Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||
శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
పదిహేడవ కాండము
మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
విషాసహిం సహమానం సాసహానం సహీయాంసమ్ |
సహమానం సహోజితం స్వర్జితం గోజితం సంధనాజితమ్ |
ఈడ్యం నామ హ్వ ఇంద్రమాయుష్మాన్ భూయాసమ్ ||
ఇంద్రుడు / సూర్యుడు శత్రువును తిరిగి తలెత్తకుండ అణచువాడు. సహనశీలి. శత్రుహంత. శత్రుదమనులందు శ్రేష్ఠుడు. శత్రుంజయుడు. శత్రు సుఖములను హరించువాడు. గోవులను గెలుచువాడు. ధనమును గెలుచువాడు. స్తుత్యుడు. నన్ను ఆయుష్మంతుని చేయుమని ఆహ్వానించుచున్నాను.
(ఇచట ఇంద్ర శబ్దమునకు ఆదిత్యుడని అర్థమని సాయణుడు చెప్పినాడు. ఇంద్రః సాక్షాద్ ఆదిత్య ఏవ - అసౌవా ఆదిత్య ఇన్ద్రః అని ప్రయాణించినాడు.)
వినియోగము :-
ఈ అనువాకపు పాఠము సలిలగణములందున్నది. ఉపనయనమున ఆచార్యుడు బ్రహ్మచారి నాభిప్రదేశమును స్పృశించి ఈ అనువాకము చదువునది. ఉపనయనమున ఋషిహస్త ప్రక్షాళనానంతరము ఆచార్యుడు వటువును అభిమంత్రించునది. ఆయుర్వృద్ధి కొరకు ఈ అనువాకముచే త్రికాలములందు ఆదిత్యుని ఉపస్థానము చేయునది.
సూర్యగ్రహణ శాంతికి ఈ అనువాకముచే ఘృతాహుతి ఇచ్చునది. చంద్రగ్రహణశాంతి కొరకు ఈ అనువాకముచే ఉపస్థానము చేయునది.
ఆయుష్య గణమున ఈ అనువాక పాఠము ఉన్నందున ఉపాకార్మమున దీనిచే ఘృతాహుతి ఇచ్చునది.
ఆదిత్య మహాశాంతి యందు దీని వినియోగము.కోటి హోమమున కూడ దీని వినియోగము కలదు. సూర్యదేవుని ప్రీతి కొరకు చేయు ఆదిత్య మండల దానపు మండలాకార అపూప అభిమంత్రణము నందు కూడ దీని వినియోగము.
1. 2వ సూక్తపు 8వ మంత్రముచే దర్శేష్ఠియందు మహేంద్ర హవిని అనుమంత్రించునది.
2. తొలిరెండు పాదములు మొదటి మంత్రమువలె 5వ మంత్రము వరకు అన్వయించుకొనునది. దేవతలకు ఇష్టులమగుటకు అనుగ్రహించు ఇంద్రుని, ఆదిత్యుని ఆహ్వానించుచున్నాము.
3. ప్రజలకు ఇష్టులమగుటకు అనుగ్రహించు ఇంద్రుని, ఆదిత్యుని ఆహ్వానించుచున్నాము.
4. ఈడ్యం నామహ్వఇంద్రం ప్రియః పశూనాం భూయసామ్.
5. ఈడ్యం నామ హ్వఇంద్రం ప్రియః పశూనాం భూయసామ్.
6. సూర్యదేవా! ఉదయించుము. ఉదయించుము. మాకు తేజస్సు కలిగించుచు ఉదయించుము. మమ్ము ద్వేషించు వారు మా అధీనమున ఉందురు గాక. మేము ద్వేషించువారి అధీనమున ఉండకుందుము గాక. నీవు విష్ణువు వంటి బహు పరాక్రమశాలివి. మాకు వివిధ పశువులను ప్రసాదించుము. అమృతమును అందించుము. అక్షయ లోకములు కలిగించుము.
7. సూర్యదేవా! ఉదయించుము. ఉదయించుము. మాకు తేజస్సు కలిగించుచు ఉదయించుము. నేను చూచుచున్న చూడకున్న ప్రాణులను నాకు అనుకూలురను చేయుము. నీవు విష్ణువు వంటి బహుపరాక్రమశాలివి. మాకు వివిధ పశువులను ప్రసాదించుము. అమృతమును అందించుము. అక్షయలోకములు కలిగించుము.
8. సూర్యదేవా! అంతరిక్ష జలములందలి పాశములు గల రాక్షసాదులు నీకు ఆటంకము కలిగించకుందురు గాక. అపనిందలు విడిచి ఆకసమున ఎదుగుము. మమ్ము రక్షించుము. నీ మంచి మనసున నిలుపుకొనుము. నీవు విష్ణువు వంటి బహుపరాక్రమశాలివి. మాకు బహురూప పశువులను ప్రసాదించుము. అమృతము అందించుము. అక్షయలోకములు కలిగించుము.
9. ఇంద్ర - సూర్య-దేవా! మాకు మహాభాగ్యము కలిగించుము. హింసకుల నుండి రాత్రింబవళ్లు రక్షింపుము. నీవు విష్ణువు వంటి బహుపరాక్రమశాలివి. మాకు అనేక రూప పశువులను ప్రసాదించుము. అమృతము అందించుము. అక్షయలోకములు కలిగించుము.
10. ఇంద్ర - సూర్య-దేవా! విశిష్ట శుభంకర దక్షిణలు కలిగించి మాకు అతి సుఖములను కలిగించుము. సోమపానమునకు గాను త్రిదివమగు స్వర్గమునకు ఆరోహించుము. ప్రియధామమునకు సుఖములు, శుభములు కలిగించుము. నీవు విష్ణువు వంటి బహు పరాక్రమశాలివి. మాకు నానారూప పశువులను ప్రసాదించుము. అమృతము అందించుము. అక్షయలోకములు కలిగించుము.
రెండవ సూక్తము - 2
1. ఇంద్రా-సూర్యా! నీవు విశ్వజితుడవు. విశ్వాత్మవు. పురుహూతుడవు. ఇంద్రా! విచ్చేయుము సుహవమగు స్తోత్రమును స్వీకరించుము. మమ్ము రక్షించుము. నీ సుమతులందు చేర్చుము.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
2. సూర్యదేవా! దివి, భువి, అంతరిక్షమున నీ వంటి మహిమాన్వితులు మహాశక్తి మంతములగు మంత్రములచే వర్ధిల్లుచున్నారు. మాకు దివియందు సుఖములు కలిగించుము.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
3. ఇంద్ర - సూర్య-దేవా! నీవు జలములందు, పృథివి యందు, అంతరగ్నులందు మూర్తీభవించి ఉన్నావు. సూర్యా! నీవు పవమానమున, స్వర్గమున, అంతరిక్షమున వ్యాపించి ఉన్నావు. ఇంద్రా. అట్టి మూర్తి, అట్టి వ్యాప్తి గల నీవు మాకు సుఖములు కలిగించుము.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
4. ఇంద్ర - సూర్య-దేవా! ఋషులు నిన్ను బ్రహ్మణములచే వర్ధిల్లచేయుచున్నారు. అభీష్ట ఫలములు కోరి నిన్ను గురించి సత్రములు చేయుచున్నారు.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
5. ఇంద్రసూర్య-దేవా! నీవు అంతరిక్షమున, సహస్రధారల మేఘమున, యజ్ఞములందు వ్యాపించిన వాడవు. స్వర్గప్రదాతవు.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
6. నీవు చతుర్దిశలను, ద్యావాపృథ్వులను, సమస్త భువనములను ప్రకాశింప జేయుచున్నావు. ఋతము యొక్క సకల మార్గములు తెలిసిన విద్వాంసుడవు.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
7. నీయొక్క అయిదు కిరణములచే పై భాగమును, ఒక కిరణముచే దిగువ భాగమును ప్రకాశింపచేయుచున్నావు. యాచించబడిన వాడవై సుదినములను కలిగించుచున్నావు. నీవు నిత్య స్తుత్యుడవు.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
8. త్వమిన్ద్రస్త్వం మహేన్ద్రస్త్వం ప్రజాపతిః | యజ్ఞములు నీకొరకే విస్తరిల్లుచున్నవి. నీ కొరకే హోమించబడుచున్నవి. హవించబడుచున్నవి.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
9. అసత్ నందు సత్ ప్రతిష్ఠితము. సత్ నందు భూతములు ప్రతిష్ఠితములు. భూతమున భవిష్యత్తు ఆహితము. భవిష్యత్తు నందే భూతము ప్రతిష్ఠితము.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
10. నీవు స్వచ్చ స్వరూపుడవై ప్రకాశించుచున్నావు. ఏ విధముగా నీవు కాంతిచే ప్రకాశించుచున్నావో అదే విధముగ మేము కాంతిచే ప్రకాశింతుము గాక.
మూడవ సూక్తము - 3
1. నీవు దీప్తులచే దీపించుచున్నావు. నీవు దీప్తులచే దీపించుచున్నట్లే నేను పశువులు, బ్రహ్మవర్చస్సుచే దీప్తుడనై దీపింతును గాక.
2. ఉదయించుచున్న వానికి నమః ఉదయించుచున్న వానికి నమః. ఉదయించిన వానికి నమః.
విరాజే నమః. స్వరాజే నమః. సమ్రాజేనమః ||
3. అస్తమించుచున్న వానికి నమః. అస్తమించుచున్న వానికి నమః. అస్తమించుచున్న వానికి నమః.
విరాజే నమః. స్వరాజే నమః. సమ్రాజేనమః ||
4. విశ్వ ప్రకాశ సహితుడగు ఆదిత్యుడు ఉదయించినాడు. అతడు మా శత్రువులను మాకు వశపరచుచున్నాడు. మేము శత్రువశులము కాకుందుము గాక.
తవేద విష్ణోః బహుధా వీర్యాణి |
త్వః నః పృణిహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమేవ్యోమన్ ||
5. ఆదిత్యా! శత ధన సమన్వితమగు నీ నావను 'స్వస్తయే' ఆరోహించినాను. నీవు నన్ను దినమున, రాత్రియందు దాటించుము.
6. సూర్యదేవా! శతధన సహితమగు నీ నావను స్వస్తయే ఆరోహించినాను. నీవు నన్ను రాత్రిని, దినమును దాటించుము.
7. నేను ప్రజాపతిచే ఆవృతుడను. మంత్రముల కవచము గలవాడను. కశ్యపుని జ్యోతిష వర్చస్సు కలవాడను. అట్టి నేను వార్ధక్యము వరకు ఆరోగ్యముగ శక్తివంతుడనై వేయేళ్లు సుకృతము చేయుచుందును గాక.
8. నేను ప్రజాపతిచే ఆవృతుడను. మంత్రకవచుడను. కశ్యపుని జ్యోతిష వర్చస్సు కలవాడను. అట్టి నన్ను వధించుటకు విడిచిన దైవిక, మానవ శస్త్రములు నన్ను చేరకుండును గాక.
9. నేను ఋతము చేత, ఋతవుల చేత, పుట్టిన పుట్టనున్న వానిచేత రక్షించబడుచున్నాను. మంత్రములను జలములందున్న నన్ను పాపములు, మృత్యువు చేరకుండును గాక.
10. అగ్ని నన్ను రక్షించుచు పోషించును గాక. విశ్వమున ఉదయించు సూర్యుడు వెలువడు ఉష ధ్రువములను పర్వతములు నన్ను మృత్యుపాశముల నుండి విడిపించును గాక. నాయందు వేల ప్రాణములు చేరును గాక.
దాశరథి రంగాచార్య రచించిన
శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత
యందలి పదిహేడవ కాండ సమాప్తము.





