Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    7. సమస్తము అతనినే చేరుచున్నవి. అతడు ఒక్కడే ఏకవృతుడు. అతడు ఒకడే.

    8. సర్వ అస్మిన్ దేవా ఏకవృతో భవన్తి. ఇతని యందు సమస్త దేవతలు ఏకవృతులు అగుచున్నారు.


                               మూడవ పర్యాయ సూక్తము - 6

    1- 3. ఏకవృత దేవతను ఎరింగినవాడు బ్రహ్మ, తపము, కీర్తి, యశస్సు, జలము, నభము, బ్రహ్మ వర్చస్సు, అన్నము, అన్నాద్యము, భూతము, భవ్యము, శ్రద్ధ, రుచి, స్వర్గము, స్వధ కలుగుచున్నారు.

    4 - 6. అతడే మృత్యువు, అమృతము, అభ్వ, రాక్షసులు, రుద్రుడు, వసువినుడు, వసుదేయుడు, నమోవాకము, వషట్కారము. సమస్త పీడాకారకములు అతని ఆధీనమందున్నవి.

    7. అతని యందు సకల నక్షత్రయుత చంద్రుడు ఉన్నాడు.


                             నాలుగవ పర్యాయ సూక్తము - 7


    1. అతడు దినము నుండి పుట్టినాడు. దినము అతని నుండి పుట్టినది.

    2. అతడు రాత్రినుండి - రాత్రి అతని నుండి పుట్టినారు.

    3. అతడు అంతరిక్షము నుండి - అంతరిక్షము అతని నుండి వ్యక్తములైనారు.

    4. అతడు వాయువు నుండి - వాయువు అతని నుండి పుట్టినవి.

    5. అతడు ద్యు నుండి - ద్యు అతని నుండి "అజాయంత"

    6. అతడు దిశల నుండి - దిశలు అతని నుండి "అజాయంత"

    7. అతడు భూమి నుండి - భూమి నుండి అతడు "అజాయంత"

    8. అతడు అగ్ని నుండి - అగ్ని అతని నుండి "అజాయంత"

    9. అతడు జలముల నుండి - జలములు అతని నుండి "అజాయన్త"

    10. అతడు ఋక్కుల నుండి - ఋక్కులు అతని నుండి "అజాయన్త"

    11. అతడు యజ్ఞము నుండి - యజ్ఞము అతని నుండి పుట్టినవి.

    12. అతడు యజ్ఞము, యజ్ఞము అతనిది. అతడు యజ్ఞశిరము అగుచున్నాడు.

    13. అతడు ఉరుముచున్నాడు. అతడు మెరయుచున్నాడు. అతడే వడగళ్లు విసరుచున్నాడు.

    14. పాపికి - భద్రమునకు - పురుషునకు - అసురునకు    

    15. ఔషధములు శుభంకరములై వర్షించుచున్నవి, వర్ధిల్లుచున్నవి.

    16. మఘవా! నీ మహిమ గొప్పది. వందల రూపములు నీ వద్దనే ఉన్నవి.

    17. నీవు అనంతుడవు. కావున నీ వద్దనే ఉన్నావు. వందల బద్ధులను బంధించుచున్నావు.


                                   అయిదవ పర్యాయ సూక్తము - 8


    1. ఇంద్రా! నీవు నమురునకున్న శ్రేష్ఠుడవు. మృత్యువుల కన్న శ్రేష్ఠుడవు.

    2. శచీపతి దాన ప్రతిబంధకమును మించిన వాడు. నీవు విభువవు. ప్రభువవు. నిన్ను ఉపాసించుచున్నాము.

    3, 4. నీకు నమస్కరించుచున్నాము. అన్నాద్యము, యశస్సు, తేజస్సు, బ్రహ్మవర్చస్సుచే మమ్ము చూడుము. చూడుము. చూడకుండకుము.

    5. జలము, అమము, మహము, సహము అని నిన్ను ఉపాసించుచున్నాము.

    6. అంభము, అరుణము, రజతము, రజము సహము అని నిన్ను ఉపాసించుచున్నాము. మాకు వానిని కలిగించుము.


                                    ఆరవ పర్యాయ సూక్తము - 9


    1. ఉరు, పృథు, సుభు, భువమని నిన్ను ఉపాసించుచున్నాను. మమ్ము చూడుము. చూడుము. చూడకుండకుము.

    2.     ప్రధో వరో వ్యచో లోకఇతి త్వోపాస్మహే వయం |
        నమస్తే అస్తు పశ్యత పశ్య మాపశ్యత ||

    3.    భవత్ వసుః ఇదత్ వసుః సంయత్ వసుః |
        ఆయత్ వసుః ఇతి త్వా ఉపాస్మహేవయం ||

    4.    నమస్తే అస్తు పశ్యత పశ్య మా పశ్యత.

    5.     అన్నాద్యేన యశసా తేజసా బ్రాహ్మణ వర్చసేన.



             దాశరథి రంగాచార్య రచించిన
    శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత యందలి
            పదమూడవ కాండ సమాప్తము.



             యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
              నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||

                        పదునాలుగవ కాండము

                          మొదటి అనువాకము

                    మొదటి సూక్తము - 1

        సత్యేనోత్తభితా భూమిః సూర్యేణోత్తభితా ద్యౌః |
        ఋతేనాదిత్యప్తి ష్ఠన్తి దివి సోమో అధి శ్రితః ||


    సత్యము వలన భూమి నిలిచి ఉన్నది. సూర్యుని వలన ద్యులోకము నిలిచి ఉన్నది. ఋతము వలన ఆదిత్యులు నిలిచి ఉన్నారు. దివి సోమమును ఆశ్రయించి ఉన్నది.

    వినియోగము :-

    ఇది వివాహ సంబంధ కాండము. ఇందు ముందు చెప్పబడు కర్మలు జరుగును. ఇందు మంత్రముల వినియోగము సూత్రకారుడు ప్రయోగాను కూలముగనే చేసినాడు.

    కౌశికుడు వీనిని తన దశమాధ్యాయమున విస్తారముగ వర్ణించినాడు. కావున అందుకు అచట చూచునది.

    ఇచట కర్మక్రమమున మంత్రసమాన దిగ్దర్శనము చేయించ బడినది.

    సూక్తపు ఆరంభమున సవితా పుత్రి 'సూర్య' వివాహపు కథ చెప్పబడినది.

    ఇది కార్యక్రమ ప్రకారము. వివాహము కన్య తండ్రి ఇంట జరుగును. I/ 1-16, 23, 24 ఋక్కులచే ఆజ్య హోమము చేయునది. I/31 చే శాస్త్రోక్త పులగమును కన్యకు తినిపించునది. చేత 'శరావ సంపుటము' పట్టించి ఒక పురుషుని వరుని వద్దకు పంపునది. కుమారీ రక్షణార్థము 'పాల ప్రేషణమ్' I/39 చే నీరు తీసికొని పోవు వానికి నీటి కుండను ఇచ్చునది. I/17 చే ఆ కుండను శాఖకు కట్టునది. ఈ జలముచే సర్వోదకకార్య కరణము జరుగును. I/58చే కన్య వెంట్రుకలు దువ్వునది. II/65 చే వేడినీటి స్నానము చేయించునది. I/35-43 లచే చల్ల నీళ్లు చల్లునది. II/66,67చే కన్యను బట్టతో తడిచి ఆమెను కన్యాపాలకునకు ఇచ్చునది. I/45,53లచే బట్టను తుంబుర దండమున తీసి గోపాటమున వేయునది. కొత్తబట్టను కుమారికి కప్పునది. II/68చే యజ్ఞోపవీత మంతటి వాధూయ వస్త్రమును కట్టునది. కేశాలంకరణ చేయునది. I/42- II/70లచే యోక్త్రను గదిలో కట్టునది. I/20 చే జ్యేష్ఠమధుమణిని ఎర్రదారముచే అనామికకు కట్టునది. - కన్యాదానము తరువాత ఉపాధ్యాయుడు కన్యను చేతితో పట్టుకొని 'కౌతుక గృహము'నకు తీసికొని పోవునది. "శాఖాయాం యుగం ధారయతి" I/40,41చే పురుషుడు దానిని ధరించునది. కన్యలలాటమున సువర్ణము కట్టునది. I/47 దాని యుగచ్చద్రమున నీరు పోయినది. కన్యను రాతి మీదకు ఎక్కించునది. II/63చే లాజ హోమము I/48-52 చే పాణిగ్రహణము. I/39 వరుడు కన్యను మూడుసార్లు అగ్ని ప్రదిక్షణ చేయించునది. II/31, I/60చే ఏడుగీతలు గీయించి కన్యను దాటించుట - శయ్య మీద కూర్చుండపెట్టుట. I/57,58 చే కూర్చున్న కన్య పాదములను ఆమె మిత్రులు కడిగి 'కటి యోక్త్రము'ను విప్పునది. II/53,58చే ఆ త్రాటిని భృత్యులు లాగునది. గెలిచినవాడు బలవంతుడు అనబడును. అన్ని ఓషధులు గల పలాశ పత్రమును వధువు వరుని తలమీద పెట్టునది. I/59,66,62చే కన్యను శయ్యమీది నుంచి లేపునది. "ఇతి వివాహః"

    ఇప్పుడు ఉద్వాహ కృత్యములు వర్ణించబడుచున్నవి. ఇది వరుని ఇంటికి వధువును చేర్చుట. I/61, II/30 లచే వధూవరులను 'యానము' ను ఎక్కించునది. II/8, I/64 చే కర్తముందుగ నడచునది. II/11, I/34 చే కుడికాలు పెట్టి దారిన నడువవలెను. అదేరోజు మరొక ఉద్వాహము జరుగుచో వధూవస్త్రపు దశ ఖండమును చతుష్పథమున వేసి, దాని మీద కుడికాలు పెట్టి నిలుచునది. ఉభయుల క్షేమము కోరి II/64ను జరిపించునది. I/47 చే బ్రాహ్మణుని వదులునది. వాహనము సాగునది. మార్గమున తీర్థము వచ్చిన II/46చే మట్టిగడ్డను వేసి సాగునది. అది దానికి ప్రాయశ్చిత్త మగుచున్నది. II/9ని మహా వృక్షములు కనిపించినంత II/7 జపించునది. ఓషధి, నది, క్షేత్రము, వనము కనిపించినంత దానినే జపించునది. శ్మశానము కనిపించినంత II/73 జపించునది. వధువు మార్గమున నిద్రించిన II/75చే మేల్కొల్పునది. వరుని తండ్రి ఇల్లు సమీపించినంత II/12 జపించునది. వాహనము ఇల్లు చేరినంత II/16చే నీళ్లు చల్లి ఎద్దులను విప్పునది. నిరృతిని దూరము చేయుటకు II/19 చే పత్నీశాలను ప్రోక్షించునది. I/47చే ఇంటి కుడిమూలన పేడ ముద్ద మీద రాయి పెట్టునది. I/47చే మూడు మోదుగాకుల కాడలోని నడిమి ఆకును పెట్టునది. దానిమీద ఘృతము - ఘృతము మీద దూర్వాగ్రములుంచి దాని మీద వధువును కూర్చుండ పెట్టునది. II/26-1/21, 63,64లచే వధువును నడిపించి వరుని ఇంట ప్రవేశ పెట్టునది. పూర్ణ కుంభము ఫలములు అక్షతలున్న ఘటమును వధువు వెంట చేర్చునది. II/17,18చే అగ్నిని ప్రజ్వలింపచేసి వరుడు వధువు చేయి పట్టుకొని వధువును 'పరిణయనము' చేయించునది. II/20,46 లచే అగ్ని, సరస్వతి, సూర్య, మిత్రావరుణులకు నమస్కరించి పత్రిని అనుమంత్రణము చేయునది. II/21 చే రోహిత చర్మమును తెచ్చునది. II/23 చే చర్మమును పరచి దాని మీద 'బల్బజమ్' పరచి, దానిమీద వధువును కూర్చుండబెట్టునది. II/23చే వధువును దక్షిణోత్తరము వైపు కూర్చుండబెట్టి శుభనామముగల బ్రాహ్మణ బాలుని ఆమె వడిలో కూర్చుండబెట్టునది. II/25చే బాలునకు ఫలములు, మధురము ఇచ్చి లేపునది. II/1-5, 45 వధూవరులు, వరుస క్రమమున ఆహుతులు ఇచ్చునది. II/45 చే సంపాతములు తెచ్చునది. II/45 చే సంపాతములు తెచ్చునది. జలపూర్ణ పాత్రయందు ఉత్తర సంపాతములు తెచ్చునది. వరుడు ఆ జలపూర్ణ పాత్రను వధువు దోసిలి యందుంచునది. 'తేన భూతేన' మును సంపాదించి వానిని స్థాలీపాకమును యజమాని దగ్గరకు చేర్చునది. యజమాని తన కుటుంబసహితముగా మధురాన్నములను భక్షించునది. ఈ సూక్తము చేతనే నేయి కలిపిన యవల పూర్ణాహుతి చేయునది. ఇత్యుద్వాహః

    అథ చతుర్థికాకర్మ. 5 కాం. 1 సూ. 6 ఋక్కుచే వరుడు వివాహాగ్ని యందు ధాన్యమును హోమించునది. 6-37వ సూక్తముచే వధూవరులు పరస్పరము కాటుక పెట్టుకొనునది. 7-6-2వ ఋక్కుచే ఆచార్యుడు వధూవరులచే మంచమును ముట్టించునది. II/31 చే మంచము ఎక్కించునది. II/23 చే వధువును మంచము మీద కూర్చుండబెట్టునది. II/32చే వధూవరులను చక్కగా కూర్చుండుమనునది. 7 కాం. 38 వ సూక్తముచే వధూవరులను బట్టచే కప్పునది. II/37 చే వారిని అభిముఖులను చేయునది. II/64 చే వధువునకు మూడు మారులు ప్రేరణ కలిగించునది. II/71,72 లచే మధుఘమణిని నూరి ఔక్షమున వేసి వధూవరులు సంగమించునది. 45వ కాం. 1 వ మంత్రముచే వరుడు అంగుష్ఠముచే ప్రజనన ప్రదేశమును తాకునది. II/43చే వరుడు వధువును మంచము మీది నుంచి లేపునది. I/45, 53, 55చే ఆచార్యుడు చిరగని వస్త్రముచే వధూవరులను ఆచ్ఛాదించునది. I/55, 56చే వధువు సీమంతమున శష్పమును ఉంచునది. మంత్ర రహితముగనే వధువు సీమంతమున ధాన్యము, యవలను ఉంచునది. కుశల కట్టచే సీమంతమును తాకునది. జనుప ముక్కచే వధువు వెంట్రుకలను కట్టునది. 'సర్వేణ కాణ్డేన ఆజ్యం జుహోతి వరః' ఇది ప్రాయశ్చిత్తము. I/32చే శుల్క ద్రవ్యమును వేరుచేసి ఇది నీది, ఇది నాది, అనునది. I/25-30లచే వధువునకు వస్త్రము లిచ్చుచు వరుడి అనుమంత్రణము చేయునది. II/41,42చే ఆచార్యుడు వానిని తీసికొనునది. II/48చే వానిని స్థాణువు మీద పెట్టునది. II/49 చే వానిని తీసికొని పోవునది. II/50చే వానిచే వృక్షమును కప్పునది. II/45చే అందరు స్నానము చేయునది. II/51 చే వాధూయ వస్త్రమును ఆచార్యుడు తాను కప్పుకొనునది. II/42 జపించుచు ఆచార్యుడు స్వగృహమునకు సాగునది. కన్యను తీసికొని పోవునపుడు పితృగృహమున రోదనలు జరిగినచో I/46, II/59-62 ఋక్కులచే ఘృతాహుతులిచ్చునది. తత్ ప్రాయశ్చిత్తం.
           
                                                  ఇతి చతుర్థికా కర్మ. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.