Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    9. హవిర్ధానమా! మా సోమము కొరకు నీవు  స్థిరపడుము. మంత్ర సహితముగ నీకు నమస్కరించుచున్నాము. విద్వాంసులు సన్మార్గమును వలె నిన్ను స్తుతించుచున్నాము. నీవు, విశ్వేదేవతలు ఆలకించండి.

    10. మృతునకు చతుష్పాద సంస్కారము చేయుచున్నాను. అతడు ముల్లోకములకు చేరునుగాక. అతడు అక్షయమగు సూర్యలోకమునకు చేరునుగాక.

       
                                     ఐదవ సూక్తము - 17


    వినియోగము: పిండపితృ యజ్ఞమున 2చే సమిధలను ఉంచునది. పిండ పితృ యజ్ఞమున 4- 6 చే  కుశలను పరచునది. 7చే సమిధలను ఉంచునది. 9, 10-6 వ సూక్తపు మొదటి మంత్రముచే శ్మశానమున శాలకాభిః  ఇష్టకాభిర్వా ప్రసవ్యం చినుయాత్'

    1. దేవతలకు మృత్యువును ఎందులకు కలిగించలేదు? మానవులకు అమృతమును ఏల కలిగించలేదు? బృహస్పతి యజ్ఞము వలన దేవతలు అమరులు, మానవులు మర్త్యులు అయినారు. అందువలననే  యముడు  మానవుల ప్రియ ప్రాణములు హరించుచున్నాడు.

    2. జాతవేదాగ్నీ! మా  హవిస్సులను సురభిళము చేయుము. ఆహ్వానించినంత దేవతలకు అందించుము. నీవు పితరులకు స్వధను అందించినావు. వారు సేవించినారు. నీవు సహితము హవిస్సులను స్వీకరించుము. సేవించుము.

    3. పితరులారా! అరుణారుణ ఉషస్సు వడిలో కూర్చున్నారు. మార్తులగు ఉపాసకులకు ధనమును అందించండి. పుత్రులకు సంపదలు ప్రసాదించండి. మాకు శక్తి కలిగించండి.

    4. అగ్నిష్వత్త  పితరులారా! ఇచటికి రండి. ఆసనము లందు ఆసీనులు కండి. పరిశుద్ధములగు హవిస్సులగు ఆరగించండి. తృప్తులు కండి. మాకు వీరులగు పుత్రులను ప్రసాదించండి.

    5. మా పితరులు సోమభక్షకులు. వారిని ఆహ్వానించుచున్నాము. వారు హవిస్సుల కొరకు రావలెను. మా స్తుతులు వినవలెను. మా విషయమున పక్షపాతము కలిగి  మమ్ము రక్షించవలెను.

    6. మా పితరుల పితరుల, శిష్టులగు పితామహులు, సోమపాయులగు పితరులు యముని సహితముగ ఆనందించుచున్నవారలై మా హవిస్సులను అందుకొనుచు ఆరగింతురుగాక.

    7. మా పితరులు దేవతలను యజించు వారు. హోతలు. స్తుతులచే ప్రశంసనీయులు. వారు దాహార్తులై దేవతలను అర్థించుచున్నారు. సత్య పురుషులు, కవులు, ఋషులు, ధర్మపరులగు పితరుల సహితుడవై అగ్నీ! వారి దాహము తీర్చుటకు మా వద్దకు విచ్చేయుము.

    8. మా పితరులు సత్యధనులు. హవి భక్షకులు. సోమ పాయులు. ఇంద్రాది దేవతలతో ఒకే రథమున సాగువారు. అగ్నీ! అట్టి జ్ఞానులగు, ఋషులగు ధర్మపరులగు, మా పితరుల సహితముగ విచ్చేయుము.

    9. ప్రేతమా! ఈ భూమి మీ తల్లి వంటిది. విశాల. సుఖప్రద. ఇచటికి రమ్ము. దక్షిణలు ఇచ్చిన నీకు భూమి ఉన్ని వలె మెత్తనిదగును. పూర్వ దిశా మార్గాగ్రమున ఈ తల్లి నిన్ను రక్షించును గాక.

    10. భూమాతా! పులకించుము. ఇతనిని బాధించకుము. అతనికి సుఖము కలిగించుము. మెత్తనిదానవగుము. తల్లి బిడ్డను కప్పినట్లు ఇతనిని కప్పి ఉంచుము.


                                       ఆరవ సూక్తము - 18

    వినియోగము :
మొదటి మంత్రపు వినియోగము పూర్వ సూక్తమున చెప్పబడినది. పాత్ర చయన కర్మమున యజమాని ఉదరమున ఇడా పాత్ర నుంచి 3,4 చే అనుమంత్రణ చేయునది. ఆహితాగ్ని, ఏకాగ్ని, సర్పము, వ్యాఘ్రాదుల వలన మృతి చెందినచో 5వ ఋక్కుచే పాము కాటు వేసిన చోటును అగ్నితో కాల్చునది. 6వ మంత్రముచే శవదహనము తరువాత స్నానము చేయునది. 10 ఋక్కుచే నీరు పాలు కలిసిన ఓషధులను అభిమంత్రించి బ్రహ్మణుని అస్థికలను వానితో తడుపునది.

    1. భూమి పులకించునుగాక. వేలకొలది ఓషధులు పెరిగి ఇచట విశ్రమించునుగాక. అవి చల్లని ఇండ్లై, ఘృత వంతములై; నిత్యము శుభములు కలిగించుచు ఇతనికి ఆశ్రయము కలిగించునుగాక.

    2. మృతుడా! నీ మీద  భూమిని పరచుచున్నాను. నీకు నలువైపుల భూమిని ఏర్పరచుచున్నాను. అది నిన్ను  బాధించకుండునుగాక. ఈ త్రవ్విన నెలలో నీ కొరకు పితరుల స్తంభములు ఏర్పరచగా యముడు గృహము నిర్మించునుగాక.

    3. అగ్నీ! చషకమును వంచకుము. ఇది దేవతలకు సోమ పితరులకు ప్రియమైనది. ఈ చషకము దేవతల సోమ పితరులకు ప్రియమైనది. ఈ చషకము దేవతల పానపాత్ర. దీనియందు అమృత దేవతలు ఆనందింతురుగాక.

    4. అధ్వర్యుడు ఇంద్రుని కొరకు, యజ్ఞము కొరకు, అన్నము కొరకు, చషకమును పూరించినాడు. అందు పుణ్యాత్ములకు ఆహారము, అమృతము పొంగి పొరలునుగాక.

    5. నిన్ను నల్లని పక్షి కరచిననను, చీమ , పాము, కుక్క కరచినను అగ్ని దానికి సర్వ ఔషధము అగునుగాక. సోమము మంత్రము కూడ ఓషధి అగునుగాక.

    6. ఓషధులు రసవంతములు అగునుగాక. వానిచే మా దేహములు రసవంతములు అగునుగాక. జలములు రసవంతములు అగునుగాక. అవి మమ్ము కాంతివంతులను చేయునుగాక.

    7. ఈస్త్రీలు విధవలు కాకుందురుగాక. సుమంగళులై కంటికి కాటుక అలంకరించుకొందురుగాక. వారు అశ్రు రహితులు, రోగరహితులై ఆభరణములు ధరింతురుగాక. బిడ్డలను కనెదరు గాక.

    8. మృతుడా! వెళ్లుము. పితరులలో కలిసిపొమ్ము. యమునిని కలసికొనుము. కోరికలు తీరునట్టి పరమ స్థానమునకు చేరికొనుము. కాంతివంత శరీరివగుము. పాప పుణ్యములు విడిచి మరల ఇచటికి రమ్ము.

    ("క్షీణేపుణ్యే మర్త్య లోకం విశంతి" అని గీత.)

    9. మా పితరులు, పితామహులు, ప్రపితామహులు, అంతరిక్షమున ఆవాసము ఏర్పరచుకున్న పితరులకు స్వరాట్ అసునీతి దేవత వారి ఇచ్ఛానుసారము దేహములు కల్పించునుగాక.

    10. నీకు నీహారము శాంతిప్రదమగునుగాక. మేఘ తుషారము నిన్ను చల్లబరచి శాంతి ప్రదమగునుగాక. శీతిక ఓషధీ! చల్లదనమును కలిగించుము. హ్లాదిక ఓషధీ! ఆహ్లాదము కలిగించుము. మండూక్యే శుభప్రదవగుము. అగ్నీ! శాంతించుము.


                                   ఏడవ సూక్తము - 19

    వినియోగము : 1 -7 మంత్రములచే శ్మశాన చయన కర్మయందు కర్త. సగోత్రజులు శ్మశానపు వెనుక భాగమున నిలిచి ప్రేతమున ఉపస్థానమును చేయునది. పితృ మేధపు నాలుగవ నాడు 2,3 చే రెండు ఆహుతులిచ్చి రెంటిని కలిపి మూడవ ఆహుతి ఇచ్చునది. మిగిలిన దానిని అభిమంత్రించి సగోత్రులకు ప్రాశన చేయించునది. 2,3,7 స్వస్త్యయనమునాకు జపించునది. 9-10 చే బియ్యము కలిపినా నువ్వులను అస్థులమీద పెట్టునది. అస్థులను చెట్టు మొదట ఉంచినచో 10చే వానిని తీయునది. 11-13చే చితి మంటలను ప్రజ్వలింపచేయునది. మధు ఘృతములను 12చ అభిమంత్రించి అస్థుల వద్ద ఉంచునది. పిండ పితృ యజ్ఞమున పిండమును స్థాపించుటకు ముందు పిండము మీద ఘృతధార జార్చునది.

    1. రక్షకుడు, జీవితము, దాతయగు వివస్వత ఆదిత్యుడు మాకు అభయమొసంగునుగాక. మాకు అనేక మంది పుత్ర, పౌత్రులు కలిగెదరు గాక. మాకు గోపుష్టి, అశ్వపుష్టి కలుగునుగాక.

    2. వివస్వతుడు మమ్ము అమృతమున స్థాపించునుగాక. మృత్యువు మరలిపోవునుగాక. మేము అమరులము అగుదుముగాక. అతడు జరావస్థ వరకు పుత్ర, పౌత్రులను రక్షించునుగాక. యముడు మము చేరకుండునుగాక.

    3. యముడు క్రాంతదర్శి. బుద్ధిమంతులకు బుద్ధిమంతుడు. తన మహిమచే పితరులను అంతరిక్షమున  నిలుపువాడు. విశ్వమిత్రులారా! యమునకు హవిస్సులు అర్పించి అర్చించండి. అతడు మాకు దీర్ఘాయువు ప్రసాదించునుగాక.

    4. ఋషులారా! ఉత్తమ దివిని ఆరోహించండి. 'మాబిభీతణ' భయపడకండి. మీరు సోమము సేవించువారు, సేవింపచేయువారు. మీ కొరకు హవి అర్పించినాము. మాకు ఉత్తమ జ్యోతిని దర్శింపచేయండి.

    5. అగ్ని బృహద్ ధూమకేతనధారి. వృషభుడై అంతరిక్షముణ గర్జించుచున్నాడు. అతడు ఇచటి నుండి ద్యులోకపు ఉపరిస్థానమున వ్యాపించుచున్నాడు. అంతరిక్షమున జలములచే వర్ధిల్లుచున్నాడు.

    6. ప్రేతమా! మా హృదయమునందలి ఆశలతో నిన్ను చూచినపుడు నీవు శోభనగతులచే స్వర్గమునకేగుచున్నావు. అచట యమ సదనమున నిన్ను బంగారు రెక్కల పక్షిగా వరుణదూతగా, పోషకునిగా దర్శించుచున్నాము.

    7. ఇంద్రదేవా! తండ్రి బిడ్డలకు ఇచ్చిన రీతి ఇమ్ము. పురుహుతా! మాకు అభిమత ఫలములు ప్రసాదించుము. చిరకాలము జ్యోతిని దర్శించుచు జీవింతుముగాక.

    8. ప్రేతమా! దేవతలు నీ కొరకు భోజ్యముల కుండలు ఏర్పరచినారు. అవి స్వధావంతములు, మధుమంతములు, ఘృతశ్చుతములు అగునుగాక.

    9. ప్రేతమా! నీకు తిలలు కలిపినా ధాన్యము స్వధగా అర్పించుచున్నాము. అది నీకు అందుచు తృప్తి ఇచ్చునుగాక. అందుకు యమరాజు అనుమతించునుగాక.

    10. వృక్షమా! నీయందు దాచిన దానిని మరల మాకు అందించుము. అందువలన అతడు యమలోకమున ప్రకాశించుచు వసించునుగాక.

    11. జాతవేదాగ్నీ! మండుటకు సిద్ధపడుము. నీ రసహారక శక్తి నీ జ్వాలలందు చేరునుగాక. ఈ  మృతదేహమును దహించుము. ఇఅతనికి పుణ్యలోకములు కలిగించుము.

    12. నీకన్న పూర్వము, నీ తరువాత గతించిన వారలకు నేతివాగులు పారునుగాక. అవి సహస్రధారలై తడి ఆరకుండునుగాక.

    13. మృతుడా! లెమ్ము. పరిశుద్ధుడవగుము. ఆకసమునకు ఎక్కుము. నీ బంధువులు ఈ లోకమున సమృద్ధులగుదురుగాక. నీవు బంధువుల మధ్య నుండి పరలోకమునకేగుము. పితృ లోకమున చిరకాలము వసించుము.


                                   నాలుగవ అనువాకము
                                     మొదటి సూక్తము - 20


    వినియోగము :
1 -15 మంత్రములచే చితియందున్న అహితాగ్ని యందు ప్రేతమును ఉంచునది. మొదటి ఋక్కుచే పరదేశమున మరణించినవాని అహితాగ్ని, ఏకాగ్ని రెండింటిని అరుణుల అగ్నిలో చేర్చునది. 5,6 మంత్రములచే ప్రేతపు అవయవముల మీదకు విసరు యజ్ఞపాత్రలను అనుమంత్రణ చేయునది.

    1. అగ్నీ! అరణులందు మాతృ స్థానమునకు చేరుము. నేను నిన్ను పితృ యానముల ద్వారమున అరణి యందు చేర్చుచున్నాను. హవ్యమును చేర్చవలసినవానిని తెలిసి చేర్చుము. అగ్నులందరు ఏకముగ ఇతనిని పుణ్యలోకమునకు చేర్చండి.

    2. దేవతలు ఋతువులను అనుసరించిన యజ్ఞములను కల్పించుచున్నారు. హవి, పురోడాశము, సృచ యజ్ఞ పరికరములు అగుచున్నవి. వాని సహితుడవై పూర్వులు స్వర్గమునకు చేరిన దేవయాన మార్గమున సాగుము.

    3. ప్రేతమా! అంగిరసులు ఏ సుకృత మార్గమున సాగినారో అట్టి  సత్య మార్గమును దర్శించుము. ఆదిత్యులు మధుసేవనము చేయు మార్గములందుసాగును. అచటి నుంచి మూడవనాకమును ఆశ్రయించుము.

    4. అగ్ని స్వర్గమునను, వాయువు, పర్జన్యుడు అంతరిక్షమును అధిష్ఠించి ఉన్నారు. స్వర్గ లోకము అమృతమయమై ఉన్నది. అవి యజమానికి అన్నము, శక్తి ప్రసాదింతురుగాక.

    5. హవిని హోమించు జుహువు ద్యులోకమును, జుహువు దగ్గర ఉండు ఉపభృత్ పాత్ర  అంతరిక్షమును, యజ్ఞము ఆరంభము నుండి అంతము వరకు ఉండు ధ్రువ పాత్ర  భూమిని ధరించుచున్నవి. భూమిని లక్ష్యముగ చేసికొని వెలుగొందు స్వర్గాది లోకములు యజమాని కోరిన వాటిని ప్రసాదించునుగాక.

    6. ధ్రువము విశ్వ భోజనమగు భూమిని, ఉపభృత్ అంతరిక్షమున ఆరోహింతురుగాక. స్రువమును వత్సముచే సకల దిశలందు వ్యాపించి యజమానికి సమస్తమును ప్రసాదించండి.
 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.