Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



               యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
                నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||


                               పదిహేనవ కాండము

                         మొదటి అనువాకము

                       మొదటి పర్యాయ సూక్తము - 1


    అత్రకాణ్డే వ్రాత్య మహిమా ప్రపంచ్యతే |
    వ్రాత్యోనామ ఉపనయనాది సంస్కారహీనః పురుషః ||


    ఈ కాండమున 'వ్రాత్య' మహిమ ప్రతిపాదించబడినది. "వ్రాత్యుడు" ఉపనయనము మున్నగు సంస్కారములు లేనివాడు.

    1. వ్రాత్య ఆసీదీయమాన ఏవ సప్రజాపతిం సమైరయత్. వ్రాత్యుడు కదలినంత ప్రజాపతికి ప్రేరణ కలిగించినవాడు అగుచున్నాడు.

    2. ఆ ప్రజాపతి తనయందు సువర్ణమును దర్శించినాడు. సువర్ణమును వ్యక్తము చేసినాడు.

    3. ఆ ప్రజాపతి అద్వితీయుడు. 'లలామమ్' - మహత్తు' - జ్యేష్ఠము - బ్రహ్మ - తపము - సత్యము అయినాడు. అతడు ప్రజలను సృష్టించినాడు.

    4. అతడు పెరిగినాడు. మహానుడు అయినాడు. మహాదేవుడు అయినాడు.

    5. అతడు దేవతలకు ఈశుడు - ఈశానుడు అయినాడు.

    6. అతడు ఏక వ్రాత్యుడు అయినాడు. ధనుస్సు అందుకున్నాడు. అదే ఇంద్ర ధనుస్సు అయినది.

    7. అతని ఉదరము నీలము, పృష్ఠము లోహితము.

    8. ఇతడు నీలిమచే అప్రియ శత్రువును మూయుచున్నాడు. ద్వేషించువారిని లోహితమున అణచుచున్నాడని బ్రహ్మవాదులు అనుచున్నారు.


                                   రెండవ పర్యాయ సూక్తము - 2

    1. అతడు లేచినాడు. తూర్పునకు నడచినాడు.

    2. అతనిని అనుసరించి బృహతి, రథంతరసామము, ఆదిత్యులు, సకల దేవతలు సాగినారు.

    3. విద్వాంసుడగు వ్రాత్యుని నిందించినవారు బృహతి, రథంతరము, ఆదిత్యులు, సమస్త దేవతలనుండి విడిపోవుచున్నారు.

    4. అతడు సాగిన ప్రాచ్య దిశ బృహతికి, రథంతరమునకు, ఆదిత్యులకు, సమస్త దేవతలకు ప్రియధామమగుచున్నది.

    5. అతనికి శ్రద్ధ పుంశ్చలి - మిత్రుడు మాగధ - విజ్ఞానము వస్త్రము - పగలు తలపాగ - రాత్రి కేశములు - హరిత, ప్రవర్తలు కల్మలి మణి అగుచున్నవి.

    6. భూత భవిష్యత్తులు పరిష్కందములు, మనసు విపథ అగుచున్నవి.

    7. మాతరిశ్వ, పవమానులు విపధవాహులు, వాయువు సారథి, రేష్మ కొరడా యగుచున్నారు.

    8. అతని ముందు కీర్తి, యశస్సు నడచుచున్నవి. దీనిని తెలిసినవాడు కీర్తిమంతుడు, యశోవంతుడు అగుచున్నాడు.

    9. అతడు లేచినాడు. దక్షిణదిశకు నడచినాడు.

    10. అతనిని అనుసరించి యజ్ఞాయజ్ఞియము, వామదేవ్యము, యజ్ఞము, యజమాని, పశువులు సాగినవి.

    11. వాత్య విద్వాంసుని నిందించినవాడు యజ్ఞాయజ్ఞియము, వామదేవ్యము, యజ్ఞము, యజమాని, పశువుల నుండి విడిపోయిన వాడగుచున్నాడు.

    12. యజ్ఞా యజ్ఞియమునకు, వామదేవ్యమునకు, యజ్ఞమునకు, యజమానికి, పశువులకు దక్షిణదిశ ప్రియధామమగుచున్నది.

    13. అతనికి ఉష పుంశ్చలి, మంత్రము మాగధము, విజ్ఞానము వసనము, పగలు తలపాగ, రాత్రికేశము, హరిత ప్రవర్తలు కల్మలి మణి యగుచున్నవి.

    14. అమావాస్య, పూర్ణిమలు పరిష్కందము మనసు విపధయగుచున్నవి.

    15. అతడు లేచినాడు. పశ్చిమ దిశకు నడచినాడు.

    16. అతనిని అనుసరించి వైరూపము, వైరాజము, జలము, రాజా వరుణుడు సాగినారు.

    17. విద్వాంసుడగు వ్రాత్యని నిందించినవారు వైరూప, వైరాజస, జల, రాజావరుణుల నుండి విడిపోవుచున్నారు.

    18. వైరూప, వైరాజస, జల, రాజా వరుణులకు పశ్చిమ దిశ ప్రియధామమగుచున్నది.

    19. అతనికి పృథ్వి పుంశ్చలి, హసము మాగధము, జ్ఞానము వసనము, పగలు ఉష్ణీషము, రాత్రికేశములు, హరితప్రవర్తలు కల్మణి మణి యగుచున్నవి.

    20. అహర్నిశలు పరిష్కందములు, మనసు విపధయగుచున్నవి.

    21. అతడు లేచినాడు - ఉత్తర దిశకు నడచినాడు.

    22. అతనిని అనుసరించి శ్యేతము నౌధసము, సప్తర్షులు రాజా సోముడు సాగినారు.

    23. విద్వాంసుడగు వ్రాత్యుని నిందించినవారు శ్యేత నౌధస, సప్తర్షి - రాజాసోముల నుండి విడిపోవుచున్నారు.

    24. శ్యేత, నౌధస, సప్తర్షి, రాజాసోములకు ఉత్తరదిశ ప్రియధామము అగుచున్నది.

    25. అతనికి విద్యుత్తు పుంశ్చలి, ఉరుము మాగధము, విజ్ఞానము వపనము, పగలు ఉష్ణీషము, రాత్రికేశములు హరిత ప్రవర్తలు కల్మణి మణి యగుచున్నవి.

    26. శ్రుత విశ్రుతములు పరిష్కందములు మనము విపధయగుచున్నవి.

    27. మాతరిశ్వ పవమానులు విపధ వాహకులు, వాయువు సారథి. రేష్మకొరడా యగుచున్నది.

    28. అతని ముందుగా కీర్తి, యశస్సులు నడచుచున్నవి. ఇది తెలిసిన వాడు యశోవంతుడు, కీర్తిమంతుడు అగుచున్నాడు.


                                    మూడవ పర్యాయ సూక్తము - 3

    1. అతడు సంవత్సరము వరకు నిటారుగా నిలిచినాడు. "వ్రాత్యా! నీవు ఎందుకొరకు నిలిచి ఉన్నావు?" అని దేవతలు అడిగినారు.

    2. అతడు 'నా కొరకు 'ఆసన్ది' సిద్ధము చేయండి' అన్నాడు.

    3. అప్పుడు ఆ వ్రాత్యుని కొరకు ఆసన్ది సిద్ధమైనది.

    4. గ్రీష్మ, వసంతములు అతని రెండు పాదములు కాగా శరది, వర్షములు మరి రెండు పాదములు అయినవి.

    5. బృహత్, రథంతరములు రెండు 'అనూచ్య' లు కాగా యజ్ఞ యజ్ఞియ, వామదేవ్యములు 'తిరశ్చ్య' లైనవి.

    6. ఋచ ప్రాంచములు తంతువులు కాగా, యజుః తిర్యక్ అయినది.

    7. వేదము 'ఆస్తరణము' - బ్రహ్మ ఉపబర్హణము అయినవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.