Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
13. హర్యశ్వ ఇంద్రా! నీవు పూర్వ సవనముల సొమము సేవించినావు. ఇదం సవనం కేవలం తే - ఈ సవనము కేవలము నీకు చెందినది. ఈ సోమమును జఠరమున నింపుము. మత్తుడవగుము. వరములిమ్ము.
14. ఇంద్రా! ఈ సోమము నీట శుద్ధము చేయబడినది. నరులచే అభిషవించబడినది. దీనితో నీ కడుపు నింపుము. శిలలు నలిచిన ఈ సోమముతోను, స్తుతులతోను వర్ధిల్లుము.
15. ప్రోగ్రాం పీతిం వృష్ణ ఇయర్మి సత్యాం ప్రయైసుతస్య హర్యశ్వ తుభ్యమ్|
ఇంద్ర ధేనాభిరిహ మాదయస్వ ధీభిర్విశ్వాభిః శచ్యాగృణానః
3 - 8 - 7 పునరావృతము.
16. ఇంద్రదేవా! ఋత్విజులు నీ అనుగ్రహమున పుత్రవంతులు, ప్రజావంతులు, అన్నవంతులు అగుచు నిన్ను ధ్యానించుచు యజమానుల యాగ గృహమున నిన్ను స్తుతించుచున్నారు.
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 30
ఇది సామసూక్తము అనబడుచున్నది. ద్వాదశాహాదులందు వైరాజ విశ్వపుష్టి యొక్క విశ్వజితమున బ్రహ్మణాచ్ఛంసి శస్త్రమున దీని వినియోగము.
రెండవది అహీన సూక్తము అనబడుచున్నది. ఆప్తోర్యామ క్రతువునందును, మధ్యందిన సవనమున బ్రాహ్మణచ్ఛంసి శస్త్రమున దీని వినియోగము.
ఈ సూక్తమునకు సంబంధించిన ఒకకథ బృహద్దేవతాను క్రమణిక' యందు చెప్పబడినది.
గృత్సమద ఋషి తపస్సుచేసి ఇంద్రుని రూపము దాల్చినాడు. ద్యులోక భూలోక అంతరిక్షములందు ఏక కాలమున కనిపించినాడు. 'ధూని' 'చమరు' అను అసాధ్య అసురులు అతనిని ఇంద్రుడే అనుకున్నారు. ఆయుధములతో అతని మీద విరుచుకు పడినారు.... అప్పుడు ఋషి ఈ సూక్తమును చదివినాడు.
మరొక కథనము ఇట్లున్నది :-
వైన్యుని యజ్ఞమునకు ఇంద్రాదులు వచ్చినారు. గృత్సమదుడు కూడా వచ్చినాడు. అసురులు ఇంద్రుని కొరకని అచటికి వచ్చినారు. అది గ్రహించిన ఇంద్రుడు గృత్సమదుని రూపము ధరించి బయటపడినాడు. వైన్యుని సత్కారములందుకొని ఋషియు బయట పడినాడు. అసురులు అతనిని ఇంద్రునిగా భావించి పట్టుకున్నారు. 'నాహంఇంద్రోస్మి' అని అతనిని వధించుటకు సిద్ధమైన అసురలను ఈ సూక్తము చదివి పారద్రోలినాడు.
1. ఇంద్రుడు ప్రప్రథమమున జన్మించినాడు. జన్మించినంతనే దేవత అయినాడు. అన్య దేవతలకు రక్షకుడు అయినాడు. ఎవని బలమున రోదసి భయపడుచున్నదో, ఎవని శక్తికి మహాభువి గడగడలాడుచున్నదో అతడు ఇంద్రుడు అగుచున్నాడు.
2. పృథివిని దృఢపరచినవాడు. పర్వతముల రెక్కలు విరిచినవాడు. అంతరిక్షమును పరిణామ శూన్యము చేసినవాడు. ద్యులోకమును స్తంభింపచేసినవాడు ""సజనాసఇన్ద్రః" అతడు ఇంద్రుడు అగుచున్నాడు.
3. ఎవడు మేఘములను భిన్నము చేసి సప్తనదులను ప్రవహింపచేసినాడో, ఎవడు బలాసురుని వధించి గోవులను వ్యక్తము చేసినాడో, ఎవడు రెండు మేఘములను తాకించి విద్యుతాగ్నిని కలిగించినాడో, ఎవడు ప్రకట శత్రువును జయించినాడో, ఎవడు వేటగాని వలె శత్రుధనమును అపహరించినాడో "సజనాసఇన్ద్రః"
4. ఎవడు ఈ దృశ్యమాన విశ్వమును స్థిరపరచినాడో, ఎవడు దుష్ట అసురులను గుహయందు బంధించినాడో, ఎవడు ప్రకట శత్రువును జయించినాడో, ఎవడు వేటగాని వలె శత్రుధనమును అపహరించినాడో "సజనాసఇన్ద్రః"
5.ఇంద్రుడు ఎచట ఎచట అని కొందరు ప్రశ్నించుచున్నారు. ఇంద్రుడు ఉన్నచో ఏల కనిపించడు? అని అడుగుచున్నారు.
ఇంద్రుడు శక్తివంతములైన పరసేనలను వ్యాఘ్రము వలె పరిమార్చినాడు. శద్థాసక్తులు కనపడవలసిన వాడె "సజనాసఇన్ద్రః"
6. ఎవడు శక్తిశాలి శత్రువును తరుముచున్నాడో ఎవడు ధనహీనుని ధనవంతుని చేయుచున్నాడో, స్తుతులకు మెచ్చి ఎవడు వరములిచ్చుచున్నాడో, ఎవడు సోమమును అభిషవించు యజమానిని రక్షించుచున్నాడో "సజనాసఇన్ద్రః"
7. ఎవడు అశ్వములను, గోవులను, గ్రామములను, రథములను ఇవ్వగలవాడో - ఎవడు సూర్యుని, ఉషస్సులను సృష్టించినాడో - ఎవడు జలములకు అధినేత యగుచున్నాడో "సజనాసఇన్ద్రః"
8. పరస్పరము కలసినవియు, శబ్దించునవియునగు ద్యావాపృథ్వులు ఎవనిని అనేకరీతులు స్తుతించుచున్నవో, వృష్టి కలిగించి పోషించుమని హవి అందుకొనుటకు ద్యావాపృథ్వులు ఎవనిని ఆహ్వానించుచున్నవో, వృష్టి కలిగించి పోషించుమని హవి అందుకొనుటకు ద్యావాపృథ్వులు ఎవనిని ఆహ్వానించుచున్నావో "సజనాసఇన్ద్రః"
9. ఎవని అనుగ్రహమున లేక జనులు జయించలేకున్నారో, యుద్ధములందు తమను రక్షించుమని ఎవనిని ఆహ్వానించుచున్నారో, ఎవడు విశ్వమునకు ప్రతిభింబమగుచున్నాడో, ఎవడు కదలని కొండలను కదలించినాడో "సజనాసఇన్ద్రః"
10. ఎవడు విశ్వసించని వారిని హతమార్చుచున్నడో, ఎవడు తామే బలవంతులమని రొమ్ము విరుచు వారికి సాయపడకున్నాడో, ఎవడు దస్యులను హతమార్చుచున్నాడో "సజనాసఇన్ద్రః"
11. భయపడి కొండలందు దాగిన శంబరుని కొరకు నలుబది సంవత్సరములు వెదకి ఎవడు హతమార్చినాడో, బలమును ప్రదర్శించు, సహాయనించిన వృత్రాసురుని ఎవడు హతమార్చినాడో "సజనాసఇన్ద్రః"
12. ఎవడు తన వజ్రముతో శంబరాసురుని తొలగించినాడో, ఎవడు చషకమున సోమమును సేవించినాడో ఎవనిని హతమార్చుటకు అసురులు చుట్టుముట్టినారో "సజనాసఇన్ద్రః"
13. ఎవడు సప్తరశ్మి సూర్యుడగుచున్నాడో, ఎవడు కోరికలను తీర్చుచున్నాడో, వర్షము కలిగించుచున్నాడో, ఎవడు నదులను ప్రవహింప చేసినాడో, వజ్రము పట్టి స్వర్గమున ఎక్కురౌహిణుని హతమార్చినాడో "సజనాసఇన్ద్రః"
14. ఎవనికి ద్వావాపృథ్వులు నమస్కరించుచున్నవో, ఎవనికి పర్వతములు భయపడుచున్నావో ఎవడు సోమపానమున శక్తిమంతుడు అగుచున్నాడో, ఎవని భుజములు వజ్రసమములో, ఎవని చేత వజ్రాయుధమున్నదో "సజనాసఇన్ద్రః"
15. ఎవడు అభిషవించు వానిని, పచనము చేయువానిని, స్తుతించువానిని రక్షించుచున్నాడో, స్తోత్రము, సోమము పురోడాశము ఎవనిని వర్ధిల్ల చేయుచున్నవో "సజనాసఇంద్రః"
16. ఎవడు అవతరించగనే ధ్యావాపృథ్వుల మధ్య ప్రకాశించి వానిని ఎరుగకున్నాడో - ఎవడు మా స్తుతులు అందుకొని దేవతలను పోషించుచున్నాడో "సజనాసఇంద్రః"
17. ఎవడు సోమభిలాషియో, ఎవడు హర్యశ్వవంతుడో, ఎవనికి సర్వభూతములు భీతిల్లుచున్నవో, ఎవడు శంబర, శుష్ణులను వధించినాడో, ఎవడు అసాధారణ శౌర్యవంతుడో "సజనాసఇంద్రః"
18. ఇంద్రా! నీవు దుర్ధర్షుడవు. అయినను సోమము సమర్పించువారలకు, పురోడాశము సమర్పించు వారలకు అన్ని దిశలనుంచి అన్నము అందించుచున్నావు. ఇది సత్యము. మేము నిన్ను స్తుతించుచు సంతానాదులు కలవారలము అగుదుము గాక.
రెండవ సూక్తము - 31
చతుర్వింశ అభిజితమున, విషువత్తున, విశ్వజిత్తున, మహావ్రతమున, బ్రాహ్మణచ్ఛంసి శస్త్రమున ఈ అహీనసూక్తము వినియుక్తము. సప్తోర్యామపు మధ్యందినమున ఆ శస్త్రమున కూడ వినియుక్తము.
1. మా ఇంద్రుడు బలశాలి. సోమము కొరకు ఆతురపడువాడు. మహా గుణవంతుడు. ఋక్కులచే ప్రతిపాదించబడువాడు. అతనిని నేను విశిష్టముగ స్తుతించుచున్నాను. అట్టి ఇంద్రునకు ఆకలిగొన్న వానికి అన్నము వంటి స్తుతి చేయుచున్నాను.
2. మా ఇంద్రునకు అన్నము వంటి స్తుతిని అర్పించుచున్నాను. శత్రువులను జయించుటకు ఆవర్జకమును ఘోషించుచున్నాను. ప్రాజీనుడు, సర్వస్వామి యగు ఇంద్రుని ఇతరులు సహితము మనసు, హృదయము, బుద్ధిచే స్తుతించుచున్నారు.
3. మా ఇంద్రుని కొరకు నిరుపమాన, ధనప్రద స్తుతులను ఉచ్చరించుచున్నాను. పరమ, ధనిక ఇంద్రుని ప్రేరణ కలిగించు స్తుతులచే నుతించుచున్నాను. వర్ధిల్లచేయుచున్నాను.
4. మా ఇంద్రుడు సోమరూప అన్నవంతుడు. యజ్ఞార్హుడు. యజమానులకు వరదుడు. అట్టి ఇంద్రునకు హవిస్సులు, స్తుతులు అర్పించుచున్నాను.
ఇంద్రుడు స్తోతలకు ప్రాపణీయుడు. యజ్ఞార్హుడు. యజమానులకు వరదుడు. అట్టి ఇంద్రునకు హవిస్సులు, స్తుతులు అర్పించుచున్నాను.
5. అన్నమును ఆశించుచు మా ఇంద్రునకు ఘృతము నిండిన స్రువమును అర్పించుచున్నాను.
ఇంద్రుడు వీరుడు. దాత. శత్రుపుర ధ్వంసి. కీర్తిశాలి. అతనిని నమస్కరించుటకు ఆహ్వనించుచున్నాను.
6. మా ఇంద్రుని కొరకు త్వష్ట వజ్రాయుధమును చేసినాడు. అది సత్కర్మలు చేయునది. స్తుత్యము. యుద్ధములందు ఉపయుక్తము. శత్రు నిగ్రహ కారకము. ప్రభువగు ఇంద్రుడు వెదికి వృత్రాసురుని వజ్రముతో హతమార్చినాడు.
7. మా ఇంద్రుడు మహిమాన్వితుడు. మూడు సవనములందు సోమము, పురోడాశము స్వీకరించువాడు. అతడు శత్రు నిబర్హణుడు. శత్రు ధనాపహారకుడు. మేఘమును బ్రద్దలు చేసి వర్షము కలిగించుచున్నాడు.
8. మా ఇంద్రుడు వృత్రుని వధించినపుడు దేవపత్నులు అతనిని స్తుతించినారు. అతడు ద్యావాపృథ్వులను అతిక్రమించినాడు. ద్యావాపృథ్వులు అతని మహిమను నివారించలేకున్నారు.
9. ఆ ఇంద్రుని మహత్వ ప్రకాశము ద్యావాపృథ్వివ్యంతరిక్షములందు వ్యాపించి ఉన్నది. ఇంద్రుడు స్వప్రకాశమున తేజరిల్లుచున్నాడు. అమిత్రులను వధించుచున్నాడు. వర్షించు మేఘములను తెచ్చుచున్నాడు.
10. ఇంద్రుడు స్వశక్తిచే వజ్రాయుధము ప్రయోగించి వృత్రుని వధించినాడు. పణుల నుంచి గోవులను విడిపించినాడు. మేఘములను విదీర్ఘము చేసి వర్షము కలిగించినాడు. యజమానులకు సర్వప్రసిద్ధ అన్నమును ప్రసాదించినాడు.
11. ఇంద్రుడు తన వజ్రముచే సప్తనదులను నియంత్రించినాడు. అతని అనుగ్రహముననే నదులు ప్రవహించుచున్నవి. అతడు యజమాని కోరికలు తీర్చి, ప్రభువును చేయుచున్నాడు. జలమునందలి 'తుర్వీతు' ని ఉద్ధరించినాడు.
12. ఇంద్రా! నీవు ఈశానుడవు. వజ్రమునందుకొని త్వరపడుము. వృత్రుని మీద ప్రయోగించుము. మాంసము కొరకు పశువును ముక్కలుగా తరిగినట్లు వృత్రుని ముక్కులు ముక్కలుగ నరుకుము. వజ్రమున మేఘమును భిన్నము చేయుము.
13. ఇంద్రుడు యుద్ధాతురుడు. అతని ప్రాచీన కార్యములను నవ్య స్తుతులచే వర్ణించండి. ఆయుధము ధరించి, యుద్ధమున దూకి, శత్రుసంహారము చేయు ఇంద్రుని శౌర్యమును గానము చేయండి.
14. ఇంద్రుడు ఉద్భవించగనే భూమి, పర్వతము బెదరినవి. పర్వతములు నిశ్చలములు కాగా భూమి గడగడలాడినది. దుఃఖ నివారకుడగు ఇంద్రుని కీర్తించిన 'నోధ' శక్తి సంపన్నుడు, బలశాలి అయినాడు.
15. ఈశానుడగు ఇంద్రుడే సోమార్హుడు, స్తోత్రార్హుడు అగుచున్నాడు. ఏలనన ఇంద్రుడు 'సౌవశ్వు' ని కొరకు సూర్యునితో సృర్దించినాడు. సోమాభిషవ కర్త 'ఏతశు' ని రక్షించినాడు.
16. ఇంద్రా! నీవు హర్యశ్వములను రథమునకు పూన్చువాడవు. గోతమ గోత్రజులు ణీ కొరకు మంత్రములు కల్పించినారు. వానియందు నీ శక్తి సామర్థ్యములను నింపుము. నేటివలె రేపును మమ్ము రక్షించుటకు విచ్చేయుము.
మూడవ సూక్తము - 32
అభిస్రవికే యుగ్మాహని మధ్యందిన సవనే బ్రహ్మణాచ్ఛంసిశస్త్రే సంపాత సంజ్ఞయా వినియుక్తమ్.
1. ఇంద్రుడు మానవ యజమానుల ఒకే పిలుపునకు పలుకువాడు. అట్టి ఇంద్రుని స్తుతివాక్కులచే పూజించుచున్నాము.
ఇంద్రుడు ప్రభువు. వరదుడు. బలసంపన్నుడు. సత్యము. బలప్రదాత. బహుకర్మి. సాహసి. అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాము.
2. మా పూర్వులగు నవగ్వులు, ఏడుతరముల విద్వాంసులు, ఇంద్రుని కీర్తించియున్నారు.
ఇంద్రుడు శత్రుహింసకుడు. దురిత నివారకుడు. పర్వతము వంటి స్థిరుడు. అతడు అనంత బలశాలి. అతని మాటను కాదనగలవాడు లేడు.
3. ఇంద్రదేవా! మాకు పుత్ర, వీర, సేవక, అన్న ధనమునిమ్మని ప్రార్థించుచున్నాము. అట్టి ధనము అక్షయము, జరారహితము ,సుఖప్రదము అగును గాక.
4. ఇంద్రా! ప్రాచీన స్తుతులు నీకు సుఖప్రదములైనచో ఆ సుఖములను స్తోతలకు ప్రసాదించుము. శత్రుదమన, పురుహోత, బహుధన ఇంద్రా! నీ భాగమెయ్యది? నీకు ఎట్టి హవి అర్పించవలయును?
5. కర్మవంత, గుణవంత, ప్రవచన వాణి రథమునందున్న ఇంద్రుని ప్రశ్నించుచున్నది. యజమాని తనకు సుఖములిమ్మని ఇంద్రుని ఎట్లుయాచించవలెను? శత్రువును ఎట్లు ఎదిరించవలెను?
6. ఇంద్రా! నీవు స్వయం శక్తిశాలివి. నీ వజ్రాయుధము మనోవేగము. పర్వములు గలది. దానితో మాయావి యగు వృత్రుని వధించినావు. ఆ వజ్రముతోనే - అనితర సాధ్యమగు శత్రు పురములను ధ్వంసము చేసినావు.
7. ఇంద్రుడు అపరిమిత బలశాలి. ప్రాచీనుడు. అతనిని ప్రాచీనులు స్తుతించినారు. వారివలె నేను ఇంద్రుని నవీన స్తుతులచే అలంకృతుని చేయుచున్నాను. ఇంద్రుడు పరిణామ రహితుడు. శోభన వాహనవంతుడు. అతడు మనలను సమస్త దురితముల నుండి రక్షించును గాక.
8. ఇంద్రా! నీవు ప్రజాద్రోహులను ద్యావాపృథివ్యంతరిక్షములందు తపింప చేయుము. రాక్షసులను, బ్రహ్మద్వేషులను దహించి, భస్మము చేయుము.
9. ఇంద్రా! నీవు దీప్తిమంతుడవు. దేవరాజువు. కుడిచేత వజ్రము పత్తి ఆసురీ మాయను పరిమార్చుము. నీవు జరా రహితుడవు. విశ్వమును అసురుల మాయ నుండి రక్షింపుము.
10. ఇంద్రా! నీవు వజ్రధారివి. నీ సంపద శత్రుంజయము. క్షేమంకరము. దస్యునాశకము. మమ్ము శత్రువుల నుండి రక్షించుటకుగాను అట్టి మహాసంపదను మాకు ప్రసాదించుము.
11. పురుహూత, విధాత, అధిక పూజ్య ఇంద్రా! నియుతాశ్వముల మీద మా వద్దకు విచ్చేయుము. నీ అశ్వములను అసురులు, దేవతలు ఎవ్వరును అడ్డజాలరు. అట్టి అశ్వముల మీద త్వరత్వరగా నాకు అభిముఖుడవై విచ్చేయుము.
నాలుగవ సూక్తము - 33
అభిస్రవిక మూడవ, ఆరవ దినమున ఈ సూక్తము బ్రాహ్మణాచ్ఛంసి శాస్త్రమున వినియుక్తము. సూత్రంతు పూర్వ సూక్తేన సహ ఉదాహృతమ్
1. ఇంద్రా! నీవు వాడి కొమ్ముల ఆబోతు వంటి భయంకరుడవు. నీవు ఒక్కడవే మా శత్రువులను దూరము చేయగల సమర్థుడవు. నీకు హవి అర్పించని వారి ధనమును గుంజి నీకు హవి అర్పించు యజమానికి ఇచ్చుచున్నావు.





