Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    2. సోముని వలన ఆదిత్యులు బలము కలిగి ఉన్నారు. సోముని వలన పృథివి పూజనీయమైనది. కావుననే నక్షత్రములకు దగ్గరగా సోముడు ఉన్నాడు.

    3. 'సోమము' అను ఓషధిని పిండి పానము చేసినవారు తాము సోమపానము చేసినాము అనుకొనుచున్నారు! బ్రాహ్మణులకు తెలిసిన సోమమును సామాన్యులు తెలియలేకున్నారు.

    4. సోమమా! నిన్ను జనులు పానము చేయుచున్నారు. నీవు మాసమున చంద్రుని వలె మరల పెరుగుచున్నావు. ఋతువులను అనుసరించిన వాయువు నిన్ను రక్షించుచున్నాడు.

    5. సోమమా! నీవు ఆచ్ఛాదన విధానముల చేతను బృహతీ ఛందస్సు చేతను రక్షించబడుచున్నావు. నీవు సోమాభిషవణ శిల మీద నలుగుచున్నావు. సాధారణులు నిన్ను సేవించలేకున్నారు.

    6. 'సూర్య' భర్త వద్దకు చేరినపుడు జ్ఞానము 'ఉపబర్హణము', చక్షువులు అభ్యంజనములు, ద్యులోక భూలోకములు కోశములు అయినవి.

    7. మానవులను ప్రశంసించు 'న్యోచివి' "రైభ్య" సూర్య వెంట పంపబడినారు. వారు 'గాథా' చేత పరిష్కృతభద్ర వస్త్రమును పట్టుకొని నడచినారు.

    8. అప్పుడు స్తుతులు 'ప్రతిధులు' ఛందములు స్త్రీలకు అలంకారప్రాయమగు కురులు, అశ్వినులు వరులు, అగ్ని ముందుగా నడచువాడు అయినాడు.

    9. మనసున పతిని ఆశించు సూర్యను సవిత ఇచ్చునపుడు సోముడు 'వధూయు' కాగా అశ్వినులు వరులు అయినారు.

    10. సూర్య పతిని చేరినపుడు మనసు రథమైనది. ద్యులోకము గృహమైనది. ఎద్దులు తెల్లనివైనవి.

    11. ఋక్సామాభ్యాభిహితములగు గోవులు సమానములగును, ద్యులోకమునందలి చరాచర మార్గములు శృతులచే కల్పించబడినవి అగుచున్నవి.

    12. సూర్యను సాగనంపునపుడు సూర్యచంద్రులు చక్రములు కాగా సూర్య తన మనసను రథమున ఎక్కినది.

    13. సవిత, తన కూతురు - సూర్య కొరకు కల్పించిన పదార్థములు, మఖానక్షత్రము ఎద్దులు ఫల్గుణి రథము అయినవి.

    14. అశ్వినులారా! మిమ్ము అడుగుచున్నాము :-

    సూర్య కొరకు మీరు త్రిచక్రవాహనము మీద వచ్చినారుకదా - ఆ ఒక్క చక్రము ఎక్కడ ఉండెను? మీ నియంత ఎచట చుండెను?

    15. శుభస్పతులగు అశ్వినులారా! మీరు సూర్యను వరించుటకు వచ్చినపుడు సమస్త దేవతలు గుర్తించినారు. కొడుకు తండ్రిని పోషకుడుగా వరించినాడు - "పుత్రః పితరమవృణీత పూషా"

    16. సూర్యా! నీ రెండు చక్రములను బ్రాహ్మణులు తెలియుచున్నారు. మరొక గూఢ చక్రమును విద్వాంసులు మాత్రమే తెలియుచున్నారు.

    17. భర్తృప్రదాతయు, బంధుసంపన్నుడగు ఆర్యమను అర్చించుచున్నాము. తొడిమ నుండి కాయను వలె కన్యను వేరుచేయుచున్నాము. కాని అత్తింటినుంచి కాదు.

    18. ఈమెను పితృవంశము నుంచి విడదీయుచున్నాను. భర్త వంశము నుండి కాదు. భర్తతో ఆమెను సంబద్ధను చేయుచున్నాను.

    ఇంద్రా! ఈమెను సుభగను, సుపుత్రను చేయుము.

    19. సుఖప్రదాత సవిత నిన్ను బంధించిన వరుణ బంధముల నుంచి నిన్ను విడిపించుచున్నాను. నీవు మధుర భాషిణివి. నీకు సత్యస్థానమందును సుకృత లోకమందును సుఖములు కలుగును గాక.

    20. భగదేవత నిన్ను చేయిపట్టి నడిపించును గాక. అశ్వినులు నిన్ను తమ రథము మీద కొనిపోవుదురు గాక. గృహములకు గృహపత్నివి అగుచు వెళ్లుము. గృహములను వశమున ఉంచుకొనుము. అచట నీ మాట చెల్లును గాక.

    21. ఇచట వారికి ప్రియములు కూర్చుము. పదార్థములను సమృద్ధములను చేయుము. నీ పతి దేహమును తాకుము. బ్రతికినన్నాళ్లు మంచిగా మాట్లాడుచుండుము.

    22. దంపతులు కలసి ఉండండి. విడిపోవద్దు. దీర్ఘాయువులు కండి. సుఖములు అనుభవించండి. పుత్ర పౌత్రులతో ఆడుచు పాడుచు ఉండండి. మీకు శుభములు కలుగును గాక.

    23. వీరిరువులు శిశువుల వలె క్రీడించుచు - కదలుచు - తమ ప్రభావమున పూర్వ, పశ్చిమ సముద్రములకు చేరుచున్నారు. వారిలో ఒకడు భువనములను వీక్షించుచున్నాడు. ఇతరుడు ఋతువులను ఏర్పరచుచున్నాడు. ఉభయులు కొత్తగా పుట్టుచున్నారు.

    24. చంద్రదేవా! కొత్త కొత్తగా పుట్టుచున్నావు. ఉషస్సులను ముందు పంపి రోజులు గడుపుచున్నావు. దేవతలకు భాగము, మానవులకు దీర్ఘాయువు కలిగించుచున్నావు.

    25. ఈ కృత్యకు కాళ్లు వచ్చి పతి యందు ప్రవేశించుచున్నది. కావున 'శాముల్య' మును - బ్రాహ్మణులకు ధనమును దానము చేయుము.

    26. ఈ వస్త్రము నీల లోహితము. ఇందు కృత్య ఆసక్తి కనిపించుచున్నది. ఇది వధువు పుట్టింటి వారిని వర్థిల్ల చేయుచు - భర్తను బంధములతో బంధించును.

    27. నీల లోహితమగు ఈ వధూ వస్త్రమును ధరించిన భర్త పాపమయ కృత్యము వలన తన దేహమును అశ్లీలము చేసికొనుచున్నాడు.

    28. సూర్యుని రూపములు మూడు - అశసన, విశసన వికర్తన. వానిని దర్శించండి. వానిని బ్రహ్మయే సుశోభితము చేయుచున్నాడు.

    29. ఈ వస్త్రము దాహము కలిగించునది. కటువైనది. ధరించువానికి విషప్రాయము. ఏ బ్రహ్మ సూర్యను తెలియుచున్నాడో అతడే వధూయ వస్త్రయోగ్యుడు.

    30. ఏది ప్రాయశ్చిత్తమగుచున్నదో, దేని వలన పత్ని మరణించకున్నదో అట్టి మంగళప్రద, సుఖప్రద వస్త్రమును బ్రహ్మ ధరించుచున్నాడు.

    31. మీరు ఉభయులు సత్య సంధర్భములందు సత్యము చెప్పండి. భాగ్యమును సముపార్జించండి.

    బ్రహ్మణస్పతీ! ఈమెకు వరుని సమకూర్చండి. అతని పలుకు తీయనిది అగును గాక. అతడు మంచిమాటలు మాట్లాడువాడు అగును గాక.

    32. మీరు ఇద్దరు ఇచట నిలువండి. ముందుకు సాగకండి. గోవులు, సంతానముచే వర్ధిల్లండి. విశ్వే దేవతలు మీ మనసులను - సోముని వంటి - కాంతిమంతములను చేయును గాక.

    33. ఈ గోవులు ప్రజలవి. ఇది దేవతల భాగపువి. వీనిలో భాగము పంచుట కూడదు. ఈమె కొరకు గాను నీకు పూష, సకల మరుత్తులు, ధాత, సవిత ప్రేరణ కలిగింతురు గాక.

    34. మా మిత్రులు సాగు మార్గములు సరళములు. నిష్కంటకములు అగును గాక. ధాత మీకు సౌభాగ్యములు కలిగించును గాక. సూర్యుడు వర్చస్సు కలిగించును గాక.

    35. అక్షములందున్న, సురయందున్న, గోవులందున్న వర్చస్సులను అశ్వినులు ఈమెకు కలిగింతురు గాక.

    36. దేని చేత జఘనములు మహానధ్న్యములైనవో, ఏ వర్చస్సు పాచికలందు, సురయందు చేరియున్నదో అట్టి వర్చస్సును అశ్వినులు ఈమెకు కలిగింతురు గాక.

    37. ప్రజ్వలితము కాకనే జలములందుండి శక్తివంతమగునది. బ్రాహ్మణుల అధ్వరములందు వ్యక్తమగు నట్టిది. ఇంద్రుని శక్తిని వర్ధిల్లచేయునది. మధుర జలమును ప్రసాదించును గాక.

    38. పట్టి శరీరమును బాధించు మురికిని వదిలించుచున్నాను. కళ్యాణప్రదము, కాంతిమంతమగు పదార్థములను స్వీకరించుచున్నాను.

    39. ఈమె కొరకు బ్రాహ్మణులు స్నాన జలము తెచ్చెదరు గాక. వీరులను బాధించని జలము ఈమెకు అందును గాక. పూషా! ఈమెకు ఆర్యమ వలన అగ్ని లభించును గాక. ఈమె కొరకు శ్వశరులు, దేవరులు ప్రతీక్షించుచున్నారు.

    40. నీకు సువర్ణము శుభప్రదమగును గాక. జలము శుభప్రదమగును గాక. క్రోధము కళ్యాణ కరమగును గాక. యుగము, శతపవిత్ర జలము శుభప్రదములు అగును గాక. పత్యా తన్వం సంస్పృశస్వ - పతి తనువును చక్కగ తాకుము.

    41. శతక్రతు ఇంద్రా! రథపు ఆకాశము - యానపు ఆకాశము - అపాలను మూడు మారులు శుద్ధిచేసి సూర్యుని వంటి త్వచను కలిగించినాను.

    42. సుమనస్సును, ప్రజను, సౌభాగ్యమును కోరుదానవై పతికి అనుకూలవై ప్రవర్తించుము. అతనికి అమృతత్వము కలిగించుము.

    43. వర్షము కలిగించు సంద్రము నదులకు సామ్రాట్టు అయినరీతి పతి ఇంట సామ్రాజ్ఞివై ఉండుము.

    44. మామలకు సామ్రాజ్ఞివగుము. బావలకు సామ్రాజ్ఞివగుము. మరదులకు సామ్రాజ్ఞివగుము. అత్తలకు సామ్రాజ్ఞివగుము.

    45. ఈ వస్త్రమును వడకిన, నేసిన, పరచిన, పూర్తి చేసిన దేవేరులు నీ వార్ధక్యము వరకు వెంట ఉండెదరు గాక. ఆయుష్మతివై ఈ వస్త్రమును ధరించుము.

    46. కన్యా రూప అధ్వరమును పురుషుడు సంతానార్థము తీసికొనిపోవునపుడు పుట్టింటివారు ఏడ్చుచున్నారు. వారు పితరులను తలచుకొని రోదించుచున్నారు. కావున వధువా! పుట్టింటివారిని, అత్తింటి వారిని కౌగిలించుకొనుము.

    47. భూదేవి వడిలో సుఖప్రదము, ధ్రువమగు ఈ రాతిని స్థాపించుచున్నారు. కాంతి, వర్చస్సు గల నీవు దాని మీద కూర్చుండుము. "దీర్ఘం త ఆయుః సవితా కృణోతు" సవిత నీకు దీర్ఘాయుష్యము కలిగించును గాక.

    48. అగ్ని భూమి కుడిచేతిని పట్టిన రీతి నీ పాణిని గ్రహించుచున్నాను. బాధపడకుము. ప్రజయో ధనేనసహ' నాకు తోడుగా ఉండుము.

    49. సవితాదేవత నీచేయి పట్టునుగాక. రాజా సోముడు నిన్ను సంతానవతిని చేయును గాక. అగ్ని సౌభాగ్యవతిని చేయును గాక. జాతవేది నిన్ను పతి వెంట వార్ధక్యము వరకు ఉంచును గాక.

    50. కన్యా! నేను నీ పతిని. నాకు సౌభాగ్యము కలుగునట్లును, నాతో వార్ధక్యము వరకు ఉండునట్లును నీ చేతిని అందుకొనుచున్నాను.

    భగో ఆర్యమా సవితా పురంధిర్మహ్యం త్వాదుర్గార్హ పత్యాయ దేవాః |

    భగ, ఆర్యమ, సవిత, లక్ష్మీ దేవతలు నిన్ను నాకుగార్హ పత్యము కొరకు అందించినారు.

    51. భగస్తేహస్తమగ్రహీత్ సవితా తే హస్తమగ్రహీత్ |

    నీవు నాకు ధర్మ పత్నివి. నేను నీకు గృహపతిని అగుచున్నాము.

    52. ఈమె నన్ను పోషించును గాక. నిన్ను బృహస్పతి నాకు ఇచ్చినాడు.

    "మయా పత్యా ప్రజాపతి సంజీవ శరదః శతమ్"


    53. శుభే! బృహస్పతి మరియు విద్వాంసుల ఆదేశానుసారము త్వష్ట సుఖప్రదమగు ఈ వస్త్రమును నేసినాడు. సవిత, భగులు, సూర్యా సమమగు ఈ వస్త్రమును, నీవు సంతానవతివి అగుటకు ఇచ్చెదరు గాక.

    54.    ఇంద్రాగ్నీ ద్యావాపృథివీ మాతరిశ్వా మిత్రావరుణా భగో ఆశినోభా |
        బృహస్పతిర్మరుతో బ్రహ్మ సోమ ఇమాం నారీం ప్రజయా వర్ధయన్తు ||


    55. అశ్వినులారా! బృహస్పతి దేవతలందు ప్రథముడు. అతడు సూర్య కేశములను అలంకరించినాడు. ఈమెను పతికి శోభ కలిగించుటకని ఇచ్చుచున్నాము.

    56. ఈమె యోష వేషమున సుందరి. ఈమె నా పత్ని. నన్నే మనసున పెట్టుకున్నదని నాకు తెలియును. నవగతుల ఈమె సఖులకు అనుకూలముగ నేను ప్రవర్తింతును. ఏ విద్వాంసుడు ఈమె కేశములను ఇంత అందముగ అలంకరించినాడు?

    57. నేను ఆమెను నాయందు చూచుచున్నాను. ఆమె తన మనోజలాశయమున నన్ను చూచుచున్నది. ఆమెను దొంగచాటుగా అనుభవించను. మనసుపెట్టి ఆమె ముడి విప్పుదును.

    58. దేవీ! నేను నీకు సుఖము కలిగించువాడను. సవిత నిన్ను వరుణ పాశములచే బంధించినాడు. వానిని నేను విప్పుచున్నాను. విడిపించుచున్నాను. నీవు నా పత్నివి. నీ సహితుడనై ఈ విశాల లోకపు మార్గములను సుఖకరము చేయుచున్నాను.

    59. విద్వాంసుడగు ధాత ఈమెకు పతిని అందించినాడు. భగరాజు ఈమె ముందుకు వచ్చును గాక. వారు జలముల నిచ్చి, రాక్షసులను వధించి, ఈమెకు పున్నెములు కలిగింతురు గాక.

    60. భగుడు నాలుగు పాదములను, నాలుగు 'ఉష్పలము'లను చేసినాడు. త్వష్ట మధ్యన 'వర్ద్ర' ను చేసినాడు. "సానో అస్తు సుమఙ్గలీ"

    61. విశ్వరూపము, హిరణ్య వర్ణము, సువృతము, సుచక్రమగు సుకింశుకమును ధరించుము. సూర్యా! అమృత లోకమును అధిరోహించుము. "స్యోనం పతిభ్యో వహతుం కృణు త్వం" పతి పక్షము వారికి సుఖములు కలిగించుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.