Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    6. పిణ్డి దర్భ సపత్నాన్ మే పిణ్డి మే పృతనాయతః|
    పిణ్డి మే సర్వాన్ దుర్హార్దః పిణ్డి మే ద్విషతో మణే ||


    పిణ్డి = పొడి చేయుట

    7. ఓష దర్భ సపత్నాన్ మే ఓష మే పృత నాయతః |
    ఓష మే సర్వాన్ దుర్హర్ద ఓషమే ద్విషతో మణే||


    ఓష = భస్మము చేయుట.

    8. దహ దర్భ సపత్నాన్ మే దహమే పృతనాయతః|
    దహ మే సర్వాన్ దుర్హార్దో దహమే ద్విహతో మణే||


    9. జహిదర్భ సపత్నాన్ మే జహి మే పృత నాయతః |
    జహి మే సర్వాన్ దుర్హార్దో జహిమే ద్విషతో మణే||


    జహి = వధించు.

   
                                      నాలుగవ సూక్తము - 31

    వినియోగము :- పూర్వ సూక్తము వలె.

    1. దర్భా! నీ యందు జరామృత్యువులకు వందలాది కవచములున్నవి. వానిని కవచముగ  చేసికొని నీ శౌర్యముచే శత్రువులను వధించుము.

    2. దర్భా! నీ యందు శతపర్వములు, సహస్ర వీర్యములు ఉన్నవి. వార్ధక్యము నుండి రక్షించుటకు గాను విశ్వేదేవతలు వానిని నీకు ప్రసాదించినారు.

    3. దర్భా! నీవు దేవతల కవచమవు. నీవు బ్రాహ్మణస్పతివి. నిన్ను ఇంద్రుని కవచముగ చెప్పుచున్నారు. నీవు రాజ్యములను రక్షించుచున్నావు.

    4. దర్భ! నిన్ను శత్రు క్షయముగ, ద్విషతుల హృదయ తాపముగ, మా బలవర్ధనగ, దేహరక్షణగ భావించుచున్నాను.

    5. మేఘము గర్జించినది. పర్జన్యుడు ఉరిమినాడు. అందునుండి హిరణ్య బిందువులు రాలినవి. వాని నుండి దర్భ అవతరించినది.


                                        ఐదవ సూక్తము - 32

    17వ నక్షత్ర కల్ప విహిత కౌబరీ మహాశాన్తి యొక్క ఔదుంబర మణిబంధమున వినియోగము.

    1. పుష్టికాముని కొరకు విధాత ఔదుంబర మణిని కల్పించినాడు. సవిత మాగోష్ఠమున సమస్త పశువులను వర్ధిల్లచేయునుగాక.

    2. మా గార్హపత్యాగ్ని పశువుల అధిపతి యగుచున్నాడు. ఔదుంబర మణి వరములిచ్చునది. అది మాకు  పుష్టిని కలిగించునుగాక.

    3. ఔదుంబర మణి తేజమున విధాత నాకు పుష్టిని మా ఇంట గోమయాదులను - అన్నాదులను కలిగించునుగాక.

    4. నేను ఔదుంబరమణిని ధరించినాను. అందువలన  జనులు, పశువులు, అన్నములు, రసములు, సమృద్ధిగ లభించుచున్నవి.

    5. నాకు పశు సమృద్ధి, ప్రజ, ధాన్య సమృద్ధియు కలుగుచున్నది. సవితయు బృహస్పతి పశువుల పాలు, ధాన్యముల రసము ప్రసాదింతురుగాక.

    6. నేను పశువులకు అధిపతిని అగుచున్నాను. పుష్టిపతి నాకు పుష్టిని కలిగించునుగాక. ఔదుంబరమణి నాకు సంపదలు ప్రసాదించునుగాక.

    7. ఔదుంబరమణి వలన నాకు సంతానము, ధనము కలిగినవి. ఇంద్రుని ప్రేరణ గల మణి వలన వర్చస్సు కలిగినది.

    8. ఇది దేవమణి. ఇది శత్రు సంహారక. ధనప్రదాత. అది పశువులను, భూములను, గోవులను, సమృద్ధిణి కలిగించునుగాక.

    9. వనస్పతులు మొదటి నుండియే పుష్టి కలిగి పెరుగుచున్న రీతి సరస్వతి నాకు ధన సమృద్ధిని కలిగించునుగాక.

    10. సరస్వతి మాకు ధన, ధాన్య పుష్టి కలిగించునుగాక. సినీవాలి, ఔదుంబర మణియు పుష్టి కలిగింతురుగాక.

    11. ఔదురంబరమణీ! నీవు మణులకు అధిపతివి. వరదుడవు. పుష్టిపతి నీయందు పుష్టిని కలిగించినాడు. అట్టినీవు మాకు సమస్త అన్నములను, ధాన్యములను కలిగించుము. మా నుండి శత్రువును, దుర్మతిని, ఆకలిని దూరము చేయుము.

    12. ఔదుంబరమణీ! నీవు గ్రామ స్వామివి, మాకు స్వామిని ఆగుము. నీవు వర్చాభిషిక్తవు. మమ్ము వర్భాభిషిక్తులను చేయుము. నీవు తేజస్సువు. మమ్ము తేజస్సున నిలుపుము. నీవు ధనమవు. మమ్ము ధనమున నిలుపుము.

    13. మణీ! నీవు పుష్టివి. మమ్ము పరిపుష్టులను చేయుము. నీవు గృహమేధివి. మమ్ము గృహపతులను చేయుము. మాకు ధనపుష్టిని, సకల వీరులను కలిగించుమని నిన్ను కట్టుకొనుచున్నాము.

    14. ఔదుంబరమా! నీవు మణులందు వీరవరుడవు. బలము నిమ్మని నిన్ను కట్టుకొనుచున్నాను. ఆ మణి మాకు ధనమును, మధువును ప్రసాదించునుగాక. సంపదను, సర్వ వీరులను కలిగించునుగాక.


                                       ఆరవ సూక్తము - 33

    వినియోగము : 17వ నక్షత్ర కల్పమున విహిత యామ్యా మహాశాంతి యందు దర్భమణిని కట్టునది.

    1. దర్భ శత కాండములది. దుఃఖ నివారిణి. సహస్ర పర్ణ. ఉత్తరు. ఓషధులందు ఉగ్ర. ఆయుష్యము కొరకు అట్టి దర్భను కట్టుకొనుచున్నాను.

    2. అచ్ఛిన్న పర్ణయగు దర్భ సుఖమును ప్రసాదించినవాని వెంట్రుకను యముడు పీకజాలడు. రొమ్మును గుద్దజాలడు.

    3. దర్భా! నీ మూలము స్వర్గము. వ్యాప్తి భూమి మీద అగుచున్నది. సహస్ర కాండవగు నీచే ఆయువును ప్రవర్ధిల్లచేయుచున్నాము.

    4. దర్భా! నీవు మూడు స్వర్గములందును, మూడు పృథ్వులందును వ్యాపించి ఉన్నావు. అట్టి నీ చే దుష్ట హృదయుల నాలుకలను, మాటలను కట్టివేయుచున్నాము.

    5. నీవు శత్రువును సహించవు. నేను శత్రువును హింసింతును. ఉభయులము సహస్వతులమై శత్రువును పరాజితుని చేతము.

    6. నా పాపములను క్షీణింపచేయుము. శత్రుసేనను అణచుము. సమస్త దుష్టచింతనులను నియంత్రించుము. మాకు బహుమిత్రులను కలిగించుము.

    7. దర్భ దేవతలు కల్పించిన స్వర్గమునకు స్తంభమై శాశ్వతముగ నిలిచియున్నది. దానిచే ప్రజలను శాశ్వతులను, అమరులను చేయుచున్నాము.

    8. దర్భా! నన్ను బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, ఆర్యులకు ప్రియతముని చేయుము. మేము కోరిన ప్రతి వాడు మాతో స్నేహించునుగాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.