Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
5. జూదరి 'కృతము' అను పాచికను వరించినట్లు సూర్యుని సృష్టించిన ఇంద్రుని ఆశ్రయించుచున్నాము. ఇంద్రదేవా! నీవు అన్యులకు సాధ్యపడని కార్యము చేసినావు. అది ఇంతకు ముందు, ఇప్పుడు, ఇకముందును అన్యులకు సాధ్యపడదు.
6. వరదుడు, ధనస్వామియగు ఇంద్రుడు తన భక్తులందరకు ఒకేసారి దర్శన మిచ్చుచువ్నాడు. ఒకేసారి వారి స్తుతులు వినుచున్నాడు. ఎవని సవనములందు ఇంద్రుడు ప్రసన్నుడగుచున్నాడో అట్టివాడు తీవ్రసొమము సేవించి శత్రుసేనలను అణచుచున్నాడు.
7. వాగులు నదులందు - నదులు సముద్రమునందు చేరినట్లు - సోమము ఇంద్రుని చేరుచున్నది. అపుడు విద్వాంసులు ఇంద్రుని మహిమలను వర్ణించుచున్నారు. వర్షము పొలములందలి పంటలను పెంచినరీతి స్తుతులు ఇంద్రుని వర్ధిల్ల చేయుచున్నవి.
8. ఇంద్రుడు సూర్యుని పాలన యందలి జలమును భూమికి దించుచున్నాడు. ఆబోతులు పోరునకు ఒకదాని మీదకు ఒకడు ఉరికిన రీతి కృద్ధుడగుఇంద్రుడు మేఘముల మీదకు దండెత్తుచున్నాడు. ధన ఇంద్రుడు తనకు సోమము, హవిస్సులు అర్పించిన వారలకు జ్యోతిని ప్రసాదించుచున్నాడు.
9. ఇంద్రుని వజ్రము జ్యోతి సహితముగ పైకి ఎగయును గాక. పూర్వము వలె యజ్ఞఫలసిద్ధి కలిగించును గాక. సూర్యుడు స్వతేజమున ప్రకాశించిన రీతి సత్పతియగు ఇంద్రుడు తేజరిల్లును గాక.
10. ఇంద్రా! నీవు ప్రసాదించిన గోవులచే ఆమతిని దుర్గతిని దాటుచున్నాము. నీవు అందించిన ధాన్యము వలన అకలి తీరిన వారలము అగుచున్నాము. మేము నరులందు ముఖ్యులము, రాజపూజితులము అగుదుము గాక. మేము శత్రువులను జయింతుము గాక.
11. బృహస్పతి మమ్ము వెనుకనుంచి, ముందునుంచి, దిగువనుండి వచ్చు ఆపదలనుండి రక్షించునుగాక. ఇంద్రుడు ముందునుంచి మధ్యనుంచి వచ్చు ఆపదల నుండి రక్షించుమిత్రుడై మాకు ధనము ప్రసాదించును గాక.
12. ఇంద్ర, బృహస్పతులారా! మీరు ద్యావాపృథ్వుల ధనములకు అధిపతులు. స్తోతలమగు మాకు ధనములిచ్చి నిత్యము శుభములు కలిగించుచు మమ్ము పాలించండి.
మూడవ అనువాకము
మొదటి సూక్తము - 18
1 - 4 సూక్తములు అతిరాత్రి క్రతువు నందు ప్రథమ పర్యాయమునందు బ్రహ్మణచ్ఛంసి యొక్క శస్త్రమున వినియోగములు.
1. ఇంద్రదేవా! నీవు మాకు సఖుడవు. నిన్ను కణ్వుని స్తోత్రములచే స్తుతించుచున్నాము. మా స్తుతులు ప్రయోజనకారులు అగును గాక.
2. వజ్రి ఇంద్రా! యజ్ఞములందు నిన్ను వినా అన్యులను స్తుతించను. నీ స్తోత్రము మాత్రమే ఎరుగుదును.
3. దేవతలు సోమాభిషవ కర్తలను ఇష్టపడుచున్నారు. వారిని నిర్లక్ష్యము చేయకున్నారు. దేవతలు సోమపు మత్తున తూలుచున్నారు.
4. వరప్రద ఇంద్రా! మిమ్ము ప్రత్యక్షముగ స్తుతించుచున్నాము. నీవు మా స్తుతులను అభిలాషించుము.
5. ఇంద్రా! నేను నీ క్రతువునందే ఉన్నాను. నన్ను అదాతల, కటుభాషణుల, నిందకుల బారిపడనీయకుము.
6. వృత్రహంత, సమస్త మహిమల ఇంద్రదేవా! నీవు నన్ను కవచము వలె రక్షింపుము. నీ అనుగ్రహమున నేను శత్రుంజయుడను అగుచున్నాను.
రెండవ సూక్తము - 19
1. ఇంద్రా! నీవు వృత్రుని వధించినావు. బలము ప్రదర్శించినావు. శత్రుసేనలను తిరస్కరించినావు. అందువల్ల నిన్ను అభిముఖుని చేయుచున్నాము.
2. శతక్రతుఇంద్రా! ఋత్విజులు నిన్ను మాకు ప్రత్యక్షము చేయింతురు గాక. మా మీద నీ అనుగ్రహదృష్టి ఉండును గాక.
3. శతక్రతుఇంద్రా! నీ నామములు అనేకములు. వానిని మేము స్తుతించుచున్నాము. కీర్తించుచున్నాము.
4. ఇంద్రదేవా! నీ తేజస్సులు అనేకములు. నీవు మానవ రక్షకుడవు. అట్టి నిన్ను మేము ఆరాధించుచున్నాము.
5. పురుహూతుడు, వృత్రహంత యగు ఇంద్రుని అన్నముల కొరకు ఉపాసించుచున్నాము.
6. శతక్రతు ఇంద్రా! వృత్రహంత వగు నిన్ను యుద్ధములందు సాహసము చూపుమని ఆహ్వానించుచున్నాము.
7. ఇంద్రదేవా! సంగ్రామము లందు, ధనప్రాప్తి యందు. సేనలను జయించుట యందు. అన్నప్రాప్తియందు, శత్రుంజయమందు మమ్ము అనుగ్రహింపుము.
మూడవ సూక్తము - 20
ఇది అతిరాత్రమున బ్రాహ్మణచ్ఛంసి యొక్క ప్రథమ పర్యాయశస్త్రమున వినియుక్తము.
1. శతక్రతు ఇంద్రా! నీవు మాకు బలప్రదుడవు. ప్రకాశకుడవు. దుస్స్వప్న నివారకుడవు. మమ్ము రక్షించుము. సోమము సేవించుము.
2. శతక్రతు ఇంద్రా! పంచజనులకు నీవు ప్రసాదించిన శ్రవణాది ఇంద్రియములను నేను ఆశించుచున్నాను.
3. ఇంద్రదేవా! నీ వద్దగల బృహదన్నము మాకు లభించును గాక. శత్రువునకు అందనట్టి ప్రకాశవంత ధనమును మాకు కలిగించుము. నిన్ను మేము సోమ, స్తోమములచే వర్దిల్లచేయుచున్నాము.
4. శక్రఇంద్రా! నీవు దగ్గరలో ఉన్నను, దూరమునందున్నను విచ్చేయుము. పరమ లోకమున ఉన్నను మా వద్దకు విచ్చేయుము.
5. ఇంద్రుడు స్థిరుడు. విశ్వద్రష్ట. అతడు మా యందున్న మహా భయములను తొలగించుచున్నాడు.
6. ఇంద్రుడు మమ్ము పాలించువాడైనచో మాయొక్క పూర్వపాపములు నశించుచున్నవి. భవిష్యత్తు భద్రమగుచున్నది.
7. ఇంద్రుడు శత్రువిజేత విశ్వద్రష్ట అతడు మమ్ము సకల దిశల అభయులను చేయును గాక.
నాలుగవ సూక్తము - 21
బ్రాహ్మణచ్ఛంసి యొక్క ప్రథమ శస్త్రపర్యాయమున ఈ సూక్తపు వినియోగముగ చెప్పబడినది.
1. యజ్ఞగృహమున ఇంద్రుని పరిపూర్ణ స్తుతులచే అర్చించుచున్నాము. ధనదాతకు అసంపూర్ణ స్తుతి ఉపయుక్తము కాదు. కావున పరిపూర్ణ స్తుతులచే అర్చించుచున్నాము.
2. ఇంద్రా! నీవు అశ్వదాతవు. గోదాతవు. ద్రావ్య దాతవు. ప్రాచీనుడవు. నరశిక్షకుడవు. కర్మవర్ధనుడవు. మిత్రులకు మిత్రుడవు. మేమునీ స్తోత్రములు ఉచ్చరించుచున్నాము.
3. ఇంద్రా! నీవు ప్రజ్ఞావంతుడవు. బహుకర్మివి. ప్రకాశతముడవు. విశ్వమందలి ధనమంతయు నీదేనని మేము తెలియుచున్నాము. ఆ ధనమునంతను కూర్చి మాకు అందించుము. మేము నీ స్తోతలము. మాకు కొరత రానీయకుము.
4. ఇంద్రా! మా హవిస్సులను, సోమమును స్వీకరించుము. మాకు అశ్వములను, గోవులను ఇచ్చి మా అమతిని దురితములను దూరము చేయుము. మా సోమాదులు స్వీకరించిన ఇంద్రుని అనుగ్రహమున శత్రువును జయించుచున్నాము. శత్రు రహితులమై అన్నవంతులము అగుచున్నాము.
5. ఇంద్రదేవా! మాకు ధనములు కలిగించుము. అన్నములు కలిగించుము. బలములు కలిగించుము. కాంతులు కలిగించుము. మేము దేవతల సుమతులందు నిలుతుము గాక. అశ్వవంతులము, గోమంతులము అగుదుము గాక.
6. సత్పతి ఇంద్రా! నీవు శత్రుసంహారము చేయునపుడు సోమరసాదులు నిన్ను శక్తిమంతుని చేయునుగాక. యజమానిని చుట్టుముట్టిన వేలమందిని పరిమార్చినపుడు సోమము నిన్ను హర్షిపులకాంకితుని చేయును గాక.
7. ఇంద్రా! వజ్రాయుధముగొని ఆయుధమును త్రుంచుచున్నావు. బలములను కూర్చుకొని శత్రు పురములను ధ్వంసము చేయుచున్నావు. నీకు మిత్రరూపమగు 'శక్తి' ఆయుధముచే 'నముచి' యను మాయావిని అంతమొందించినావు.
8. ఇంద్రదేవా! 'అతిధిగు' డగు రాజుకొరకు గాను, తేజోమయ 'వర్తన' ఆయుధముచే 'కరంజు' ని వధించినావు. 'పర్ణయు' ని కూడ వధించినావు. 'ఋజిశ్వు' డను రాజు కొరకు 'వంగృదు' ని నూరు నగరములను ధ్వంసము చేసినావు.
9. ఇంద్రా! నీవు కీర్తిశాలివి. సహాయరహితముగ 'సుశ్రవు' ని కొరకు ఇరువది మందిని, ఆరువేల తొంబది తొమ్మది మందిని నీ చక్రముచే హతమార్చినావు. నీ చక్రమును ఏ ఒక్కడు చేరలేక పోయినాడు.
10. ఇంద్రా! నీవు నీ శక్తి యుక్తులచే 'సుశ్రవు' ని అతని కొరకే 'తూర్వయు' ని కాపాడినావు. 'సుశ్రవు' ని 'అతిథిగు' 'కుత్స' ఆయువు' లకు వప్పగించినావు.
11. ఇంద్రదేవా! యజ్ఞపూర్తి యందు మమ్ము దేవతలు కాపాడుదురు గాక. మేము మీకు మిత్రసములము. మేము శివతములము అగుదుము గాక. నిన్ను స్తుతించుచున్నాము. మేము ధనవంతులము పుత్రవంతులము, ఆయుష్మంతులము అగుదుము గాక.
అయిదవ అనువాకము - 22
అతిరాత్రి క్రతువు మధ్యమ పర్యాయమున బ్రహ్మణచ్ఛంసి శస్త్రమున 5 - 8 సూక్తములు వినియోగములు.
1. వర్షక ఇంద్రా! అభిషుత సోమమును నీ పానము కొరకు సిద్ధము చేసినాము. సేవించి మత్తుడవగుము.
2. ఇంద్రా! నీవు లేకనే తమను రక్షించుకొందుము అనుకొనువారు నిన్ను బాధించకుందురు గాక. పరిహసించువారు నిన్ను లొంగదీయకుందురు గాక. నీవు బ్రహ్మద్వేషులను అనుగ్రహించకుము.
3. ఇంద్రా! ధనము కొరకని ఆవు పాలు కలిపిన సోమము మీకు అర్పింతురుగాక. గౌరమృగము హ్రదపు నీరు త్రావినట్లు సోమమును సేవింపుము.
4. ఇంద్రుడు సత్యసూనుడు. సత్పతి. గోపతి. అతడు మమ్ము అనుగ్రహించు రీతి కీర్తించండి.
5. హర్యశ్వములు యజ్ఞశాలయందు పరచిన దర్భల మీదకు ఇంద్రుని చేర్చును గాక. అచట మేము ఇంద్రుని స్తుతించుచున్నాము.
6. ఇంద్రుని చుట్టు స్వాదుసోమధారలు చేరినపుడు గోవులు మధుర దుగ్ధములను అర్పించుచున్నవి.
ఆరవ అనువాకము - 23
1. వజ్రధారి ఇంద్రా! నిన్ను ఆహ్వానించుచున్నాము. హర్యశ్వముల మీద రమ్ము. మాకు అభిముఖముగ రమ్ము. సోమపానము చేయుటకు రమ్ము.
2. హోతలగు ఋత్విజులు సిద్ధముగ ఉన్నారు. దర్భలు చక్కగా పరచిఉన్నవి. అభిషవ శిలలు ప్రాతస్సవనమునకాని ఏర్పడి ఉన్నవి.
3. మంత్రములచే స్తుతించబడు ఇంద్రా! నీ కొరకు బర్హి ఆసనము సిద్ధము చేసినాము. శూరా! మా పురోడాశము స్వీకరింపుము.
4. ఇంద్రా! నీవు స్తుతులచే సేవనీయుడవు. వృత్రసంహారకుడవు. నీవు సవనములందరి స్తోత్రములను, శస్త్రములను ఆలకించి ఆనందించుము.
5. ఇంద్రుడు సోమపాయి. బలములకు స్వామి. అతనికి మా స్తుతులు - గోవు దూడను నాకు రీతి - అందును గాక.





