Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4. అంజనమా! నీవు ప్రాణమవు. ప్రాణములను కాపాడును. నీవు సుఖమవు. సుఖములను కాపాడుము. నిరృతి పాశముల నుండి విముక్తి కలిగించుము.
5. సింధు గర్భమవు, విద్యుత్ పుష్పమున అగుచున్నావు. వాయువు ప్రాణము, సూర్యుడు నేత్రము, దివి దుగ్ధము అగుచున్నావి.
6. దేవాంజనమా! నీవు త్రికకుద పర్వతపు దానవు. మమ్ము సర్వత్ర కాపాడుము. పర్వతముల మీది, పర్వతముల క్రింది ఓషధులు నీకు సరిరాకున్నవి.
7. ఈ అంజనము రాక్షస నాశకము. రోగనాశకము. ఇది పర్వతముల దిగువకు సాగి వ్యాపించుచున్నది. సమస్త వ్యాధులను రూపుమాపుచున్నది.
8. వరుణరాజా! ఇతడు అనేక అసత్యములాడినాడు. వీనిని క్షమించుము.
వేల బలముల అంజనమా! ఇతనిని పాపమునుండి కాపాడుము.
9. జలమా! గోమాతా! వరుణా! మమ్ము గుర్తించండి.
వేల బలముల అంజనమా! ఇతనిని పాపములనుండి కాపాడుము.
10. అంజనమా! మిత్రావరుణులు నీ వెనుకు వచ్చినారు. కొంత దూరము సాగి నిలిచి నిన్ను మరల రమ్మని ఆహ్వానించినారు.
పన్నెండవ సూక్తము - 46
1. అప్పు తీసుకున్న వాడు అప్పు తీర్చినరీతి కృత్యను ప్రయోగించినవాని ఇంటికి కృత్యను పంపుము. అంజనమా! నీది నేత్ర స్థానము. దుర్బుద్ధి గల వాని ప్రక్కటెముకలు విరుచుము.
2. మా యందు, మా గోవులందు, మా గృహములందలి దుస్స్వప్న దోషములను, అనామకుడగు దుష్టబుద్ధి ప్రియముగ ధరించునుగాక.
3. అంజనము జలముల రసము గలది. ఓజోవర్ధిని. జాతవేది యగు అగ్ని వద్ద వెల్లడియైనది. పర్వతమున పుట్టినది. చతుర్వీర్య. అట్టి అంజనము దిశ ప్రదశలను సుఖ ప్రదములను చేయునుగాక.
4. చతుర్వీర్యమగు అంజనమును కట్టుచున్నాము. సమస్త దిశలు అభయములు అగునుగాక. అంజనమా! సూర్యునివలె స్థిరముగ నిలిచి ఉన్నావు. జనులు నీకు ధనములను బలిగా అర్పింతురుగాక.
5. ఒక అంజనమును కంటికి పెట్టుకొనుము. ఒకదానిని మణిగా కట్టుకొనుము. ఒకదానిచే స్నానము చేయుము. చతుర్వీర్యమగు అంజనము నిరృతి బంధముల నుండి విడిపించునుగాక.
6. అగ్ని నన్ను అగ్ని రూపమున రక్షించునుగాక. ప్రాణము, అపానము, ఆయుష్షు, వర్చస్సు, ఓజస్సు, తేజస్సు, శుభములు కలిగించును గాక. సుభూతయే స్వాహా.
7. ఇంద్రుడు నన్ను ఇంద్రియములచే రక్షించునుగాక. ప్రాణము, అపానము, ఆయుష్షు, వర్చస్సు, ఓజస్సు, తేజస్సు, స్వస్తి, సుఖముల కొరకు స్వాహా.
8. సోముడు నన్ను సోమములచే రక్షించునుగాక. ప్రాణము, అపానము, ఆయుష్షు, వర్చస్సు, ఓజస్సు, తేజస్సు స్వస్తి, సుఖముల కొరకు స్వాహా.
9. భగుడు నన్ను సంపదలచే రక్షించునుగాక. ప్రాణము, అపానము, ఆయుష్షు, వర్చస్సు, ఓజస్సు, తేజస్సు, స్వస్తి, సుఖముల కొరకు స్వాహా.
10. మరుతో మా గణైరవన్తు ప్రాణాపానాయుషే వర్చస ఓజసే, తేజసే స్వస్తయే సుభూతయే స్వాహా.
ఆరవ అనువాకము
మొదటి సూక్తము - 47
17వ నక్షత్ర కల్పమున విహిత మరుద్గణీ నామక మహాశాంతి యందు అస్తృతనామక మణిని అభిమంత్రించి కట్టుట యందు వినియోగము.
1. తొలుత ప్రజాపతి అస్తృతమణిని బలవీర్యముల కొరకు కట్టినాడు. అట్టి మణిని ఆయుష్యము వర్చస్సు, ఓజస్సు, బలము కొరకు కట్టుచున్నాను. అస్తృతస్త్వాభిరక్షతు". అస్తృతము నిన్ను అభిరక్షించునుగాక.
2. అస్తృతమా! నీవు ఉన్నతవు. ఇతనిని రక్షింపుము. పణులు, యాతుధానులు నిన్ను ఆటంకపరచకుందురుగాక. నీవు ఇంద్రుని వలె దస్యులను వధింపుము. పాదముల క్రింద వేసి త్రొక్కుము. సకల శత్రు సేనలను వధించుము. "అస్తృతస్త్వాభిరక్షతు".
3. ఈ మణిని అసంఖ్యాకులు దెబ్బతీయలేక పోయినారు. హతమార్చలేకపోయినారు. అందుకే ఇంద్రుడు దీనియందు చక్షువులను, ప్రాణములను, బలములను ప్రవేశపెట్టినాడు. అస్తృతస్త్వాభిరక్షతు".
4. ఇంద్రుడు దేవతలకు అధిరాజు అగుచున్నాడు. ఈ మణిని ఇంద్రుని కవచముచే కప్పుచున్నాము ఈ మణిని సకల దేవతలు స్తుతింతురుగాక. అస్తృతస్త్వాభిరక్షతు".
5. ఈ అస్తృత మణియందు నూరున్నొక్క బలములు, వేల ప్రాణములు చేరియున్నవి. ఈ మణిని ధరించిన నీవు వ్యాఘ్రము వలె శత్రువులను వధించుము. శత్రు సేనలను త్రొక్కివేయుము. అస్తృతస్త్వాభిరక్షతు".
6. అస్తృతమణి ఘృత పుతము. మధుమంతము. పయస్వంతము. సహస్ర ప్రాణములది. శతయోని. యోద్ధ. మణిని ధరించువానికి శాంతి, సుఖము, బలము, అన్నము, పాలను ప్రసాదించుచున్నది. అస్తృతస్త్వాభిరక్షతు".
7. అస్తృతమణిధారకా! నీవు సర్వ శ్రేష్ఠుడవు. శత్రురహితుడవు - శత్రు హంతవు ఆగుము. నిన్ను సవితా దేవత సజాతీయుల అధిపతిని చేయునుగాక. అస్తృతస్త్వాభిరక్షతు".
రెండవ సూక్తము - 48
48 - 51 సూక్తములు రాత్రి కల్పపు రాత్ర్యుప స్థానమున మరియు జపమున వినియోగమగును.
1. రాత్రీ! నీవు భూలోక, అంతరిక్ష, స్వర్గ లోకములందు నల్లని అంధకారమును వ్యాపింపచేసినావు. అందువలన సర్వత్ర చీకట్లు క్రమ్ము కున్నవి.
2. రాత్రి. చీకటి. ఆద్యంతములు అగుపించవు. లోకమున దేని విషయమున తెలియదు. నిద్ర. రాత్రులందు ప్రమాదము.
రాత్రీ! నీవు నిరుపద్రవముగ దాటిపొమ్ము. మమ్ము భద్రముగ దాటించుము.
3. రాత్రీ! నరులను చూచుచు నిన్ను దర్శించువారు తొంబది తొమ్మండ్రు. వారు కాక నీచే ప్రభావితులు ఎనుబది ఎనిమిది మరియు డెబ్బది ఏడుగురు.
(వీరందరు గణదేవతలని సాయణుడు.)
4. రాత్రీ! నీవు ధనప్రదవు. సుఖప్రదవు. అన్నప్రదవు. నీకు సంబంధించిన 66గురు, 55మంది, 44గురు దేవతలున్నారు.
5. ద్యులోక పుత్రీ! రాత్రీ! నీకు సంబంధించిన 22గురు, పదకొండుమంది ఈ సమస్త దేవతలతో కూడి మమ్ము రక్షింపుము.
6. రాత్రీ! మమ్ము రక్షింపుము. పాపులు మమ్ము బాధించకుందురుగాక. దుష్టులు బాధించకుందురుగాక. మా గోవులు దొంగలించబడకుండునుగాక. అవి అడవి మృగములు పాలబడకుండునుగాక.
7. అశ్వములు దొంగలించబడకుండునుగాక. నరులను యాతుధానులు బాధించకుందురుగాక. దొంగలు దూర మార్గముల నుండి పారిపోవుదురుగాక. సర్పములు దూరమునుండి తొలగిపోవునుగాక.
8. రాత్రీ! పొగలు క్రక్కు సర్పముల తలనరకుము. తోడేలు దవడలు విరుచుము. దానిని చెట్టు క్రింద హతమార్చుము.
9. రాత్రీ ! నీ మీద భారము వేసి నిద్రించుచున్నాము. నీవు అప్రమత్తవగుము. మా అశ్వములకు, గోవులకు, నరులకు సుఖము కలిగించుము.
మూడవ సూక్తము - 49
1. రాత్రీ! ఇంటనున్న ప్రాకారములోన ఉన్న వానిని నీకు వప్పగించుచున్నాను.
2. రాత్రీ! ఉషస్సు వరకు మమ్ము రక్షింపుము. విభావరీ! ఉష- పగలు తరువాత - నీకు వప్పగించునుగాక.
3. రాత్రీ! పక్షుల నుండి, సరీసృపముల నుండి, పర్వత మృగముల నుండి మమ్ము రక్షించుము.
4. విభావరి మమ్ము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలందు కాపాడునుగాక. రాత్రీ! మేము నిన్ను స్తుతించుచున్నాము. మమ్ము రక్షించుము.
5. ఎవరు రాత్రులందు అనుష్ఠానము చేయుచున్నారో, ఎవరు ప్రాణుల కొరకు జాగృతులై ఉన్నారో, ఎవరు పశువులను రక్షించుచున్నారో, వారందరు మా విషయమున అప్రమత్తులు అగుదురుగాక. మా పశువులను రక్షింతురుగాక.
6. రాత్రీ! నీ పేరు 'ఘృతాచి' యని ఎరుగుచున్నాము. నిన్ను భరద్వాజుడు గ్రహించినాడు అట్టి రాత్రి మా ధనమును రక్షించునుగాక.
నాలుగవ సూక్తము - 50
1. రాత్రి ప్రార్థనీయ. నిత్యయువతి. సవితా, భగుల యోష. దుర్దమన. అశ్వక్షమ. అహవనీయ. అది ద్యావాపృథ్వులను తన మహిమచే ఆచ్ఛాదించునది.
2. రాత్రి విశ్వవ్యాప్తి. గంభీర. వర్షిష్ఠి. శ్రనిష్ఠ. ఆ రాత్రి లోకములను ఆక్రమించినది. మేము రాత్రిని స్తుతించుచున్నాము. స్వధలు అందుకొని సూర్యుడు రక్షించునట్లు, రాత్రి మమ్ము రక్షించునుగాక.
3. వందనీయ, స్తవనీయ, సుభగ, సుజాత రాత్రీ! విచ్చేయుము. నీ రాక వలన మేము సుమనస్కులము అగుదుముగాక. మమ్ము రక్షించుము. నరులను, పశువులను కాపాడు వారిని రక్షించుము.
4. రాత్రి - గజ, సింహ, వ్యాఘ్ర, శార్దూలముల శక్తిని హరించుచున్నది. అశ్వపు వేగమును, నరుని ఆయువును కట్టి వేయుచున్నది. రాత్రీ! నీవు బహురూపములు ధరించుచున్నావు.
5. శివాత్మక రాత్రికి, సూర్యునకు నమస్కరించుచున్నాము. హిమమాతయగు రాత్రి ఆహ్వాననీయ యగునుగాక. సుభగే! నా స్తుతులను ఆలకించుము. అందువలన మేము సమస్త దిశలకు నమస్కరించినవారలము అగుచున్నాము.
6. విభావరి రాత్రీ! రాజు వలె మా స్తుతులు విని ప్రసన్నవగుము. మేము ఉషః కాలమున పుత్ర వంతులము, జ్ఞానవంతులము అగుదుముగాక.
7. రాత్రీ! నీవు శత్రుదమన వగుటచే శమ్య అనబడు చున్నావు. మా ధనములను అపహరించువారిని తపింప చేయుము. ఆ దొంగలు మరల రాకుండునట్లు వారిని తపింపచేయుము. తపింపచేయుము.
8. రాత్రీ! నీవు చమసము వంటి పరిశుద్ధవు. విశ్వ వ్యాప్తవు. గోరూపవు. యువతిని. ప్రకాశించుదానవు. నీ చల్లని చూపుతో మమ్ము కాపాడుము. దేవతలు తమ దేహములను విడువని రీతి మమ్ము విడవకుము.
9. రాత్రీ ! మా ధనము దొంగలించుటకు వచ్చు వారి, మమ్ము హతమర్చ వచ్చు శత్రువుల మెడల త్రెంచుము. తలలు నరుకుము.
10. మరల రాకుండ వారి పాదములు నరకుము. మరల ఎత్తకుండ వారి చేతులు ఖండించుము. మమ్ము బాధించవచ్చువాడు రాత్రీ! నీ వలన యాతనలు పొంది పారిపోవును గాక. అతడు ఆకులేని, కొమ్మలేని చెట్టు క్రింద పడునుగాక.
ఐదవ సూక్తము - 51
1. రాత్రీ! శ్వాస యందు తృషా ధూమము గల సర్పపు తల తెంపుము. తోడేలు రెండు కనులు పోడువుము. దానిని చెట్టు క్రింద వధించుము.
2. ఎద్దులు దాటరాని నదులను దాటించురీతి మమ్ము సమస్త దురితములనుండి గట్టెక్కించుము.
3. రాత్రులు రాత్రులు గడుపుచు మేము రాత్రులను దాటుదుముగాక. మా శత్రులు మునుగుచున్న పడవ యందు వలె రాత్రిని దాటకుందురుగాక.
4. రాత్రీ! మా పట్ల దుర్మార్గము తలపెట్టినవానిని శ్యామ ధాన్యమ పండి రాలిన రీతి రాల్చుము.
5. రాత్రీ! వస్త్ర చోరులను దూరము చేయుము. గోవులు, మేకల చోరులను దూరము చేయుము. మెడకు త్రాడు కట్టి తీసికొనిపోవు అశ్వ చోరులను హతమార్చుము.





