Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4. ఇంద్రుడు ఆకసమున ప్రకాశించు గ్రహనక్షత్రాదులను స్థిరముగ స్థాపించినాడు. కావుననే అవి రాలకున్నవి.
5. ఇంద్రా! సముద్ర తరంగములు నిన్ను స్తుతించుచున్నవి. సోమము నిన్ను ప్రకాశింప చేయుచున్నవి.
మూడవ సూక్తము - 36
1. మరుత్తులు ఇంద్ర సహితులై దర్శనమిచ్చుచున్నారు. నడచుచున్నారు. ఆనందించుచున్నారు. ప్రకాశించుచున్నారు.
2. ఇంద్రుడు పాపరహితుడు. ప్రకాశవంతుడు. తన గణములతో వచ్చినపుడు యజ్ఞము శోభిల్లుచున్నది.
3. తదుపరి స్వధ అందుకొని గర్భత్వ ప్రాప్తులై యజ్ఞియ నామమును ధరించుచున్నారు.
నాలుగవ సూక్తము - 37
1. యుద్ధమున వెన్ను చూపని ఇంద్రుడు వృత్రుని తొంబది తొమ్మిది పురములను ధ్వంసము చేసినాడు.
2. ఇంద్రుడు పర్వతములందు అశ్వశిరము కొరకు వెదకి, వెదకి దానిని శర్యణావతమున కనుగొన్నాడు.
3. చంద్రుని మీదకు సూర్యుని కిరణములు చేరుచున్నవని చెప్పుచున్నారు.
ఐదవ సూక్తము - 38
1. ఇంద్రుని నుంచి అష్టాపది, నవస్రక్తి, ఋతస్పృశమును పొంది నాయందు చేర్చినాను.
2. ఇంద్రా! నీవు దస్యులను సంహరించునపుడు దుర్బలుడవు కాగా ద్యావాపృథ్వులు నీకు బలము కలిగించినవి.
3. ఇంద్రా! లెమ్ము. అభిషుత సోమము సేవించుము తదుపరి కష్టముగ లేచి నీ గడ్డము కదిలించుము.
ఆరవ సూక్తము - 39
1. ఇంద్రా! మా శత్రువును వధింపుము. మమ్ము యుద్ధబాధల నుండి కాపాడుము. మాకు ధనము ప్రసాదించుము.
2. ఇంద్రా! పురుషులందలి, స్థిరమగు, పార్శ్వములందున్న ధనమును మాకు ప్రసాదించుము.
3. ఇంద్రా! నీవు నరులకు అందించు విశాల ధనమును మాకు అందించుము.
ఏడవ సూక్తము - 40
1. సముద్రమున చేరు నదుల వలె సమస్త స్తోత్రము చేరుచున్నది.
2. శత్రునిబర్హణుడగు వాని, ప్రకాశించువాని, స్తోతలకు ధనము ప్రసాదించు వానిని చక్కని స్తుతులచే కీర్తించుచున్నాను.
ఎనిమిదవ సూక్తము - 41
1. కపోతము గర్భము దాల్చు కపోతిని చేరిన రీతి మా మాట నీకు చేరును గాక.
2. ధనస్వామీ! స్తుతులు నిన్ను మాకు ప్రత్యక్షముచేయుచున్నవి.
3. శతక్రతూ! యుద్ధమున మమ్ము రక్షించుటకు ఉన్నత స్థానమున నిలువుము. మేము ఇతరులతో స్పర్థించినపుడు మా రక్షణకు నిన్ను ప్రార్థించుచున్నాము.
తొమ్మిదవ సూక్తము - 42
1. అతడు ప్రసన్నులను చేయువాడు. శత్రుదమనుడు. కాంతిని ప్రసాదించువాడు. నేత.
2. ఆ పురుహూత ఇంద్రుడు స్వస్తిప్రద నావలందు మమ్ము దాటించును గాక. మమ్ము సమస్త శత్రువులకన్న అధికులను చేయును గాక.
3. ఇంద్రదేవా! మాకు రెండు చేతులచే అన్నము అందించుము.
పదవ సూక్తము - 43
1. మహా వృత్రుని వధించుటకు ఇంద్రునకు పుష్టి కలిగించుచున్నాము. వరములిచ్చు ఇంద్రుడు మహానుడు అగును గాక.
2. ఇంద్రుడు పాశమగుచున్నాడు. యజ్ఞములకు ఆహూతుడు అగుచున్నాడు. ప్రకాశించుచున్నాడు. ప్రశంసనీయుడు, సౌమ్యుడు అగుచున్నాడు.
3. అతడు అచ్యుతుడు. వజ్రము వంటి దృఢగాత్రుడు. అతడు శత్రు ధనమును యజమానులకు అందించుచున్నాడు.
4. బృహదింద్రుని గాయకులు ప్రశంసించుచున్నారు. భక్తులు అర్చించుచున్నారు. వాణి సహితము ఇంద్రుని స్తుతించుచున్నది.
5. ఇంద్రుడు హర్యశ్వుడు. అవి మంత్రములచే రథమున జతపడుచున్నవి. ఇంద్రుడే రమణీయుడు. వజ్రధారి.
6. విశ్వదర్శనమునకు ఇంద్రుడు సూర్యుని ఆకసమున నిలిపినాడు. సూర్యాత్మక ఇంద్రుడు తన కిరణములచే మేఘములను విదీర్ణము చేసినాడు.
7. ఇంద్రా! విచ్చేయుము. పరచిన దర్భాసనము మీద ఆసీనుడవగుము. సోమము సిద్ధమైయున్నది. పానము చేయుము.
8. ఇంద్రా! నీ యొక్క హర్యశ్వములు మంత్రములచే రథమున కూడునవి. కోరిన చోటునకు చేర్చునవి. జాలుగలవి. అవి నిన్ను మా వద్దకు చేర్చును గాక. నీవు మా స్తుతులు వినుము.
9. సోమపాయి ఇంద్రా! అర్చించిన సోమము ఇచట ఉన్నది. సోమపానమునకు మనసునంటు స్తుతులచే ఆహ్వానించుచున్నాము.
10. స్థావర, జంగమాత్మక విశ్వము మీద సంచరించు రథమునకు హర్యశ్వములు కట్టి ఉన్నవి. హర్యశ్వములు ద్యులోకమున ప్రకాశించుచున్నవి.
11. ఇంద్రుని రథమునకు సారథి హర్యశ్వములను పూన్చుచున్నాడు. అశ్వములు, కామ్యములు. రథమునకు రెండు పక్కల కట్టబడినవి. రక్తవర్ణలు. అణచగలవి. నరులను మోయునవి.
12. అజ్ఞానికి జ్ఞానము. అంధకారమున ప్రకాశము కలిగించు సూర్యుని దర్శించండి. అతడు కిరణ్మయుడై అవతరించినాడు.
13. సూర్యునకు విశ్వమును చూపుటకు కిరణములు కేతనములై అతనిని వహించుచున్నవి.
14. రాత్రి ముగియగా దొంగలు పారిపోయినట్లు, సూర్యుడు కనిపించగనే నక్షత్రములు అదృశ్యములగుచున్నవి.
15. అగ్ని వలె ప్రకాశించు సూర్యకిరణములు జ్ఞానదాయినులై నరులను అనుసరించుచున్నవి.
16. సూర్యదేవా! నీవు విశ్వద్రష్టవు. జ్యోతివి. జగములను ప్రకాశింపచేయువాడవు.
17. సూర్యదేవా! నీవు దేవ, మానవ జనుల ముందు ఉదయించుచున్నావు. నిన్ను దర్శించు వానికి ప్రత్యక్షమగుచున్నావు.
18. వరుణదేవా! నీవు పావకుడవు. పుణ్య పురుషులను అనుగ్రహించిన రీతి మమ్ము అనుగ్రహించుము.
19. సూర్యదేవా! నీవు సమస్త జీవులను అనుగ్రహించుటకు వీక్షించుచున్నావు. ద్యావా పృథివ్యంతరిక్షములందు సంచరించుచున్నావు.
20. ప్రకాశించు కిరణముల వాడవగు నీ యొక్క రథమును ఏడు గుర్రములు లాగుచున్నవి.
21. సూర్యుడు తన రథమునకు సప్తాశ్వములను సంధించినాడు. అవి స్వయుక్తిచే సాగుచున్నవి.
పదకొండవ సూక్తము - 44
1. గోవులు వత్సమునకు ఎదురుగా వెళ్లిన రీతి స్తోత్రములు నీకు అభిముఖముగ వచ్చుచున్నవి.
2. తల్లి బిడ్డను గుండెకు హత్తుకున్నట్లు జ్యోతిష్మంత స్తుతులు ఇంద్రుని గుండెకు హత్తుచున్నవి.
3. ఇతడు వజ్రధారి. నేను మర్త్యుడను. అతడు నాకు కీర్తి, ఆయువు, ఘృతము, దుగ్ధము ఇచ్చును గాక.
4. సూర్యుడు ఉదయాచలమును అధిరోహించినాడు. మాతృ రూపమగు భూమిని, పితృరూపయగు దివిని ప్రకాశింపచేసినాడు - అందుకే భానుడు అయినాడు.
5. సూర్యుడు ప్రాణ, అపానముల మధ్య వెలుగుచున్నాడు. అతడు స్వర్గాదులకు వెలుగు కలిగించుచున్నాడు.
6. రాత్రింబవళ్ల అవయవ రూపములగు ముప్పది అంశములను సూర్యుని కిరణములే ప్రకాశింప చేయుచున్నవి. విశ్వమందు ప్రతిక్షణము ఇదే వెలుగుచున్నది.
పన్నెండవ సూక్తము - 45
1. స్తోతల స్తుతులు అంతరిక్షమునంటినపుడు దేవతలు ఆనందించుచున్నారు.
2. ఇంద్రా! నీ భక్తులతో కటువుగ పలుకకుము. అనుగ్రహ భాషణ చేయుము. స్వర్గమున ఆనందించుము.
3. శక్రా! కుశాసనమున ఆసీనుడవగుము. ఆనందించుము. కటువుగ పలుకకుము.
4. అభిమత ఫలము కొరకు ఇంద్రుని స్తుతించుచున్నాము. అతడు దర్శనీయుడు. దురిత నివారకుడు. సోమమాదకుడు. ఆవులు దూడలకు పాలిచ్చుటకు పరుగులు పెట్టినట్లు, మా స్తుతులు ఇంద్రుని వైపు పరుగులు పెట్టుచున్నవి.
5. దీప్తమయుడు, దాత, స్తుతిపాత్రుడు, వందల వేల జనులను పోషించువాడు. గోధనుని ఆకలిగొన్నవాడు కందమూలాదులు గల పర్వతమును అర్థించిన రీతి - ధనమును అర్థించుచున్నాము.
6. నిన్ను సువీర్యము అర్థించుచున్నాము. పూర్వజ్ఞాన మంత్రమును యాచించుచున్నాము. పూర్వ ఋషులగు భృగువులకు ఇచ్చిన ధనమును ప్రసాదించుము. ప్రస్కణ్వులకు వంటి హితము సమకూర్చుము.
7. ఇంద్రా! ఏ బలమున నీవు సముద్రమును ఏర్పరచి దానిని నీటితో నింపినావో ఆ బలమున నరుల కోరికలు తీర్చుచున్నావు. నీ వంటి మహిమలు గలవాడు అన్యుడు లేకున్నాడు. నీ మహిమలను భూలోక వాసులు వర్ణించుచున్నారు.
పదమూడవ సూక్తము - 46
వాజసేయమున ఈ సూక్తము సామప్రగాధయగుచున్నది. గవామయనాది సంవత్సరము మరియు మధ్యందిన సవనమున సామప్రగాథ యగుచున్నది.
1. అతడు క్షయము ఎరుగడు. నిత్య నూతనుడు. ఒకప్పుడు మర్త్యరూపము ధరించుచున్నాడు. అతని మహిమలను కీర్తించండి. ఏ మాత్రపు కీర్తన యైనను స్వర్గము ప్రసాదించుచున్నది.
2. ఇంద్రా! సత్యకాములగు దేవతలు నిన్ను ఏల నుతించుచున్నారు? విద్వాంసుడగు ఏ ఋషి నీకు హవిస్సులు అర్పించుచున్నారు. ఎప్పుడు నీవు అభిషుత సోమము సేవించుచున్నావు? ఎప్పుడు నీవు స్తోతల పిలుపు విని వచ్చుచున్నావు?
పదునాలుగవ సూక్తము - 47
1. ఇంద్రుడు మహా ధనవంతుడు. స్తుతించు వారలకు వేలకొలది ధనమును ఇచ్చుచున్నాడు. అట్టి ఇంద్రుడు నాకు ప్రత్యక్షమగునట్లు అతనిని కీర్తించండి.
2. ఇంద్రుడు హవి అర్పించు వారి శత్రువులను నివారించుచున్నాడు. హతమార్చుచున్నాడు. పర్వతము నుండి వెలువడు జలపాతము వలె హవిర్దాతలు నిత్యము ఫలములు పొందుచున్నారు.
3. ఇంద్రుని అర్చించువారలకు, అతనికి సోమము సమర్పించు వారలకు వేలకొలది ధనములు లభించుచున్నవి. మేము అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాము.
4. ఇంద్రునకు వేల ఆయుధములు ఉన్నవి. దుష్టులు వానిని తప్పుకొనజాలరు. ఇంద్రుడు తనను అర్పించువారలకు పర్వతము వలె సమస్తము ప్రసాదించుచున్నాడు.
పదిహేనవ సూక్తము - 48
1. ఇంద్రా! నీ కొరకని సోమమును శుద్ధ జలము వలె అభిషవించినాము. అది దశాపవిత్రమున ఉండగా నిన్ను స్తుతించుచు కూర్చున్నాము.
2. ఇంద్రా! నరులు నీ కొరకు సోమము సిద్ధము చేసినారు. నిన్ను కీర్తించుచున్నారు. దప్పిగొన్న మృగము జలాశయమునకు ఉరికినట్లు నీవు ఎప్పుడు ఏతెంచుచున్నావు?





