Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. ఇంద్రదేవా! అర్జునీ పుత్రుడగు 'కుత్సు' ని కొరకు 'శుష్ణ' 'కువయ' అసురులను దండించినావు. వారి ధనములను 'కుత్సు' నకు ఇచ్చినావు. యజ్ఞమున 'కుత్సు' ని దేహమునకు చికిత్స చేసి రక్షించినావు.
3. ఇంద్రా! నీవు శత్రు దమనుడవు. నీ సమస్త ఆయుధములచే 'వీతహవ్య' 'సుదాసు' లను రక్షించినావు. యుద్ధము నందు 'పురుకుత్స' పుత్రుడు 'త్రసదస్యు' ని 'పురు' ని రక్షించినావు.
4. నరులను అనుగ్రహించునట్టియు, హర్యశ్వములు గల ఇంద్రా! దేవ సంగ్రామములందు మరుత్తుల సాయమున రాక్షసులను, పాపులను హతమార్చినావు. 'దభీతు' ని రక్షించుటకు వజ్రాయుధముచే 'చమురి' 'ధుని' దస్యులను పరిమార్చినావు.
5. వజ్రహస్త ఇంద్రా! నీ బలము అతి దృఢము. ప్రసిద్ధము. ఆ బలముతోనే అసురుల తొంబది తొమ్మిది పురములను ధ్వంసము చేసినావు. నివాసము కొరకు నూరవ పురమును ఆక్రమించినావు. అసురులగు 'నముచి' వృత్రులను హతమార్చినావు.
6. ఇంద్రా! నీకు హవి అర్పించిన 'సుదాసు' నకు నీకు సనాతన ధనములను ప్రసాదించినావు. బహుకర్మ, వరద ఇంద్రా! నిన్ను తెచ్చుటకు రథమునకు హర్యశ్వములను పూన్చుచున్నాను. బలశాలివగు నిన్ను మా స్తుతులు నుతించుచున్నవి.
7. హర్యశ్వ ఇంద్రా! నీవు గెలిచిన శత్రుధనము నందలి పాపమున మేము భాగస్వాములము కాకుందుము గాక. బాధించని సాధనములతో మమ్ము కాపాడుము. స్తోతలు, విద్వాంసులందు మేము నీకు ఇష్టులము అగుదుము గాక.
8. ధనవాన్ ఇంద్రా! మేము నీ అనుగ్రహమున మా గృహములందు సుఖింతుము గాక. 'అతిథిగు' నకు అత్యంత సుఖములిమ్ము. 'యదు' 'తుర్వశు' లకు శౌర్యము కలిగించుము.
9. మఘవ ఇంద్రా! నీవు ప్రత్యక్షమైనంత ఋత్విజులు స్తుతులు, శస్త్రములు, ఉక్థములు ఉచ్చరించుచున్నారు. ఋత్విజులు మంత్రశక్తిచే పణులను, అదాతలను హతమార్చుచున్నారు. నీవు వారికి యజ్ఞఫలమును ప్రసాదించుము.
10. నేతలకు నేతవగు ఇంద్రా! మాకు ధనమును ప్రసాదించు నిన్ను భజించుచున్నాము. నీవు మాకు శత్రుహంతవు, శూరుడవు, శివుడవు, సుఖుడవు అగుము. మమ్ము రక్షింపుము.
11. శూర ఇంద్రా! మా స్తుతులు, హవిస్సులు అందుకొని వర్థిల్లుము. మాకు సంతానమును, ధనమును ప్రసాదించుము. సర్వవేళల మాకు శుభములు కలిగించుచు మమ్ము పాలింపుము.
అయిదవ అనువాకము
మొదటి సూక్తము - 34
అభిప్లవపు ఆరవరోజున ఈ సూక్తపు ఆరు ఋక్కులు ఆజ్యస్తోత్రియములు అగుచున్నవి. స్వరసామపు మూడవ దినమున ఇది ఆజ్యస్తోత్రియగుచున్నది.
1. ఇంద్రా! విచ్చేయుము. సోమము అభిషుతమైనది. పరచిన దర్భల మీద ఆసీనుడవగుము. సోమపానము చేయుము.
2. ఇంద్రా! నీ హర్యశ్వములు కేశినులు మంత్రమున రథమునకు చేరునవి. అవి నిన్ను మా వద్దకు తెచ్చును గాక. మ విన్నపములు మన్నింపుము.
3. సోమపాయి ఇంద్రా! మేము యజించినాము. సోమము సిద్ధము చేసినాము. నిన్ను ఆహ్వానించుచున్నాము.
4. గాధాగాయకులు ఇంద్రుని ప్రశంసించుచున్నారు. మంత్రవేత్తలు ఇంద్రుని స్తుతించుచున్నారు. వాణి సహితము ఇంద్రుని కీర్తించుచున్నది.
5. ఇంద్రుడు వజ్రి. హిరణ్యుడు. అతడు హర్యశ్వుడు. అవి మాట మాత్రమున రథమున పూనుచున్నవి.
6. ఇంద్రుడు విశ్వద్రష్టయగు సూర్యుని ఆకసమున నిలిపినాడు. తానే సూర్యుడై మబ్బులను చీల్చినాడు.
రెండవ సూక్తము - 35
గవామయనాదులందు సంవత్సరపు ప్రాతః సవనమున అనురూపానంతరము దీనిని ప్రారంభించునది. గోసవ వివిధ వైశ్యస్తోమముల మూడు ఏకాహములందు ఇది అజయపృష్ట స్తోత్రియమగుచున్నది.
1. సమస్త ప్రాణుల కొరకు మేము ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. అతడు మావాడు మాత్రమగును గాక.
2. ఇంద్రుడు అంతరిక్షమున వర్షజలమును వర్థిల్లచేసినాడు. సోమపానము చేసి శక్తివంతుడై మేఘములను విదీర్ణము చేసినాడు.
3. ఇంద్రుడు అంగిరుల కొరకు గుహలందున్న గోవులను వ్యక్త పరచినాడు. బలాసురుని వధించినాడు.





