇది నీ కొరకే అభిషుతమైనది. నీ కొరకే పాత్రలో నింపబడినది. బ్రాహ్మణులను తృప్తిపరచు పర్యంతము పానము చేయుము.
7. ఇంద్రుని ప్రాచీనులు ఆహ్వానించిన రీతిగనే ఆహ్వానించుచున్నాను. ఇది పూర్వము ఐశ్వర్యము ఇచ్చిన హవిస్సే యగుచున్నది.
ధనప్రద ఇంద్రా! ఋత్విజులు అర్పించు సౌమ్యమధువును అవసరముననుసరించి సేవింపుము.
రెండవ సూక్తము - 64
1. పాలు పితుకువాడు సులభముగ పాలిచ్చు ఆవును పిలుచుచున్నాడు. అట్లే మమ్ము రక్షించుమని ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రుడు గోప్రదాత. ఆనందమయుడు. ధనసంపన్నుడు. అతడు మా యజ్ఞమునకు విచ్చేసి సోమపానము చేయును గాక.
3. ఇంద్రా! మేము నీ సౌమనస్యమును తెలియుదుము. మమ్ము నిందలపాలు కానివ్వకుము. మావద్దకు రమ్ము.
4. ఇంద్రుడు అపరాజితుడు. విప్రుడు. విద్వాంసుడు. అతని శరణు వేడండి. అతడు మిత్రులకు ధనము ప్రసాదించుచున్నాడా? అని అడగండి.
5. మమ్ము నిందలు చేరకుండును గాక. ఇంద్రుని యందే మనసు లగ్నము చేయండి. ఇంద్రుని శరణు వేడండి.
6. మా సంపదలు శత్రువుల పాలబడకుండును గాక. ఇంద్రుడు మాకు సుఖములు ప్రసాదించినంత మేము సుక్షేత్రముల వారలము అగుదుము గాక.
7. ఇంద్రుడు యజ్ఞములకు శోభ. మానవులకు ఆనందకరుడు, మిత్రులకు ప్రసన్నుడు అగుచున్నాడు. అట్టి ఇంద్రుని అశ్వారోహణము చేయండి.
8. ఇంద్రా! ఈ సోమము సేవింపుము. శత్రు ధనమును కొల్లగొట్టుము. యుద్ధమున మా అశ్వములను రక్షింపుము.
9. శతక్రతుఇంద్రా! నీవు అన్నసంపన్నుడవు. నిన్ను యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. ధనప్రాప్తి కొరకు యజ్ఞము నందు నిన్ను అర్చించుచున్నాము.
10. ఇంద్రుడు ధనముల మహా రక్షకుడు. సత్పాలకుడు. సోమాభిషవకుని మిత్రుడు. ఇంద్రుని స్తోత్రగానములు చేయండి.
11. స్తోమవాహకులారా! రండి. కూర్చొనండి. ఇంద్రుని గానము చేయండి.
12. విరాట్పురుషుడు, వరములసామి ఇంద్రుని సోమము సిద్ధమైనంత ఆహ్వానించండి.
మూడవ సూక్తము - 65
1. పురముల ఆలోచన కలిగినపుడు ఇంద్రుడు మా ముందు వ్యక్తమగుచున్నాడు. ఇంద్రుడు అన్య సహితముగ మమ్ము చేరును గాక.
2. ఇంద్రుడు యుద్ధమున దూకినంత శత్రువు హర్యశ్వమును తాకజాలడు. అట్టి ఇంద్రుని స్తోత్రగానము చేయండి.
3. ఈ సోమము అభిషుతము. దధిమిశ్రితము. పవిత్రము ఇంద్రుని కొరకు సాగుచున్నది.
4. శతక్రతూ! అభిషుత సోమము సేవించుటకు నీవు పెరుగుచున్నావు. త్వరత్వరగ ఎదుగుచున్నావు.
5. స్తోతల భజించు ఇంద్రా! చురుకుదనపు సోమము నీలో చేరును గాక. నీ చిత్తమునకు శాంతి కలుగును గాక.
6. ఇంద్రా! మా స్తోమములు, ఉక్థలు, వాక్కులు నిన్ను వర్థిల్ల చేయుచున్నవి.
7. ఏ యజ్ఞమున అక్షయ పురుషార్థములు కలవో ఆ యజ్ఞములను ఇంద్రుడు రక్షించును గాక.
8. కీర్తనీయ ఇంద్రా! నీవు మాకు ఈశ్వరుడవు. నరుడు మాకు ద్రోహము చేయకుండును గాక. హంతకుడు మాకు దూరమగును గాక.
9. స్థావర, జంగమాత్మక విశ్వముపై సంచరించు ఇంద్రుని రథమును హర్యశ్వములు వహించుచున్నవి. అవి స్వర్గమును ప్రకాశించుచున్నవి.
10. ఇంద్రుని రథసారథి హర్యశ్వములను రథమునకు పూన్చుచున్నాడు. అశ్వములు కామ్యములు. అవి రథపు రెండు ప్రక్కల చేరియున్నవి. రక్తవర్ణ, దుర్దమన అశ్వములు సారథి మున్నగు వారిని వహించుచున్నవి.
11. సూర్య భగవానుడు కిరణములతో ప్రత్యక్షమైనాడు. మర్త్యులారా! అజ్ఞానులకు జ్ఞానము, అంధకారమున ప్రకాశము కలిగించు భానుని దర్శించండి.
12. మరుద్గణములు స్వధా సమర్పకుల గర్భమున ప్రవేశించుచున్నారు. అప్పుడు వారు యజ్ఞియ నామము ధరించుచున్నారు.
నాలుగవ సూక్తము - 66
1. ఇంద్రా! ఉషస్సు అవతరించిన తరువాతనే నీవు స్వశక్తిచే గుహయందున్న ధనమును వెలికి తీసినావు.
2. స్తుతివాణులారా! దేవతలను ఆశించు మా మనసులందు దేవతలను చేర్చిన రీతి మీరు కీర్తిశాలియగు ఇంద్రుని స్తుతించండి.
3. ఇంద్రా! నీవు మరుత్తులతో కూడి దర్శనమిచ్చుచున్నావు. మరుత్తులతో కలిసి ఆనందించుచున్నావు. మరుత్తులతో కూడి ప్రకాశించుచున్నావు.
4. ఇంద్రుడు పాపరహితుడు. ప్రకాశవంతుడు. అతని వలన యజ్ఞము శోభిల్లుచున్నది.





