Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    4. సవితాదేవా! వెనుక నుంచి పిలుచు,  ప్రక్కల నుండి పిలుచు, పరుష పదముల , వర్జనీయ పదముల, వట్టి కుండలు మున్నగు సమస్త దుర్నిమిత్తములను దూరముచేయుము.

    5. తుమ్ము యొక్క పాపము పరిహారమగునుగాక. తుమ్ము పుణ్య ప్రదమగునుగాక. పాపనాశికయగు తోడేలు శుభప్రదమగునుగాక. నపుంకుడు సహితము ప్రోత్సహించునుగాక.

    6. బ్రాహ్మణస్పతి ఇంద్రా! అన్ని దిశల నుండి వీచు పెనుగాలులను అనుకూలములను చేసి వానిని  నాకు శివతమములు చేయుము.

    7. మాకు రాత్రింబవళ్లు శుభప్రదములు, అభయములు అగునుగాక. రాత్రింబవళ్లకు నమస్కరించుచున్నాము.

   
                                          పదవ సూక్తము - 10

    వినియోగము - రాజును ప్రతినిత్యము ఇంటికి చేర్చు విధియందు ఇసుక చల్లిన తరువాత ఈ సూక్తమును జపించునది. పిష్ట రాత్రి కల్పమునను - ఐరావతీ శాంతి మరియు ఇతర శాంతులందు దీని వినియోగము - ఇది శాంతి సూక్తము.

   
    1 శాన్తా ద్యౌః శాన్తా పృథివీ శాంతం ఉర్వన్తరిక్షమ్|

    సముద్ర జలములు, ఓషధులు మాకు శాంతములు అగునుగాక.

    2. ఒక కార్యమునకు పూర్వములు - జరిగిన, జరగని కార్యములు శాంతములు అగునుగాక. భూత భవ్యములును, సమస్తమును మాకు శాంతమగునుగాక.

    3. ఈమె పరమేష్ఠిని, మా మనస్సు - వేద స్వరూపిణి, మా విషయమున ఆమె వలన కలిగిన ఘోరములను అమెయే శాంతింపచేయునుగాక.

    4. ఈమె పరమేష్ఠిని, మా మనస్సు - వేద స్వరూపిణి, మా విషయమున ఆమె వలన కలిగిన ఘోరములను ఆమెయే శాంతింపచేయునుగాక.

    5. అయిదు ఇంద్రియములు, ఆరవ మనసును హృదయ మందలి ఆత్మ నియంత్రించుచున్నది. ఆత్మవలన నాకు కలిగిన ఆపదలను ఆత్మయే శాంతింపచేయునుగాక.

    6. శంనో మిత్రః శం వరణః శం విష్ణుః శం ప్రజాపతిః|
    శంన ఇంద్రో బృహస్పతి శం నో భవత్యర్యమా ||

    7. శంనో మిత్రః శం వరుణః శం వివస్వాచ్ఛమన్తకః|


    పృథివి, అంతరిక్షము నందలి ఉత్పాతములు శాంతించునుగాక. మాకు దివియందలి గ్రహములు శాంతములు అగునుగాక.

    8. మాకు భూకంపము శాంతమగునుగాక. ఉల్కా పాతము శాంతమగునుగాక. రక్తము పెంచు క్షీరములనిచ్చు గోవులు శాంతములగునుగాక. శాంతమగు భూమి మమ్ము రక్షించునుగాక.

    9. ఉల్కా తాడిత నక్షత్రము మాకు శాంతములు అగునుగాక. అభిచారకులు, కృత్యులు శాంతులు అగుదురుగాక. మా కొరకు తీసిన  గోతులు శాంతించునుగాక. పిడుగుపాటు శాంతమగునుగాక. దేశము శాంతమగునుగాక.

    10. చంద్రునితో గూడిన గ్రహములు మా కొరకు శాంతించునుగాక. రాహుగ్రస్త సూర్యుడు శాంతించునుగాక. ధూమకేతు మృత్యువు శాంతించునుగాక. తీక్ష్ణ తేజ రుద్రుడు శాంతించునుగాక.

    11. శం రుద్రాః శం వసవః శమాదిత్యాః  శమగ్నయః|
    శం నో మహర్షయో దేవాః శం దేవాః శం బృహస్పతిః ||


    12. బ్రహ్మ, ప్రజాపతి, ధాత, వేదములు. సప్తర్షులు అగ్నులు మాకు శుభములు కలిగింతురుగాక. ఇంద్రుడు, బ్రహ్మ, విశ్వేదేవతలు, సకల దేవతలు మాకు సుఖమును, ధనమును ప్రసాదింతురుగాక.

    13. జగములందు గల శాంతులను సప్తర్షులు తెలియుచున్నారు. ఆ సకల శాంతులు మాకు కలుగునుగాక. "శంమే అస్త్వభయంమే అస్తు" నాకు శాంతి, అభయము కలుగునుగాక.

    14. పృథివీ శాన్తిః అన్తరిక్షం శాన్తిః ద్యౌ శాన్తిః ఆపః శాన్తిః ఓషధయః శాన్తిః వనస్పతయః శాన్తిః విశ్వే మే దేవాః శాన్తిః సర్వ మే దేవాః శాన్తిః శాన్తిః శాన్తిః శాన్తిభిః

    ఈ సమస్త శాంతులచే మాకు శాంతి లభించును గాక. ఇచట నేను చేసిన పాపము ఘోరము, కృరము శాంతించునుగాక.

    "తచ్ఛివం సర్వమేవ శమస్తునః"


                                      రెండవ అనువాకము
                                            మొదటి సూక్తము -11


    వినియోగము :
1-3 సూక్తములు రాజు శయ్యాగృహ ప్రవేశ సమయమున పురోహితునిచే చదువబడవలసినది. వీనిచే తులాపురుష, మహా దానమున ఘృత హోమము చేయునది. ఇవి శాంతి ప్రతిపాదకములు. ఐరావతీ మహాశాంతి యందు వినియోగము.

    1. ఇంద్రాగ్నులు మమ్ము రక్షించుచు శుభములు కలిగింతురుగాక. ఇంద్రావరుణులు హవిస్సులు అందుకోని మాకు శుభములు కలిగింతురుగాక. ఇంద్ర సోములు సుఖములిచ్చి శుభములు కలిగింతురుగాక. ఇంద్రాపూషలు అన్నము లిచ్చు వారై శుభములు కలిగింతురుగాక.

    2. మాకు భగుడు, శంసుడు, బుద్ధి, ధనములు శుభప్రదములు అగునుగాక. సత్య, సుయములు, పురుజాత ఆర్యమ శుభప్రదులు అగుదురుగాక.

    3. మాకు ధాత - ధర్త, అన్నములతో పృథ్వి శుభప్రదములు అగునుగాక. మహాంతరిక్షము, పర్వతములు, సుఖ ప్రదముగ వీచు వాయువు కళ్యాణకరములు అగునుగాక.

    4. మాకు జ్యోతిర్ముఖ అగ్ని, మిత్రావరుణులు, అశ్వినులు కళ్యాణకరులు అగుదురుగాక. పుణ్యకర్మము, సుఖ ప్రదముగ వీచు వాయువు కళ్యాణకరములు అగునుగాక.

    5. పూర్వహోత ద్యావాపృథ్వులు, అంతరిక్షము మా దృష్టికి మంగళము కలిగింతురుగాక. వన ఓషధులు, లోకపాలక జిష్ణువు మాకు మంగళము కలిగింతురుగాక.

    6. వసుసహిత ఇంద్రుడు, ఆదిత్య సహిత సుస్తుత వరుణుడు మాకు శుభములు కూర్తురు గాక. సుఖప్రద రుద్రుడు రుద్రుల సహితముగ దేవపత్నీ సహిత త్వష్ట మాకు శుభములు కూర్తురుగాక. మా సుతులు ఆలకింతురుగాక.

    7. సోమము, మంత్రములు, అభిషవ శిలలు, యజ్ఞములు మాకు శుభప్రదములు అగునుగాక.  యూపములు, ఓషధులు, వేది శుభప్రదములు అగునుగాక.

    8. మహా తేజస్వి సూర్యుడు శాంతుడై ఉదయించునుగాక. చతుర్దిశలు శాంతములు అగునుగాక. పర్వతములు, ధ్రువములు, నదులు, జలములు, శాంతములు అగునుగాక.

    9. సుకర్మలచే అదితి, సుస్తుతులచే వాయువు మా కొరకు శాంతులు అగుదురుగాక. విష్టువు, పూష, జలము, వాయువు శాంతులు అగుదురుగాక.

    10. త్రాతయగు సవిత, ప్రకాశించు ఉషస్సులు, ప్రజ కొరకు వర్షించు పర్జన్యుడు, క్షేత్ర పతియు మాకు సుఖ శాంతి ప్రదులు అగుదురుగాక.

   
                                      రెండవ సూక్తము - 12

    1. సత్యపాలకులు, అశ్వములు, గోవులు, సుకృతులు, హస్త కుశలురగు ఋభువులు, హవిస్సులందు పితరులు మాకు సుఖ శాంతప్రదులు అగుదురుగాక.

    2. మా కొరకు దేవతలు, విశ్వే దేవతలు, సత్కర్మల సరస్వతి,  ధనము, యశస్సు, ద్యావాపృథ్వులు, జలములు శాంతములు అగునుగాక.

    3. మా కొరకు అజ ఏకపాద దేవత, అహిర్బుధ్న్య దేవత జలము కురిపించు అపాంనపాత దేవత, దేవతలచే రక్షించబడు పృశ్ని శాంతులు - సుఖప్రదులు అగుదురుగాక.

    4. ఆదిత్యులు, రుద్రులు, వసువులు మానవీన స్తుతులను ఆలకింతురుగాక. దివియందున్న, భువియందున్న దేవతలు, మరుత్తులు, యజ్ఞార్హ దేవతలు మా స్తుతులను ఆలకింతురుగాక.

    5. దేవ ఋత్విజులు, యజ్ఞములు, మనుపుత్రులు, అమృతులు, సత్యజ్ఞులు మాకు మహా యశస్సు కలిగింతురుగాక. వారు మమ్ము నిత్యము సుఖము కలిగించి పోషింతురుగాక.

    6. మిత్రా వరుణ అగ్ని దేవతలు మాకు ఆరోగ్యమును, ఆభయమును ప్రసాదింతురుగాక. మాకు గాధలు, ప్రశస్తి కలుగునుగాక. దేవతల బృహత్ సదనమునకు నమస్కరించుచున్నాము.

   
                                     మూడవ సూక్తము - 13

    ఉష ఉదయించును. రాత్రి అంతరించును. మార్గములు ప్రకాశవంతములగును. అప్పుడు మాకు దేవతలు ఆనందించు అన్నము లభించునుగాక. సంతాన సహితులమై "మదేమ శతహిమాః
 నూరు హేమంతములు ఆనందింతుముగాక.

    (జీవించుట మాత్రము కాదు ఆనందించుట అనుచున్నాడు.)

           
                                   నాలుగవ సూక్తము - 14

    ఇది అప్రతిరథ సంజ్ఞక సూక్తము. నక్షత్ర కల్పాదులందు "అప్రతిరథ" శబ్దము వచ్చినపుడు దీనిని అర్థము చేసికొనవలెను.

    1. ఇంద్రుని బహువులు బలిష్ఠములు, వరదములు, అద్భుతములు, వృషభములు, ఇంద్రుడు ఆ బాహువులతో అసురులను ఓడించినాడు, స్వర్గమును గెలిచినాము. యోగ క్షేమములకని వానిని ప్రార్థించుచున్నాము.

    2. ఇంద్రుడు ఆలస్యము ఎరుగని వాడు, తీక్ష్ణ బుద్ధి కలవాడు. అరిభయంకరుడు. నరులకు క్షోభ కలిగించువాడు. అనిమిషుడై ఎదిరించువాడు. ఒక్కడే వందలసేనలను గెలుచువాడు.

    3. ఇంద్రుడు శత్రువులను ఏడిపించువాడు. అనిమిషుడు. విజయుడు. నిశ్చలుడు. ధృష్టుడు. ధనుర్ధారి. వరదుడు.

    జనులారా! అట్టి ఇంద్రుని అనుగ్రహమున ఎదిరించండి. జయించండి.

    4. ఇంద్రుడు బాణహస్తుడు. ఖడ్గధారి. నియంత. యుద్ధమున శత్రువులను పారద్రోలువాడు. యుద్ధజితుడు. సోమపాయి. భుజబలి, ఉగ్రధన్వుడు. ప్రతిపక్షులను పరాస్తులను చేయువాడు.

    5. ఇంద్రుడు బలజ్ఞాత. స్థవిరుడు. ప్రవీరుడు. సహస్వి. అన్నవంతుడు. సహమానుడు. ఉగ్రుడు. అనుచరవీరుడు. వీరపూజ్యుడు. సహజిత్తు. జైత్రుడు. గోజితుడు. అట్టి ఇంద్రుడు మా కొరకు రథమును అధిష్ఠించునుగాక.

    6. యోధులారా! ఉగ్ర ఇంద్రుని అనుసరించండి. మిత్రులారా! ఉత్సాహమున ఉరకండి. ఇంద్రుడు గ్రామజితు. గోజితు. వజ్రబాహువు. యుద్ధ విజేత. శత్రువును తొక్కి పెట్టువాడు.

    7. ఇంద్రుడు జలములను, బలములను నిర్దయగా లాగి తెచ్చువాడు. ఉగ్రుడు, క్రోధనుడు. కదిలించరానివాడు. అయోధ్యుడు. అట్టి ఇంద్రుడు మా సేనలను రక్షించునుగాక.

    8. మహా దేవతలను పాలించు ఇంద్రా! రథమును ఎక్కుము. రాక్షసులను, శత్రువులను పరిమార్చుచు ప్రభంజనము వలె సాగుము. మా శత్రువులను, ప్రతికక్షులను హతమార్చుము. మమ్ము రక్షింపుము.

    9. అభిభంజించు, జయించు దేవసేనలకు ఇంద్రుడు నేత. బృహస్పతి తూర్పున నడచువాడు. సోముడు దక్షినాధిపతి. మరుత్తులు మధ్యన ఉందురుగాక.

    10. వర్షించు ఇంద్రుడు, రాజగు వరుణుడు, ఆదిత్యులు మరుత్తులు శత్రుమర్దనుడు ప్రత్యక్షమగుదురుగాక. మహాయశస్వులు శత్రువులను లోకచ్యుతులను చేయగలవారు. జయించునట్టి దేవతలందరు జయధ్వానములు చేయుదురుగాక.

    11. ఇంద్రుడు ధ్వజములందు, యుద్ధములందు మావాడు అగునుగాక. మా బాణములు జయించునుగాక. మా వీరులు  వీరవరులు అగుదురుగాక. దేవతలు యుద్ధమునందు మమ్ము రక్షింతురుగాక.

   
                                        ఐదవ సూక్తము - 15

    వినియోగము :
సాగ్ని పత్నీక ఆహితాగ్ని ప్రయాణము పర్యవసితమైనపుడు దీనిచే ఘృతాహుతులు ఇచ్చునది.

    ప్రయాణాంతమునకు చేరుకున్నాము. ద్యావాపృథ్వులు శివములు అగునుగాక. దిశలు బాధారహితములు అగునుగాక. మేము మిమ్ము ద్వేషించకున్నాము. మాకు అభయము కలిగించండి.


                                        ఆరవ సూక్తము - 16


    వినియోగము: ఈ సూక్తపు పాఠము అభయ గణము లందు ఉన్నందున నక్షత్రకల్ప, శాంతికల్ప, పరిశిష్ఠాదులందు గణ ప్రయుక్త వినియోగముగ భావించునది.

    1. ఇంద్రదేవా! మాకు భయము కలిగిన చోట అభయులను చేయుము. మఘవా! నీ ఆయుధములచే మమ్ము రక్షించు సమర్థుడవగుము. మా శత్రువులను వధింపుము.
       




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.