Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    ఇందు వారసత్వ సూత్రము సహితము ఇమిడి ఉన్నది. భర్త గతించిన భార్య పునర్వివాహము చేసికొనకున్న భర్త ఆస్తి ఆమెకే చెందవలసిఉన్నది.

    ఈ మంత్రము సతీసహగమనము సూచించుచున్నదని భ్రమ పడరాదు. ఇది స్త్రీకి ఆస్తిహక్కు కలిగించుచున్నదని గ్రహించవలెను.)

    వినియోగము : భార్య సతి కాదలచనిచో ఈ మాత్రముచే ఆమెను పతి వద్ద నుంచి లేపునది.

    2. నారీ! నీ భర్త యందు ప్రాణములు లేకున్నవి. లెమ్ము జీవలోకమున చేరుము. నీ భర్త బంధువులు ఇచట ఉన్నారు. వారిలో చేరుము.

    (ఇచట సహితము చితి మాట లేదు. భర్త శవము వద్ద దుఃఖించుచున్న  స్త్రీని ఓదార్చుటయే ఉన్నది.)

    వినియోగము : 3-4 ఋక్కులచే చితి పక్కనుండి తీసికొనిపోవు గోవును అనుమంత్రించునది.

    3. మరణించిన యువతి శవము వద్దకు తేబడుచున్న జీవిని చూచుచున్నాను. ఇది అంధకారము. అజ్ఞానముచే ఆవృతమై ఉన్నది. కావున దానిని శవమునకు అపాఙ్ముఖముగ చేసి నాకు అభిముఖముగ తెచ్చుచున్నాను.

    4. గోమాతా! నీవు భూలోకమును తెలియుచున్నావు. దేవలోక మార్గములను తెలియుచున్నావు. ఇతడు నీకు స్వామి. సేవించుము. ఇతనిని స్వర్గ లోకమునకు చేర్చుము.

    వినియోగము : పితృ మేధమున నాల్గవ నాటి సంచయన కర్మమున 5-6లచే  ఓషధులను మంత్రించి వానిని పాలతో చేర్చి బ్రాహ్మణుని అస్థికలను అవసించయనము చేయునది. తాశ్చ ఓషధయః వేత సాశ్చ కర్ణీచ నదీఫేనంచ అవకాచ బృహద్ దూర్వాచ మండూక పర్జీచే త్యేవమాద్యాః

    5. అగ్నీ! నీవు జలములందలి పిత్త ధాతువవు. నిన్ను నది నురగ, వేతసము బృహ దూర్వ చే  శాంతింపచేయుచున్నాము.

    6. అగ్నిదేవా! నీవు భస్మము చేసిన వానికి మరల సుఖములు కలిగించుము. ఈ దహన ప్రదేశమున క్యాంబు మొక్కలు మొలుచునుగాక. బృహద్ దూర్వా వ్యాపించునుగాక.

    వినియోగము : ఆహితాగ్ని ప్రేతము ముందు మూడు  అగ్నులను చేర్చి దీనిచే అనుమంత్రించునది.

    7. ప్రేతమా! నీకు గార్హపత్యాగ్ని ఒక జ్యోతి, అన్వహార్య పచనాగ్ని రెండవ జ్యోతి, ఆహవనీయాగ్ని మూడవ జ్యోతి యగుచున్నది. నీవు ఈ మూడింటి సమ్మేళనమున చేరుము. అట్టి మూడు  జ్యోతుల దేహివై వర్ధిల్లుము. దేవతలకు ఇష్టుడవై ఉండుము.

    వినియోగము : 8,9 మంత్రములచే శ్మశానమునకు తీసికొని పోవుటకు శవమును ఎత్తునది.

    8. లెమ్ము - కదులుము - సాగుము. అంతరిక్షమున వసతి ఏర్పరచుకొనుము. అచట నీవు పితరులతో చేరి సోమము, స్వధలు సేవించి ఆనందించుము.

    9. ప్రేతమా! నీ  తనువును సరిచేసికొనుము. అవయవములను దేహమునువిడువకుము. నీ  మనసుకు నచ్చిన చోట ప్రవేశించుము. భూమిని చేరి సుఖించుము.

    వినియోగము : పిండ పితృ యజ్ఞమున దీనిచేతను మరుసటి సూక్తపు మొదటి మంత్రము  చేతను ఆచమనము చేయునది.

    10. సోమపాయులగు పితరులు నాకు వర్చస్సును, దేవతలు మధు ఘృతములను కలిగింతురుగాక. మంచి చూపు కలిగించి వార్ధక్యము వరకు మంచి ఆకలి కలిగించి వర్ధిల్ల చేయుదురుగాక.


                                      రెండవ సూక్తము - 14

    వినియోగము :
1.  మొదటి సూక్తము పూర్వ సూక్తమున చెప్పబడినది.

    2. పిండ పితృ యజ్ఞమున కర్త హస్త ప్రక్షాళనము చేయునది.

    3. పితృ విసర్జనము చేయునది.

    7. శవదహనము నాటి రాత్రి కుండను పగులుకొట్టువాడు జపించునది.

    8. పిండ పితృ యజ్ఞమున పిండముల ఘృతాభిఘారము చేయునది.

    9. పితృ దేవతా భూత సోమాంజన లింగముచే పిండాభిఘారమున.

    1. అగ్ని నాకు వర్చస్సు కలిగించునుగాక. విష్ణువు మేధస్సును ప్రసాదించునుగాక. విశ్వే దేవతలు నన్ను ధనమునందు స్థాపింతురుగాక. జలము, వాయువు శుభములు కలిగింతురుగాక.

    2. మిత్రావరుణులు మాకు  వస్త్రాదులు ప్రసాదింతురుగాక. ఆదిత్యులు స్వరములను వర్ధిల్ల చేయుదురుగాక. ఇంద్రుడు కాంతిని, సవిత జీర్ణ శక్తి గల దీర్ఘాయువును ప్రసాదింతురుగాక.

    3. యముడు మర్త్యులను తొలుత చంపినవాడు. తొలుత ఈ లోకములను దర్శించినవాడు. అతడు వివస్వత పుత్రుడు. ప్రాణుల అంతిమగమ్యము. అట్టి యమరాజునకు హవిస్సులు అర్పించండి.

    4. పితరులారా ! మేము అర్పించు మధుర యజ్ఞమును స్వీకరించండి. తృప్తులు కండి. మరలండి. మరల పిలిచినపుడు విచ్చేయండి. మాకు శుభప్రద ధనమును, పుత్ర పౌత్రాదులను ప్రసాదించండి.

    5. కణ్వుడు, కక్షీవంతుడు, పురుమీఢుడు, అగస్త్యుడు, శ్యావాశ్వుడు, సోభరి, అర్చనానుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అత్రి, కశ్యపుడు, వామదేవుడు మమ్ము రక్షించెదరు గాక.

    6. విశ్వామిత్ర, జమదగ్ని, వసిష్ఠ, భరద్వాజ, గోతమ, వామదేవులు, మాకు సుఖములను ఇత్తురుగాక. అత్రి మా గృహమును రక్షించుచున్నాడు. పితరులకు నమస్కారము. వారు మమ్ము రక్షింతురుగాక.

    7. శ్మశానమున కలిగిన బంధు మరణదుఃఖమును శవస్పర్శ పాపమును ఇచటనే విడిచి వెళ్లుచున్నాము. మాకు  దీర్ఘాయువు కలుగునుగాక. మేము పుత్ర, పౌత్రా, ధనాదులతో వర్ధిల్లుదుముగాక. మా గృహములు సురభిళములు అగునుగాక.

    8. క్రతువును చేసినపుడు అంజన, వ్యంజన, సమంజన, నవనీత అభ్యంజనలు చేయండి. చంద్రుడు ఉఅదయించుచున్నాడు. సముద్రము ఉచ్ఛ్వసించుచున్నది. కిరణములు జగమును చూచుచున్నది. అవి స్వర్ణపాద పశువులను కలిగించుచున్నవి.

    9. పితరులారా! మీ వద్ద  మోదము కలిగించు సోమము ఉన్న మమ్ము దానితో కూర్చుండి. మీరు యశోధనులు కదా!

    మీరు గతించిన వారు. విద్వాంసులు. సుదాతలు. శోభన జ్ఞాన సంపన్నులు. యజ్ఞములందు మా ఆహ్వానములను ఆలకించండి.

    10. పితరులారా! మీరు అత్రి, అంగిరస, నవగ్వ, ఇష్టావంత, రాతిషాచగోత్రజులు. మీరు దక్షిణలిచ్చువారు. పుణ్యాత్ములు. కుశాసనముల మీద ఆసీనులు కండి. మా హవిస్సులను ఆనందించండి.



                                          మూడవ సూక్తము - 15

    వినియోగము :
1- 4 ప్రేతోపస్థానమున.

    5 మొదలు 10 మంత్రములచే ప్రేత దేహమునకు అగ్ని దానానంతరము ఆజ్యముతో సారస్వత హోమములు చేయునది.

    5 మొదలు కొని 11 మంత్రములచే శ్మశాన చయన కర్మమున ఘృతాహుతులు ఇచ్చునది.

    1. అగ్నిదేవా! మా ప్రాచీన పితరులు యజ్ఞములు చేసి మహామహులు అయినారు. వారిని నీవు ప్రకాశమాన స్వర్గమునకు చేర్చినావు. ఉక్థములు గానము చేయు పితరులు రాత్రి అంధకారమును వారి తేజస్సుచే తొలగించి అరుణ ఉషస్సులను ప్రకాశింపచేయుచున్నారు.  

    2. పితరులు పుణ్యాత్ములు దీప్తివంతులు. దేవయంతులు. కమ్మరి ఇనుమును శుద్ధి చేసినట్లు తపముచే కాంతిమంతులయినవారు. అగ్నిని, ఇంద్రుని వర్ధిల్లచేయువారు. వారు మా  ఇంటి నిండ గోసమూహములను కలిగింతురుగాక.

    3. పశువుల మందయందు వలె దేవతలందు చేరిన ఈతడు దేవతల ప్రాదుర్భావమును దర్శించునుగాక. ఈతడు మర్త్యుడుయ్యు ఊర్వశ్యాది స్వర్గసుఖములు అనుభవించుచున్నాడు. మరల మానవగర్భమున వర్ధిల్లుచున్నాడు.

    4. అగ్నిదేవా! మేము నిన్ను సేవించుచున్నందున యజ్ఞవంతులము అగుదుముగాక. ఉషస్సులు మమ్ము ప్రకాశింపచేయునుగాక. విశ్వేదేవతలు రక్షించిన కర్మలే భద్రములు అగుచున్నవి. మేము పుత్రవంతులమై మహాస్తుతులు చేయుదుముగాక.

    5. క్రింద భూదానము చేసినవానికి పైన ఉన్న స్వర్గమున రక్షణ కలిగినట్లు మరుత్ సహిత ఇంద్రుడు తూర్పు దిశన మమ్ము రక్షించునుగాక.

    "లోకకృతః పథికృతో యజామహే యేదేవానాం హుతభాగా ఇహస్థ ||"

    లోకములను సృష్టించిన వారిని, మార్గములు ఏర్పరచినవారిని యజించుచున్నాము. దేవతల హుత  భాగములు ఈ పితృ మేధమున చేరునుగాక.

    6. క్రింద భూదానము చేసిన వారికి పై స్వర్గమున రక్షణ కలిగినట్లు ధాత నిరృతి యుక్తుడై దక్షిణ దిశన మమ్ము రక్షించునుగాక.

    "లోకకృతః......."

    7. క్రింద భూదానము చేసినవానికి పైన స్వర్గమున రక్షణ కలిగినట్లు ఆదిత్యుల సహితయై అదితి మమ్ము పడమటి దిశన రక్షించునుగాక

    "లోకకృతః......."

    8. క్రింద భూదానము చేసిన వానికి పైన స్వర్గమున రక్షణ కలిగినట్లు విశ్వేదేవ సహిత సోముడు మమ్ము ఉత్తర దిశన  రక్షించునుగాక.

    "లోకకృతః........"

    9. పైన ఉన్న ద్యులోకము భానుడగు సవితను ధరించిన రీతి ధర్త ధరుణి సహితుడై నిన్ను పోషించునుగాక.

    "లోకకృతః......"

    10. దిగువన భూదానము చేసిన వానికి పైన స్వర్గము అందినట్లు ప్రాగ్దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందుచున్నది.

    "లోకకృతః........."

   
                                           నాలుగవ సూక్తము - 16


    వినియోగము : 1 - 5  ఘృత  హోమమున  - అభిమంత్రణమున

    1. భూదానము పైన స్వర్గమును కలిగించినట్టు దక్షిణ దిక్కున నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.

    "లోకకృతః........"

    2. భూదానము పైన స్వర్గము కలిగించినట్లు పశ్చిమ దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.

    "లోకకృతః.........."

    3. భూదానము పైన స్వర్గము కలిగించినట్లు ఉత్తర దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.

    "లోకకృతః............."

    4.భూదానము పైన స్వర్గము కలిగించినట్లు ధ్రువ దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.

    "లోకకృతః........."

    5. భూదానము పైన స్వర్గము కలిగించినట్లు ఊర్థ్వ దిశన నీకు పూర్వ సంచిత స్వధ అందించుచున్నాను.

    వినియోగము : సోమయాగమున హవిర్ధాన శకటము చేరినంత 6-7 మంత్రములచే అభిమంత్రణ చేయునది.

    6. అగ్నీ! నీవు ధర్తవు. ధరుణవు. వంసగవు.

    7. ఉదకమును పూరింపుము. మధువును పూరింపుము. వాయువును పూరింపుము.

    8. మమ్ము ఇచట రక్షించండి. అచట రక్షించండి. కవలల వలె కలసిసాగండి. దేవతల అనుగ్రహము ఆశించు నరులు మీకు హవి అర్పించినపుడు మీ స్థానములను తెలిసి ఆసీనులుకండి.
 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.