Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    4. జంగిడా ! మమ్ము దివియందు రక్షింపుము. పృథివి యందు రక్షింపుము. అంతరిక్షమందు రక్షింపుము. ఓషధుల విషమునుండి రక్షింపుము. భూతభవ్యముల దిశదిశల పరిరక్షించుము.

    5. విశ్వభేషజమగు జంగిడ దేవకృత, మనుష్యకృత సర్వబాధలను నివారించునుగాక.

                                       మూడవ సూక్తము - 37

    వినియోగము:- 17వ నక్షత్ర కల్పమున విహిత సన్తతి నామక మహాశాంతి యందు శతవారిమణిని అభిమంత్రించి కట్టునది.

    1. శతవారి తన తేజస్సుచే వ్యాధులను, రాక్షసులను నాశనము చేయునుగాక. తన వర్చస్సుచే చర్మ వ్యాధులను నివారించునుగాక.

    2. శతవారి తన శృంగములచే రాక్షసులను, మూలముచే యాతుధానులను వధించుచున్నది. మధ్య భాగముచే సకల రోగ నివారకములను పాపులు పొందజాలరు.

    3. అల్పవ్యాధులను, మహావ్యాధులను, శబ్దించు వానిని, సర్వ దుష్ట వ్యాధులను శతవారి మణి నాశనము చేయునుగాక.

    4. శతవారి శత సంతతి కలిగించునుగాక. శతవ్యాధులను నివారించునుగాక. సర్వవ్యాధులను నివారించి రాక్షసులను హతమార్చునుగాక.

    5. శతవారమణి హిరణ్య శృంగ. ఋషభ. అది దుర్నామమను సమస్త చర్మవ్యాధులను నివారించి రాక్షసులను పారద్రోలునుగాక.

    6. ఈ శతవారిచే శత చర్మ వ్యాధులను, శత గంధర్వాప్సరసలను, శత శశ్వన్వంతులను నివారించుచున్నాను.

    (గంథర్వాప్సరసలు మనుష్యులను బలిఇచ్చుటకు తీసికొని పోవువారు. శశ్వన్వంతులు అపస్మారాది వ్యాధులు.)

                                          నాలుగవ సూక్తము - 38

    1. అగ్ని దేవత ప్రసాదించు బలము నన్ను చేరునుగాక. కీర్తి, తేజస్సు, ఓజస్సు, నిత్య యవ్వనము, బలము నాయందు ప్రవేశించునుగాక. ముప్పది మూడు వీర్యములను అగ్ని దేవత నాకు ప్రసాదించునుగాక.

    2. ఓజస్సు, వయస్సు, బలసహితముగ వర్చస్సును నా తనువున ప్రవేశపెట్టుము. శత శరత్తులు జీవించుటకు నిన్ను ఇంద్రియములు, కర్మములు, వీర్యములందు పరిగ్రహించుచున్నాను.

    3. ఊర్జమునకు నిన్ను, బలమునకు నిన్ను, తేజమునకు నిన్ను, సాహసమునకు నిన్ను, శత్రు దమనమునకు నిన్ను, రాజ్యమునేలుటకు నిన్ను శతశరత్తుల జీవితమునకు నిన్ను పరిగ్రహించుచున్నాను.

    4. ఋతువుల కొరకు, ఆర్తవముల కొరకు, మాద్భ్యముల కొరకు, సంవత్సరముల కొరకు, ధాత్రి కొరకు, విధాత్రి కొరకు, సమృద్ధి కొరకు, భూతపతి కొరకు నిన్ను యజించుచున్నాను.

                                         ఐదవ సూక్తము - 39

    5,6 సూక్తములు పురోహితుని కర్తవ్యములు. రాత్రిపూట రాజును శయ్యాగృహమున ప్రవేశపెట్టుట, గుగ్గిలము మున్నగు ఓషధుల ధూపములు వేయుట యందు వినియోగము.

    1. ఓషధి రూపపు గుగ్గిల  ధూమమును ఆఘ్రాణించిన వానికి వ్యాధులు బాధించవు. శాపములు బాధించవు.

    2,3 సింధు దేశమున, సముద్రమున పుట్టిన ఉభయ గుగ్గిలములను బాధా నివారణకు గ్రహించుచున్నాను. దానివలన వ్యాధులు నా నుండి సకల దిశలకు అశ్వములు, హరిణముల వలె పరిగెత్తి పారిపోవునుగాక.

                                          ఆరవ సూక్తము - 40

    1. హిమవంతమున పుట్టి, దేవతలకే బలకారకమగు కుష్ఠ ఓషధి సర్వ బాధలను సర్వయాతనలను నాశము చేయునుగాక.

    2. కుష్ఠమా! నీకు నద్యమార, నద్యారిష, నద్యమను మూడు వ్యాధి నివారక నామములున్నవి. వానిని నేను ఉదయము, పగలు, సాయంత్రము ఉచ్చరించుచున్నాను.

    3. వ్యాధివారక నద్య కుష్ఠమా! నీకు 'జీవిల' తల్లి, జీవంతి తండ్రి యగుచున్నారు. నీ నామమును ఉదయ, మధ్యాహ్న, సాయంకాలములందు ఉచ్చరించుచున్నాను.

    4. వ్యాధి నివారక నద్య కుష్ఠమా! జంతువులందు బరువులు మోయు ఎద్దు వలెను మృగములందు వ్యాఘ్రము వలెను, నీవు ఓషధులందు శ్రేష్ఠమవు. నీ నామమును ఉదయ, మధ్యాహ్న , సాయంకాలములందు ఉచ్చరించుచున్నాను.

    5. కుష్ఠము అంగిరులగు శంభువులచే మూడుమారులు, ఆదిత్యులచే మూడు మారులు విశ్వేదేవతలచే మూడుమారులు ఆవిష్కరించబడినది. అది సర్వరోగ నివారిణి. సోమము చేత కలిసి ఉన్న కుష్ఠము సర్వ బాధలను, సమస్త యాతనలను నాశము చేయుచున్నది.

    6. భూమి నుండి మూడవ లోకము దివి అగుచున్నది. అచటి అశ్వత్థము నుండి అమృతము ప్రకాశించినది. అందునుండి కుష్ఠము ఆవిర్భవించినది.

    సకుష్ఠో విశ్వ భేషజః సాకం సోమేన తిష్ఠతి |
    తక్మానం సర్వం నాశయ సర్వాంశ్చ యాతు ధాన్యః||


    సర్వ రోగ నివారకమగు సోమముతో కలిసి ఉన్న సోమమా! సకల బాధలను, సమస్త యాతనలను నాశము చేయుము.

    7. దివి యందు హిరణ్మయనావ బంగరు త్రాళ్లచే కట్టబడి ఉన్నది. అచట అమృతము ప్రకాశించినది. అందునుండియే కుష్ఠము ఆవిర్భవించినది.

      సకుష్ఠో విశ్వ భేషజః సాకం సోమేన తిష్ఠతి |
    తక్మానం సర్వం నాశయ సర్వాంశ్చ యాతు ధాన్యః||


    8. దివి హిమవంతమునకు శిరమై యున్నది. దివియందలి వారు రాలకున్నారు. అచటనే అమృతము ప్రకాశించినది. అందునుండియే కుష్ఠము ఆవిర్భవించినది.

    సకుష్ఠో విశ్వ భేషజః సాకం సోమేన తిష్ఠతి |
    తక్మానం సర్వం నాశయ సర్వాంశ్చ యాతు ధాన్యః||


    9. కుష్ఠమా! నిన్ను పూర్వము ఇక్ష్వాకుడు గ్రహించినాడు. కామపుత్రుడు గ్రహించినాడు యముని ముఖసముడగు వస దేవత గ్రహించినాడు. నీవు విశ్వ భేషజమవు.

    10. భూమి నుండి మూడవదగు స్వర్గము కుష్ఠపు శిరమై యున్నది. అది ఆవిర్భవించిన సమయము రోగనాశకమైయున్నది.

    కుష్ఠమా! విశ్వమందలి సమస్త బాధలను అధోముఖులను చేసి త్రొక్కివేయుము.


                                       ఏడవ సూక్తము - 41

    పవిత్ర నాశ నిమిత్త ప్రాయశ్చిత్తార్థము ఆజ్యహోమమున వినియోగము. అపయామము చేతి నుండి పడిపోయినందుకు ఆజ్య హోమమున వినియోగము.

    1. నా మనసునందలి లోపమును, వాక్కునందలి లోపమును మన్యుమంత సరస్వతి పూరించునుగాక. విశ్వే దేవతల సహితుడై బృహస్పతి వానిని పూరించునుగాక.

    2. జలములారా! మా ఆలోచనలను, మా మంత్రములను భంగపరచకండి. శోషించిన మా కర్మములను ఆర్ధ్రము చేయండి. మిమ్ము ఉపాసించుచున్నాము. మమ్ము సుమేధలను, శర్చస్సులను చేయండి.

    3. మా మేధలు, మా దీక్షలు, మా తపములు భంగపడకుండునుగాక. మాకు శుభములు కలుగునుగాక. మా ఆయువులు సుఖములగునుగాక. మా మాతరులు శుభప్రదలు అగుదురుగాక.

    4. అశ్వినులారా! మాకు అడ్డము తగులు అంధకారమును జ్యోతిష్మంతము చేయండి. మాకు జ్యోతిష్మంత రాత్రులను ప్రసాదించండి.


                                          ఎనిమిదవ సూక్తము - 42

    పూర్వము ఋషులు శుభములను ఆశించుచు తపము, దీక్షలు ఆచరించినారు. స్వర్గమునకు చేరినారు. వారి నుండియే రాజ్యము, బలము, ఓజము పుట్టినవి. వానిని దేవతలు మాకు కలిగింతురుగాక.


                                       తొమ్మిదవ సూక్తము - 43

    1. బ్రహ్మ హోత. బ్రహ్మ యజ్ఞము అగుచున్నాడు. బ్రహ్మ వలననే స్వరములు ఏర్పడినవి. అధ్వర్యుడు బ్రహ్మ నుండి అవతరించినాడు. బ్రహ్మ హవి యందు అంతర్హితుడై ఉన్నాడు.

    2. ఘృతవతి స్రుచ బ్రహ్మ యగుచున్నాడు. బ్రహ్మనుండియే వేది ఉద్భవించినది. యజ్ఞతత్వమగు ఋత్విజులు, హవిష్కృతము బ్రహ్మయే యగుచున్నది.

    శమితాయ స్వాహా.


    3. పాప విమోచనకుగాను మనీషి, పరమరక్షకుడు, సుమనస్కుడగు ఇంద్రుని స్తుతించుచున్నాము. ఇంద్రుడు మా హవిస్సులు అందుకొనునుగాక. సత్యాః సన్తు యజమానస్య కామాః'. యజమాని కోరికలు వాస్తవములు అగునుగాక.

    4. పాప పరిహారార్థము వరదుడు, యజ్ఞియుడు, విరాజమానుడు, అధ్వరులందు ప్రథముడగు ఇంద్రుని స్తుతించుచున్నాము. అగ్నిని, అశ్వినులను ఆహ్వానించుచున్నాము. వారు బుద్ధి బలమును, ఇంద్రియముల బలమును ప్రసాదింతురుగాక.

                                        పదవ సూక్తము - 44

    1. దీక్ష, తపస్సు సహితులైన బ్రహ్మ విదులు ఎచటికి చేరుచున్నారో అగ్నిదేవుడు మమ్ము అచటికి చేర్చునుగాక. మాకు మేధస్సు నిచ్చునుగాక.

    అగ్నయే స్వాహా.

    2. యత్ర బ్రహ్మవిదో యాన్తి దీక్షయా తపసహ | వాయువు మమ్ము అట్టి పదమునకు చేర్చునుగాక. వాయువు నాకు ప్రాణముల నిచ్చునుగాక వాయవే స్వాహా.

    3. యత్ర బ్రహ్మవిదో యాన్తి దీక్షయో తపసా సహ | సూర్యుడు మమ్ము అచటికి చేర్చునుగాక. సూర్యుడు నేత్రములు ప్రసాదించునుగాక.

    సూర్యాయ స్వాహా.

    4. యత్ర బ్రహ్మ విదో యాన్తి దీక్షయా తపసా సహ|
    చన్ద్రో మా  తత్ర నయతు మనశ్చన్ద్రో దధాతుమే|

    చన్ద్రాయ స్వాహా||

    5. యత్ర బ్రహ్మ విదో యాన్తి దీక్షయా తపసా సహ|
    సోమో మా తత్ర నయతు పయః సోమో దధాతు మే|
   
    సోమాయ స్వాహా||

    6. యత్ర బ్రహ్మవిదో యాన్తి దీక్షయా తపసా సహ|
    ఇన్ద్రోమా తత్ర నయతు బలమిన్ద్రో దధాతు మే|

    ఇన్ద్రాయ స్వాహా||

    7. యత్ర బ్రహ్మవిదో యాన్తి దీక్షయా తపసా సహ|
    ఆపోమా తత్ర నయన్వమృతం ,మోపతిష్ఠతు|

    అద్భ్యః స్వాహా||

    8. యత్ర బ్రహ్మ విదో యాన్తి దీక్షయా తపసా సహ|
    బ్రహ్మా మా తత్ర నయతు బ్రహ్మా బ్రహ్మ దధాతు మే|

    బ్రహ్మణే స్వాహా||       

   
                                          పదకొండవ సూక్తము - 45

    1. అంజనమా! నీవు ఆయుష్యమవని, విప్రుని వలె పరిశుద్ధవని, భేషజమవని చెప్పుచున్నారు. నీవును, జలములును శుభము, అభయము కలిగించండి.

    2. అంజనమా! కామిల, అంగభేద, విసల్పకాది సకల వ్యాధులను అవయవములనుండి బయటికి గెంటి హతమార్చుము.

    3. అంజనము భూమి మీద  పుట్టినది. భద్రము జీవనప్రదము. అది నన్ను అమరుని, రథము వంటి వేగవంతుని, పాప రహితుని చేయునుగాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.