Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
6. ఇంద్రదేవా! దేహబలమునకు సొమము సేవించండి. హర్షించండి. స్తోతలకు ధనము అందించండి. వారిని నిందల నుండి కాపాడండి.
7. ఇంద్రా! మేము నీ భక్తులము. నీకు సోమము సమర్పించుచున్నాము. స్తుతించుచున్నాము. మాకు అభిమత ఫలములు ప్రసాదించుము.
8. హరిప్రియఇంద్రా! నీ అశ్వములను దూరమున విప్పకుము. రథము మీదనే మా వద్దకు రమ్ము. సోమపానము చేయుము. హర్షించుము.
9. ఇంద్రా! నీ రథము సుఖప్రదము. నీ అశ్వములు జూలు గలవి. శ్రమ నివారకము. ఆ రథమున సుఖప్రద సుఖాసనమున మా వద్దకు విచ్చేయుము.
ఏడవ సూక్తము - 24
1. ఇంద్రా హర్యశ్వముల నీ రథము మమ్ము ఆశించుచున్నది. మేము అందించు గవాశిర సోమము సేవించుటకు విచ్చేయుము.
(గవాశిర సోమము ఆవుపాలు కలిపినది.)
2. ఇంద్రా! అభిషుత సోమమును ఆశించి రమ్ము. దర్భసనమున ఆసీనుడవగుము. సోమమును సేవింపుము. అతి తృప్తుడవగుము.
3. మేము ఇంద్రుని స్తుతించుచున్నాము. అవి యజ్ఞమును వచ్చు, సోమమును సేవించు ఇంద్రుని చేరును గాక.
4. సోమపానము చేయుమని ఇంద్రుని స్తోమములతోను, ఉక్థములతోను ఆహ్వానించుచున్నాము. అతడు మరల మరల విచ్చేయును గాక.
5. శతక్రతో! నీవు అన్నధనివి. ఈ సోమములు అభిషుతములు. వీనితో నీ ఉదరము నింపుము.
6. జ్ఞానవాన్ ఇంద్రా! నీవు శత్రుదమనుడవనియు, శత్రుధనాపహారివనియు మేము ఎరుంగుదుము. కావున సుఖప్రదమగు నీ ధనమును యాచించుచున్నాము.
7. ఇంద్రా! ఈ సోమము గవాశిరము, యవాశిరము. రాళ్లతో దంచినది. విచ్చేయుము. ఈ సోమమును సేవించుము.
8. ఇంద్రా! నిన్ను సోమ పానమునకును - నీ కడుపున సోమము చేర్చుటకును ఆహ్వానించుచున్నాము. ఇది నీకు మరల మరల ఉత్సాహము కలిగించును గాక.
9. ఇంద్రా! మేము కుశిక గోత్రజులము. నీవు ప్రాచీనుడవు. మమ్ము రక్షింపుమని సోమపానమునకు నిన్ను ఆహ్వానించుచున్నాము.
ఎనిమిదవ సూక్తము - 25
1. ఇంద్రదేవా! నీవు అనుగ్రహించినవాడు అనేక అశ్వములు, గోవులు కలవాడు అగుచున్నాడు. సముద్రమును నదులు నింపిన రీతి నీవు అతనిని ధనములచే నింపుచున్నావు.
2. ఇంద్రా! జలము పల్లమునకు పారినట్లు స్తుతులన్నియు స్తోతవ్యుడవగు నిన్ను చేరుచున్నవి. నిన్ను చూచి బెదిరినవారు సూర్యుని చూడలేక నేలను చూచినట్లు తలలు వాల్చుచున్నారు. వరుడు కన్యను వలె ఋత్విజులు నిన్ను వేదికి చేర్చుచున్నారు.
3. యజ్ఞమున ఉక్థ, మంత్రద్వయములు కలసి వర్తించుచుండ మూడవదియగు స్రుచ చేరినది. సోమము సమర్పించు యజమానికి క్షేమము, శక్తి కలుగును గాక.
4. అంగిరులు సత్కర్ములు. అగ్నిని ప్రజ్వలింపచేయువారు. వారు ఇంద్రునకు ప్రప్రథమముగ హవిస్సులు అర్పించినారు. ఈ అంగిరులు పణులు అపహరించిన సమస్త అశ్వ, గో, అజరూప ధనమును సాధించినారు.
5. అథర్వుడు యజ్ఞము చేసిన వారిలో ప్రథముడు. అతడు సూర్యుని కన్నా ముందే మార్గమును తెలిసికొన్నాడు. అప్పుడు కర్మసాక్షి, ప్రకాశకుడగు సూర్యుడు అవతరించినాడు. తదుపరి "కవి" పుత్రుడగు "ఉశనుడు" గోవులను కనుగొన్నాడు. మేము ఈశ్వర సంజాతమగు అమృతమును ఉపాసించుచున్నాము.
6. సంతానార్థులు దర్భలు పరచినారు. మంత్రఘోషలు దివిని తాకుచున్నవి. అభిషవ శిలలు మంత్రఘోష వంటి ధ్వనులు చేయుచున్నవి. అదిగో అచ్చోటనే ఇంద్రుడు రమించుచున్నాడు.
7. ఇంద్రా! నీవు హర్యశ్వుడవు. వరదుడవు. సత్యస్వరూడవు. నీవు పానము చేయుటకని తీక్ష్ణమగు సోమమును ఏర్పరచినాము. నీవు యజ్ఞమునందు చేయు సమస్త స్తుతులకు ప్రసన్నుడవగుము.
తొమ్మిదవ సూక్తము - 26
9 - 12 సూక్తములు అతిరాత్ర క్రతువు యొక్క తృతీయ రాత్రి పర్యాయమునందు బ్రాహ్మణచ్ఛంసి శాస్త్రమున వినియోగములు.
1. యోగయోగమందును, యజ్ఞయజ్ఞమందును సఖుడగు ఇంద్రుని రక్షణల కొరకు ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రుడు మా పిలుపులను వినును గాక. వేల రక్షణలు, అన్నములతో మా వద్దకు విచ్చేయును గాక.
3. ఇంద్రుడు స్వర్గపు సనాతన అధిపతి. శూరులకు నేత. అతనిని మా తండ్రి ఆహ్వానించినాడు. మేము ఆహ్వానించుచున్నాము.
4. ఇంద్రుని రథము పైన సంచరించును. దానికి పూన్చబడు హర్యశ్వములు స్వర్గమందు తమ ప్రకాశముచే ప్రకాశించుచున్నవి. "రోచన్తే రోచనాదివి".
5. అభిలషణీయ హర్యశ్వములు రథమునకు రెండు ప్రక్కల పూన్చబడుచున్నవి. అవి ఎరుపు రంగువి శత్రుదమనలు. నరులను వహించుచున్నవి.
6. నరులారా! అజ్ఞానులకు జ్ఞానము, అంధకారమున వెలుగులు ప్రసాదించు జ్యోతిష్మంతుడగు సూర్యుని దర్శించండి.
పదవ సూక్తము - 27
1. ఇంద్రా! ణీ వలె నేను సహితము ధనస్వామిని అగుదును గాక. నన్ను స్తుతించువాడు గోపతి అగును గాక.
2. శచీపతీ! నేను గోపతినైనపుడు విద్వాంసులకు ధనము ఇవ్వగలవాడను అగుదును గాక.
3. ఇంద్రా! సత్యవాది యగు యజమాని సమర్పించిన సోమము నీకు తృప్తి కలిగించును గాక. నీవు యజమానికి అశ్వములు, గోవులను ప్రసాదింతువు గాక.
4. ఇంద్రా! ణీ ధనమును దేవతలు, నరులు ఎవరును అడ్డజాలరు. నీవు స్తోతలకు ప్రసాదించిన ధనమును నష్టపరచగలవారలు లేరు.
5. ఇంద్రుడు దివినుండి వర్షము కలిగించినపుడు యజ్ఞము ఇంద్రుని వర్ధిల్లజేయుచున్నది.
6. ఇంద్రదేవా! నీవు స్తుతులకు వర్ధిల్లినావు. శత్రు ధనములను గెలిచినావు. అట్టి నిన్ను మమ్ము రక్షించుమని ప్రార్థించుచున్నాము.
7. ఇంద్రుడు సోమరసపానము చేసినాడు. బలాసురుని వధించినాడు. అంతరిక్షము నందలి జలమును వర్ధిల్లచేసినాడు.
8. ఇంద్రుడు అంగిరుల కొరకు గుహలందలి గోవులను కనుగొన్నాడు. వెలికి తీసినాడు. గోవులను దాచిన వారిని శిక్షించినాడు.
9. ఇంద్రుడు ఆకాశమునందలి గ్రహనక్షత్రాదులను బలపరచి దృఢపరచినాడు. అందువలననే అవి రాలకున్నవి.
10. ఇంద్రా! నీకు సంబంధించిన స్తుతులు సముద్ర తరంగముల వలె పొంగుచున్నవి. సోమపానము వలన కలిగిన మత్తు ప్రకాశవంతమగుచున్నది.
పన్నెండవ సూక్తము - 28
1. ఇంద్రా! నీవు స్తోమ వర్ధనుడవు. ఉక్థ్యవర్ధనుడవు నీవు స్తోతలకు శుభములు సమకూర్చుచున్నావు.
2. ఇంద్రుని హర్యశ్వములు కేశవంతములు, ధనవంతములు. అవి ఇంద్రుని సోమపానార్థము యజ్ఞమునకు చేర్చునుగాక.
3. ఇంద్రా! నీవు నముచి శిరమును నీటి నురగచే ఖండించినావు. అపుడు నిన్ను ఎదిరించిన సేనలను హతమార్చినావు.
4. ఇంద్రా! అసురులు స్వర్గమునకు ఎక్కదలచినారు. అప్పుడు నీవు ణీ మాయచే వారిని తలక్రిందులుగా పడవేసినావు.
5. ఇంద్రా! సోమపానము చేసి బలశాలివైన నీవు, సోమాభిషవము చేయని వారి సభలను ఛిన్నాభిన్నము చేసినావు.
పదమూడవ సూక్తము - 29
అతిరాత్రమున బ్రహ్మనచ్ఛంసి యొక్క తృతీయ పర్యాయ శస్త్రమున ఈ సూక్తపు వినియోగము.
1. ఇంద్రుని మహాయయజ్ఞములకు తెచ్చు హర్యశ్వములను ప్రశంసించుచున్నాను. సోమపానమున మత్తిలిన ఇంద్రుని వరములిమ్మని అర్థించుచున్నాను. అగ్ని ప్రజ్వరిల్లుటకు ఘృతము పోసినట్లు, ధనము వర్షించుటకు హర్యశ్వముల మీద వచ్చు ఇంద్రుని స్తుతించుచున్నాను.
2. సృష్టికి మూల కారణుడగు ఇంద్రుని పూర్వులు స్తుతించినారు. ఇంద్రుడు యజ్ఞగృహమునకు చేరునట్లుగా అతని రథమునకు అశ్వములు పూన్చబడినవి. పాడియావు స్వామికి పాడి సమకూర్చినట్లు యజమాని ఇంద్రుని పురోడాశ, సోమాదులచే అర్చించుచున్నాడు.
3. ఇంద్రుని ఇనుపవజ్రము హరిత వర్ణపుది. ఇంద్రుడు హరితవర్ణుడు. ఇంద్రుడు హరితవర్ణ వజ్రమును హస్తమున ధరించినాడు. ధనవంతుడు, అందగాడగు ఇంద్రుని ధనుస్సు హరితవర్ణ. ఇంద్రునకు సంబంధించినవన్నియు హరితవర్ణలు అగుచున్నవి.
4. ఇంద్రుని వజ్రము సూర్యుని ప్రకాశము గలది. సూర్యుని అశ్వముల వలె వజ్రము వేగవంతము. సోమపానమున హరితవర్ణుడగు ఇంద్రుడు తన వజ్రము చేత వృత్రుని వధించినాడు. హర్యశ్వ ఇంద్రుడు ఆ వజ్రముతోనే వందల, వేల శత్రువులను శోకసంతప్తులను చేసినాడు.
5. హరితకేశ ఇంద్రా! హవి ఉన్నచోట్లందు నీవు ఉన్నావు. పూర్వ యజమానుల నుండియు,. నవీన యజమానుల నుండియు నీవు స్తుతులు, సోమము ఆశించుచున్నావు. సర్వస్తోత్రములు, సర్వసోమములు నీకే చెందుచున్నవి.
6. ఇంద్రుడు వజ్రధారి స్తోతవ్యుడు. ప్రసన్యుడు. అతనిని సోమపాన మత్తునకు హర్యశ్వములు యజ్ఞమునకు తెచ్చుచున్నవి. ఇంద్రుడు అన్ని సవనములందు హరితవర్ణ సోమమును సేవించుచున్నాడు.
7. యుద్ధములందు నిశ్చలుడగు ఇంద్రుని కొరకు సవనములందు హరితవర్ణ సోమము సిద్ధముగనున్నది. ఆ హరిత సోమమే హర్యశ్వములను యజ్ఞమునకు చేర్చుటకు త్వరపరచుచున్నది. వేగవంత అశ్వముల మీద యజ్ఞమునకు విచ్చేయుము. ఇంద్రుడు సోమవంత యజమానిని అనుగ్రహించుచున్నాడు.
8. ఇంద్రుని కేశములు, గడ్డము మీసములు హరిత వర్ణలు. అతని హృదయము ఇనుము వంటిది. అతడు అభిషుత సోమపానము చేసి వర్ధిల్లుచున్నాడు. హవిర్ధనవానుడగు ఇంద్రుడు శీఘ్రగామి అశ్వముల మీద సోమపానమునాకు విచ్చేయుచున్నాడు.
9. ఇంద్రుని హరితవర్ణపు గడ్డము యజ్ఞమున స్రువము వలె సోమపానమునకు కదలును. దమసము నింపి సోమపానము చేసిన ఇంద్రుడు అశ్వములను దువ్వుచున్నాడు. సోమపానమున ఉన్మత్తుడగు ఇంద్రుని గడ్డము అదరుచున్నది.
10. ఇంద్రుని భవనము ద్యావాపృథ్వులందున్నది. అశ్వము యుద్ధమున దూకినట్లు ఇంద్రుడు హర్యశ్వముల మీద యజ్ఞగృహమునకు చేరుచున్నాడు. మా స్తుతులు బలశాలి యగు ఇంద్రుని ఆశించుచున్నావి. ఇంద్రదేవా! యజమానికి మరింత అన్నము ప్రసాదించుము.
11. ఇంద్రదేవా! నీవు నీ మహిమ వలన ద్యావాపృథ్వులందు వ్యాపించి ఉన్నావు. క్రొత్త క్రొత్త స్తుతులు నీకు ప్రియములు అగుచున్నవి. బలశాలివగు నీవు గోవులను విడిపించినావు. సూర్యునకు ఇచ్చినావు. సూర్యుడు స్తోతలకు గోవులకు ప్రసాదించును గాక.
12. హరిశిప్రఇంద్రా! నీవు సోమప్రియుడవు. నిన్ను హర్యశ్వములు రథము మీద యజమాని వద్దకు చేర్చును గాక. ఇది దశాంగుళులచే పిండిన సోమము, మాదకము, మధురము. దీనిని సేవించుటకు అశ్వములు నిన్ను తెచ్చును గాక.





