Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||
శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
పద్ధెనిమిదవ కాండము
మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
ఓ చిత్ సఖాయం సఖ్యా వవృత్యాం తిరః పురుచిదర్ణవం జగన్వాన్ |
పితుర్న పాతమా దధీత వేధా అధిక్షమి ప్రతరం దీధ్యానః ||
అతనిని అనుకూలుని చేసి కొనుటకు గాను సఖి యమి సఖుని - యముని - తో అన్నది:- రహస్యము, విశాలము అగు సముద్రమునకు చేరుదము. తండ్రిని మించు పుత్రుని నా యందు ప్రవేశపెట్టుము. ప్రతర ప్రదీప్తుడవగు నీవు నన్ను క్షమించుము.
వినియోగము :-
పితృమేధపు శవదహన, అగ్ని ప్రదానము తరువాత బేసిసంఖ్య బ్రాహ్మణులు తూర్పుముఖముగ కూర్చుండి ఈ కాండను జపించునది. అదే కర్మమున సారస్వత హోమానంతరము ఈ కాండచే ప్రేతము దగ్గర బంధువు కూర్చుండునది.
ఈ అనువాకపు మొదటిసూక్తను మరియు రెండవ సూక్తపు 6 వ మంత్రము వరకు యమ, యమి సంవాదము వర్ణించబడినది. వారిద్దరు వివస్వతుని సంతానము. అన్నా చెల్లెండ్రు అగుచున్నారు.
యముడు అనుచున్నాడు :-
2. నేను నీకు ఏకోదరత్వమున సఖుడను అగుచున్నాను. కావున కామించరాదు. రుద్రుని మహాపుత్రులు, దివిని పాలించువారు, భూమి మీద వ్యాపించిన వారలగు మరుత్తులు కూడ అదేమాట అనుచున్నారు.
3. యమి అనుచున్నది:-
అమృత దేవతలగు మరుత్తులు నేను కోరిన కోరికను ఆమోదించుచున్నారు. అసాధారణ మర్త్యులై సంతానమును కోరుచున్నారు. కావున నీ మనసును నా యందు ప్రవేశపెట్టుము. నా తనువున ప్రవేశించి పతివి అగుము.
4. యముడు అనుచున్నాడు :-
ఇది పూర్వము చేయనిది. మనము ఎట్లు చేయుదము? మనము సత్యవాదులము. అసత్యమెట్లు పలుకుదము? ఆకసమున ఆదిత్యుడు ఉన్నాడు. అతని భార్య ఉన్నది. వారు మనలను గమనించుచున్నారు.
5. యమి అనుచున్నది:-
మనము గర్భమునందే దంపతుల మైనాము. ఈ విషయము త్వష్టకు తెలియును. విశ్వరూపియగు సవితకు తెలియును. ద్యావాపృథ్వులకు సహితము ఈ విషయము తెలియును. దేవతలు ఆమోదించిన దానిని కాదనువాడెవడు?
6. యముడు అనుచున్నాడు:-
సత్యపు భారమును తన నాలుక మీద ఎవడు భరించుచున్నాడు? ఎవడు సత్యము చెప్పుచున్నాడు? కర్మవంతులు, తేజస్వులు, నిర్భయులు మాత్రమే హృదయునందలి సత్యమును వాక్కున వచించుచున్నారు: వారే సిద్ధజీవులై చిరంజీవులు అగుచున్నారు.
7. యమి అనుచున్నది:-
మన ప్రథమ సంగమమును ఎవడు ఎరుగును? ఎవడు చూచినాడు? ఎవడు చెప్పుచున్నాడు? ఇది రాత్రింబవళ్లు విశాల ధామము. నాకు బాధ కలిగించి తిరుగు బోతు నరులనీతులు చెప్పుచున్నావెందుకు ?
8. యమి యముని కామించుచున్నది. పతికి పత్ని తన దేహమును అర్పించిన రీతి అసాధారణ శయ్యమీద నా దేహమును అతనికి అర్పింతునుగాక. తదుపరి రథ చక్రముల వలె కలసి సాగుదుముగాక.
9. యముడు అనుచున్నాడు :-
ఈ లోకమున సంచరించు దేవదూతలు ఒక చోటనిలువరు. కనురెప్ప వాల్చరు. కావున ఉన్మత్తమగు నీవు అన్యుని వద్దకు చేరుము. అతనితో కలిసి రథచక్రములవలె సాగుము.
10. యమి అగుచున్నది :-
యమునకు రాత్రింబవళ్లు హవి లభించును గాక. సూర్యుని ప్రకాశము అతని కొరకు నిత్యము ఉదయించును గాక. ద్యావాపృథ్వుల సంబంధము వలె యమి యముల సంబంధము కలుగును గాక. భగినీ సంబంధము రాలి పోవును గాక.
రెండవ సూక్తము - 2
1. యముడు :-
రానున్న యుగములందు సోదరి భార్య కావచ్చును. కావున యమీ! నీవు మరొకని చేయిపట్టుము. నన్ను విడువుము. సుభగే! మరొకనిని పతినిగా చేసికొనుము.
2. యమి :-
సోదరుడు ఉండగా సోదరి దిక్కులేనిది అగునా? సోదరి ఉండగా సోదరుడు దుఃఖితుడు కావచ్చునా? నేను కామవశమై మూర్ఛిల్లుచున్నాను. నీ తనువుతో నా తనువును కలుపుము.
3. యముడు :-
యమీ! నేను నీకు భర్తను కాజాలను. నీ తనువుతో తనువు కలుపజాలను. నీవు అన్యునితో రమించుము. సుభగీ! నీ సోదరుడు నీకోరిక తీర్చడు.
4. యమీ! నా తనువును నీతో కలుపలేను. సోదరితో సంగమించుట పాపమని పెద్దలు చెప్పుచున్నారు. సోదరుడనై సోదరితో శయనించిన నా హృదయము, మనస్సు, ప్రాణము నష్టపోవును.
5. యమీ :-
యమా! నీవు దుర్బలుడవు అయినావు. నీ మనసును, హృదయమును నా మీద పెట్టకున్నావు. నేను గ్రహించినాను. తీగచెట్టు మొదటి నుంచి చివరి వరకు చుట్టుకున్నట్లు మరొకటి నిన్ను చంకన వేసుకున్నది.
6. యముడు :-
యమీ! తీగ చెట్టును చుట్టుకున్నట్లు నీవు మరొకనిని ఆలింగనము చేసికొనుము. అతడు నీ మనసున, నీవు అతని మనసున నిలుతురుగాక. సౌభాగ్యవతివై సుఖపడుము.
7. పూర్వము విద్వాంసులు ఈ జగత్తును మూడింటచే ఆచ్ఛాదించినారు. వానిలో పురూరూపము, విశ్వనేత్రమగు జలము ఒకటి. వారు భూలోకమున జలము, వాయువు ఓషధులను ఈ లోకమున స్థాపించినారు.
8. అగ్ని వరదుడు. వర్షి. అతడు అఖండనీయము, అదాభ్యము అయిన భూమికి దివి నుంచి రసవృష్టి కలిగించుచున్నాడు. అగ్ని వరుణుని వంటి విశ్వవేత్త. యజ్ఞయోగ్య అగ్ని ఋతువులననుసరించిన యజ్ఞములను యజించుచున్నాడు.
9. ఆదిత్య స్వభూత భారతియు, సరస్వతియు నేను అగ్నిని స్తుతించుటకు స్పష్ట వాక్కును ప్రసాదింతురుగాక. దేవమాత అదితి నన్ను యాగములందు నిలుపునుగాక. నాకు జ్యేష్ఠ భ్రాతయగు అగ్ని నన్ను మెచ్చుకొనునుగాక.
10. ఉష శుభములు కలిగించునది. శబ్ద స్వరూప యశస్వతి. సూర్యవతి. ఆమె మానవుల కొరకని ఉదయించినది. అప్పుడే అధ్వర్యులు హవిస్సు అందుకొమ్మని దేవతలను ఆహ్వానించుచు యజమానుల యజ్ఞములందు అగ్నిని కల్పించినారు.
మూడవ సూక్తము - 3
1. సోమము మహత్తము. దర్శనీయము. దేవమానవ సేవనీయము. దానిని శ్యేనము స్వర్గము నుండి యజ్ఞము కొరకు భూలోకమునకు తెచ్చినది. ఆ విధముగ సోమము చేరగా ఆర్యులు యజ్ఞములు చేయుటకు అగ్నిని వరించినారు. ఆ యజ్ఞము నుండియే సమస్త కర్మలు ఆవిర్భవించినవి.
2. అగ్నీ! నీవు మానవులు సమర్పించు ఘృతాదులచే పుష్టినొందుచున్నావు. సర్వదా యజమానికి దర్శనీయుడవు అగుచున్నావు. విప్రుల, యజమానులచే స్తుతించబడు నీవు వారి కోరికలు తీర్చుటకు దేవతల వద్దకు చేరుకున్నావు.
3. అగ్నీ! నీ మాతా పితరులగు ద్యావాపృథ్వులకు ప్రేరణ కలిగించుము. సూర్యుడు, ద్యావాపృథ్వులను వలె నీవును ప్రకాశింపచేయుము. యజమాని ఏ దేవతలను పూజించదలచుచున్నాడో అగ్ని ఆ దేవతలను హృదయ పూర్వకముగ అభిలషించుచున్నాడు. అగ్ని యజమానితో నన్ను పూజించు వానికి సకల పదార్థములను ఇచ్చుచున్నాడు' అనుచున్నాడు. అగ్ని అట్టివాని వద్దకే విచ్చేయుచున్నాడు.
4. అగ్నీ! నీవు బలపుత్రుడవు. నీ అనుగ్రహమును గురించి అన్యులకు వివరించు నరుని కీర్తి బహుశ్రుతమగు చున్నది. అతడు మరింత అన్నము, అశ్వములు, తేజస్సు కలవాడై చిరకాలము జీవించుచున్నాడు.
5. అగ్నిదేవా! యజ్ఞ గృహమందు మా ఆహ్వానమును వినుము. దేవతల కొరకు అమృత రథమును సిద్ధపరచుము. ఉరికించుము. దేవతలను, ద్యావాపృథ్వులను తీసికొనిరమ్ము. ఒక్కదేవత కూడ మిగులరాదు.
6. అగ్నీ! నీవు పూజనీయుడవు. నీకు సంహితలు స్తోత్రములు, హవిస్సులు సమర్పించబడుచున్నవి. దేవతలు పూజించబడుచున్నారు. నీవు రమణీయ రత్నములను స్తోతలకు పంచుచున్నావు. అప్పుడు మాకు ధనము నందు పెద్ద భాగము ప్రసాదించుము.
7. జాతవేదాగ్ని ఉషస్సు వెంట ఉదయించినాడు. పగలు కూడ ప్రకాశించినాడు. సూర్యుడు తొలుత ఉషస్సును, తదుపరి ద్యావాపృథ్వులను ప్రకాశింపచేయుచున్నాడు.
8. ఉషోదయమైనంత అగ్ని ప్రకాశించుచున్నాడు. జాతవేదాగ్ని పగలు వెలుగుచున్నాడు. సూర్యునివి అనేక రూపములు. సూర్య కిరణములవి బహురూపములు. అవి ద్యావాపృథ్వులందు వెలుగును విస్తరింపచేయుచున్నవి.
9. ద్యావాపృథ్వులు ప్రథమములు, సత్యవచనలు. యజ్ఞములందు స్తుతులు ఆలకించునవి. యజ్ఞమునందలి అగ్నిహోతకు అభిముఖమై ప్రజ్వరిల్లును. అప్పుడు ద్యావాపృథ్వులు స్తుతులు వినునుగాక.
10. అగ్నిదేవా! నీవు అగ్రుడవు. మా యజ్ఞమును ఎరుంగుము. మా హవిస్సులను దేవతలకు అందించుము. నీవు ధూమకేతువవు. సమిధలచే ప్రజ్వరిల్లువాడవు. ప్రసన్నులను చేయువాడవు. హోతవు. నిత్యుడవు. పూజ్యుడవు.
నాలుగవ సూక్తము - 4
1. ద్యావాపృథ్వులారా! మీ యందలి జలమును వర్ధిల్ల చేయుటకు స్తుతించుచున్నాము. ఆలకించండి. హోతలు తమ శక్తిచే యజించు రోజులందు, మాతా పితరులగు, మీరు మాకు మధుర జలమును ప్రసాదించండి.
2. సకల ప్రాణుల జీవమగు, దేవతల అమృతమువంటి జలము కిరణములందు చేరి, భూమికి దిగి ఓషధులను కలిగించుచున్నది. అగ్నీ! నీవు దివియందలి ఘృతము వంటి జలమును వర్షించుచున్నావు. అప్పుడు విశ్వేదేవతలు నిన్ను అనుసరించుచున్నారు.
3. యమరాజు దేనిని గ్రహించుచున్నాడు? అతనికి మేము చేయు వ్రతములందలి లోపములేవి? వానిని తెలిసిన వాడు ఎవడు? అగ్ని దేవహోత. మిత్రుడు. మా లోపములను గురించి దేవతలకు విన్నవించి మమ్ము రక్షించునుగాక.
4. యమి యముని భర్తను చేసికొనదలచినది. కావున యముని నామము దుర్వచనము అగుచున్నది. అగ్నిదేవా! అట్టి యముని తలచిన, స్తుతించిన వాని దోషమును మన్నింపుము. అతనిని రక్షించుము.
5. అగ్ని వలననే దేవతలు ఆనందించుచున్నారు. అగ్నియే మానవులను సూర్యలోకమునకు చేర్చుచున్నాడు. దేవతలు సూర్యుని యందు జ్యోతిని, చంద్రుని యందు రశ్మిని ప్రవేశపెట్టినారు. కావుననే సూర్యచంద్రులు అగ్నిని నిరంతరము సేవించుచున్నారు.
6. దేవతలు సంచరించు స్థానములను మేము తెలియకున్నాము. వరుణుడు అంతర్హితమున ఉన్నాడు. దేవతలు అతనికి మా నిరపరాధిత్వమును చెప్పెదరుగాక. అగ్నిదేవా! సవిత, మిత్రుడు, అదితి, ద్యులోకము కూడ మేము నిరపరాధులమని గుర్తింతురుగాక.
7. మిత్రుడు, వజ్రియగు బ్రహేంద్రుని నుండి ఫలములు ఆశించుచున్నాము. పరమనేత, శత్రుదమనుడగు ఇంద్రుని నుతించుచున్నాము.
8. ఇంద్రా! నీవు బలశాలివని శృతి. వృత్రుని వధించి వృత్రహంతవైనావు. మేఘముల వలన మఘవుడవైనావు. శూరా! నీవు మహాదాతవు అగుచున్నావు.
9. వర్షకాలమున మండూకము భూమిని విడుచుచున్నది. అట్లే నీవు భూమిని విడిచి పైకి పోవుచున్నావు. భూమి మీద మాకు అనుకూలముగ గాలివీచునుగాక. అగ్ని గడ్డిని బూడిద చేసినట్లు మిత్రావరుణులు మా దుఃఖములను నిర్మూలింతురుగాక.
10. రుద్రుడు శ్మశానసదనుడు. ప్రజలకు రాజు. భీకరుడు. ఉగ్రుడు. దగ్గర ఉండి కొట్టువాడు. స్తోతా! అట్టి రుద్రుని స్తుతించుము.
రుద్రదేవా! మా స్తుతులు వినుము. మమ్ము రక్షించుము. నీ సేన మమ్ము తాక కుండునుగాక. అది నిన్ను ద్వేషించు వారి మీద పడునుగాక.
ఐదవ సూక్తము - 5
వినియోగము :- పితృమేధమున 1-3 ఋక్కులచే అగ్నిదాతయగు కనిష్ఠపుత్రుడు దక్షిణ దిశ నుంచి ఘృతముచే సారస్వత హోమము చేయునది. 4వ మంత్రముచే కాంపిలీ శాఖచే ఉధృతము చేసి, అభ్యుక్షితము చేసి లక్షణము చేయునది. పిండపితృ యజ్ఞమున దీనిచే గొయ్యి త్రవ్వునది. 4-6 చే మూడు జలపూర్ణ పాత్రలను కుశల మీద ఉంచునది. 6చే గోతిలో కుశలను పరచునది. కనిష్ఠ పుత్రుడు చితికి అగ్గి పెట్టిన పిదప 9-10 మంత్రములచే యామ్య హోమము చేయునది.
1. సరస్వతిని దేవయంతులు ఆహ్వానించుచున్నారు. అధ్వరములందు ఆహ్వానించుచున్నారు. సుకృతులు ఆహ్వానించుచున్నారు. సరస్వతి స్తోతలకు శక్తి ప్రసాదించునుగాక.
2. వేదికి దక్షిణముగ ఆసీనులగు పితరులు సరస్వతిని ఆహ్వానించుచున్నారు.
పితరులారా! మా యజ్ఞమునందు ఆసీనులై సంతృప్తులు కండి. మా హవిని ఆనందముగ స్వీకరించండి.





