Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
7. తీర్థముల వలన మహా పాపములను తరించిన యజ్ఞకృతులగు సుకృతులు ఏ మార్గమున సాగుచున్నారో, ఆ మార్గములు యజమానికి సకల దిశలందు శుభములు కలిగించునుగాక.
8. అగ్ని పూర్వ దిశన అంగిరసాయనము. గార్హపత్యమున ఆదిత్యాయనము, దక్షిణాగ్ని దక్షిణాయనముఅగుచున్నాడు. మంత్రములచే మహిమాన్వితులగు అగ్నులు సంయుక్తముగ సుఖములు కలిగింతురుగాక.
9. ప్రేతమా! అగ్ని నిన్ను తూర్పున సుఖముగ దహించునుగాక. పశ్చిమమున గార్హపత్యాగ్ని సుఖముగ దహించునుగాక. దక్షిణాగ్ని దక్షిణమున సుఖముగ దహించునుగాక.
అగ్నిదేవా! ఉత్తర, మధ్య అంతరిక్ష సకల దిశలందును ఘోరములనుండి రక్షింపుము.
10. అగ్నులారా! మీ రూపములు కళ్యాణప్రదములు. ముందు ఒకటి వెనుక రెండు గుర్రములు గల రథము దేవతలను వహించుచున్నది. అట్లే మీరు మూడు అగ్నులు. మూడు అశ్వములై యజమానిని దేవతలు అమృతమున ఆనందించు స్వర్గమునకు చేర్చండి.
రెండవ సూక్తము - 21
వినియోగము : 1-5 చే చితియందున్న ఆహితాగ్ని ఉపస్థానమున 4,5 లచే చితియందున్న వానిని కర్త అనుమంత్రించునది. 6 మొదలు 16 మంత్రములచే ( 2 - 4 + 3- 10 + 4 - 2 = 16) ద్రవ్యములను మంత్రించునది. 9 చరులను అభిమంత్రించి 8 దిశలందును మధ్యన ఒక్కొక్కటి పెట్టునది.
1. అగ్నిదేవా! ఇతనిని సుఖముగ తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశలందు దహించుము. జాతవేదా! నీవు ఒక్కడవే గార్హపత్యాది మూడు రూపములవాడవు. మీ ముగ్గురు కలిసి ఇఅతనికి సుకృత లోకము ప్రసాదించండి.
2. అగ్నులారా! సమిద్దులు కండి. ప్రజ్వలించండి. ప్రాజాపత్య, పితృ మేధామును స్పృశించండి. జాతవేదా! ఇతనిని పూర్తిగా దాహించుము. మిగల్చకుము.
3. ఈ పితృమేధ యజ్ఞము యజమానికి స్వర్గ సుఖములు కలిగించుచున్నది. ఈ సర్వ హుత ప్రాజాపత్య మేధ్య యజ్ఞమును అగ్నులు అనుభవింతురుగాక. జాతవేదాగ్నీ! ఇతనిని పూర్తిగా దహించుము. మిగల్చకుము.
4. అగ్నిదేవా! ఇతడు చితాగ్ని మీద ఉన్నాడు. ఇతనిని నాకము మీద ఉన్న త్రిదివమునకు చేర్చుము. అతని కొరకు నభము వెలుగునుగాక. సుకృతుల స్థానమగు స్వర్గపు జ్యోతిష్పథములు అతనికి గోచరించునుగాక.
5. పితృమేధమున అగ్నిహోత, బృహస్పతి అథ్వర్యు, ఇంద్రుడు బ్రహ్మ అగుచున్నారు. బ్రహ్మయగు ఇంద్రుడు దక్షిణమున ఆసీనుడు అగుచున్నాడు. సమాప్తమైన ఈ యజ్ఞము పూర్వ యజ్ఞముల మార్గముననే సాగుచున్నది.
6. అపూపవాన్ క్షీర వాంశ్చరురేహ సీదతు|
లోకకృతః పధికృతో యజామహే యే దేవానాం హుతభాగా ఇహస్థ||
అపూపవంతము క్షీరవంతమైనది ఇందు నిలుచునుగాక. లోక కృతులను, మార్గ కృతులను యజించుచున్నాము. దేవతల హుత భాగము ఇందు చేరునుగాక.
7. అపూవంతము, దధివంతము ఇందు నిలుచునుగాక.
"లోకకృతః........"
8. అపూపవంతము, సోమబిందు వంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
9. అపూపవంతము, ఘృతమంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
10. అపూపవంతము, మాంసవంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
మూడవ సూక్తము - 22
వినియోగము : 1- 4 అస్థుల సమీపపు మంత్రోక్త చరుస్థాపన కర్మమున. 5చే 9 చరులను అభిమంత్రించునది. మిశ్రధాన్యములు ఉంచునది. 8వ ఋక్కుచే అగ్నిష్టోమాది యజ్ఞములందు బహిష్పవమాన ప్రసర్పణ సమయపు వైప్రుష హోమము చేయునది. 9,10 లచే జల్లెడలో అస్థులను వేసి నీరు లేకుండా చేయునది.
1. అపూపవంతము, అన్నవంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
2. అపూపవంతము, మధుమంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
3. అపూపవంతము, రసవంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
4. అపూపవంతము, చరువంతము ఇందు చేరునుగాక.
"లోకకృతః........"
5. అపూపాదులు ఉంచిన కుండలను దేవతలు స్వీకరించినారు. అవి స్వధావంతములు, మధుమంతములు, ఘృశ్చుతములు అగునుగాక.
6. నీ కొరకు తిలలు కలిసిన ధాన్యమును స్వధగా సమర్పించుచున్నాను. అవి నీకు మహాన్నములు, ప్రభుతలు అగునుగాక. వానిని సేవించుటకు యమరాజు అనుమతించునుగాక.
7. నీ కొరకు తిలలు కలిసిన ధాన్యమును స్వధగా సమర్పించుచున్నాను. అది అక్షయమగునుగాక వానిని సేవించుటకు యమరాజు నిన్ను అనుమతించునుగాక.
8. సోమబిందువులు ద్యావాపృథ్వులమీద వానియోక్క పూర్వ మూల స్థానముల మీద రాలునుగాక. సమాన స్థానములందు పడుచున్న సోమబిందువులను యజించుచున్నాను. సప్త హోతలు అనుసరించుచున్నారు.
9. శతధారయు, వాయుమంతము, స్వర్గ ప్రదమును అగు ధనమును మానవ దృష్టి గల దేవతలు నీ కొరకు దర్శించుచున్నారు. నీకు ప్రీతి కలిగించుటకు దానము చేయువారు సర్వదా సప్తమారుత దక్షిణ ఇచ్చిన వారలు అగుచున్నారు.
10. నాలుగు రంధ్రముల కుండను, నాలుగు చన్నుల మధుమతి ధేనువుగా దానము చేయుచున్నాము. అగ్నిదేవా! పరలోకమున పితరులకు అందునట్టి మోదమును, అన్నమును ఆటంకపరచకుము.
నాలుగవ సూక్తము - 23
వినియోగము : 5చే ఋక్కుచే దహన స్థానము వద్ద మరొకదాని దూడ గల ఆవుపాలు లేక పాలస్థాలీ పాకముచే హోమము చేయునది. 6చే జల్లెడ నుంచి పడు నీటితో అస్థులను కడుగునది. 7చే గుంతలో నున్న ఎముకలను సగోత్రజులు లేక అందరు దర్శించునది. కర్త మంత్రము చదువునది. పితృ పిండ యజ్ఞమున 8చే కాల్చిన రెండు పుల్లలలో ఒకదానిని దుమ్ములో వేయునది. 9చే పిండ ప్రదానము తరువాత ఆచమనము చేయునది. 10చే నిప్పును నీటితో ఆర్పునది.
1. ప్రేతమా! సవితా దేవత ఈ వస్త్రమును నీకు కప్పుకొనుటకు ఇచ్చుచున్నాడు. దానిని కప్పుకొని యమరాజ్యమున సంచరించుము.
2. పేలాలు, ధేనువు, తిలలు, వత్సము అగుచున్నవి. ఇవి యమ రాజ్యమున అక్షయములు అగునుగాక. వానితో జీవించుము.
3. ఇవి నీకు అచట కామధేనువులు అగునుగాక. ఎరుపు, నలుపు, సరూప వత్సగల ధేనువు వంటివి ఈ తిలలు, పేలాలు, ఇవి అచట నీకు అందునుగాక.
4. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, మాడిన పేలాలు అచట నీకు ధేనురూపలగుచున్నవి. తిలరూప వత్స ధేనువులు నీకు నిత్యము, నిరంతరము బలప్రద అన్నము ప్రసాదించునుగాక.
5. వైశ్వానరాగ్నికి, శత సహస్ర ధారల హవిని అర్పించుచున్నాను. అతడు మా పితరులను, పితామహులను, ప్రపితామహులను పరిపుష్టులను చేయునుగాక.
6. ఇది స్వధా కుంభము. అది శతసహస్రధారల వర్షించు అక్షయ మేఘము వంటిది. అది శక్తిని ఇచ్చునది. గుర్తుండునది. అట్టి స్వధను పితరులకు సమర్పించుచున్నాము.
7. బంధువులారా! నీటముంచి చయనము చేసిన అస్థికలను దర్శించండి. దానివలన ప్రేతమునకు అమృతత్వము కలుగునుగాక. అతనికి, అతని పూర్వులకు గృహములు ఏర్పడునుగాక.
8. ఉల్ముకమా! ఇచట ధూళి ధూసరితవై నిలువుము. మాకు ధనదవు, ప్రజ్ఞాతావు, కర్మ సంపాదకవు అగుము. ఇచట బలశాలివి, అన్నపుష్టి కలిగించుదానవు, శత్రు హంతవు అగుచు వర్ధిల్లుము.
9. ఈ జలములు మధురములు. పుత్ర, పౌత్రాదులను తరింపచేయునవి. ఇవి పితరులకు అమృతము వంటి స్వధను అందించుచు మాతృ, పితృ ఉభయ పక్షముల వారిని తరింపచేయుచున్నవి.
10. ఈ జలము అగ్నిని పితరులకు చేర్చునుగాక. ఈ యజ్ఞమును పితరులు అనుభవింతురుగాక. పిండములు అందుకొనుటకు వచ్చిన పితరులు మాకు ధనమును వీర పుత్రులను ప్రసాదింతురుగాక.
ఐదవ సూక్తము - 24
వినియోగము : మొదటి ఋక్కుచే పితృ పిండ యజ్ఞమున సమిధలను ఉంచునది. 3చే అస్థుల మీద తల్లితండులములు వేయునది. 4చే శ్మశానమునాకు చేర్చు శవమును బండిలో పెట్టునది. 5 -7 మంత్రములచే దహనానంతరము సారస్వత హోమము చేయునది. 8చే చరుస్థలమును మట్టి, పేడచే అలుకునది. 9చే ప్రేతమును ఉంచిన బండి ఎడ్లను అభిమంత్రించి కర్త పగ్గములను అందుకొనునది. పితృమేధమున నాలుగవ నాడు దక్షిణ గోవును అభిమంత్రించి తీసికొనునది.
1. అగ్ని అమరుడు, ఘృత ప్రియుడు. హవ్యవాహనుడు. అతడు సమిధలచే ప్రజ్వలించబడుచున్నాడు. అతడు పరదేశములకు పోయిన పితరుల నిక్షిప్త నిధులను ఎరుంగుచున్నాడు.
2. ప్రేతమా! నీకు మంథమును, అన్నమును, మాంసమును సమర్పించుచున్నాను. అది నీకు స్వధావంతము, మధుమంతము, ఘృతశ్చుతము అగునుగాక.
3. ప్రేతమా! నీ కొరకు తిలమిశ్రిత ధానములను స్వదా వంతములను సమర్పించుచున్నాము. అవి నీకు సమృద్ధములు ప్రభువంతములు అగునుగాక. యమరాజు అనుమతించునుగాక.
4. ఇది ప్రేతములను చేర్చు శకటము. నీ పూర్వ, పర పితరులను ఇదియే చేర్చినది. ఇవి పూర్వము బండిని లాగిన ఎద్దులే. ఇవి నిన్ను పుణ్య లోకములకు చేర్చగలవు.
5. సరస్వతిని దేవకాములు ఆహ్వానించుచున్నారు. సరస్వతిని యజ్ఞము చేయువారలు ఆహ్వానించుచున్నారు. సరస్వతిని పుణ్యాత్ములు ఆహ్వానించుచున్నారు. సరస్వతి యజమానులకు బలము ప్రసాదించునుగాక.
6. సరస్వతిని యజ్ఞపు దక్షిణ భాగమున ఆసీనులగు ఆహ్వానించుచున్నారు. పితరులారా! విచ్చేయండి. కుశాసనముల మీద ఆసీనులు కండి. ఆనందించండి. మాకు రోగరహితమగు అన్నమును ప్రసాదించండి.
7. సరస్వతీ! స్తోత్రములు, స్వధలచే ఆనందించు పితరుల సహితముగా ఒకే రథము మీద వచ్చుచున్నావు. నీవు యజమానికి వేల ధన భాగమును, పుష్టి కలిగించు అన్నమును ప్రసాదించుము.
8. భూమీ! నిన్ను భూమితోనే అలంకరించుచున్నాము. ధాతాదేవత నాకు దీర్ఘాయువును ప్రసాదించునుగాక. దూర దేశమున పోయిన పితరులారా! మీరు ధనవంతులై అమృతమూర్తులగు పితరులందు చేరండి.
9. శవవాహనపు వృషభములారా! మీరు బండిని విడువండి. మీ నుండి శవమును మోసిన నింద తొలగునుగాక. అవధ్య వృషభములారా! నిందల బండి నుండి రండి. పితరులకు పిండములు అర్పించు మాకు పోషకులు కండి.
10. ఇదిగో గోరూప దక్షిణ శుభంకరముగ వచ్చుచున్నది. అది మాకు మంచిపాలు, మంచి అన్నము ఇచ్చునుగాక. ఆ గోవు యవ్వనమునందు వలెనే వార్ధక్యమునకు యువతియగునుగాక. హవిస్సులను పితరులకు అందించునుగాక.





