Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    2. ఇంద్రుడు అనుగ్రహించువాడు. అతనిని మేము ఆహ్వానించుచున్నాము. అందువలన మేము  ప్రజా, పశు సమృద్ధులము అగుదుముగాక. శత్రుసేన మమ్ము అడ్డగించకుండునుగాక. నలుదిశల మా పగతురను పరిమార్చుము.

    3. ఇంద్రుడు వృత్రహంత. అంతటివాడు మాకు రక్షకుడు అగునుగాక. అతడు మమ్ము శత్రువుల నుండి రక్షించునుగాక. ఇంద్రుడు మాకు ముందు వెనుక, మధ్యన సర్వత్ర మమ్ము రక్షించునుగాక.

    4. ఇంద్రదేవా! నీవు సర్వజ్ఞుడవు. మాకు మహా లోకమును కలిగించుము. మాకు స్వర్గమందలి జ్యోతి అభయము, శుభము అగునుగాక.

    5. మాకు అంతరిక్ష అభయము, ద్యావాపృథ్వుల అభయము, పశ్చిమమున అభయము, ప్రాగ్దిశన అభయము, ఉత్తరమున అభయము, దక్షిణమున అభయము కలుగును గాక.

    6. మిత్రుల, అమిత్రులనుండి అభయము, జ్ఞాతల అజ్ఞాతల నుండి అభయము, రాత్రింబవళ్ల నుండి అభయము కలుగునుగాక. దిశలన్నియు మాకు మిత్రములు అగునుగాక.

       
                                          ఏడవ సూక్తము - 17

    వినియోగము:
7-10 సూక్తములు రాత్రి పురోహితుని కర్తవ్యము. రాజు గృహప్రవేశము. అభిమంత్రిత సైకతమును సకల దిశలందు చల్లుట యందు.

    1. పూర్వ దిశ శత్రురహితము, పశ్చిమ దిశ భయరహితము అగునుగాక, దక్షిణమున సవిత,  ఉత్తరమున ఇంద్రుడు రక్షింతురుగాక.

    2. దివి యందు ఆదిత్యుడు, భూమి మీద అగ్నులు మమ్ము రక్షించునుగాక. ఇంద్రాగ్నులు పూర్వదిశ యందు రక్షింతురుగాక. అశ్వినులు సకల దిశలందు ధనము ప్రసాదింతురుగాక. ఆదిత్యులు, అగ్నులు మాకు సర్వత్ర కవచము వంటి వారలు అగుదురుగాక.

                                        ఎనిమిదవ సూక్తము - 18

    1. అగ్ని వసువుల సహితుడై మమ్ము రక్షించునుగాక. మేము కాలు కదిపిన చోట - కాలు పెట్టినచోట, ప్రవేశించిన గ్రామమున మమ్ము రక్షింతురుగాక. ఇంద్రుడు మమ్ము రక్షించునుగాక. పాలించునుగాక. అతనికి నన్ను అర్పించుకొనుచున్నాను - స్వాహా.

    2. వాయువు అతని దిశయగు అంతరిక్షమున నన్ను రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపిన చోట, ప్రవేశించిన గ్రామమున మమ్ము రక్షించును గాక.

    సమా రక్షతు సమాగోపయతు తస్మాఆత్మానం పరిదదే స్వాహా||

    అతడు మమ్ము రక్షించును గాక. పోషించును గాక. అతనికి నన్ను అర్పించుచున్నాను- స్వాహా.

    3. సోముడు రుద్ర సహితుడై మమ్ము దక్షిణ దిశయందు రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపినచోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."

    4. వరుణుడు ఆదిత్య సహితుడై అతని దిశయందు రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపిన చోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."

    5. సూర్యుడు ద్యావాపృథివీ సహితుడై మమ్ము పశ్చిమ దిశన రక్షించును గాక. కాలు కదిపిన  చోట, కాలు మోపినచోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."


    6. జలము ఓషధీ సహితమై దాని దిశయందు రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపినచోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."


    7. విశ్వకర్మ సప్తర్షుల సహితుడై ఉత్తర దిశన మమ్ము రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపిన చోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."

    8. ఇంద్రుడు మరుత్సహితుడై మమ్ము అతని దిశయందు రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపినచోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."

    9. ప్రజనన  వంతుని సహితముగ ప్రజాపతి ప్రతిష్ఠావంత ధ్రువదిశయందు మమ్ము రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపిన చోట, ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."

    10. బృహస్పతి విశ్వేదేవతల సహితుడై ఊర్థ్వ దిశన మమ్ము రక్షించును గాక. కాలు కదిపిన చోట, కాలు మోపిన చోట,  ప్రవేశించిన గ్రామమున రక్షించును గాక.

    "సమా రక్షతు................."

       
                                          తొమ్మిదవ సూక్తము - 19

    1. తూర్పు దిక్కున మమ్ము బాధించు పాపిష్ఠులు వసుమంత అగ్ని యందు పడి చత్తురు గాక.

    2. అంతరిక్షమున మమ్ము బాధించు పాపిష్ఠులు అంతరిక్ష వాయువున పడి చత్తురు గాక.

    3. దక్షిణ దిశయందు మమ్ము బాధించు పాపిష్ఠులు రుద్రువంత సోమము చేత చత్తురు గాక.

    4. దక్షిణ దిశయందు మమ్ము బాధించు పాపిష్ఠులు ఆదిత్య వంత వరుణుని చేతబడి చత్తురు గాక.

    5. పశ్చిమ దిశయందు మమ్ము బాధించు పాపిష్ఠులు ద్యావా పృథ్వీయుత సూర్యుని చేతబడి చత్తురు గాక.

    6. పశ్చిమ దిశయందు మమ్ము బాధించు పాపిష్ఠులు ఓషధీయుత జలములందు పడి చత్తురుగాక.
   
    7. ఉత్తర దిశ యందు మమ్ము బాధించు పాపిష్ఠులు సప్తర్షియుత విశ్వకర్మ చేతబడి చత్తురుగాక.

    8. ఉత్తర దిశ యందు మమ్ము బాధించు పాపిష్ఠులు మరుత్వంత ఇంద్రుని చేతబడి చత్తురుగాక.

    9. ధ్రువ దిశయందు మమ్ము బాధించు పాపిష్ఠులు ప్రజననవంత ప్రజాపతి చేతబడి చట్టురుగాక.

    10. ఊర్థ్వ దిశయందు మమ్ము బాధించు పాపిష్ఠులు విశ్వే దేవయుత బృహస్పతి చేతబడి చత్తురుగాక.


                                      పదవ సూక్తము - 20

    వినియోగము : పురోహితుడు రాజును రాత్రి శయ్యా గృహమున ప్రవేశపెట్టుటకు, రాజు యొక్క నూతన గృహ ప్రవేశమునకు.

    1. అగ్ని పృథ్వి మీద  అవతరించినాడు. మిమ్ము పురమున ప్రవేశపెట్టుచున్నాను.

    తామా విశత తాం ప్రవిశత సావః శర్మచ వర్మచ యచ్ఛతు.

    ఆ పురమునకు చేరుము. దానియందు ప్రవేశించుము. అది మీకు ధనమును రక్షణను కలిగించునుగాక.

    2. వాయువు అంతరిక్షమున  అవతరించినాడు. మిమ్ము పురమున ప్రవేశపెట్టుచున్నాడు.

    "తామా విశత.................||"

    3. సూర్యో దివోదక్రామత్ తాంపురం ప్రణయామి వః |

    "తామా విశత.................||"

    4. చంద్రమా నక్షత్రైరుద క్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    5. సోమ ఓషధీ భిరుద క్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    6. యజ్ఞో దక్షిణాభిరుద క్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    7. సముద్రో నదీబిరుదక్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    8. బ్రహ్మ బ్రహ్మచారీభిరుదక్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    9. ఇంద్రో వీర్యేణోదక్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    10. దేవా అమృతేనోదక్రామంస్తాం పురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"

    11. ప్రజాపతిః ప్రజాభిరుద క్రామత్ తాంపురం ప్రణయామి వః|

    "తామా విశత.................||"



                                    పదకొండవ సూక్తము - 21

    దీనిచే యుద్ధమునకు సిద్ధమగురాజునకు పురోహితుడు కవచము ధరింపచేయునది.

    1. వధించు సాధనములు సిద్ధము చేసినారు. ఇంద్రాగ్నులు ధాత, సవిత, బృహస్పతి, సోమరాజు, వరుణుడు, అశ్వినులు, పూష ఇతనిని మృత్యువు నుండి రక్షింతురుగాక.

    2. భువనపతియగు ప్రజాపతి , మాతరిశ్వ ప్రజల కొరకు ఏ  కవచమును చేసినారో , దేనిని దేశలు, ప్రదిశలు ధరించి యున్నవో అట్టి కవచములు నాకు మరిన్ని యగునుగాక.

    3. దివము నందలి రాజులు తమ దేహములను దేనితో కప్పుకున్నారో, ఇంద్రుడు ఏకవచమును ధరించినాడో అవి సర్వత్ర మమ్ము రక్షించునుగాక.

    4. ద్వావాపృథ్వులు నాకు కవచమును ప్రసాదించునుగాక. సూర్యదేవత కవచమును ప్రసాదించునుగాక. శత్రువులు నన్ను చేరకుందురుగాక.

       
                                       మూడవ అనువాకము
                                      మొదటి సూక్తము - 22


    ఛందోబ్రహ్మ వర్చస్కామి కొరకు 17వ నక్షత్ర కల్పమున విహిత మహాశాంతియందు వినియోగము

    గాయత్య్రై స్వాహా. ఉష్ణిహే స్వాహా. అనుష్టుభే స్వాహా. బృహత్యైస్వాహా. పంక్త్యై స్వాహా. త్రిష్టుభే స్వాహా. జగత్యై స్వాహా.

                                       రెండవ సూక్తము - 23

    సంపద కోరు వానికి, అభిచారము చేయువానికి అభిచారము వారికి 17 వ నక్షత్ర కల్పమున విధించిన ఆంగిరసీ మహాశాంతి యందు వినియోగము.

    1. ఆంగిరసాదులకు పంచానువాకములచే స్వాహా. 2. షష్ఠాయ స్వాహా. || 3. సప్తమాష్టమాభ్యాంస్వాహా || 4. నీలనఖేభ్యః స్వాహా || 5. హరితేభ్యః స్వాహా || 6. క్షుద్రేభ్యః స్వాహా|| 7. పర్యాయికేభ్యః స్వాహా || 8. ప్రథమేభ్యః శృజ్ఖేభ్యః  స్వాహా || 9. ద్వితీయేభ్యః శృజ్ఖేభ్యః స్వాహా|| 10. తృతీయభ్యః శృజ్ఖేభ్యః స్వాహా|| 11. ఉపోత్తమేభ్యః స్వాహా|| 12. ఉత్తమేభ్యః స్వాహా || 13. ఉత్తరేభ్యః స్వాహా|| 14. ఋషిభ్యః స్వాహా || 15. శిఖిభ్యః స్వాహా|| 16. గణేభ్యః స్వాహాః|| 17. మహాగణేభ్యః స్వాహా|| 18. సర్వేభ్యోజ్గిరోభ్యో విద్గణేభ్యః స్వాహా || 19. పృథక్సహస్రాభ్యాం స్వాహా || 20. బ్రహ్మణే స్వాహా||

    21. వీరకృత్యములు బ్రహ్మజ్యేష్ఠములు అగుచున్నవి.బ్రహ్మయే తొలుత దివిని కల్పించినాడు. సకల ప్రాణులందు బ్రహ్మయే జ్యేష్ఠుడు అగుచున్నాడు. అట్టి తరి బ్రహ్మతో స్పర్ధించగలవాడెవ్వడు?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.