Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4. ప్రేతమా! నీ మనసు, సర్వాంగములు, రస పదార్థములు నిన్ను విడువకుండునుగాక. నీ తనువు యొక్క ఏ భాగము కూడ నిన్ను విడువకుండునుగాక.
5. ప్రేతమా! నిన్ను వృక్షములు బాధించకుండునుగాక. మహా భూమాత నిన్ను బాధించకుండునుగాక. యమరాజు యొక్క పితృ లోకము చేరి వర్థిల్లుము.
6. ప్రేతమా! నీ అవయవములు, ప్రాణములు పునరవృత్తి కొరకు ఇచట నిలిచిపోయినవి. నీతోటి పితరులు వానిని మరల నీ దేహమున చేర్చి మరల నీయందు అనుభవ శక్తిని చేర్చెదరుగాక.
7. జీవించి ఉన్న బంధువులారా! మృత్యువు యముని దూత, ప్రజ్ఞాని. అతడు ఈ మృతుని ప్రాణములను పితరులందు ప్రవేశ పెట్టుటకు కొనిపోయినాడు. ఈ శవమును ఇంటి నుంచి బయటకు తెండి. ఎత్తి ఊరి బయటకు చేర్చండి.
8. దస్యులు జ్ఞాతుల రూపములు ధరించి పితరులందు ప్రవేశించుచున్నారు. ఆహుతులగు పర, అపర పితరులను నష్ట పరచుచున్నారు. అగ్నీ! వారిని ఈ పితృ యజ్ఞము నుండి బయటకు గెంటుము.
9. మా పితరులు ఇచట ఆసీనులు అగుదురుగాక. మాకు శుభములు కలిగించుచు ఆయువును పెంచెదరుగాక. ఆ విధముగ వర్ధిల్లు మేము పితరులకు హవిస్సులు అర్పించునంతటి శక్తివంతులము అగుదుముగాక. అనేక శరత్తులు జీవింతుము గాక.
10. ప్రేతమా! నేను నీ నిమిత్తము ధేనువును, క్షీరాన్నమును దానము చేయుచున్నాను. పితృ లోకమున నీకు అన్నము లేకున్న వానితో జీవించుము.
నాలుగవ సూక్తము - 10.
వినియోగము :- పితృమేధమున శవదహనము తరువాత నదిలోనికి దిగి స్నానము చేసి పైకి వచ్చువానిని మొదటి మంత్రముచే అనుమంత్రించునది. పిండ పితృ యజ్ఞమున 4,5 మంత్రములచే రెండు సమిధలను వేయునది. 6వ మంత్రముచే పుత్రుడు లేక గోత్రజుడు చితిమంటను మరింత మండించునది. 7వ మంత్రముచే కాంపీల శాఖచే దహన స్థానమును ప్రోక్షించునది. 9 మొదలు 7 మంత్రములచే శ్మశానపు ప్రతి దిశలను కొలత వేయునది. విలస్తాదులచే దక్షిణమున ఏడు, ఉత్తరమున ఏడు, పూర్వ పశ్చిమములందు ఐదేసి చొప్పున కొలతలు వేయునది.
1. ప్రేతమా! మమ్ము అశ్వవతి నదిని దాటించుము. ఆ నది మాకు సుఖప్రదాయిని అగునుగాక. నాకు తెలియని కొత్త అరణ్యమును దాటుదునుగాక. నిన్ను చంపినవాడు 'వధ్యుడు' అగునుగాక. అతడు నిర్ధనుడు అగునుగాక.
2. యముడు తండ్రి వివస్వతుని కన్న తేజోవంతుడు అగుచున్నాడు. అతని మించినవాడు కానరాకున్నాడు. నా అధ్వరమున యమునే అధికముగ ప్రతిష్ఠించుచున్నాను. వివస్వత సూర్యుడు భూమిని ప్రకాశింపచేయుచున్నాడు - యముని అధ్వరము కొరకు.
3. దేవతలు మర్త్యుల నుండి అమృతమును దాచినారు. సువర్ణమగు స్త్రీని కల్పించి సూర్యునకు ఇచ్చినారు. ఆమె సరణ్యు. సరణ్యు అశ్వరూపము దాల్చిన అశ్వినులను కన్నది. ఆమె యే యమ యమి జంటను కని సూర్యుని ఇల్లు వదలునపుడు వారిని విడిచి వెళ్లినది.
4. పితరులందు ఖననము చేయబడినవారు, దూర దేశమున కట్టెను వలె వదిలి వేయబడినవారు దహనమైనవారు, పితృ లోకమున ఉన్నవారు కలరు. అగ్నిదేవా! వారలనందరను హవి భక్షణకు కొనిరమ్ము.
5. పితరులందు అగ్ని దుగ్ధులు, అనగ్ని దగ్ధులు, స్వధను సేవించుచు దివి మధ్యన ఉన్నవారు కలరు. జాతవేదాగ్నీ! నీవు వారిని స్పష్టముగా తెలియుచున్నావు. వారికి పితృ పిండములను అందించుము.
6. అగ్నిదేవా! శవమునకు సుఖము కలుగునట్లు దహించుము. ఎక్కువగా దహించకుము. మా దేహములను దహించకుము. నీ యొక్క దహించు జ్వాలలు అరణ్యములకు - రసహరణశీల తేజము పృథ్విని చేరునుగాక.
7. యముడు ఇట్లనుచున్నాడు.
ఈ వచ్చినవాడు నావాడు అయినచో వానికి నివాసము కల్పించుచున్నాను. యముడు మరల ఇట్లన్నాడు.
అతడు నన్ను భజించినంత కాలము ఇచట ఉండునుగాక.
8. ఈ శ్మశానమును కొలతవేయుచున్నాము. మా ఆయువు శతశరత్తులగుచున్నది. మరొక కొలత వేయకుందుముగాక.
9. ప్రేతమునకు చాలినంత కొలిచినాము. మాది శత శరదాయుష్యము. మరొకదానిని కొలత వేయకుందుము గాక.
10. దోష నివారణకు కొలత వేయుచున్నాము. మాది శత శరదాయువు. మరొక కొలత వేయకుందుము.
ఐదవ సూక్తము - 11
వినియోగము : కొలత వేసిన శ్మశానమును 5-7 మంత్రములచే అనుమంత్రించునది. 8,9 చే శవమును బండి లేక మంచమునకు ఎక్కించునది. 9,10 మంత్రములచే ప్రేతాగ్ని యందు యామ్య హోమము చేయునది. 10వ మంత్రము మరియు 6వ సూక్తపు 1,2 మంత్రములచే అసమ సంఖ్య 'శలకాభిః ఇష్టికాభిర్వా ప్రసవ్యం చినుయాత్'
1. వీమాం మాత్రాం మిమీమహే యథా పరంన మాసాతై
శతే శరత్సునో పురా |
శ్రేష్ఠముగా కొలత వేయుచున్నాము. శతశరత్తులలో మరల కొలత వేయకుందుముగాక.
2. నిరిమాం మాత్రాం మిమీమహే యథాపరం న మాసా తై |
శతే శరత్సునో పురా ||
నిర్దోషముగ......
3. ఉదిమాం మాత్రాం మిమీమహే యథాపరం న మాసా తై |
శతే శరత్సునో పురా ||
ఉత్కర్షముగ.....
4. సమిమాం మాత్రాం మిమీమహే యథాపరం న మాసా తై |
శతే శరత్సునో పురా ||
సమ్యక్ గ......
5. కొలతలు వేసి ప్రేతాత్మను స్వర్గమునకు పంపినాము. నేను ఆయుష్మంతుడగు అగుదునుగాక.
"యథాపరం న మాసాతై శతే శరత్సు నో పురా"
6. ప్రాణ - అపాన - వ్యాన - చక్షువులు సూర్యుని దర్శించునుగాక. నీవు చోర రహితమగు యముని రాజమార్గమున పితరులను చేరుము.
7. సంతాన హీనులయ్యు ద్వేషమును త్యజించినవారు పైకి పోయి - అంతరిక్షమును దాటి దుఃఖమెరుగని స్వర్గ లోకమునకు చేరుచున్నారు.
8. దిగువన ఉండు ద్యులోకము ఉదన్వతి. మధ్యన ఉండునది పీలూమ. మూడవది ప్రద్యు. ఈ మూడవ దివి యందు పితరులున్నారు.
9. నా తండ్రిని కన్నవారికి, తాతను కన్నవారికి, అంతరిక్షమున, పృథ్వి మీద, స్వర్గమందున్న పితరులకు పిండ ప్రదానము చేసి నమస్కరించుచున్నాను.
10. మృతుడా! ఇదే నీ జీవనము. అన్యము లేకున్నది. దివి యందు సూర్యుని దర్శించుచుందుము.
భూమీ! తల్లి బిడ్డను వలె ఇతనిని నీ ఉరమున చేర్చుకొనుము.
ఆరవ సూక్తము - 12
వినియోగము : 1-2 శ్మశానమున శాలాకాచయన కర్మమున 3-6 చే శవమును శకటమున పెట్టునది. 6చే శవమును ఉంచిన తరువాత ఎద్దులను అభిమంత్రించి బండికి కట్టునది. 8వ మంత్రముచే ఏడు ఛిద్రముల 'గోవపయా ప్రేతముఖం ప్రచ్ఛాదయేత్' 9వ మంత్రముచే ప్రేత బ్రాహ్మణ హస్తము నుండి 'వేద యష్టి'ని పుత్రుడు గ్రహించునది. 10చే ప్రేత క్షత్రియ హస్తము నుండి పుత్రుడు ధనుస్సును గ్రహించునది.
1. ఇదే నీ భోజనము. మరొకటి లేదు. ఇదే నీ స్థలము. ఇతరము లేదు. భార్య భర్తకు బట్ట కప్పినట్లు భూమి ఇతనిని కప్పునుగాక.
2. భద్రమగు భూమాత వస్త్రముచే నిన్ను ఆచ్ఛాదించుచున్నాను. బతికిన వానికిచ్చునవి నాకు - పితరులకు ప్రదానము చేయు పిండములు నీకు లభించునుగాక.
3. అగ్ని సోములారా! మీరు పుణ్య లోకములకు దారులు పరచినారు. దేవతలు రమణీయమగు స్వర్గమును ఏర్పరచినారు. ఈ ప్రేతమును సూర్యలోకమునకు సరళ మార్గమున చేర్చండి.
4. ప్రేతమా! విద్వాంసుడగు పూష ఇచటి నుంచి నిర్గమించునుగాక. పూష పశువులను నష్టపరచడు. రక్షించును. అతడు నిన్ను రక్షించుటకని పితరులకు ఇచ్చునుగాక. అగ్ని నిన్ను సుదాతలగు దేవతలకు వప్పగించునుగాక.
5. విశ్వాయువు నా ఆయువును రక్షించునుగాక. పూష పూర్వ మార్గపు అగ్రమున నిన్ను రక్షించునుగాక. ప్రేతమా! ఎచటి పుణ్యాత్ములు ఉందురో, ఎచటికి పుణ్యాత్ములు చేరుదురో అట్టి లోకమునకు సవిత నిన్ను చేర్చునుగాక.
6. ప్రేతమును వహించుటకు ఈ రెండు ఎద్దులను నేను కట్టుచున్నాను. ఈ ఎద్దులు ఈ ప్రాణిని యమ సదనమునకు చేర్చునుగాక.
7. ప్రేతమా! పూర్వము ఈ లోకమున జీవించి ఉండగా ధరించిన వస్త్రమును విడువుము. విద్వాంసుడవై బంధువులకు ఇచ్చిన బహుధనములు నీకు ఇష్టా పూర్తి కలిగించునుగాక.
8. ప్రేతమా! దాహక అగ్ని నుండి రక్షణకు గోవు యొక్క అవయవముల కవచము ధరించుము. అందువలన ధర్షక అగ్ని మహా జ్వాలలచే నిన్ను అటు ఇటు పడవేయకుండును గాక.
9. ప్రేతమా! నా హస్తమున ధరించిన దండము వలన శ్రోత్రియ వర్చస్సు, బలము కలుగునుగాక. నీవు ఈ దహన ప్రదేశముననే నిలువుము. మేము సుఖవంతులము, పుత్రవంతులమై సకల ఉపద్రవములను, హింసక శత్రువులను అణచి వేతుముగాక.
10. మృతుని చేతి నుండి ధనుస్సు అందుకొని నేను క్షాత్రము, వర్చస్సు, బలము కలవాడను అగుచున్నాను.
ధనువా! మాకు ధనమును, పుష్టిని కలిగించుటకు భూలోకమున మాకు దర్శనము ఇమ్ము.
మూడవ అనువాకము
మొదటి సూక్తము - 13
వినియోగము : మొదటి సూక్తపు తొలి ఋక్కుచే భార్యను ప్రేత సహితముగా చితిపై ఎక్కించునది.
1. మర్త్య ప్రేతమా! నీ భార్య పతిలోకమును వరించి పురాణ ధర్మమును పాలించుచు, నిన్ను చేరుచున్నది. తస్యై 'ప్రజాం ద్రవిణం చే హ ధేహి' ఆమెకు ప్రజను సంతానమును ఇచట అందించుము.
(వినియోగమున తప్ప భార్య చితిని చేరుటను మంత్రము చెప్పలేదు. "తస్యై తథావిధాయై అను మరణం కృతస్యై స్త్రీయై భూలోకే జన్మాన్త రేపి ప్రజాం ద్రవిణం చ ధేహి" అని సాయణుని వ్యాఖ్య. అట్లు మరణించిన స్త్రీకి భూలోకమున జన్మాంతరమున ప్రజ, ధనము ఇమ్ము అని అర్థము.
సాయణుడు దీని ప్రమాణము చూపలేదు.
"తస్మై ప్రజాం ద్రవిణం చేహ ధేహి" ఇహముననే ఆమెకు ప్రజను ధనమును ఇమ్మని మంత్రము. ధనమునీయవచ్చును. భర్త లేని ప్రజ ఎట్లు? ప్రజ అనిన సంతానము మాత్రము కాదు. ప్రజావై తన్తుః - ప్రజావై విశ్వ జ్యోతిః - ప్రజా నా ఇషః - ప్రజావై భూతాని - ప్రజావై బర్హిః ప్రజాశస్త్రమ్ అని ప్రమాణము. ప్రజ సేవకులు కూడ అగుచున్నారు.
కావున ఆమెకు సేవకులను ధనమును ఈ లోకముననే ఇవ్వవలసినది అని అర్థము.
"పతి లోకం వృణానా" అనిన మరల వివాహము చేసికొనకుండుట మాత్రమే.





