Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్స నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో ఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||
శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
ఇరువదవ కాండము
మొదటి అనువాకము
మొదటి సూక్తము
ఇంద్ర త్వా వృషభం వయం సుతేసోమే హవామహే|
సపాహి మధ్వో అంధసః ||
1. ఇంద్రా! నీవు వరదుడవు. సోమము అభిషుతమై ఉన్నది. నిన్ను ఆహ్వనించుచున్నాము. మధుర సోమాన్నమును సేవించుము.
వినియోగము:-
1. అగ్నిష్టోమాది యజ్ఞములందు బ్రాహ్మణాచ్ఛంసిపోత మరియు అగ్నీధ్రాది క్రమమున ప్రాతః సవనపు ప్రస్థిత యాజ్యలగుచున్నది ఈ సూక్తము.
2. మరుత్తులు తేజోవంతులు. వారు దివినుంచి దిగి ఎవని గృహమునకు వచ్చుచున్నారో అతడు యజమానులందు శ్రేష్ఠుడు అగుచున్నాడు.
3. అగ్ని అజవశాది భక్షకుడు. సోమపృష్ఠుడు. విధాత. ఆదేవుని స్తోమములచే స్తుతించుచున్నాము.
రెండవ సూక్తము
వినియోగము:-
ఈ నాలుగు ఋతుప్రైషలు. మొదటి, చివరి వానిచే పౌత యజించును. రెండు మూడింటిచే అగ్నీధ్ర, బ్రహ్మణాచ్ఛంసి యజింతురు.
1. మరుత్తులు పోత్రయాగమున చక్కగ అభిషుతమైనదియు, చక్కగా అర్చించబడినదియు, ఋతువును అనుసరించినదియు అగు సోమమును సేవింతురు గాక.
2. అగ్ని అగ్నీధ్రమున చక్కగ అభిషుత, చక్కగ అర్చిత, ఋతువుననుసారించిన సోమమును సేవించును గాక.
3. ఇంద్రుడే బ్రహ్మయగు చున్నాడు. అతడు బ్రహ్మణాచ్ఛంసి ఋత్విజునిచే స్తుతించబడి, స్వర్చిత ఋతుసంబంధ సోమమును సేవించును గాక.
4. దేవతలు ద్రవ్యదాతలు. వారు పోత్ర యాగమున సుస్తుత, స్వర్చిత, ఋతు సంబంధ సోమమును సేవింతురు గాక.
మూడవ సూక్తము
3 - 7 సూక్తములు బ్రాహ్మణాచ్ఛంసి శస్త్రమున వినియోగములు.
1. ఇంద్రా! విచ్చేయుము. సోమాభిషవము చేసినాము. దర్భాసనమున ఆసీనుడవగుము. సేవించుము.
2. ఇంద్రా! నీ హర్యశ్వములు మంత్రముచే రథమునకు చేరునవి. గమ్యము చేర్చునవి. జూలుగలవి. అవి నిన్ను ఇచటికి చేర్చును గాక. నీవు మా స్తుతులను వినుము.
3. ఇంద్రా! నీవు సోమపాయివి. మేము నిన్ను బ్రాహ్మణములచే యజించుచున్నాము. సోమము అభిషుతమైయున్నది. నిన్ను సోమ పానమునకు ఆహ్వానించుచున్నాము.
నాలుగవ సూక్తము
1. ఇంద్రా! మేము సోమవంతులము. మాసుందర స్తుతులు వినుటకు విచ్చేయుము. సోమాన్న భాగమును స్వీకరింపుము.
2. ఇంద్రా! నీ ఉభయ కుక్షులందు సోమము నింపుచున్నాము. అది ఆపాద మస్తకము వ్యాపించును గాక. మధువు వంటి సోమరసమును నాలుకతో చప్పరించుము.
3. మేము దాతలము. నీకు సోమము అర్పించుచున్నాము. ఇంద్రా! అది నీకు స్వాదిష్ట మగును గాక. తనువుకు బలము, హృదయమునకు ఉత్సాహము కలిగించును గాక.
అయిదవ సూక్తము
1. ద్రష్టా ఇంద్రా! సంతానవతుల చుట్టు పిల్లలు చేరినట్లు - అధ్వర్యులు చుట్టు చేరిన సోమమును అందుకొనుము.
2. ఇంద్రుడు సోమము సేవించి విశాల భుజస్కంధములు - బలమైన ఉదరము - సుబాహువు అగుచున్నాడు. అతడు వృత్రుని వధించుచున్నాడు.
3. ఇంద్రా! నీవు విశ్వప్రభువవు. మా సేనల ముందు నడువుము. వృత్రహంతా! మా శత్రువులను వధించుము.
4. ఇంద్రా! ధనమును ప్రసాదించు నీ బాహువులు దీర్ఘములు అగును గాక. సోమము సమర్పించు యజమానికి భూరి ధనము ప్రసాదించుము.
5. ఇంద్రా! దర్భల మీద సుశోధిత సోమము సిద్ధముగ ఉన్నది రండి. ద్రవమును పానము చేయండి.
6. ఇంద్రా! నీవు గోవులను మరలించిన వాడవు. స్తవనీయుడవు. శత్రువులను ఖండించువాడవు. అభిషుత సోమము అందుకొనుమని నిన్ను ఆహ్వానించుచున్నాను.
7. సూర్యుని నిలిపి ఉంచిన ఇంద్రా! కుండపాయ్య క్రతువునందు మనసు లగ్నము చేయుము.
ఆరవ సూక్తము
1. ఇంద్రా! నీవు వరదుడవు. సోమము అభిషుతమై ఉన్నది. నిన్ను ఆహ్వానించుచున్నాము. మధుర సోమాన్నమును సేవింపుము.
2. ఇంద్రా! నీవు బహుస్తుతుడవు. ఇది క్రతువు కొరకు అభిషుత సోమము. రమ్ము సేవింపుము. ఉదరము నింపుము.
3. ఇంద్రా! నీవు స్తుతిమంతుడవు. మరుత్తుల స్వామివి. మాది సోమవంత యజ్ఞము. సమస్త దేవతల సహితుడవై విచ్చేయుము. సోమము స్వీకరింపుము.
4. ఇంద్రా! నీవు సత్పురుషులను పాలించువాడవు. ఆనందము కలిగించు అభిషుత సోమము నీ జఠరమును చేరుచున్నది.
5. ఇంద్రా! ఈ సోమము సుతము - వరేణ్యము. ఇది నీకు దీప్తి కలిగించునది. నీ భాగమై ఉన్నది.
6. ఇంద్రా! నీవు స్తుతులచే సేవనీయుడవు. సోమపానము చేయుము. సోమ ధారలు నిన్ను ఆర్ధ్రుని చేయుచున్నవి.
7. దేవభక్తులగు యజమానులు సమర్పించు ప్రకాశవంత సోమము ఇంద్రుని నలుదిశల నుండి చేరుచున్నది. ఇంద్రుడు దానిని సేవించి వర్ధిల్లుచున్నాడు.
8. ఇంద్రా! నీవు మాకు దగ్గరలో ఉన్నను, దూరమున ఉన్నను విచ్చేయుము. మా స్తుతి వాక్కులను అందుకొనుము.
9. ఇంద్రా! మేము నిన్ను దూరము నుండి పిలిచినను, దగ్గరనుండి పిలిచినను విచ్చేయుము. త్వరత్వరగా విచ్చేయుము.
ఏడవ సూక్తము
1. ఇంద్రుడు స్తోతలకు ధనము లిచ్చువాడు. వరదుడు. కర్మఫల ప్రదాత. సూర్యుడు అట్టి ఇంద్రుని కొరకు ఉదయించును గాక.
2. ఇంద్రుడు తన బహు బలమున శంబరుని తొంబది పురములను ధ్వంసము చేసినాడు. అతడే శత్రువగు వృత్రుని వధించినాడు.
3. అట్టి ఇంద్రుడు మాకు శుభంకరుడు అగును గాక. మిత్రుడు అగును గాక. జలపాతము వలె నిత్యము మాకు గోవులను, అశ్వములను, ధాన్యమును ఇచ్చును గాక.
ఎనిమిదవ సూక్తము
వినియోగము:-
మొదటి ఋక్కు బ్రహ్మనచ్ఛంసపు శస్త్రయాజ్య యగుచున్నది. 2 - 4 ఋక్కులు బ్రాహ్మణచ్ఛంసి మున్నగు ముగ్గురు ఋత్విజుల మాధ్యందిన సవనపు ప్రస్థిత యాజ్య యగుచున్నది.
1. ఇంద్రక్రతువిదం సుతం సోమం హర్య పురుష్టుత |
పిబా వృషస్వ తాతృపిమ్||
6 - 2 పునరావృతము.
2. ఇంద్రా! పూర్వము వలెనే సోమము సేవించి ఆనందించుము. మా స్తుతులు వినుము. మమ్ము వర్ధిల్లాచేయుము. గోవులు ఇప్పించుము.
3. ఇంద్రదేవా! నిన్ను సోమకామిగ చెప్పుచున్నారు. మాముందు నిలువుము. సుత సోమపానము చేయుము. మదించుము. సోమమునుఉదరమున నింపుము. తండ్రివలె మా విన్నపమును ఆలకించుము.
4. స్వాముతార్థము కలశము నిండియున్నది. ఇంద్రా! కుండనింపినట్లు నీ కుక్షినింపుము. సోమము ఇంద్రునకు ప్రియమగును గాక. మాదకమగును గాక. ఇంద్రుని చుట్టు ప్రవహించును గాత.
తొమ్మిదవ సూక్తము
9 - 12 సూక్తములు మాధ్యందిన సవనమున బ్రహ్మణచ్ఛంసి శస్త్రమున వినియుక్తములు.
1. ఇంద్రుడు దర్శనీయుడు. బాధానివారకుడు. సోమప్రియుడు. ధేనువులు వత్సముల వద్దకు వలె మేము ఇంద్రుని స్తుతించి ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రుడు దీప్తిమంతుడు. మంచిదాత. స్తోతవ్యుడు. ప్రజాపాలన దక్షుడు. శబ్దము అనేక ఫలములు కలిగి, వందల వేలమంది ఆకళ్లు తీర్చు పర్వతము వంటి ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
3. ఇంద్రదేవా! నిన్ను బలవర్ధక ఆహారము అర్థించుచున్నాము. పూర్వజ్ఞానము కలిగించు విజ్ఞానము అర్థించుచున్నాము. నీవు భృగువునకు, ప్రస్కణ్వునకు ఇచ్చినటువంటి ధనమును యాచించుచున్నాము.
4. ఇంద్రుడు స్వశక్తిచే అనంత జలముచే సముద్రమును నింపినాడు. వరములనిచ్చినాడు. అతని మహిమను ధిక్కరించగలవారలు లేరు. అట్టి వానిని భూలోకవాసులు నుతించుచున్నారు.
పదవ సూక్తము
1. ఇవి ప్రగీతములు. మధురములు. మంత్రములు. ఇవి శత్రుంజయములు. రక్షకములు. అన్నప్రదములు. రథము రథి కొరకు పరిగెత్తినట్లు ఇవి ఇంద్రుని వెంటసాగుచున్నవి.
2. ఇంద్రుడు లోకత్రయస్వామి. అతనిని కణ్వుడు, భృగువంశీయులు, సూర్యుడు స్తుతులచే నుతించుచున్నారు. అట్లే ప్రియమేధులు ఇంద్రుని మహా స్తుతులచే కీర్తించుచున్నారు.
పదకొండవ సూక్తము
1. ఇంద్రుడు శత్రు నగరములను భిన్నము చేసినవాడు. అల్లరి చేయు శత్రువులను తన బలమున అణచినవాడు. శత్రుధనాపహారకుడు, వృత్రహంత.
ఇంద్రుడు మంత్రములచే వర్ధిల్లువాడు. అతని వద్ద శత్రునాశక ఆయుధములున్నవి. అట్టి వాడు ద్యావాపృథ్వులను వ్యాపింపచేసినవాడు.
2. ఇంద్రా! నీవు మహా బలశాలివి. నిన్ను వర్ధిల్లచేయు మంత్రములు చదువుచున్నాను. నాకు అన్నము ప్రసాదించుమని నిన్ను స్తుతించుచున్నాను. నీవు నరులకు, దేవతలకు అగ్రదేవతవు అగుచున్నావు.
3. ఇంద్రుడు శత్రువు మీద తన బలమును ప్రయోగించినాడు. వృత్రుని అడ్డగించినాడు. యుద్ధమున మా యావులను వధించినాడు. కోరి కోరి అరణ్యములచే చుట్టబడిన వృత్రుని భుజములను ఖండించినాడు. రాత్రులందు పణులు హరించిన గోవులను విడిపించినాడు.





