Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4. ఇంద్రుడు స్వర్గప్రాప్తి కలిగించువాడు. అతడు దినములను ప్రకటించినాడు. యుద్ధమునకు కాలు దువ్వు అసురులను యుద్ధమున హతమార్చినాడు. అతడు మానవుల కొరకు సూర్యుని ద్యులోకమున ప్రకాశింపచేసినాడు. అతడు బృహత్ జ్యోతిని వెలిగించినాడు.
5. యోధుడు శత్రుసేనలోనికి చొచ్చుకొని పోయిన రీతి మానవ హితము కొరకని ఇంద్రుడు శత్రుసేనలోనికి చొరబడుచున్నాడు. అతడు ఉషస్సులను స్తోతల కొరకు ఉదయింప చేయుచున్నాడు. ఉషస్సుల తెలుపు దనమును తేటతెల్లము చేయుచున్నాడు.
6. ఇంద్రుడు శత్రుదమనుడు. అతడు తన నిరుపమాన ఆయుధమున అసురులను పిండిచేసినాడు. స్వశక్తిచే బలమును క్షీణింప చేయువారిని నలిపి వేసినాడు.
7. ఇంద్రుడు తన మహిమచే యుద్ధముచేసి స్తోతల కొరకు ధనమును జయించినాడు. అతడు సజ్జన పాలకుడు అగుచున్నాడు. యజమానుల గృహములందు విద్వాంసులు ఇంద్రుని గుణగణములను గానము చేయుచున్నారు.
8. ఇంద్రుడు శత్రుంజయుడు, వరణీయుడు. బలప్రదాత. స్వర్గజలస్వామి. దేవ, మానవుల కొరకు భూలోక, స్వర్గలోకములను కల్పించినవాడు. అట్టి ఇంద్రుని స్తోతలు, యజమానులు మధుర కీర్తనలచే స్తుతించుచున్నారు.
9. ఇంద్రుడు అశ్వములను ఇచ్చినాడు. సూర్యుని ఇచ్చినాడు. అమృత దుగ్ధముల గోవులను ఇచ్చినాడు. దస్యులను హతమార్చి నరులకు బంగారమును, భోగ పదార్థములను ప్రదానము చేసినాడు.
10. ఇంద్రుడు ఓషధులను , వనస్పతులను, దివములను, అంతరిక్షమును కల్పించినాడు. అతడు బలాసురుని, విరుద్ధ కర్ములను హతమార్చినాడు.
11. ఇంద్రుడు ప్రచండ బలశాలి. సుఖప్రదాత. అతనిని యజ్ఞములకు ఆహ్వానించుచున్నాము. అన్నము కలిగించుటకు ఆహ్వానించుచున్నాము. సంగ్రామ విజేత, ధనప్రదాత ఇంద్రుని, ఆహ్వానించుచున్నాము.
పన్నెండవ సూక్తము
1. ఇంద్రుడు సమస్త ప్రాణులను వర్ధిల్లచేసినాడు. ఋత్విక్కులారా! యజమానులారా! ఇంద్రునకు అట్టి హవిస్సులు అర్పించి స్తుతించండి. ఇంద్రుడు స్తుతులను ఆలకించును గాక.
2. పరిశుద్ధము, పవిత్రమగు స్తుతులచే దేవఘోష చేయుచున్నాము. ఇంద్రదేవా! మేము మా ఆయువు తెలియని వారలము. మా ఆయువును హరించు పాపముల నుండి మమ్మ రక్షించుము.
3. ఇంద్రుని రథము గోప్రాప్తి కలిగించునది. ఇంద్రుడు ఆ రథమునకు హర్యశ్వములను జతచేయుచున్నాడు. అతడు తన మహిమచే పృథివ్యంతరిక్షములను నిలిపినాడు. శత్రువులను హతమార్చినాడు.
4. జలము, వశ, గోవు చేరినవి. ఋత్విజులు ఫలార్థులై ఇంద్రుని స్తుతించుచున్నారు. ఇంద్రదేవా! నియుతముల మీద మరుత్తులు వచ్చినట్లు యజ్ఞము మీద ధ్యాస పెట్టి విచ్చేయుము.
5. ఇంద్రా! నీవు ఒక్కడవే మర్త్యులను కరుణించు వాడవు. స్తోతల కొరకు నీ వద్ద బోలెడు ధనమున్నది. మాదక, అభిషుత సొమము నీకు ఆనందము కలిగించుచున్నది. శూరా! ఈ సవనమున మాకు సుఖముల నిమ్ము.
6. అట్టి వరదుని, వజ్రబాహువును, వసిష్ఠుని, ఇంద్రుని స్తుతులచే కీర్తించుచున్నాము. మా స్తుతులు విని ఇంద్రుడు మాకు పుత్ర, గోధనములను ఇచ్చును గాక. ఇంద్రుడు మమ్ము నిత్యము శుభములు కలిగించుచు పాలించును గాక.
7. ఋజీషి, వజ్రి, వరద, శత్రుసంహారక ప్రభువు, వృత్రహంత, సోమపాయి యగు ఇంద్రుడు హర్యశ్వములను జోడించిన తన రథము మీద మా మాధ్యందిన సవనమునకు విచ్చేసి సోమమున ప్రసన్నుడగును గాక.
(మూడవ సవనపు సోమము ఋజీషము.)
పదమూడవ సూక్తము
జ్యోతిష్టోమాదులందు 1 - 3 ఋక్కులు "క్రమేణతార్తీయ సవనిక్యః ప్రస్థితయాజ్యాః" నాలుగవ దానిచే పాత్నీవతగ్రహం యజతే'
1. ఇంద్ర, బృహస్పతులు ఈ యజ్ఞమున సోమపానము చేసి ఆనందింతురు గాక. సోమము వారియందు ఆపాదమస్తకము చేరును గాక. వారు మాకు ధనమును, సంతానమును ప్రసాదింతురు గాక.
2. మరుత్తులారా! శీఘ్రగమనలగు అశ్వములు మిమ్ము యజ్ఞమునాకు తెచ్చును గాక. శీఘ్రగమన సాధనలగు మీ భుజములతో విచ్చేయండి. మీ కొరకు విశాల దర్భాసనము సిద్ధమై ఉన్నది. మధుర, మాదక సోమమును సేవించండి. హర్షించండి.
3. రథకారుడు రథమును తీర్చిదిద్దిన రీతి మేము జాతవేదాగ్నిని ఉత్తమ స్తుతులచే స్తుతించుచున్నాము. అగ్ని సన్నిధియందు మాకు సుబుద్ధి కలిగి ఉన్నది" అగ్నిదేవా! మేము నీ బంధువులము. బాధించకుము.
4. అగ్నిదేవా! ఒక రథము మీద రమ్ము లేక అనేక రథముల మీద రమ్ము. నీ అశ్వములు సమర్థవంతములు కదా! పత్నీ సమేతులగు ముప్పది ముగ్గురు దేవతల సహితముగా విచ్చేయుము. ఆనందించుము.
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 14
ఈ అనువాకము నందలి నాలుగు సూక్తములు ఉక్థ్య క్రతువున బ్రహ్మణాచ్ఛంసి యొక్క. శస్త్రమునందు వినియుక్తములు. నాలుగవ సూక్తపు చివరి ఋక్కు శస్త్రయాజ్య యగుచున్నది.
1. ఇంద్రా! నీవు గుణాఢ్యుడవు. అపూర్వుడవు. నిన్ను అన్నము ప్రసాదించుమని సమంత్రకముగ ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రా! నీవు శత్రుదమనుడవు. నిత్య యవ్వనుడవు. ప్రచండ బలశాలివి. యుద్ధము సంభవించినపుడు రక్షించుమని నిన్నే ఆశ్రయించుచున్నాము. మాకు సాయపడుము. మిత్రుడవు, రక్షకుడవగు నిన్నే ఆశ్రయించుచున్నాము.
3. ఎవడు పూర్వము మనకు సమకూర్చిన మిత్రుడు అగుచున్నాడో అట్టి ఇంద్రుని రక్షించుమని ప్రార్థించుచున్నాము.
4. ఇంద్రుడు హర్యశ్వుడు. సత్పతి. సర్వచక్షువు. సంతృప్తుడు. అతనిని స్తుతులచే అర్థించుచున్నాము. అతడు మాకు వందల గోవులు - వందల అశ్వములు ఇచ్చును గాక.
రెండవ సూక్తము - 15
1. ఇంద్రుడు మహాదాత. మహానుడు. మహాధరుడు. సత్యశీలుడు. మహాబలశాలి. జలపాతము వంటి దుర్ధర్షుడు. విశ్వమును పోషించగలవాడు. అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాము.
2. ఇంద్రా! పల్లమునకు పారు నీతివలె విశ్వము నిన్ను అనుసరించుచున్నది. సవన, యజ్ఞములు నిన్ను అనుసరించుచున్నవి. శత్రుహింసకము. స్వర్ణభూషితమునగు ఇంద్రుని వజ్రము పర్వతములను సహితము గడగడలాడించుచున్నవి.
3. ఇంద్రుడు జలధామపువాడు. ప్రాణుల వ్యవహారములకు గాను సకల దిశలందు ఇంద్రజ్యోతిని ప్రకాశింపచేసినవాడు. అరిభయంకరుడు. ఉషోదేవీ! అట్టి ఇంద్రుని యజ్ఞమునకు కొనిరమ్ము.
4. ఇంద్రా! నీవు బహుస్తుతుడవు. మేము నీ వారలము. నిన్ను ఆశ్రయించి జీవించుచున్నాము. నీవు కాక అన్యుడు మా విన్నపమును ఆలకించజాలడు. రాజు ప్రజల మొరలు విన్నట్లు మా విన్నపములు వినుము.
5. ఇంద్రదేవా! నీ శక్తి అపారము. మేము నిన్ను భజించుచున్నాము. మా కోరికలు తీర్చుము మహా ద్యులోకము నీ శక్తి ముందు తలవంచుచున్నది. నీ బలమునకు పృథివి మోకరిల్లుచున్నది.
6. వజ్రధారి ఇంద్రా! నీవు అంచెలంచెల పర్వతమును నీ వజ్రాయుధముచే ముక్కలు ముక్కలు చేసినావు. మేఘావృత జలమును నదులుగ ప్రవహింపచేసినావు. నీవు అట్టి మహా శక్తి మంతుడవు. ఇది సత్యము.
మూడవ సూక్తము - 16
1. మంత్రములు జలస్థానములు. వ్యాధి నివారకములు. పక్షి పలుకులు. మేఘగర్హనలు. వర్షధ్వనులు. అట్టి మంత్రములచే బృహస్పతిని స్తుతించుచున్నాము.
2. అంగిరసుడు మంత్రదేవతయగు, భగుని రీతి దంపతులను అర్యమ ముందునకు తెచ్చినాడు. మిత్రదేవత జనుల దంపతులను కూర్చును గాక. బృహస్పతీ! రథమునకు అశ్వమువలె దంపతులను కూర్చుము.
3. గరిశ నుండి ధాన్యము తీసిన రీతి బృహస్పతి స్తోతలకు వరము లిచ్చుచున్నాడు. స్వధాదాత్రి. అతిథులకు తృప్తికలిగించునట్టి, కోరికలను తీర్చునట్టి, స్వర్ణవర్ణపు గోవులను బృహస్పతి పర్వతముల నుండి వెలికి తీసినాడు.
4. సూర్యుడు ఆకసము నుండి ఉల్కలు రాల్చినట్లు, బృహస్పతి వర్షము వర్షించుచున్నాడు. అతడు పర్వతములందలి గోవులను వెలికి తీసి భూమిని గోధూళిచే పావనము చేసినాడు.
5. సూర్యుడు అంతరిక్షము నుండి అంధకారము, వాయువు నీటినుండి నాచును తొలగించిన రీతి బృహస్పతి గోవులను విడిపించినాడు. బలారుని వధించి గాలి మేఘమును వలె గోవులను సర్వవ్యాప్తము చేసినాడు.
6. అగ్ని తన కిరణములచే కాల్చినరీతి బృహస్పతి బలాసురుని హింసక ఆయుధమును దహించినాడు. పంటితో నమిలి అన్నము తిన్నట్లు బకాసురుని నమిలి మ్రింగినాడు. తదుపరి పాడియావుల నిధులను ప్రకటించినాడు.
7. బృహస్పతి పర్వత గుహలందలి గోవుల ధ్వనులు, పేర్లు తెలిసికొన్నాడు. అప్పుడు అతడు గ్రుడ్డునుండి పిల్ల బయటికి వచ్చినట్లు పర్వతమును పగులకొట్టి గోవులను వెలికితీసినాడు.
8. ఎండిన చెరువునందలి చేపలను వలె, చెట్టు చాటున దాగిన తేనె పట్టును వలె బృహస్పతి పర్వతము నందలి గోవులను గాంచినాడు. అతడు చెరువునుండి చేపను, చెట్టును పట్టును వలె గోవులను వెలికి తీసినాడు.
9. పర్వత గుహలందలి అంధకారమును తొలగించుటకు బృహస్పతి ఉషస్సును, సూర్యుని, అగ్నిని ప్రత్యక్షము చేసికొన్నాడు. బలాసురుని వధించినాడు. ఎముక నుండి మూలుగును వలె గోవులను వెలికితీసినాడు.
10. మంచు ఆకులను నిస్సారము చేసినట్లు బృహస్పతి అసురులను నిర్వీర్యులను చేసి గోధనమును సాధించినాడు. రాత్రింబవళ్లు నేల మీద కలిగించి పైన నిలుచు సూర్యచంద్రుల వలె బృహస్పతి అనితర సాధ్యమును సాధించినాడు.
11. బృహస్పతి పర్వతమును చీల్చి గోవులను వెల్లడించినపుడు దేవతలు సంబరపడి గుర్రమును ఆభరణములచే అలంకరించినట్లు రాత్రిని నక్షత్రములచే అలంకరించినారు. రాత్రులందు చీకట్లను, పగళ్లందు వెలుగులను ఏర్పరచినారు.
12. మేఘముల నుండి వర్షము కలిగించు బృహస్పతిని అతడు మెచ్చునట్లు స్తుతించుచున్నాము. బృహస్పతి మాకు గోవులను, అశ్వినులను, పుత్రులను, సేవకులను, ఆయువును ప్రసాదించును గాక.
నాలుగవ సూక్తము - 17
ఈ సూక్తము కూడ అచటనే ఉక్థ్యమున బ్రహ్మశస్త్రమందు వినియుక్తము. 11,12 శస్త్రయాజ్యలగుచున్నవి.
1. ఇంద్రునకు అభిముఖముగ నిలిచి హృదయ పూర్వకముగ ఇంద్రుని స్తుతించుచున్నాము. మా స్తుతులు స్వర్గప్రదములు, పరస్పర సమ్మిళితములు, ఇంద్రుని చేరునవి అగుచున్నవి. పిల్లలను కనుతల్లి భర్తను ఆలింగనము చేసికొన్నట్లు పుత్రాదులు తండ్రిని చుట్టుకున్నట్లు మా స్తుతులు రక్షణ కొరకు ఇంద్రుని ఆశ్రయించుచున్నవి.
2. పురుహోత ఇంద్రా! నా మనసు నిన్ను చేరినది. వదలకున్నది. అన్యులను ఆశ్రయించుకున్నది. ఇంద్రదేవా! రాజు సింహాసనము మీద వలె దర్భసనమున ఆసీనుడవగుము. అభిషుత సోమపానము చేయుము.
3. ఇంద్రుడు మా దుర్మతిని, ఆకలిని దూరము చేయును గాక, ఇంద్రుడే ధనములకు ప్రభువు కదా! వర్షంచువాడును, బలశాలి యగు ఇంద్రుడు సప్త నదులను పల్లమునకు ప్రవహింప చేసినాడు. అన్నము కలిగించినాడు.
4. పక్షి మంచి ఆకుల చెట్టును ఆశ్రయించినట్లు అభిషవ ఫలకములందలి సొమము ఇంద్రుని ఆశ్రయించుచున్నది. ఈ ప్రకాశించు సోమమే జగమునకు ప్రకాశము నిచ్చు సూర్యుని కల్పించినది.





