Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్స నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||
శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
పందొమ్మిదవ కాండము
మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
సంసం స్రవంతు నద్యః సంవాతాః సం పతత్రిణః|
యజ్ఞమిమం వర్దయతా గిరః సంస్రావ్యేణ హవిషా జుహోమి||
నదులు అనుకూలముగ ప్రవహించునుగాక. వాయువు అనుకూలముగా వీచునుగాక. పక్షులు అనుకూలములు అగునుగాక. ఈ యజ్ఞము స్తుతులచే వర్ధిల్లునుగాక. ఆజ్యపయః ప్రవాహపు హవిస్సు అర్పించుచున్నాను.
వినియోగము : ఈ సూక్తము సర్వపుష్టి కర్మయందు మిశ్ర ధాన్య చరు ప్రాశనమునందు, దధిమధు మిశ్రిత సక్తుమంథ ప్రాశనమందును, లక్ష్మీకరణమందును, అమృతాది మహాశాంతియొక్క సాధారణ భూత శాంతి యందును, శాంతి కొరకు నది నుండి తెచ్చు నీటిని అభిమంత్రించుటకు-
2. ఈ హోమములు యజ్ఞము - ఘృతమధు ప్రవాహము అగుచున్నది. ఈ యజ్ఞము స్తుతులచే వర్ధిల్లును గాక. ఘృత , మధు హవిస్సులు అర్పించుచున్నాము.
3. ఇతనికి పశు, పుత్రపౌత్ర ధనాదులు కలిగించుచున్నాను. ఈ యజ్ఞము నలు దిశల వర్ధిల్లును గాక. ఘృత, మధు ధారల హవిస్సులను అర్పించుచున్నాను.
రెండవ సూక్తము - 2
1. హిమమంతపు జలము శుభము అగును గాక. సెలయేటి జలము శుభము అగును గాక. జీవనదీ జలము శుభము అగును గాక. వర్షజలము శుభము అగును గాక.
2. ఎడారి జలము శుభప్రదము అగును గాక. జలసమృద్ధ దేశజలము శుభప్రదము అగును గాక. బావి జలము శుభప్రదము అగును గాక. కుండలోని నీరు శుభప్రదము అగును గాక.
3. సాధనము లేకనే, కరచరణాదులచే గంభీర జలమును కలిగించునట్టియు, అగాధస్థానములందు ఉండునట్టియు వైద్యుల కన్నా మిన్నహితము కలిగించు జలములు సుఖప్రదములు అగును గాక. వానిని మేము స్తుతించుచున్నాము.
4. దివ్యజలములు, నదుల జలములు, పరిశుద్ధ జలములు శక్తినిచ్చునవి అగును గాక.
5. శివములగు జలములగు తెండి. రోగనివారక జలములను తెండి. తృప్తి నిచ్చు, సుఖము కలిగించు, ఓషధుల వంటి జలమును ప్రసాదించండి.
మూడవ సూక్తము - 3
వినియోగము :-
3 - 4 సూక్తములు బుద్ధిని పెంచుటకు ఉపయుక్తములు. బుద్ధిని కోరువాడు నిద్రలేచి రెండు సూక్తములు చదివి చేతితో ముఖము కడుగునది. వర్చస్సు కోరువాడు ఈ రెండు సూక్తములచే దధి మధులను సంపాతిత, అభిమంత్రితములు చేసి తినునది.
వర్చస్సు కోరువాడు క్షత్రియుడైన దధిమధులను సంపాతిత, అభిమంత్రితములు చేసి, వానిని అన్నములో కలిపి సంపాతిత అభిమంత్రితములు చేసి తినిపించినది. వైశ్య శూద్రులకు అన్నము మాత్రము సంపాతిత, అభిమంత్రితములు చేసి తినిపించునది.
1. జాతవేదాగ్నీ! నీవు దివి, అంతరిక్షము, దిశలు, వనస్పతులు, ఓషధులందు ఎచట వర్ధిల్లువాడవైనను మాకు ప్రీతి కలిగించుటకు విచ్చేయుము.
2. అగ్నిదేవా! నీటి యందు, అరణ్యములందు, ఓషధులందు, పశువులందు, జలాంతరములందున్న నీ మహిములు అన్నింటిని కూర్చుకొని రమ్ము. మాకు నిరంతరము ధనము ప్రసాదించుము.
3. అగ్నిదేవా! నీ మహిమ దేవతలందున్నది. స్వర్గమందున్నది. నీ దేహమున ఉన్నది. నీవు పితరులందు ప్రవేశించి ఉన్నావు. మానవులందు నీవు కలిగించిన పుష్టి ఉన్నది. వాటితో మాకు సంపద లొసంగుము.
4. అగ్నిదేవా! నీవు శ్రుతులు వినువాడవు. కవివి. విద్వాంసుడవు. నిన్ను వాక్కుతోను, ఛందస్సుతోను స్తుతించుచున్నాను. నాకు భయమునన చోట అభయమును, దేవతల క్రోధమున్న చోట అక్రోధమును కలిగించుము.
నాలుగవ సూక్తము - 4
1. తొలుత అథర్వుడు ఆహుతులు అర్పించినాడు. జాత వేదాగ్ని తొలుత వానిని దేవతలకు చేర్చినాడు. నేను అట్టి తొలి ఆహుతులను అర్పించుచున్నాను. అగ్ని మా హవిస్సులను వహించును గాక - అగ్నయే స్వాహా.
2. సర్వ విద్యలకు దేవి, సుభగ, సరస్వతిని నా ముందు నిలుపు కొనుచున్నాను. ఆమె మనసునకు తల్లి. నా పిలుపునకు పలుకును గాక. నేను కోరిన కోరిక నాకు మాత్రమే ఫలించును గాక. నా మనసునందలి కోరికలు నిత్యము ఫలించును గాక.
3. బృహస్పతియు, వాగ్ధేవియు సకల విద్యలతో మమ్ము చేరుదురు గాక. మాకు సంపదలు కలిగించండి. మా పిలుపునకు పలకండి.
4. బృహస్పతి అంగిరసుడు. దేవతలను ఏకము చేయువాడు. ప్రసన్నలను చేయువాడు. అతడు వాగ్ధేవిని స్మరించును గాక. మా కామనలు ఫలింప చేయును గాక.
ఐదవ సూక్తము - 5
1. ఇంద్రుడు లోకముల మానవులకు ప్రభువు. అతడు జగములందలి ధనములను, సంపదలను స్తోతలకు ప్రసాదించుచున్నాడు. ఇంద్రుడు మా స్తుతులు విని మా ముందునకు ధనమును పంపునుగాక.
ఋక్పాఠస్తు
ఆరవ సూక్తము
వినియోగము:-
6,7 సూక్తములు పురుషమేధమున పురుష పశువును అనుమంత్రించుటకు శనిగ్రహ హవిఘృత హోమమందు, ఉప స్థానమున, భూదానమందు జరుగు ఘృతహోమమందు వినియోగము.
1. అతడు వేల బాహువులవాడు. వేల కన్నులవాడు. వేల పాదములవాడు. అతడు విశ్వమును ఆదరింపగా దశాంగుళులు ఎక్కువైనాడు.
2. అతడు త్రిపాదముచే ద్యులోకమును ఆరోహించినాడు. ఒక పాదమును ఇహలోకమున ఉంచినాడు. అతడు విశ్వమునందలి అశన, అనశనులను ఆక్రమించి ఉన్నాడు.
(అశన భుజించువారు. అనశన భుజించని వారు.)
3. అంతటిది అతని మహిమ. అతడు దానిని మించినవాడు. అతని ఒక పాదము సమస్త భూతములు కాగా, మూడు పాదములు "అమృతందివి" యందున్నవి.
4. అతడు సర్వము తెలిసినవాడు. పుట్టినవి, పుట్టనున్నవి తెలిసినవాడు, అతడు అమృత దేవతలకు ఈశ్వరుడు. ఇతడే అన్యులందరకు ఈశ్వరుడు అగుచున్నాడు.
5. అతనిని ఎట్లు కల్పించినారు? ఎన్ని తీరుల కల్పించినారు? అతని ముఖము ఏది? బాహువులు ఏవి? ఊరువులు ఏవి? పాదములు ఏవి?
ఏడవ సూక్తము - 7
1. బ్రాహ్మణుడు అతని ముఖముమ్ రాజన్యులు బాహువులు అయినారు. మధ్యమునుండి వైశ్యులు పాదములనుండి శూద్రులు పుట్టినారు.
2. చంద్రుడు మనసునుండి ఆవిర్భవించినాడు. నేత్రముల నుండి సూర్యుడు అవతరించినాడు. ముఖమునుండి ఇంద్రాగ్నులు, ప్రాణము నుండి వాయువు ఆవిర్భవించినారు.
3. నాభినుండి అంతరిక్షము, తలనుండి ద్యులోకము ఏర్పడినవి. పాదములనుండి భూమి, చెవుల నుండి దిశలు, అట్లే లోకముల కల్పన జరిగినది.
4. తొలుత విరాట్టు కలిగినాడు, అతడు విరాట్ పురుషునిగ అవతరించినాడు. అతడు అవతరించగనే భూమిని ముందునుంచి వెనుకనుంచి ఆక్రమించినాడు.
5. ఎవని కొరకు హవిస్సులర్పించి దేవతలు యజ్ఞము చేసినారో దానికి వసంతము ఆజ్యము, గ్రీష్మము సమిధ, శరత్తు హవి అయినవి.
6. తొలుత పుట్టినవాని యజ్ఞమున వర్షము ప్రోక్షించినది. దానినుండి దేవతలు, సాధ్యులు, వసువులు అవతరించినారు.
7. దానినుండి అశ్వములు, దవడ కింది. పైభాగమున దంతములున్నవి, గోవులు, మేకలు, గొర్రెలు పుట్టినవి.
8. ఆ యజ్ఞము నుండి సర్వహుతము, ఋక్కులు, సామములు అవతరించినవి. అందునుండియే ఛందములు, యజుస్సులు ఆవిర్భవించినవి.
9. ఆ యజ్ఞము నుండియే సర్వహుతమగు దధిమిశ్రిత ఆజ్యము ఆర్జితమైనది. అందునుండియే ఆరణ్యక, గ్రామ్య పశువులు వచ్చినవి.
10. దేవతలు ఈ యజ్ఞమును చేయునపుడు పురుష పశువును కట్టినారు - అబధ్నన్ పురుషం పశుమ్. ఆ యజ్ఞమునకు ఏడు పరిధులు - ఇరువదియొక్క సమిధలు అయినవి.
11. ఆవిర్భవించిన ఆ దేవత తలనుంచి సొమము పుట్టినది. ఆ సోమపు సప్త, సప్తతి కిరణములు అతని నుండియే పుట్టినవి.
ఎనిమిదవ సూక్తము - 8
వినియోగము :-
8,9 సూక్తములు నక్షత్రదేవత ఘృతహోమము నందును, నక్షత్రముల హవి హోమము నందును వినియోగము.
1. చిత్ర విచిత్రములగు నక్షత్రములు స్వర్గమున మిలమిల మెరయు చున్నవి. నేలమీది జనులకు కదులుచున్నట్లు కనిపించుచున్నవి. ఆ నక్షత్రములను స్తుతులతోను, మంత్రములచే అర్పించు హవిస్సులతోను అర్చించుచున్నాను.
2. అగ్నీ! కృత్తిక చక్కగా ఆహ్వానించదగునది అగునుగాక. రోహిణి శుభప్రదలు అగునుగాక. మృగశిర, ఆర్ద్రలు సుఖప్రదలు అగునుగాక. పునర్వసు సునృత అగునుగాక. పుష్యమి శ్రేయస్కరము అగునుగాక. ఆశ్లేష ప్రకాశించునుగాక. 'మఖ' నాకు గంతవ్యము అగునుగాక.
3. పూర్వ ఫల్గుణులు రెండు పుణ్య ప్రదములు, హస్తాచిత్తలు శుభములు, స్వాతి సుఖము అగునుగాక. రాధ విశాఖ యను పేర్లు గల నక్షత్రము సుఆహ్వాత. అనూరాధ, జ్యేష్ఠ సుఆహ్వాతలు. అరిష్టకారక 'మూల' శుభప్రద అగునుగాక.
4. పూర్వాషాఢ అన్నమును, ఉత్తరాషాఢ శక్తిని, అభిజిత పుణ్యమును, శ్రవణ ధనమును ధనిష్ఠ పుష్టిని ప్రసాదించునుగాక.
5. శతభిష మాహత్ఫలము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రలు సుఖప్రద ధనమును, రేవతి సౌభాగ్యమును, అశ్వినులు సంపదను, భరణి ద్రవ్యమును ప్రసాదింతురుగాక.
తొమ్మిదవ సూక్తము - 9
1. ద్యులోకమున, అంతరిక్షమున, పృథివి యందు, పర్వతముల మీద, దిశలందు కనుపించునవియు - చంద్రుని కాంతిచే ప్రకాశించు నక్షత్రములు మాకు సుఖప్రదలు అగునుగాక.
2. ఇరువది ఎనిమిది నక్షత్రములు కలిసి మాకు సుఖదాయినులు, శుభప్రదలు అగునుగాక. అవి మాకు ఆహోరాత్రులు యోగము క్షేమముమ్ క్షేమము యోగము కలిగించును గాక. వానికి నమస్కరించుచున్నాము.
3. సుప్రభాతము, సుసాయంత్రము, సుదినము, సుమృగము, సుపక్షి నాకు శుభప్రదములు అగునుగాక. అగ్నీ! మాకు సుఖశాంతులకని నా హవిస్సులు అందించి నన్ను అభినందించుటకు మరలి రమ్ము.





