Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    3. అపరాజిత ఇంద్రా! నీవు ధనమును దాచగలవు. వేల బలములు వారలను చిత్తుచేయగలవు. మఘవా! మేము పిశంగ గోరూప ధనమును త్వరగా ప్రసాదించుమని యాచించుచున్నాను.

                                 పదహారవ సూక్తము - 49

    1. ఇంద్రుడు సోమము సేవించునపుడు ఏ భోజ్యమును ఇష్టపడుచున్నాడు? భోజ్యము భుజించి బలశాలి యగు ఇంద్రుడు శత్రు పురములను ధ్వంసము చేయుచున్నాడు.

    2. ఇంద్రా! నీవు సింహము వంటి వాడవు. రథమున సాగునపుడు నిన్ను అడ్డగలవాడు లేడు. నీవు బలవంతుడవై తిరుగుచున్నావు. సోమము సిద్ధమైనది. విచ్చేయుము.

    3. అతడు ఉగ్రుడు. అయినను శత్రువు బాధింపజాలడు. అతడు యుద్ధమునకు సిద్ధుడు అయినను స్థిరుడు. అట్టి ఇంద్రుడు స్తోతల ఆహ్వానము విన్నప్పుడు ప్రియురాలి దగ్గరకు వలె విచ్చేయుచున్నాడు.

                                    పదిహేడవ సూక్తము - 50

    1. ఇంద్రుడు సమస్త సేనలను పరాస్తము చేయువాడు. శత్రుసేనలను మూర్ఛిల్ల చేయువాడు. అతడు ఉగ్రుడు, బలశాలి. తరింపచేయువాడు. అతనిని యుద్ధమునకు ఆహ్వానించుచున్నాము. ప్రత్యక్షము చేసికొనుచున్నాము.

    2. స్తోతలు సోమపానమునకు విచ్చేయుమని ఇంద్రుని ప్రార్థించుచున్నారు. స్వర్గపతియగు ఇంద్రుడు సర్వబల సంపన్నుడై సోమము వైపునకు సాగుచున్నాడు. స్తోతలను రక్షించుచున్నాడు.

    3. ఇంద్రుడు దర్శనమిచ్చినంత స్తోతలు సస్వరముగ అతనికి ప్రణమిల్లుచున్నారు. ఇంద్రుని వజ్రగర్జన కర్ణములకు హాని కలిగించ కుండును గాక.

                                       పద్ధెనిమిదవ సూక్తము - 51

    1. ఇంద్రుడు ధనవంతుడు. ఉగ్రుడు. అప్రతిహతుడు. బలశాలి. అట్టి ఇంద్రుని కీర్తించి, ఆహ్వానించుచున్నాను. వజ్రి ఇంద్రుడు మాకు ధనము కలిగించు సకల మార్గములను సుగమములు చేయును గాక. "రాయే నో విశ్వ సుపథా కృణోతు వజ్రీ"

    2. ఇంద్రా! నీవు స్వర్గాధిపతివి. అసురులను పరిమార్చు భుజబలము కలవాడవు. ఆ బలమున స్తోతలకు వర్ధిల్లచేయుము. నిన్ను ఆశ్రయించిన ఋత్విజులను పెంపొందించుము.

    3. ఇంద్రా! నీ వద్ద గోవులున్నవి, అశ్వములున్నవి, అవ్యయ భాగము ఉన్నది. వానిని సోమాభిషవకులకు, దాతలకు ప్రసాదించుము - "మా పణౌ" పణులకు ఇవ్వకుము.

                                    పంతొమ్మిదవ సూక్తము - 52

    1. వృత్ర వధకుగాను నరులు ఇంద్రుని మద, బలములను పెంచుచున్నారు. మహా సంగ్రామములకు, ఈ యజ్ఞమునకు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. యుద్ధములందు ఇంద్రుడు మమ్ము ఆవేశించును గాక.

    2. ఇంద్రా! నీవు వీరుడవు. సేనలు గల వాడవు. అరి భయంకరుడవు. స్తోతల కొరకు దుష్టులను దండించువాడవు. అభిషవకర్తకు భూరి ధనము ఇచ్చుచున్నావు.

    3. యుద్ధములందు శూరునకు ధనము అందుచున్నది. ఇంద్రా! అట్టి తరి హర్యశ్వరథము మీద వచ్చి ఎవనిని సంహరించుచున్నావు? ఎవనికి ధనము ఇచ్చుచున్నావు?

    ఇంద్రదేవా! ఆ ధనమును మాకే ప్రసాదించుము.

    4. ఇంద్రా! నీ యజ్ఞము సరళము. నీవు హర్షించినపుడెల్ల మాకు ఆలమందలను ఇచ్చుచున్నావు. నీవు రెండు చేతులతో వందల మారులు ధనములు పట్టినావు. అట్టి ధనమును మాకు ప్రసాదించుము.

    5. ఇంద్రా! ఇంద్రా! సోమపానము చేయుము. మత్తిల్లుము. బలశాలివగుము. నిన్ను మహా ధనశాలిగా ఎరుంగుదుము మా కోరికలు తీర్చుము. మాకు రక్షకుడవు అగుము.

    6. ఇంద్రా! ఈ బలి పశువులు నీకు మహాబలము కలిగించుచున్నవి. నిన్ను విశ్వసించని వారివద్ద కూడ ధనములు ఉన్నవి. అట్టి ధనములను మాకు ప్రసాదించండి.

                                      ఇరువదవ సూక్తము - 53

    1. పాలిచ్చు గోవును పితుకుటకు పిలిచినట్లు, మమ్ము రక్షించుమని ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.

    2. ఇంద్రుడు సోమపాయి. గోప్రదాత. అతడు సోమమును చేరును గాక. సేవించును గాక. హర్షించును గాక.

    3. ఇంద్రదేవా! నీ సౌమనస్యమును ఎరిగియున్నాము. మమ్ము నిందలపాలు చేయకుము. రమ్ము.

    4. శతక్రతు ఇంద్రా! ఈ సోమమును జ్యోతిష్మంతము. బలప్రదము. ఆస్వాదించుము.

    5. శతక్రతు ఇంద్రా! పంచజనులకు నీవు కలిగించిన అవయములను నేను అభిలషించుచున్నాను.

    6. ఇంద్రదేవా! నీ బృహదన్నమును మాకు అందించుము. శత్రువును జయించగల ధనమును మాకు ప్రసాదించుము. మేము సోమ, స్తోమములచే నిన్ను వర్ధిల్లచేయుచున్నాము.

    7. శక్రఇంద్రా! నీవు దగ్గర ఉన్నను, దూరమున ఉన్నను, నీ లోకమున ఉన్నను మా వద్దకు సోమపానమునకు విచ్చేయుము.

    8. ఇంద్రుడు స్థిరుడు. సర్వదర్శి. నిశ్చలుడు. అతడు మాకు గల మహాద్భయములను తొలగించుచున్నాడు.

    9. ఇంద్రుడు మాకు రక్షకుడై ఉన్నచో పాపములు శమించును గాక. మా ముందు శుభములు నడచును గాక.

    10. ఇంద్రుడు దిశ అంతర్దిశలందు అభయములను చేయును గాక. శత్రువులను దృష్టి యందుంచుకొనును గాక.

    11. ఇంద్రుడు సోమముతో ఏ భోజ్యము ఇష్టపడుచున్నాడో హవి ఆరగించిన హర్షమున ఇంద్రుడు శత్రుపురములను ధ్వంసము చేసినాడు.

    12. సింహము వంటి ఇంద్రుడు రథమున సాగునపుడు అడ్డగించగలవాడు లేడు. బలసంపన్నుడవై సంచరించు ఇంద్రా! సోమము సిద్ధమైనంత విచ్చేయుము.

    13. అతడు ఉగ్రుడు. అయినను శత్రువుల బాధించజాలరు. అతడు యుద్ధమున నిలుచును. అయినను ఓడించజాలరు. స్తోతల పిలుపువిని ప్రియురాలి వద్దకు వలె వెళ్లుచున్నాడు.

    14. ఇంద్రా! సోమము పరిశుద్ధ జలము వలె సిద్ధమైఉన్నది. దశా పవిత్రము నుండి వెడలునపుడు నిన్ను స్తుతించుచు కూర్చున్నాము.

    15. ఇంద్రా! సోమము సిద్ధము చేసిన నరులు సుస్వరమున నిన్ను స్తుతించుచున్నారు. దప్పిగొన్న మృగము జలాశయమునకు చేరినట్లు సోమపానమునకు విచ్చేయుము.

    16. వర్షక ఇంద్రా! నీవు ధనమును దాచగలవాడవు. వేల శక్తిమంతులను కూడ విచ్చిన్నము చేయగలవాడవు. పిశంగ గోరూప ధనమును అర్థించుచున్నాము.

                                   ఇరువది ఒకటవ సూక్తము - 54

    1. సూర్యుని కిరణములు ఆశ్రయించుచున్నవి. ఇంద్రుని భువనములు ఆశ్రయించుచున్నవి. ఇంద్రుడు జనులకు ధనము అందించుచున్నాడు. జనులు దానితోనే జీవించుచున్నారు. మేము ఇంద్రుని ఆశ్రయించుచున్నాము.

    2. ఇంద్రుని దానములు కళ్యాణప్రదములు. అతనిని శరణువేడండి. ఆ ధనదాతను స్తుతించండి. ఇంద్రుడు భక్తుల కోరికలు తీర్చుచున్నాడు. మీ స్తుతులు ఇంద్రుని దానమునకు ప్రేరణ కలిగించును.

    3. సూర్యదేవా! నీవు మహానుడవు. ఇది సత్యము. ఆదిత్యా! నీవు మహానుడవు. ఇది సత్యము. నీ మహిమ ప్రశంసనీయము. నీవు మహామహుడవు. ఇది సత్యము.

    4. సూర్యదేవా! నీవు హవి వల్ల మహానుడవు. హవి లేకున్నను మహానుడవు. ఇది సత్యము. అసురులను ఎదిరించు దేవ శ్రేష్ఠుడవు. పురోహితుడవు. ఆర్పరాని జ్యోతివి.

                                        ఇరువది రెండవ సూక్తము - 55

    1. మధుర వచనముల స్తుతులు ఆవిర్భవించుచున్నవి. అవి రథము వంటివి. శత్రుంజయములు, ధనప్రదములు, అక్షయరక్షణలు, అన్నప్రదలు అగుచున్నవి.

    2. ఇంద్రుడు విశ్వస్వామి. వరదుడు. స్తోతవ్యుడు. అట్టి ఇంద్రుని కణ్వులు, భృగువులు, సూర్యుడు కీర్తించుచున్నారు. అట్లే ప్రియమేధులను జనులు సహితము ఇంద్రుని కీర్తించుచున్నారు.

    3. ఇంద్రుని యజ్ఞభాగము విజేత సాధించిన ధనము వంటిది. ఇంద్రుడు హర్యశ్వుడు. పాపములు తాకనివాడు. దక్షుడు. యజమానులకు దాతయగుచున్నాడు.

    4. యజ్ఞియ స్తుతులు ప్రభావ పూర్ణములు, సుందరములు, దీప్తములు, సుసంపన్నలు అగును గాక. ఇంద్రుని సేవించు కర్మములు చేయువాడు పాప విముక్తుడు అగుచున్నాడు.

                                  ఇరువది మూడవ సూక్తము - 56

    1. నీవు వీరులను తొలగించువాడవు. శూరుడవు. స్థిరుడవు. నీ మనసున ఆరాధ్యమగుచున్నది.

    2. ఇంద్రా! నీ సమస్త శక్తులచే నాయందు దాత్రుత్వమును ప్రవేశపెట్టుము. తదుపరి నీవు నాకు సాయపడుము.

    3. అన్నములస్వామీ! నీవు బ్రహ్మ వలె తొందర పడకుము. చురుకుదనపు సోమము సేవించుము. ఆనందించుము.

    4. ఇతడు ప్రసాదించు భూమి సత్యసంపన్న, గోప్రదాత్రి అగుచున్నది. ఇది యజమానులగు, కొమ్మమీద పండిన ఫలము అగుచున్నది.

    5. పృథ్వీపతి ఇంద్రా! నీ సంపదలు, రక్షణలు నీకు హవి అందించు వారలకు చేరుచున్నవి.

    6. సోమప్రియుడగు ఇంద్రునకు స్తోమ, ఉక్థ, శంస్యస్తుతులు ప్రియములు అగుచున్నవి.

                                      ఇరువది నాలుగవ సూక్తము - 57

    1. ఇంద్రా! వజ్రధారివి, వరదుడవు. శత్రుదమనుడవు. హర్యశ్వశ్రీమంతుడవగు నీ లోక కళ్యాణ శక్తిని నుతించుచున్నాము.

    2. నీవు మహిమచే 'ఆయువు' నకు 'మనువు' నకు జ్యోతిని ప్రసాదించినావో ఆ మహిమతో యజమాని పరచిన దర్భాసనము మీద ఆసీనుడవగుము.

    3. ఈ గాయకులు నీ పూర్వ గాథలను గానముచేయుచున్నారు. అవసరము కలిగినపుడు విజయము సాధించుము.

    4. బహుస్తుతుల, బహు ఆహ్వానముల ఇంద్రుని యశస్సును గానము చేయండి. ఇంద్రుని మాత్రమే మీ స్తుతులచే కీర్తించండి.

    5. ఎవడు తన శక్తిచే ద్యావాపృథ్వులను, పర్వతములను, జలములను తనయందు దాల్చినాడో అట్టి ఇంద్రుని కీర్తించండి.

    6. బహుస్తుత ఇంద్రా! నీవు విజయుడవు, యశస్వివి అగుటకు వంటరిగనే స్వబలమున శత్రువులను పరిమార్చినావు.

                                  ఇరువది అయిదవ సూక్తము - 58

    1. ఇంద్రా! నీవు స్థిరుడవు. అపూర్వుడవు. ఇతరుల వైపు వెళ్లకుము. మాకు యుద్ధమందు సాయపడుమని నిన్ను ఆహ్వానించుచున్నాము.

    2. ఇంద్రా! నీవు శత్రుంజయుడవు. నిత్య తరుణుడవు. మహా బలశాలివి. మా కర్మములందు మమ్ము రక్షించుమని నిన్ను ఆశ్రయించుచున్నాము. మేము నీ మిత్రులము. మాకు హితము చేకూర్చుమని వేడుచున్నాము.

    3. ఎవడు మనకు పూర్వము సమస్త పదార్థములను ఇచ్చినాడో అట్టి ఇంద్రుని, మిత్రుని వలె రక్షించుమని స్తుతించుచున్నాము.

    4. ఇంద్రుడు హర్యశ్వుడు. సత్పాలకుడు. నరుల నియంత. స్తుతిప్రియుడు. అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాము. ఇంద్రుడు మాకు నూరు, నూరు ఆవుల, అశ్వముల గుంపులను ప్రదానము చేయును గాక.

    5. ధర్మకృతుడు, మహా విద్వాంసుడు, మహాస్తుతి మంతుడగు ఇంద్రుని బృహత్సామములచే గానము చేయండి.

    6. ఇంద్రా! నీవు శత్రునిబర్హణుడవు. నీవు సూర్యుని ఆకసమున వెలిగించినావు. నీవు విశ్వకర్మవు. విశ్వదేవతవు. మహానుభావుడవు.

    7. నీవు సూర్యునిచే దివిని ప్రకాశింప చేసి స్వర్గమునకు చేరినావు. దేవతలందరు నీకు స్నేహపాత్రులు అయినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.