Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
ఆరవ సూక్తము - 25
వినియోగము : మొదటి అర్ధమంత్రముచే చితి మీద దర్భలు పరచునది. రెండవ సగముచే శవమును చితిమీద వెల్లకిల పరుండపెట్టునది. మొదటి అర్ధ ఋక్కుచే గుంతలో దర్భలు పరచునది. ఉత్తరార్ధముచే ఆస్థులను గుంతలో పెట్టునది. 2మంత్రముచే కులజ్యేష్ఠుడు కీళ్ల ప్రకారము ఎముకలను ఒక చోట చేర్చునది. 3వ ఋక్కుచే 9 చరులను జల్లెడను మోదుగాకులచే కప్పునది. 4చే చరులను, జల్లెడను ఇటుకలచే కప్పునది. 5వ మంత్రముచే శలాకలు లేక ఇటుకలచే చితి ఏర్పర్చిన శ్మశాన భూమిని సరిచేయునది. "తత్ర పితృగృహం ఉన్నతం కుర్యాత్" 6వ ఋక్కు ప్రథమార్ధముచే ప్రేతముచేతనున్న స్వర్గము అభిఘారము చేసి జ్యేష్ఠ పుత్రునిచే అగ్నియందు భస్మము చేయించునది. ఉత్తరార్ధముచే పుత్రుడు ప్రేత హస్తమును మార్జన చేయునది. 7వ మంత్రముచే ఘృత, మధుల పడిన రెండు చరులను అభిమంత్రించి అస్థుల వద్ద పెట్టునది. దీనితోనే కుశలమీద పితరుల కొరకు ఉంచిన పిండములను ఘృతాభిఘారము చేయునది. 8,9,10 మంత్రములు కాండోక్త వినియోగముగ భావించవలెను.
1. పితరుల కొరకు కుశలను పరచుచున్నాను. దేవతల కొరకు జీవించు నేను ఉత్తరమున కుశలను పరచుచున్నాను. పురుషా! నీవు పితృ మేధ యోగ్యుడవగుచు ఈ దర్భల మీద చేరుము. పూర్వ పితరులు నిన్ను ప్రేతముగ గుర్తింతురుగాక.
2. ప్రేతమా! నీవు చితిమీద చేరిన కుశల మీదకు చేరినావు. పూర్వ పితరులు నిన్ను ప్రేతముగ గుర్తింతురుగాక. నీకు పూర్వము వలెనే అవయవములు ఉండునుగాక. మంత్రముల చేత నీకు అవయవములను ఏర్పరచుచున్నాను.
3. చరుల మీద వృక్షరాజమగు పలాశపత్రములను కప్పుచున్నాను. అది మాకు బలమును, శక్తిని ఇచ్చునుగాక. ప్రాణులకు జీవితము కల్పించుచు శత శరత్తుల దీర్ఘాయువు కలిగించునుగాక.
4. ఈ చరుభాగమును యముడు తెలియుచున్నాడు. రాళ్లు కప్పిన అన్నమునకు యముడు అధిపతి యగుచున్నాడు. విశ్వమిత్రులారా! అట్టి యముని హవిస్సులచే అర్చించండి. అతడు మాకు చిరంజీవత్వము కలిగించునుగాక.
5. పంచజనులు యమునకు హర్మ్యము నిర్మించినట్లే నేను పితరుల కొరకు హర్మ్యము నిర్మించుచున్నాను. అదినాకు బహు బంధువులను కలిగించునుగాక.
6. పూర్వము నీ తండ్రి ధరించిన హిరణ్యమును అభిఘరించుము. స్వర్గమునకు చేరు నీ తండ్రి కుడిచేతిని రుద్డుము. దువ్వుము.
7. జీవించిఉన్న వారలకు, మరణించినవారలకు పుట్టిన వారలకు, పుట్టనున్నవారలకు మధు ప్రవాహము ఘృతనదులు ప్రాప్తించునుగాక.
8. సోమును స్తోతలకు వరద. పండితులకు దర్శనీయ. రాత్రింబవళ్లు వ్యక్తమగునది. ఉషస్సును, స్వర్గమును వర్ధిల్ల చేయునది. అది జలములకు ప్రాణభూతము. కలశములందు ప్రవేశించునది. అది ఇంద్రుని జఠరామున ప్రవేశించుచున్నది.
9. అగ్నీ! నీ పొగలు మబ్బులై ఆకసమున వ్యాపించి కప్పివేయుచున్నవి. స్తుతించబడుచున్న నీవు ఆకసమున సూర్యుని వలె వెలుగొందుచున్నావు.
10. ఇది సోమము. ఇంద్రుని ఉదరమున నిండుచున్నది. స్తుతించబడిన సోమము మిత్రము అగుచున్నది. పురుషుడు యువతి వద్దకు చేరినట్లు ఇది శతధారయై కలశమున చేరుచున్నది.
ఏడవ సూక్తము - 26
వినియోగము : 1చే పిండోపస్థానానంతరము ఉత్తర పరిషేకము చేయునది. 2. పిండదానమునకు పరచిన కుశల మీద నువ్వులు చల్లునది. 3. పితరులను విసర్జించునది. 4. పిండ పితృ యజ్ఞమున సాంయవన తండులముల ఆహుతి ఇచ్చునది. 5. సమిదాధానానంతరము సర్వ ప్రణీత అగ్ని యొక్క ప్రత్యానయనము చేయునది. 6,7. శవ దహన స్థానమును బేసి సంఖ్య 'శలాకాభిరిష్ట కాభిర్వా ప్రసవ్యం చినుయాత్' 8. పిండ ప్రదానమునకు కుశలు పరచునది. 9. శవ దహనానంతరము బ్రహ్మణులందరు స్నానము చేయునది. 10. పితృమేధమున స్వస్త్యయనమునకు సాయంకాలము, ఉదయము అందరు పఠించునది.
1. పితరులు పిండములు ఆరగించినారు. తృప్తి చెందినారు. శిరః కంపనము చేసినారు. తమ కాంతులతో పిండ ప్రదాతలను మెచ్చుకున్నారు. విప్రులమగు మేము వారిని వరములు కోరుచున్నాము.
2. సోమర్హాపితరులారా! గంభీరములగు పితృయాన మార్గములనుండి విచ్చేయండి. మాకు ఆయువు ప్రసాదించండి. సంతానము సంపద, పుష్టి కలిగించండి.
3. సోమార్హ పితరులారా! గంభీరములగు పితృయాన మార్గములనుండి రండి. నెలనెలా మా గృహాములకు విచ్చేయండి. హవి సేవించండి. మాకు వీరులగు సంతానమును కలిగించండి.
4. ప్రేతమా! అగ్ని నిన్ను పితృలోకము చేర్చునపుడు, దహించునపుడు, ఒక అవయవమును వదలినాడు. దానిని మరల అగ్నిలో వేయుట ద్వారమున నీకు చేర్చుచున్నాను. నీవు పరిపూర్ణాంగుడవై స్వర్గమున పితరుడవుగా ఆనందించుము.
5. జాతవేదాగ్ని ఉదయ, సాయంకాలములందు వందనీయుడు. అతనిని దూతగా చేసి పితరులకు స్వధణు పంపినాము. వారు ఆరగించి ఆనందించినారు. అగ్నిదేవా! నీవు సహితము హవిస్సును ఆరగించుము.
6. ప్రేతమా! నీ మనసును ఇచటనే నిలుపుడు. బంధువులు బట్ట కప్పినట్లు భూమి నిన్ను ఆచ్ఛాదించునుగాక.
7. పితృ సదనములు నీకు వెల్లడి యగునుగాక. నిన్ను పితృ లోకమునకు చేర్చుచున్నాము.
8. బర్హీ! నీవు పితరులకు ఆసనమగుము.
9. వరుణదేవా! మా నుండి నీయొక్క ఉత్తమ, మధ్యమ పాశములను తొలగింపుము. మేము ఆదిత్య వ్రతమున నిన్ను ఆర్చించుచు పాప రహితులము అగుచున్నాము.
10. వరుణదేవా! నీయొక్క దూరపు, దగ్గరి సర్వ పాశముల నుండి విముక్తి కలిగించుము. నీ రక్షణలందు మేము శతశరత్తులు జీవింతుముగాక.
ఎనిమిదవ సూక్తము - 27
వినియోగము : 1-3, 8-10 మంత్రములచే స్థాలీ పాకపు ఆహుతి ఇచ్చునది. 5-7 ఋక్కులచే కుశల మీద మూడు పిండములను కలిపిపెట్టునది.
ఏతత్ సూక్తం సర్వం యజుర్మన్త్రత్మకం
1. అగ్నయే కవ్య వాహనాయ స్వధా నమః ||
2. సోమాయ పితృమతే స్వధా నమః ||
3. పితృభ్యః సోమ వద్భ్యః స్వధా నమః ||
4. యమాయ పితృమతే స్వధా నమః||
5. ప్రపితామహా! ఈ పిండరూప హవి నీకును, నిన్ను అనుసరించిన వారికిని అందునుగాక.
6. పితామహా! ఈ పిండరూప హవి నీకును, నిన్ను అనుసరించు వారికిని అందునుగాక.
7. తండ్రీ! ఈ పిండ రూప హవి నీకు అందునుగాక.
8. భూమి మీద పితరులకు ఈ హవి సమర్పించుచున్నాము.
9. అంతరిక్షపు పితరులకు ఈ హవి సమర్పించుచున్నాము.
10. స్వర్గము నందలి పితరులకు ఈ హవి సమర్పించుచున్నాము.
తొమ్మిదవ సూక్తము - 28
వినియోగము : 1 - 8 మంత్రములచే కుశల మీది పిండములకు ఆవాహన చేయునది. 8వ మంత్రముచే వాని మీద సమిధ ఉంచునది. వరుణుని మహా శాంతి యందు 9వ మంత్రము చదువునది.
1. పితరులారా! మీ శక్తికి నమః పితరులారా! మీ రసాత్మకు నమః.
2. పితరులారా! మీ క్రోధమునకు నమః పితరులారా! మీ మనసునందలి క్రోధమునకు నమః.
3. పితరులారా! మీ ఘోరమునకు నమః పితరులారా మీ క్రూరమునకు నమః.
4. పితరులారా! మీ శివమునకు నమః పితరులారా! మీ స్యోనమునకు నమః.
5. నమో వః పితరః స్వధా వః పితరః.
6. పితరులారా! పితరులు ఎచట ఉందురో అచట మీరు ఉండండి. వారు మీకు అనుకూలురు అగుదురుగాక. మీరు వారిలో శ్రేష్ఠులు అగుదురుగాక.
7. పితరులారా! ఇహమున మేము జీవించి ఉన్నాము. మేము జీవించి ఉన్న బంధువులందు శ్రేష్ఠులము అగుదుముగాక.
8. ప్రకాశించునట్టి అగ్నీ! నీవు దీప్తిమంతుడవు. జరారహితుడవు. నిన్ను మా ముందు ప్రజ్వలింపచేయుచున్నాము. స్తవనీయమగు నీ కాంతి ఆకసమున వెలుగుచున్నది. స్తోతలకు అన్నము ప్రసాదించుము.
9. సుపర్ణ చంద్రుడు జలద ఆకాశమున పరుగులిడుచున్నాడు. అతని బంగారు కిరణములను చూడలేకున్నాను. ద్యావాపృథ్వులారా! నా ఈ ప్రార్థన మన్నించండి.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్రవచన అథర్వ వేద సంహిత యందలి
పద్దెనిమిదవ కాండ సమాప్తము.





