Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    6. సుభగ రాత్రీ! దొంగిలించబడిన ఇనుము, ధనమును మాకు చేర్చుము. ఇతరులు హరించిన దానిని కూడ మాకు చేర్చుము.

    7. రాత్రీ ! మమ్ము బాధారహితులుగ ఉషస్సునకు వప్పగించుము. విభావరీ! ఉషస్సు, పగులు అట్లే మరల మమ్ము నీకు వప్పగించునుగాక.

                                      ఆరవ సూక్తము - 52


    ఇది యజుర్మంత్రాత్మక సూక్తము. దీని వినియోగము లింగము నుండి గ్రహించునది.

    1. నేను పరిపూర్ణుడను. నా ఆత్మ పరిపూర్ణము. నా నేత్రములు పరిపూర్ణములు. నా ప్రాణములు పరిపూర్ణములు. అపానములు పరిపూర్ణములు. వ్యానములు పరిపూర్ణములు. సమస్తము పరిపూర్ణములు.

    2. నిన్ను సవితా దేవత ప్రేరణచే, అశ్వినుల బాహువులచే, పూష హస్తములచే ప్రేరణ కలిగించి ప్రారంభింప చేయుచున్నాను.

                                         ఏడవ సూక్తము - 53

    దానము తీసికొను వస్తువును దీనితో అభిమంత్రించి ప్రతి గృహీత తీసికొనునది. సవజ్ఞ ప్రతిగ్రహమున కూడ దీని వినియోగము. దర్శలేక పూర్ణ మాసము వ్యతిక్రమించినపుడు ఘృతహోమము. శాంతి సమిదా ధానమున  దీని వినియోగము. భూదాన, సువర్ణమూర్తి దానమున దీనిచే ఘృతా హుతులిచ్చునది.

    1. మొట్ట మొదటి కోరిక పుట్టినది. తదుపరి మనసున బీజరూపమున అయినది. అట్టి కోరిక ఈశ్వరుని తోబుట్టువైనది. అట్టిది యజమానికి ధనద్రవ్యములు ప్రసాదించునుగాక.

    2. కోరికా! నీయందు సాహసము ప్రతిష్ఠించబడియున్నది. నీవు విభుడవు. విభావుడవు. మిత్రుడవు. మాతో స్నేహము చేయుము. నీవు ఉగ్రుడవు. శత్రుదమనుడవు. యజమానికి ఓజస్సు ప్రసాదించుము.

    3. ఇతడు దుర్లభము, అక్షయమైనది కోరినాడు. దిశలు విన్నవి. అతడు కోరినవి ప్రసాదించినవి.

    4. కోరిన కోరిక నన్ను చేరునుగాక. హృదయము నుండి హృదయము దాటి వచ్చునుగాక. సృష్టి కర్త మనసు నా యందు చేరునుగాక.

    5. కోరికా! నేను దేనిని కోరి నీకు హవిస్సు అర్పించుచున్నానో అట్టి సమస్త సమృద్ధిని నాకు కలిగించుము. హవిస్సును స్వీకరించుము. స్వాహా. 

    (దీనిని కామసూక్తముఅన్నారు. కామము అనగా కోరిక. తెలుగు కామమునకు గల అర్థము వేరు. కావున "కోరిక" అని వాడినాను. 'కామస్తదగ్రే' అట్లే ప్రతి మంత్రమున కామ శబ్దము గలదు.

    ప్రతి దానికి మూలము కోరిక. కోరికలేనిది ఏదియు సాధ్యపడదు. కోరిక ఉన్నచో అసాధ్యము లేదు. కోరిక భగవత్ స్వరూపము అనుచున్నాడు. బలమైన  కోరిక దుర్లభమును, అక్షయమును సాధించగలదని చెప్పినాడు. ఇది సత్యము.)

                                    ఎనిమిదవ సూక్తము - 54

    54 , 55 సూక్తములు సువర్ణ భూదానవు ఘృత హోమమున వినియోగములు.

    1. కాలము సప్త కిరణము, సహస్రాక్షము, అజరము, భూరి రేతము. దానిని వహించు అశ్వములను విద్వాంసులు ఆరోహించుచున్నారు. ఆ రథపు చక్రములు విశ్వ భువనములు అగుచున్నవి.

    2. కాలము సప్త చక్రములు, సప్త నాభులు గలది. దాని అక్షయ అమృతము. కాలమే సర్వ ప్రథమ దేవత. కాల పురుషుడే సమస్త లోకములకు ప్రేరణ కలిగించుచున్నాడు. రక్షించుచున్నాడు.

    3. కాలము పూర్ణ కుంభము వంటిది. అందు అనేక మంది సత్పురుషులను దర్శించుచున్నాము. కాలము పరమాకాశమున నిలిచి సమస్త భువనములకు ప్రేరణ కలిగించుచున్నది.

    4. కాలమే సకల భువనములను సృష్టించినది. పోషించుచున్నది. కాలమే పితా, పుత్రుడు అగుచున్నది. కావున కాలమును మించిన తేజస్సు లేకున్నది.

    5. కాలమే దివిని సృష్టించినది. కాలమే పృథివి అంతరిక్షములను కల్పించినది. కాలమే భూత, భవిష్య, వర్తమానములను ఏర్పరచి నిలిచినది.

    6. కాలము ప్రాణులను సృష్టించినది. కాలము సూర్యుని ప్రకాశింపచేయుచున్నది. కాలమే  సమస్త భూతములు అగుచున్నది. కాలమే కన్నుగా చూచుచున్నది.

    7. కాలమునందే మనస్సు, కాలమునందే ప్రాణము, కాలమునందే సమస్త నామములు చేరి యున్నవి. కాలము వలననే సమస్తము సంతోషించుచున్నది. కాలమే ప్రజల కోరికలు తీర్చుచున్నది.

    8. కాలము తపస్సు కాలము జ్యేష్ఠము. కాలము నందే బ్రహ్మ సమాహితుడు. కాలమే సర్వమునకు ఈశ్వరుడు. కాలమే  ప్రజాపతికి తండ్రి యగుచున్నాడు.

    9. కాలమే  కోరబడుచున్నది. కాలమే సృష్టించుచున్నది. కాలమునందే సమస్తము చేరియున్నది. కాలమే బ్రహ్మయై పరమేష్ఠిని ధరించుచున్నది.

    10. కాలః ప్రజా అసృజత కాలో అగ్రే ప్రజాపతిమ్ |
    స్వయంభూః కశ్యపః కాలాత్ తపః కాలాదజాయత||


                                    తొమ్మిదవ సూక్తము - 55

    1. కాలము నుండి జలము సంభవించింది. బ్రహ్మ, తపస్సు, దిశలు అవతరించినవి. కాలము నుండియే సూర్యుడు ఉదయించుచున్నాడు. కాలము నందే అస్తమించుచున్నాడు.

    2. కాలము వలననే వాయువు వీచుచున్నది. కాలము వలననే మహా పృథ్వి మహాద్యులోకము నిలిచిఉన్నది.

    3. కాలము భూత భవిష్యత్తులు అగుచున్నది. కాలమే పూర్వము పుత్రులను కన్నది. కాలము నుండియే ఋక్కులు, యజుస్సులు ఆవిర్భవించినవి.

    4. కాలమే యజ్ఞమును కలిగించినది. దేవతలకు భాగములు ఏర్పరచినది. కాలమునందే గంధర్వ, అప్సరసలు సమస్త లోకములు నిలిచి ఉన్నవి.

    5. కాలమునందే అంగిరులు, దేవతలు, అధర్వర్షి నిలిచి ఉన్నారు. ఈ లోకము, పరలోకము, పుణ్య లోకము సకల లోకములను జయించిన కాలము బ్రహ్మయగుచున్నది. పరమ దేవత యగుచున్నది.

                                             ఏడవ అనువాకము   
                                            మొదటి సూక్తము - 56


    లింగానుసారముగ ప్రాతః కాలమున అగ్ని ఉపస్థానమందు ఈ సూక్తము వినియోగము.

    1. ప్రతిరాత్రి గడ్డి లభించు అశ్వమును వలె అగ్నీ! మమ్ము పోషించుము. ధన ద్రవ్యములు కలిగించుము. సంతోషింపచేయుము. ఆటంకములు కలిగించకుము.

    2. అగ్నీ! మాకు అన్నము, నివాసము కలిగించి మమ్ము రక్షించుము. ధన ద్రవ్యములు కలిగించుము.  ఆనందము కలిగించుము. ఆటంకములు కలిగించకుము.

    3. గార్హపత్యాగ్ని సాయంకాలములందును, ఉదయములందును మాకు సుఖములు కలిగించుచున్నాడు. అగ్నీ! సమస్త ధనములతో మా వద్దకు విచ్చేయుము. నీకు ఇంధనము సమర్పించి మా పుత్ర మిత్రులను పోషింతుముగాక.

    4. గార్హపత్యాగ్నీ! ఉదయములందును, సాయంకాలములందును మాకు సుఖములు కలిగించుచున్నాడు. సమస్త సంపదలతో అగ్ని మా వద్దకు విచ్చేయునుగాక. అగ్నికి ఇంధనము అర్పించి మేము శతహిమములు జీవింతుముగాక.

    5. మాకు మాడిన అన్నము లభించకుండునుగాక. అన్నదాత అగ్నికి, అన్నపతి రుద్రునకు నమస్కారము. సభాసదులు, నా సభను రక్షింతురుగాక. సభ సభాసదులను కాపాడునుగాక.

    6. అగ్నీ! నీవు ఇంద్రుడవు - పురుహూతుడవు. ఎడమ ప్రతిరోజు గుర్రమునకు గడ్డివేసినట్లు నీకు బలి అర్పించుచున్నాడో వానికి జీవితాంతము అన్నము కలిగించుము.

                                       రెండవ సూక్తము - 57

    లింగానుసారము ఈ సూక్తము దుస్స్వప్న నాశక కర్మమున వినియోగము.

    1. దుస్స్వప్నమా! ధీరవు. యమలోకమునుండి దిగి వచ్చినావు. స్త్రీ పురుషులందు ప్రవేశించుచున్నావు. జనుల ఆయువులను ఎరింగిన నీవు దుష్ట ఫలితములు కలిగించి ఒక్కొక్కరినే నీ రథము మీద తీసికొని పోవుచున్నావు.

    2. విశ్వమును సృష్టించి, ప్రాణులను కర్మ బంధములందు బంధించు విధాత దుస్స్వప్నమును చూచినాడు. రాత్రింబవళ్లను సృష్టించక ముందే దానిని చూచినాడు. దుస్స్వప్నమా! నాటి నుండియే నీవు లోకములను అధిష్ఠించినావు. నీవు భిషగ్వరుల ముందు ముఖము దాచుచున్నావు.

    3. దుస్స్వప్నము మహా పురుషులను చేరుటకు పూర్వము మహిమలను ఆశించుచు అసురులను, దేవతలను చేరినది. అట్టి దుస్స్వప్నమునకు ముప్పది ముగ్గురు దేవతలు కష్టములు కలిగించుటకు ఆధిపత్యము కలిగించినారు.

    4. ఈ విషయము పితరులు ఎరుంగరు. అన్య దేవతలు ఎరుంగరు. కేవలము దుస్స్వప్నమే ఎరుంగును. నరులు, ఆదిత్యులు వరుణుని ఉపదేశము మేరకు దుస్స్వప్నమును 'త్రిత' ఋషి యందు ప్రవేశపెట్టినారు.

    5. దుస్స్వప్నము వలన దుష్టకర్ముడు కష్టములు అనుభవించుచున్నాడు. సత్కర్ముడు పుణ్యమును పొందుచున్నాడు.

    దుస్స్వప్నమా! సత్కర్ములను బంధు సమేతులనుగా స్వర్గ సుఖములందు తేల్చుచున్నావు. దుష్కర్ముల మనసులందు మృత్యుభయమును కలిగించుచున్నావు.

    6. దుస్స్వప్నమా! మేము తొలుత నీ పరిజనులను, పిదప నీ అధిపతిని ఎరింగి కీర్తిశాలురమైనాము. మమ్ము శత్రువులు నుండి కాపాడుము. మమ్ము ద్వేషించువారి సహితముగ దూరమునకు పారిపొమ్ము.



                                    మూడవ సూక్తము -58

 

  ఈ సూక్తముచే పురోహితుడు దుస్స్వప్నము కన్న రాజును అభిమంత్రించునది.

    1. పనికిరానివి పారవేసినట్లు, ఋణమును నిశ్శేషముగ తీర్చినట్లు, దుస్స్వప్నపు సర్వానర్థములను తొలగించుచున్నాను.

    2. రాజులు దండెత్తినట్లు, ఋణమును నిశ్శేషముగ తీర్చినట్లు, దుస్స్వప్నపు సర్వానర్థములను తొలగించుచున్నాను.

    3. దుస్స్వప్నమా! నీవు పిశాచ పుత్రుడవు. యముని హస్తమవు. నీలోన గల మంచి నన్ను, చెడు మా శత్రువులను చేరునుగాక. కాకి ముక్కు వంటి స్వప్నము నన్ను బాధించకుండునుగాక.

    4. స్వప్నమా! మేము నిన్ను గ్రహించినాము. అశ్వము తనమీది దుమ్ము  దులుపుకున్నట్లు, జీనుమున్నగునవి తొలగించినట్లు మా నుండియు, మా దైవ కార్యముల నుండియు, మా గోవుల నుండియు, గృహముల నుండియు దుష్ట ఫలితములను దూరము చేయుము.

    5. దుస్స్వప్నము దుష్ఫలితము శరీరము నుండి ఆభరణము తొలగినట్లు తొలగిపోవునుగాక. మరలి రాలేనంత దూరము పోవునుగాక. దుస్స్వప్నము యొక్క సర్వ దుష్పలితములను శత్రువునకు వప్పగించుచున్నాము.

                                           నాలుగవ సూక్తము - 59

    వినియోగము:- లింగానుసారము తెలిసికొనునది.

    1. ప్రజ్ఞానము, సమదృష్టి, సర్వాంగముల పరమాత్మ హవిస్సులచే వర్ధిల్లుచున్నాడు. మా  శ్రోత్రములు, చక్షువులు, ప్రాణము విచ్ఛిన్నమ్ములు కాకుండునుగాక. ఆయుష్యము వర్చస్సు అవిచ్ఛిన్నములు అగునుగాక.

    2. మేము ప్రాణములను ఆహ్వానించుచున్నాము. ప్రాణములు మమ్ము ఆహ్వానించునుగాక. పృథివ్యంతరిక్షములు వర్చస్సును గ్రహించునుగాక. సోమ, బృహస్పతులు వర్చస్సు ధరింతురుగాక.

    3. ద్యావాపృథ్వులు మాకు వర్చస్సు ప్రసాదింతురుగాక. వర్చస్సు గలవారమై పృథివి మీద సంచరింతుముగాక గోపతినగు నాకు యశస్సు, గోవులు లభించునుగాక. ఆ యశస్సుతో పృథివి మీద సంచరింతుముగాక.

    4. అవయవములారా! ఇతని యందు చేరండి. ఇతడు మాకు పానపరికరము అగుచున్నాడు. మీ శ్రవణాది శక్తులను దృఢపరచి విస్తృత పరచండి. వానిని ఇనుము వంటి గట్టి వానిని చేయండి. ఇతడు మీకు చమసము వంటివాడు. ఇతడు నశించకుండునుగాక.   

    5. అగ్ని  యజ్ఞపుము, నేత్రము అగుచున్నాను. అతనిని నేను వాక్కు, శ్రోతములు, మనసుచే ఆరాధించుచున్నాను. ఈ యజ్ఞము విశ్వకర్మ ఏర్పరచినది. దేవతలు సుమనస్కులై
 ఈ యజ్ఞమునకు విచ్చేయుదురుగాక.

    6. దేవతలు, ఋత్విజులు, హవిస్సుల భాగములు గలవారు తమ తమ ధర్మపత్నులచే ఈ  యజ్ఞమునకు విచ్చేయుదురుగాక. వారలు హవిస్సులు స్వీకరించి ఆనందింతురుగాక.

   
                                         ఐదవ సూక్తము - 59

    దర్శ లేక పూర్ణమాస వ్యతిక్రమమున ఘ‌ృత హోమమున లేదా శాంతి సమిదా ధానమున వినియోగము.

    1. అగ్నిదేవా! నీవు వ్రతపాలకుడవు. నరులందు తేజరిల్లువాడవు. యజ్ఞములందు స్తుతించబడుచున్నావు.

    2. దేవతలారా! యజ్ఞాదులందు మేము ఎరుగక చేసిన లోపములను అగ్ని పూరించుచున్నాడు. విద్వాంసుడగు సోముని అర్చించు బ్రహ్మణులకు అగ్ని ప్రత్యక్షమగుచున్నాడు.

    3. మేము చేయ తలపెట్టిన కర్మలను పూర్తి చేయుటకు దేవయాన మార్గమును అనుసరించుచున్నాము. అగ్ని విద్వాంసుడు. అతడు యాజకులను, హోతను, ఋతువులను ఏర్పరచుచున్నాడు.


                                          ఆరవ సూక్తము - 60

    1. నా వాక్కున వాణి - నాసిక యందు ప్రాణము, నేత్రములందు దృష్టి, కేశములందు నలుపు, దంతములందు పటిమ, భుజములందు బలము నిలిచి ఉండునుగాక.

    2. నా ఊరువులందు ఓజస్సు, పిక్కలందు బలము, పాదములందు శక్తి, ఆత్మయందు శుద్ధి కలుగునుగాక. నా సర్వావయవములు పాపరహితములు అగునుగాక.

    3. నా దేహము శత్రుదేహమును అణచ కలుగునుగాక. జీవితాంతము దంతములతో నమల కలుగుదునుగాక. పవమానాగ్నీ! నీవు సుఖముగ నాముందు ఆసీనుడవగుము. స్వర్గమున నన్ను సుఖములందు ముంచుము.

    4. నన్ను దేవతలకు ప్రియుడను - రాజులకు ప్రియుడను, చూడగలుగు వారలందరకు ప్రియుడను, ఆర్యులకు ప్రియుడను, శూద్రులకు ప్రియుడను చేయుము.

    5. బ్రహ్మణస్పతీ! లేవండి. దేవతలను ఉద్బోధించండి. యజమానికి ఆయువు, ప్రాణము, ప్రజ, పశువులు, కీర్తి కలిగించండి.

    బ్రహ్మచారి చేయవలసిన అగ్ని కార్యమున ఈ నాలుగు ఋక్కులచే నాలుగు సమిధలను వేయునది.

    1. జాతవేది యగు అగ్ని కొరకు సమిధలు తెచ్చినాము. అతడు నాకు శ్రద్ధ, మేధ ప్రసాదించునుగాక.

    2. జాతవేదాగ్నీ! మేము నిన్ను సమిధలచే వర్ధిల్లచేయుచున్నాము. నీవు మమ్ము ప్రజలు, ధనముచే వర్ధిల్లాచేయుము.

    3. అగ్నిదేవా! నీయందు ఉంచిన యజ్ఞయు, అయజ్ఞియ సమిధలు మాకు శుభములు కలిగించునుగాక. తరుణతమ అగ్నే! నీవు ఆ సమిధలను స్వీకరించుము.

    4. అగ్నిదేవా! ఇదిగో నీకు సమిధలు తెచ్చినాము. ప్రజ్వరిల్లుము. నాకు ఆయువును, ఆచార్యనకు అమృతత్వమును ప్రసాదించుము.

                                     ఏడవ సూక్తము - 61

    61-64 సూక్తములు సూర్యోపస్థానమున వినియోగములు. సూర్యదేవా! నీవు  హరివి. సుపర్ణుడవు. నీ తేజస్సుచే స్వర్గమును ఆరోహించుము. దివియందు నీకు అడ్డుతగులువారిని హతమార్చుము. శత్రుంజయుడవై ఉగ్రతేజమున 'దివమారోహసూర్య".

                                 ఎనిమిదవ సూక్తము - 62

    సూర్యదేవా! ఇనుప వలలు, ఇనుప పాశములు పట్టుకొని మాయావులు తిరుగుచుందురు. అట్టి వారిని నీ అనుగ్రహమున నేను అణచుచున్నాను. సహస్ర ఋషి సంపన్న, వజ్రివగు నీవు శత్రువులను వధించుము. మమ్ము రక్షించుము.

                                 తొమ్మిదవ సూక్తము - 63

    శత శరత్తులు చూతుముగాక. శత శరత్తులు జీవింతుముగాక. శతశరత్తులు ఆలోచింతుముగాక. శతశరత్తులు పుష్టి గలవారలమగుదుముగాక. శతశరత్తులు కొనసాగుదుముగాక. శతశరత్తుల వారలమగుదుముగాక. శతశరత్తులు మించినవారలము అగుదుముగాక.

                                    పదవ సూక్తము - 64

    సమష్టి, వ్యష్టులచే మూలాధారమున ప్రవేశించి జ్ఞానవంతుడనై కర్మలు చేయుచున్నాను.

                                  పదకొండవ సూక్తము - 65

    జీవింతుముగాక. పూర్తిగా జీవింతునుగాక. సర్వమాయువు జీవింతునుగాక.
    ఉపజీవింతునుగాక. పరులకొరకు జీవింతునుగాక. సర్వమాయుర్జీవ్యాసమ్.
    సంజీవింతముగాక. చక్కగ జీవింతుముగాక. సర్వమాయుర్జీవ్యాసమ్.
    ప్రాణాధారముగ జీవింతుముగాక. సర్వమాయుర్జీవ్యాసమ్.
    ఇంద్ర జీవ సూర్య జీవ దేవజీవా జీవ్యాసమహమ్. సర్వమాయుర్జీవ్యాసమ్.

                                       పన్నెండవ సూక్తము -66

    చదివిన వేదము లేక గాయత్రి ఉపస్థానమున వినియోగము.

    వేదమాత వరములిచ్చునది. ఆమెను స్తుతించుచున్నాను. ఆమె మాకు ప్రేరణ కలిగించి పాపహారిణి యగునుగాక. ద్విజులకు ఆయువు, ప్రాణము, ప్రజ, పశువులు, కీర్తి, ధనము, బ్రహ్మ వర్చస్సు ప్రసాదించి బ్రహ్మ లోకమునకు చేరునుగాక.

       
                                       పదమూడవ సూక్తము - 67

    సకల శ్రౌత స్మార్త కర్మలందు బ్రహ్మోత్థాపనానంతరము జపించునది. స్వాధ్యాయోత్సర్జ కర్మానంతరము జపించునది.

    ఏ కోశమునునుండి వేదమును వెలికితీసినామో ఆ కోశముననే ఉంచుచున్నాము. బ్రహ్మ కర్మను ఇష్ట పూర్వకముగను, స్వశక్తితోను ఆచరించినాము. కావున దేవతలు మమ్ము తమ తేజస్సులతో రక్షింతురుగాక.

    దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ దాశరథి వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును, కమలానామ్ని ధర్మ పత్నీ సమేతుండునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్రవచన అథర్వవేద సంహిత యందలి పందొమ్మిదవ కాండము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.