Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
3. సరస్వతీ! ఉక్థ, శస్త్ర, స్వధా సహితముగ పితరులతో కూడి ఆనందించుచు ఒకే రథము మీద వచ్చుచున్నావు. వేలమందికి తృప్తి కలిగించు అన్నమును, ధన పుష్టిని కలిగించుము.
4. అగ్ర పితరులారా! లేవండి. మధ్యమ పితరులారా! లేవండి. మీరు సోమ భక్షకులు. అంగశరీరులు. సత్యవంతులు. అట్టి పితరులు మమ్ము రక్షించెదరుగాక.
5. కళ్యాణధనులగు పితరులకు అభిముఖుడనై చేరుచున్నాను. విక్రముడగు విష్ణువును, రక్షకుడగు అగ్నిని చేరుకొనుచున్నాను. బర్హిష్పద అభిషుత సోమపాయులగు పితరులను సేవించుచున్నాము. అగ్నిదేవా! వారిని మా వద్దకు ఆహ్వానించండి.
6. పూర్వము పితృ లోకము చేరినవారికి, ఈ మధ్య చేరిన వారికి నమః. భూమి మీద ఉన్నవారికి సువిభక్త దిశలందున్న వారికి నమః.
7. మాతలి నామక పితరులు కవ్వముచే, యమనామకులు అంగిర హవ్యముచే - బృహస్పతి నామక పితరులు ఋక్వములచే వర్ధిల్లుచున్నారు. ఏ పితరులను దేవతలు వర్ధిల్లచేయుచున్నారో, ఏ పితరులు దేవతలును వర్ధిల్లచేయుచున్నారో వారెల్లరు పితృ యజ్ఞములందు మమ్ము రక్షింతురుగాత.
8. మధుమంత సోమము రుచిగలది. కావున మధురము. ఇది తీవ్రము. కావున వెంటనే ఆనందము కలిగించును. ఇది సారవంతము. దీనిని సేవించిన ఇంద్రుని గెలువగలవాడు లేడు.
9. విశాల పృథ్విని అతిక్రమించునట్టి, అతి దూర దేశమునకు సాగునట్టి, అనేకమంది పితరుల మార్గమున నడుచునట్టి, వివస్వత పుత్రుడు, మరణించు వారు చేరుస్థానమగు యముని అర్పించండి.
10. యముడు పూర్వము గతించిన వారి మార్గమును ఎరింగియున్నాడు. ఇది అందరు సాగవలసిన మార్గము. పూర్వ, పర పితరులు సాగిన మార్గమును మేము తెలియుచున్నాము.
ఆరవ సూక్తము - 6
వినియోగము :- మొదటి ఋక్కుచే కుశలను పరచునది. 2వ మంత్రముచే తిలలు చల్లునది. పితృమేధమున ప్రేతపు అస్థికలను దీనిచే 'త్రిపాదశిక్యము'న పెట్టునది. 4వ మంత్రముచే దానిని బండి మీద పెట్టునది. ప్రేత దహన స్థానమును 5వ ఋక్కుచే కాంపీలశాఖచే సంప్రోక్షణ చేయునది. పిండ పితృ యజ్ఞమున 6,7లచే రెండు పుల్లలను మండించునది. అగ్ని పెట్టు పుత్రుడు 8 నుండి ఏడు ఋక్కులచే ప్రేత దేహమున ఘృతాహుతులిచ్చునది. 10వ ఋక్కుచే యమునకు నాలుగవ వపాహుతి ఇచ్చునది. ప్రేతమును ఎత్తి 11 మరియు మరుసటి సూక్తపు 2,3 మంత్రములచే బండి లేక మంచము మీద పెట్టునది.
1. యజ్ఞమునకు విచ్చేసిన బర్హిషద పితరులారా! మీరు మమ్ము రక్షించండి. మా సమ్ముఖమునకు రండి. మేము సమర్పించిన ఆహుతులను స్వీకరించండి. మాకు శుభములు కలిగించండి. రోగశాంతి కలిగించండి. మమ్ము పాపరహితులను చేయండి.
2. వేదికి దక్షిణమున ఆసీనులై మా హవిని స్వీకరించండి. ప్రశంసించండి. మేము చేసిన అపరాధములకు మమ్ము శిక్షించకండి. మేము మానవులము కదా!
3. త్వష్ట తన కూతురు 'సరణ్యు' వివాహము చేసినాడు. అది చూచుటకు సమస్త విశ్వము కూడినది. యముని తల్లి వివస్వతుని భార్య సరణ్యు వివాహము జరిగినపుడు దాగినది.
4. ప్రేతమా! నీ పూర్వులగు పితరులు పోయిన దారి పట్టుము. అచట యమ, వరుణరాజులు ఉన్నారు. వారు మేము సమర్పించిన హవిస్సులు సేవించి ఆనందించుచుందురు. మీకు ఆ ఉభయ ప్రభువులు దర్శనమగును.
5. పిశాచములారా! ఈ స్థానమునుండి పారిపొండి. వెళ్లిపొండి. దూరమునకు వెళ్లండి. మీరు పాతవారలైనను, క్రొత్త వారలైనను ఇచట నిలువరాదు. యముడు ఈ స్థలమును జలము దివారాత్రుల సహితముగ ఈ ప్రేతమునకు ఇచ్చినాడు.
6. అగ్నిదేవా! నిన్ను పితృ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. నిన్ను ప్రజ్వలితుని చేయుచున్నాము. మా హవిని భక్షించుటకుగాను పితరులను ఇచటికి చేర్చుము.
7. ద్యుమంతుడవగు నిన్ను ఆహ్వానించుచున్నాము. ద్యుమంతుడవగు నిన్ను ప్రజ్వలింప చేయుచున్నాను. ద్యుమంతుడవగు నీవు ద్యుమంత పితరులను హవి సేవించుటకు ఆహ్వానించుము.
8. సనాతనులగు అంగిరసులు మాకు పితరులు. నవీనులగు అథర్వులు, భృగువులు మాకు పితరులు. వారందరు సోమపాయలు. యజ్ఞియులగు పితరులు సన్మనస్సులందు మేము ఉందుముగాక. వారు మా విషయమున హృదయములందు ప్రసన్నులు అగుదురుగాక.
9. యమదేవా! నీవు వైరూపుడవు. యాజ్ఞియ అంగిర పితరుల సహితముగ విచ్చేయుము. ఆనందించుము. నీ తండ్రియగు వివస్వతుని ఆహ్వానించుచున్నాము. అతడు కుశాసనమున ఆసీనుడై హవి స్వీకరించునుగాక.
10. యమదేవా! అంగిర పితరుల సహితుడవై విచ్చేయుము. కుశాసనముల ఆసీనుడవగుము. కవుల మంత్రములు నిన్ను పిలుచుచున్నవి. మా హవిస్సు స్వీకరించుము. ప్రసన్నుడవగుము.
11. ఈ ప్రేతమును నేల మీద నుంచి బండి మీదకు ఎక్కించినారు. భూమిని జయించిన అంగిరసులు పోయిన మార్గమున వీనిని ప్రవేశపెట్టినారు.
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 7
వినియోగము :- పితృ మేధమున 10వ ఋక్కు తప్ప 4-18 మంత్రములచే భస్మమగు ప్రేత శరీరము వద్ద సకల గోత్రముల వారు నిలుచునది. 4-7 లచే గోత్రము వారు నిప్పును మండించునది. 8,9 మంత్రములచే చితికి కుడివైపు మేకను కట్టునది. అది భస్మము కావలెను. దానిని విడువరాదు. పితృ మేధపు నాల్గవనాడు ఏకాగ్నిక ఆహితాగ్ని శరీరమును 10చే అనుకరించునది.
1. యముని కొరకు సోమము అభిషుతమగుచున్నది. యముని కొరకు హవి సిద్ధమగుచున్నది. దూతయగు అగ్నిచే అలంకృత యజ్ఞము యముని చేరుచున్నది.
2. మధుమత్తమ హవి, ప్రతిష్ఠయు యముని కొరకే అగునుగాక. ఋషులకు, పూర్వజులకు, పూర్వులకు, మార్గనిర్దేశకులకు నమః.
3. యమరాజునకు ఘృతవంత దుగ్ధ హవిని అర్పించండి. అతడు మాకు దీర్ఘాయువును, జీవితమును ప్రసాదించునుగాక.
4. అగ్నిదేవా! ఈ ప్రేతమును అతిగా కాల్చకుము. అతనిని దుఃఖింపచేయకుము. అతని త్వచను, దేహమును వేరు చోటునకు విసరకుము.
జాతవేదాగ్నీ! ఈ దేహము పూర్తిగ కాలినంత దానిని పితరుల వద్దకు చేర్చుము.
5. అగ్నిదేవా! వీనిని దహించుము. ఈ దావాసంస్కృతుని రక్షణకుగాను పితరులకు అర్పించండి. ఇతడు 'అసునీతి' దేవతకు చేరినంత దేవతలను వశమునందుంచుకొనువాడు అగునుగాక.
6. త్రికద్రుకములందు యముని కొరకే సోమము అభిషుతమగుచున్నది. షడుర్వులు యముని కొరకే నిలిచి ఉన్నవి.
"త్రిష్టుబ్ గాయత్రీ ఛన్దాంసి సర్వాతా యమ ఆర్పితా"
(జ్యోతిష్టోమము, గోష్టోమము, ఆయుష్టోమము త్రికద్రుకలు. ద్యౌ, పృథివి, రాత్రి, పగలు, జలము, ఓషధులు షడుర్వులు.)
7. కన్నులచే సూర్యుని ఆత్మచే వాయువును, అవయవములచే ద్యావాపృథ్వులను చేరుము. నీకు హితము కూర్చు జలమున చేరుము. దేహములను ఓషధులందు ప్రతిష్ఠించుము.
8. అగ్నిదేవా! అజము నీ భాగమగుచున్నది. దానిని తపింపచేయుము. దాని అవయవములను నీ జ్వాలచే తపింపచేయుము.
జాతవేదా! కళ్యాణప్రదలగు నీ జ్వాలలచే ఇతనిని సుకృతుల లోకమునకు చేర్చుము.
9. జాతవేదాగ్నీ! నీ జ్వాలలు దుఃఖ ప్రదములు. వేగవంతములు. వానితోనే నీవు ద్యులోక, అంతరిక్షములందు వ్యాపించుచున్నావు. ఆ జ్వాలలు ఈ అజమును చేరునుగాక. సుఖప్రదములగు జ్వాలలచే ఈ ప్రేతమును దహించుము.
10. అగ్నిదేవా! ఆహుతులందు చరించువారును, స్వధావంతులగు పితరుల లోకమున ఇతనికి పునర్జన్మ కలిగించుము. భూలోకమున మిగిలిన ఇతని బంధువులు ఆయుష్మంతులగుదురుగాక. వర్చస్సు గలవారలగుదురుగాక.
రెండవ సూక్తము - 8
వినియోగము :- 1-8 భస్మమగుచున్న ప్రేత శరీరపు ఉపస్థానమున. వీనిచే శ్మశానమునకు ప్రేత దేహమును అనుమంత్రించునది. అస్థి సంచయనమున అస్థి కలశమును వీనిచే ఖనన ప్రదేశమునకు తీసికొనుపోవునది. 1-3 చే ప్రేత హస్తమునకు అందించు 'గోపశువృక్కద్వయల అనుమంత్రయేత్'. 9వ మంత్రము 3వ సూ. 1,2ల 'ముముర్షు' యజమానిని అగ్నిశాల యందు పరచిన దర్భల మీద స్థాపయేత్. వీనితోనే అగ్నికి ఉత్తర దిశన శవమును బండి నుంచి దించునది. అస్థి కలశమును పాతవలసినచో 9వ మంత్రముచే అభిమంత్రించి పాతిపెట్టునది.
1. దేవతల ఆడకుక్క పేరు సరమ. దానికి శ్యామ, శవల అనుపుత్రులు. వానిలో ఒక్కొక్క దానికి నాలుగు కాళ్లు. నాలుగు నేత్రములు. ప్రేతమా! నీవు సాధు మార్గమున వానిని తప్పుకొని సాగుము. తదుపరి ధనసంపన్నులు, యమునితో కూడి ఆనందించువారలగు పితరుల వద్దకు చేరుము.
2. యమదేవా! నీ కుక్కలు రక్షించునవి. నాలుగు కనులవి. మార్గమున సాగు ఈ జీవిని వానిచే రక్షింపచేయుము. ఇతనికి నీ లోకమున అవినాశ్యము. బాధారహితము శుభప్రదమగు స్థానమును ఏర్పరచుము.
3. యముని ఇద్దరు దూతలు దీర్ఘ నాసికులు. ప్రాణ తృప్తులు. ప్రాణాపహారకలు. వారు సర్వత్ర సంచరించుచున్నారు. వారిద్దరు మేము సూర్యదేవుని దర్శించునట్లు మా పంచ ప్రాణములను మరల ప్రసాదింతురుగాక.
4. ఒకట సోమము ప్రవహించుము. ఒకట ఘృతము ఉపాసించును. ఒకట మధువు పరుగులిడును. అవన్నియు నీకు లభించునుగాక.
5. పూర్వ పురుషులు సత్య సంభక్తులు. సత్య సంభవులు. సత్యవర్ధనులు. ఋషులు తపస్సంపన్నులు, తపస్సంభవులు, నీవు వారిని చేరుదువు గాక.
6. తపస్సుచే పాపరహితులైన వారిని, తపము వలన స్వర్గము చేసిన వారిని, మహా తపస్సులు చేసిన వారిని చేరుము.
7. యుద్ధమున శౌర్యము చూపినవారిని, యుద్ధమున అమరులైన వారిని, భూరి దక్షిణల యజ్ఞములు చేసిన వారిని చేరుము.
8. యముని అధీనా! సహస్రనయనముల విద్వాంసులు సూర్యుని రక్షించుచున్నారు. తపస్సంపన్నులు, తపో సంజాతులగు ఋషులున్నారు. వారిని చేరుము.
9. భూమీ! నీవు విశాలవు. నివాస ప్రదాయినివి. ఇతనికి శుభప్రదవగుము. అనంత సుఖములు కలిగించుము.
10. బాధలేని వాడవై పృథివి ఉరస్థానమున ఉండుము. జీవించి ఉన్నప్పుడు నీవు సమర్పించిన స్వధాదులు నీకు తేనెవాగులు అగునుగాక.
మూడవ సూక్తము - 9
వినియోగము :- 2 మంత్రముచే చితికుడివైపున అది భస్మమగురీతిన అజమును కట్టునది. ఆహితాగ్ని సంస్కారార్థక విహిత మూడు అగ్నులందు 7వ మంత్రముచే ఘృతాహుతులిచ్చునది. పితృ పిండ యజ్ఞమున జలపూర్ణ పాత్రను కుశల మీద పెట్టిన పిదప 8వ ఋక్కుచే రెండువైపుల కాలుచున్న ఉల్మకములను వేయునది. పిండ పితృ యజ్ఞమున 9వ ఋక్కుచే పరచిన దర్భల మీద నువ్వులు వేయునది.
1. ప్రేతమా! నా మనసుచే నీ మనసును పిలుచుచున్నాను. నిన్ను సేవించు గృహములకు విచ్చేయుము. పితృ సహితుడవై వెళ్లుము. యముని సహితుడవై వెళ్లుము. పితృలోక మార్గమున వాయువులు నీకు సుఖ ప్రదములు అగునుగాక.
2. ప్రేతమా! మరుత్తులు నిన్ను ఊర్థ్వ లోకమునకు చేర్చును గాక. జలవాహక మేఘము అజముతో సహ నిన్ను వర్షించి చల్లబరచునుగాక.
3. ప్రేతమా! నిన్ను ఆయువు, శ్వాస, జీవితము కొరకు ఆహ్వానించుచున్నాను. నీ మనసు సంస్కారవంతమగునుగాక. నీవు పితరులందు చేరుదువుగాక.





