Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    62. వరుణ, ఇంద్ర, సవిత, బృహస్పతులారా! ఈమె భ్రాతలకు, పశువులకు, పతికి క్షతి కలిగించనిదానిగ చేసి సంతానవతిని చేయండి.

    63. దేవతలారా! దేవకృతమగు స్థూణమను మార్గమున వధువును బాధించకండి. మేము గృహదేవి ద్వార మార్గమును, వధువుకొరకు, సుఖప్రదము చేయుచున్నాము.

    64. బ్రహ్మమంత్రము పరమున, పూర్వమున, మధ్యన, సర్వ దిశలందు ప్రవర్తించును గాక. నీవు వ్యాధి రహితమగు దేవగృహమున ప్రవేశించుము. 'శివాస్యోనా పతిలోకే విరాజ'. పతి ఇంట శుభములు, సుఖములు కలిగించుచు విరాజిల్లుము.


                                   రెండవ అనువాకము

                                        మొదటి సూక్తము - 2

    1. అగ్నిదేవా! తొలుత కట్న సహితముగ సూర్యను నీ కొరకే తెచ్చియుండిరి. అట్టి నీవు పతులమగు మాకు సంతాన సహితముగ పత్నులను ప్రసాదించుము.

    2. అగ్ని ఆయుష్యము, వర్చస్సు సహితముగ పత్నిని ప్రసాదించినాడు 'శరదః శతమ్' జీవించు పతి యొక్క పత్నికి దీర్ఘాయువు కలుగును గాక.

    3. నీవు తొలుత సోమునకు, రెండవసారి గంధర్వునకు, మూడవసారి అగ్నికి, నాలుగవ సారి మానవుడనగు నాకు భార్యవైనావు.

    4. సోముడు గంధర్వునకు, గంధర్వుడు అగ్నికి ఇవ్వగా అగ్ని నాకు ఈమెను ధనపుత్ర సహితముగ ఇచ్చినాడు.

    5. ఉషః కాల ధన సంపన్న అశ్వినులారా! మీ మనసున గల మంచి కోరికలు, మీ అనుగ్రహపు సమృద్ధి మాకు కలిగించండి.

    శుభస్పతులగు అశ్వినులారా! మాకు రక్షకులు కండి. మిత్రులు కండి. మేము సూర్యుని గృహములందు ఆనందింతుము గాక.

    6. అలంకారముల అశ్వినులారా! సుహాసము, సుఖప్రదమగు ధనమును ప్రసాదించండి. వీర వచనములు కలిగించండి మార్గము నందలి జలతీర్థములను సుగమము చేయండి. రాయి రప్ప తొలగించి మార్గమందలి దుష్టులను నష్టపరచండి.

    7. వధూ! నదులందు, క్షేత్రములందు, అరణ్యములందున్న ఓషధులు నిన్ను సంతాన సంపన్నను చేయును గాక. పతిని రాక్షసుల నుండి రక్షించును గాక.

    8. స్వస్తి వాహన వంతులమగు మేము సుగమ మార్గమున సాగుచున్నాము. ఈ మార్గమున వీరులు వధించబడరు. వారికి ఇతరుల ధనము లభించును.

    9. నృలారా! వినండి. ఆశీర్వాద ఫలముగ ఈ దంపతులు శ్రేష్ఠ పదార్థములను అనుభవింతురు గాక. ఈ వనస్పతులందున్న గంధర్వులు, అప్సరలు వధువునకు సుఖప్రదులు అగుదురు గాక. వెంట ఉన్న ద్రవ్యము నష్టపడకుండును గాక.

    10. ఈమె చంద్రుని వలె ఆహ్లాదము కలిగించునది. ఈమె వెంటనున్న ధనము కొరకు దుష్టులు వచ్చుచున్నారు. యజ్ఞ దేవతలు వారిని, వారు బయలు దేరిన చోటునకు పంపుదురు గాక.

    11. బందిపోటులు దంపతులను చేరకుందురు గాక. దుర్గమ మార్గమును సుగమముగ దాటుదుము గాక. మ శత్రువులు పారిపోవుదురు గాక.

    12. వెంట వచ్చు ద్రవ్యమును మంత్రములచే, గ్రహములచే, అఘోర చక్షువుల చేత, మిత్రులచేత రక్షించుచున్నాను. ఈ మూటలో ఉన్న వివిధములను పతి కొరకని సవిత రక్షించును గాక.

    13. శుభంకరి నారి గృహమునకు వచ్చినది. ధాత ఆమె కొరకు ఈ గృహరూప లోకమును నిర్దేశించినాడు. "తామర్యమా భగో అశ్వినోభా ప్రజాపతిః ప్రజయా వర్దయంతు"

    14. స్వాభిమానము గల మహా యువతి వచ్చినది. నరుడు ఆమె యందు బీజమును ఆరోపించును గాక. ఆమె వృషభము వంటి రేజస్సును ధరించి దుగ్ధ సహితముగ సంతానవతి అగును గాక.

    15. సరస్వతీ! నీవు ప్రతిష్ఠితమగుము. నీవు విష్ణువు వంటి విరాట్టువు.

    సినీవాలీ! నీవు భగుని మంచి మనసున నిలువుము. నీకు సంతానము కలుగును గాక.

    16. జలములారా! అలలు మానండి. శాంతించండి. కళ్లెములు వదలండి. వీరు పాపమెరుగని వారు. ఈ వాహనమును ఆటంక పరచకండి.

    17. వధువా! నీవు చల్లని మనసుదానవై, బిడ్డలను కని, స్నిగ్ధ దృష్టి కలిగి, పతికి క్షతి కలిగించక, అందరను అదుపునందుంచుకొని - సుఖదాయినివై ఇల్లు చేరుము. నీ వలన మాకు అభ్యుదయము కలుగును గాక.

    18. బావకు, భర్తకు క్షతి కలిగించకుము. పశువులకు శుభంకరి వగుము. కాంతి వంతవగుము. నియమములను పాటించుము. ప్రజా సంపన్న వగుము. వీరులను కనుము. సుఖదాయివి అగుము. బావ క్షేమము కోరుచు అగ్నిని అర్చించుము.

    19. నిరృతీ! లే. ఏమి కోరి ఇచటికి చేరినావు? నిన్ను ఇంటినుంచి వెళ్లగొట్టుచు, దూరమునకు గెంటుచున్నాను. శత్రురూపిణీ! నీవు శూన్యము కోరివచ్చినావు. శూన్యముగనే పొమ్ము. ఇచట నిలువకుము.

    20. గార్హ పత్యమున ప్రవేశించుటకు ముందు ఈ వధువు అగ్నిని పూజించుచున్నది. నారీ! నీవు సరస్వతికి పితరులకు ప్రణమిల్లుము.

    21. ఈమె ఆసనము కళ్యాణకరము, రక్షకము అగును గాక. ఈమె సౌభాగ్యవతి యగును గాక. సినీవాలీ! ఈమె బిడ్డలను కనుచుండును గాక.

    22. ఈ వేసిన తుంగ, మృగ చర్మము మీద సుప్రజా సంపన్నము, పతిని వరించినది యగు వధువు ఆసీనయగును గాక.

    23. రోహిత మృగచర్మము మీద తుంగ పరచుము. దాని మీద ఆసీనయై సుప్రజయగు యువతి అగ్నిని అర్చించును గాక.

    24. మృగచర్మము మీద కూర్చుండుము. అగ్ని వద్ద ఆసీనవగుము. అగ్ని రాక్షస సంహారకుడు అగుచున్నాడు. ఈ ఇంట నీ పతికి సంతానము కనుము. నీ కొడుకే జ్యేష్ఠుడు అగుచున్నాడు.

    25. ఈమె తల్లి. ఈమె వడిలో అనేక రూప ప్రాణులు పుట్టిన వారై కూర్చుందురు గాక. సుమంగళీ! నీవు అగ్ని సమీపమున కూర్చుండుము. సకల దేవతలను అలంకరించుము.

    26. నీవు సుమంగళివి. గృహిణివి. పతికి శుభము, మామకు ముదము, అత్తకు సుఖము కలిగించుటకు గృహమున ప్రవేశించుము.

    27. అత్తమామలకు, పతికి, గృహములకు, వారలందరకు సుఖదాయినివై వారికి పుష్ఠి కలిగించుము.

    28. దేవతలారా! ఈమె సుమంగళి. ఈమె వెంట రండి. చూడండి. సౌభాగ్యము కలిగించండి. దౌర్భాగ్యములను తీసికొని పొండి.

    29. దుహృదయ యువతులు, వృద్ధస్త్రీలు ఈమెకు తమ తేజస్సులిచ్చి ఇళ్లకు మరలుదురు గాక.

    30. మనసును మురిపించు వివిధ వర్ణముల పరుపు ఈ విశాల మంచము మీద వేయబడినది. సూర్యుని పుత్రిక సూర్య సుఖించుటకు ఈ మంచము నెక్కినది.

    31. సుమనస్యమానవై తల్పమును ఎక్కుము. నీ పతికి బిడ్డలను కనుము. ఇంద్రాణి వంటి బుద్ధిగల దానవై వర్థిల్లుము. వెలుగు తెచ్చు ఉషస్సులందు మేల్కొనుచుండుము.

    32. తొలుత దేవతలు కూడ ఇట్లే తల్పమును ఎక్కినారు. తనువులతో తనువులు కలిపినారు. నారీ! నీవు విశ్వరూప సూర్యసమవై నీ మహిమచే పతివెంట ఉండుము. ప్రజా సంపన్నవగుము.

    33. విశ్వావసూ! లెమ్ము. నీకు ప్రణమిల్లి సత్కరించుచున్నాము. నీవు పితృసదనమునకేగు యజమానిని కోరుము. అతడు నీ భాగమై ఉన్నాడు. అతని ప్రవృత్తిని తెలియుము.

    34. అప్సరసలు ప్రాణులు ప్రసన్నులగు చోట హవిర్దాన, సూర్య సమయములందు మోదించుచున్నారు. అది మీ యొక్క మూల స్థానము అగుచున్నది. మీరు అచటికి చేరుడు. మీకు వందనము. మిమ్ము గంధర్వుల దారి పట్టించుచున్నాము.

    35. గంధర్వుల హవికి నమస్కారము. వారి క్రోధభరిత నేత్రములకు నమస్కరించుచున్నాము. విశ్వావసూ! నీ యొక్క మంత్రములు, ప్రణామములచే అప్సరసలను ఈమెకు దూరమున ఉంచుము.

    36. మేము ప్రసన్న ప్రదాతలము అగుదుము గాక. గంధర్వులను పైకి పంపుచున్నాము. వారు తమ పరమ ధామములకు చేరినారు. మేము విస్తారమగు ఆయువులు గల చోటుకు చేరుచున్నాము.

    37. మీరు తల్లిదండ్రులగుటకు ఋతు కాలమున సంగమించండి. మీరు వీర్యము వలన తల్లిదండ్రులు కండి. అందరి వలెనే పురుషుడు స్త్రీని ఆరోహించు గాక. సంతానము కలిగించి ధనమును పెంచండి.

    38. పూషా! మనిషి బీజము వేయనున్న కళ్యాణకర యువతికి ప్రేరణ కలిగించుము. ఆమె కామించుచు తొడలు వెడల్పు చేయును గాక. మేము సహితము కామించుచునే ఆమెయందు శేప్త ప్రహారము చేయుదుము గాక.

    39. నీవు ఊరువు నెక్కుము. చేతిని పట్టుము. ప్రసన్న మనస్కుడవై భార్యను ఆలింగనము చేయుము. మీరు ఉభయులు మోదభరితులై పిల్లలను కనండి. "దీర్ఘం వామాయుః సవితా కృణోతు"

    40. మీకు ప్రజాపతి సంతానము నిచ్చును గాక. ఆర్యమ మిమ్ము రాత్రింబవళ్లతో కలుపును గాక. అశుభరహితవై పతి ఇంట ప్రవేశింపుము. "శంవో భవ ద్విపదే శం చతుష్పదే"

    41. మను సహితులగు దేవతలు వధూయ వస్త్రమును ఇచ్చినారు. దానిని విద్వాంసుడగు బ్రాహ్మణునకు దానముచేసినవాని మంచమును ఆశ్రయించిన రాక్షసులు హతులగుచున్నారు.

    42. వరుని వస్త్రము, వధువు వస్త్రము బ్రహ్మ భాగములుగ భావించి నాకు ఇచ్చినారు. ఇంద్ర, బృహస్పతులారా! బ్రహ్మ అనుమతితో మీరే నాకు ఇచ్చినట్లైనది.

    43. మేము సుఖములచే ఆనందింతుము గాక. హాస్యముచే ఆనందింతుము గాక. మహత్వమున ఆనందింతుము గాక. మేము మంచి నడత వారలము, పుత్ర సంపన్నులమై ప్రకాశించు ఉషస్సులను దర్శించుచుందుము గాక.

    44. నవ వస్త్రమును, సుగంధ వస్త్రమును ధరించి జీవించువాడవై ఉషస్సులను ఆరాధింతును గాక. గుడ్డునుండి పిట్ట బయట పడినట్లు నేను పాపముల నుండి బయటపడుదును గాక.

    45. ద్యావాపృథ్వులు శోభాయమానములు. వాటి మధ్య మహత్కార్యములు జరుగుచున్నవి. ఏడుగా ప్రవహించు నదుల దేవేరులు మమ్ము పాపవిముక్తులను చేయుదురు గాక.

    46. సూర్యునకు, దేవతలకు, మిత్రావరుణులకు, ప్రాణులను ఎరిగిన ప్రాజ్ఞులకు "ఇదమకరం నమః"

    47. అభిశ్రిషము లేకనే పూర్వము జత్రువుల నిమిత్తము ఆతర్దనము చేయువాడెవడు? మఘవ సంధిని జోడించువాడెవడు? విరిగిన దానిని మరల అతికించు పురూ వసువు ఎవ్వడు?

    48. నీల పిశంగ లోహిత ధూమము మా నుండి దూరమగును గాక. భస్మము చేయు పృషాతకిని మేము స్థాణువున బంధించినాము.

    49. గృహములందు ఎన్ని కృత్యలున్నవో, రాజా వరుణుని ఎన్ని పాశములున్నవో, అవృద్ధి, అసమృద్ధులు ఎన్ని ఉన్నవో వానిని అన్నింటిని స్థాణువున బంధించినాము.

    50. ఈ తనువు నాకు ప్రియము. ఇది వస్త్రముచే ప్రకాశించును గాక. వనస్పతీ! దాని ముందు నీవిని చేయుము. మేము నష్టపడకుందుము గాక.

    51. అంచులు కలిగి, పడుగు పేకలతో భార్యలచే నేయబడిన ఈ వస్త్రము సుఖప్రదమై మా దేహమును తాకును గాక.

    52. పుట్టింటి నుంచి, భర్త ఇంటికి వెళ్లు వలపు కన్నెలు దీక్షను విరమించినారు. స్వాహా.

    53.    బృహస్పతినావ సృష్టాం విశ్వే దేవా అధారయన్ |
        వర్చోగోషు ప్రవిష్టం యత్ తేనే మాం సం సృజామసి ||


        బృహస్పతి వదిలిన ఓషధిని విశ్వేదేవతలు వర్ధిల్ల చేసినారు.

        గోవులందు ప్రవేశించిన వర్చస్సుచే దీనిని కల్పించుచున్నాము.

    54. "బృహస్పతినా..............."

    గోవులందు ప్రవేశించిన తేజస్సుచే దీనిని కల్పించుచున్నాము.

    55. "బృహస్పతినా..............."

    గోవులందు ప్రవేశించి సౌభాగ్యముచే దీనిని కల్పించుచున్నాము.

    56. "బృహస్పతినా..............."

    గోవులందు ప్రవేశించి యశస్సుచే దీనిని కల్పించుచున్నాము.

    57. "బృహస్పతినా..............."

    గోవులందు ప్రవేశించిన పాలతో దీనిని కల్పించుచున్నాము.

    58. "బృహస్పతినా..............."

    గోవులందు ప్రవేశించిన రసముచే దీనిని కల్పించుచున్నాము.
   
    59. వధువా! నీవు వెళ్లుచున్నావని నీ ఇంటివారు దుఃఖించుచు తలలు విరియబోసుకొని ఏడ్చుచున్నారు. అగ్నిదేవత ఆ పాపము నుంచి నిన్ను విడిపించును గాక.

    60. గృహమున నీ కూతురు తల విరియబోసుకొని దుఃఖము కలిగించుచు ఏడ్చిన

    అగ్నిష్ట్యా తస్మా దేనసః సవితా చ ప్రముఞ్చతామ్. అట్లు ఏడిపించుట వలన కలిగిన పాపము నుండి అగ్ని, సవితలు నిన్ను విముక్తను చేయుదురు గాక.

    61. నీ తోబుట్టువులు, యువతులు ఏడ్చుచు దుఃఖము వ్యాపింపచేసినచో

    "అగ్నిష్ట్యా..........."


    62. దుఃఖమును వ్యాపింపచేయువారు నీ ఇంట - సేవకులందు, పశువులందు దుఃఖము కలిగించినచో

    "అగ్నిష్ట్యా..........."


    63. లాజలను ఆహుతి ఇచ్చు నారి ఇట్లనుచున్నది :-

    "దీర్ఘాయురస్తు మే పతిర్జీవాతి శరదః శతమ్".

    64. ఇంద్రా! ఈ దంపతులను చక్రవాక పక్షుల వలె ఉంచుము. వీరికి సేవకులను, సుందర గృహములను కలిగించుము. విశ్వమాయుర్వ్యశ్నుతామ్ - పరిపూర్ణ ఆయువు అనుభవింతురు గాక.

    65. ఆసనమున, తలదిండున, తల్పమున ఏ దేని పాపము జరిగియున్న, వివాహమున ఇతరులు కృత్యను ప్రయోగించిన వానిని అన్నింటిని స్నాన స్థానమునకు చేర్చుచున్నాము.

    66. వివాహము విషయమున, శుల్క విషయమున, అపరాధము జరిగియున్నచో దానిని మధుర భాషియగు వాని కంబళమున చేర్చుచున్నాము.

    67. సంభలమున మలమును చేర్చు దురితములను కంబళమున ఉంచి మేము యజ్ఞియులము, పరిశుద్ధులము అగుచున్నాము. ఆయుష్మంతులము అగుచున్నాము.

    68. ఇది వందల దంతముల దువ్వెన. ఇది వెంట్రుకల మురికిని దూరము చేసి తలను తాకును గాక.

    69. ఇతని ప్రతి అవయవము నుండి వ్యాధులను తొలగించుచున్నాను. అది నాకు, భూమికి, దేవతలకు, ద్యులోకమునకు, అంతరిక్షమునకు, జలములకు, పితరులకు, సమస్త దేవతలకు అంటకుండును గాక.

    70. నిన్ను భూసారము, ఓషధీసారముచే, ప్రజలచే, ధనముచే కూర్చుచు దీనిని కట్టుచున్నాను. నీవు సన్నద్దవై ధనమును కలిగించుము.

    71. నేను విష్ణువును. నీవు లక్ష్మివి. నేను సామమును, నీవు ఋక్కువు. నేను ద్యును, నీవు భూమివి. మనము కలసి ఉందము. సంతానము కనెదము గాక.

    72. మమ్ము నదులు అనుగ్రహించును గాక. మాకు మంచి దాతయగు పుత్రుడు కలుగును గాక. మేము బాధలులేని వారలము అగుదుము గాక. కలిసి బృహదన్నమునకు కృషి చేయుదుము గాక.

    73. ఈ వధువును చూచుటకు పితరులు శుల్కము వద్దకు వచ్చియున్నచో సౌభాగ్యవతి యగు ఈమేకకు సంతాన సంపద ప్రసాదింతురు గాక.

    74. పూర్వపు మార్గము బంధనములు కలది అయినచో ఈమెకు సేవకులను, ధనము ఇచ్చి తొక్కని మార్గమున కొనిపొండి. ఈమె ప్రజాపతియై వర్ధిల్లును గాక.

    75. సుబుధా! నిన్ను మేల్కొలుపుచున్నారు. శత శరత్తుల దీర్ఘాయువు కలుగుటకు మేల్కొనుము. గృహపత్నివై గృహమును చేరుము. "దీర్ఘంత ఆయుః సవితా కృణోతు"


                   దాశరథి రంగాచార్య విరచిత
         శ్రీమదాంధ్రవచన అథర్వవేద సంహిత యందలి
                  పదునాలుగవ కాండ సమాప్తము.   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.