Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda



    46. ధేనువు వంటి ఉష ఉదయించునపుడు జనులు అగ్నిని సమిధలతో ప్రజ్వలింపచేయుదురు. అప్పుడు అతని కిరణములు పైపైకి ఎగిసి స్వర్గమున ప్రవేశించుచున్నవి.


                                      మూడవ అనువాకము

                                       మొదటి సూక్తము - 3

    వినియోగము :-


    ఇది రోహిత దేవతాకము. రోహితుడు ఉదయించు సూర్యుడు లేక సూర్యుని ప్రధానాశ్వము కావచ్చును :- వీరి వాస్తవ రూపము 13 - 19 మంత్రము లందు చూడనగును.

    సంప్రదాయికులు దీని వినియోగమును ఇట్లు వచించుచున్నారు :-

    అభిచారిక కర్మమున ఈ అనువాక విధానమును అనుసరించి శత్రువు కాళ్లను తెగవేయునది. ఆ కర్మముననే 'రక్తశాలిక్షీరౌదనము'ను సంపాతిత, అభిమంత్రితముల చేసి శత్రువునకు ఇచ్చునది. ఈ కర్మమునే ఈ అనువాకముచే పచ్చి కుండ మీద శత్రువు చేతులు కడిగించునది. ఈ కర్మమునే ఈ అనువాకముచే పచ్చి కుండ మీద శత్రువు చేతులు కడిగించునది. ఈ కర్మమునందే దీనిచే వృషభమును సంపాతితము చేసి శత్రువు మీదకు వదలునది. శత్రువు మట్టి బొమ్మను చేసి దీనిచే అగ్ని స్థాణువున కట్టి దాని తల మీదకు సంపాతములను తెచ్చునది. 6వ మంత్రముచే జలవ్రజ ప్రహారము చేయునది. 7వ మంత్రముచే జలమును అభిమంత్రించి, శత్రువును తలచుకొని ఆచమనము చేయునది.

    1. ఎవడు ఈ ద్యావాపృథ్వులను కల్పించినాడో, ఎవడు 'ద్రాపింకృత్వా' లోకములను ఆచ్చాదించినాడో, ఎవని యందు సూర్యుడు ప్రదీప్తము చేయు దిశలు చేరి ఉన్నవో

    తస్య దేవస్య కృద్ధస్యైతదాగో యఏవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి |
    ఉద్ వేపయం రోహిత ప్రక్షిణీహి బ్రహ్మజ్యస్య ప్రతి ముంచ పాశాన్ ||

    అట్టి క్రోధభరిత దేవతకు అపరాధము చేయువానిని విద్వాంసుడగు బ్రాహ్మణుని కొట్టిన వానిని రోహితా! అట్టి బ్రహ్మజ్యాని గడగడలాడించుము. క్షయము కలిగించుము. వానికి పాశములు వేయుము.

    2. ఎవని వలన ఋతువులను అనుసరించి గాలి వీచుచున్నదో, ఎవని వలన నదులు పవహించుచున్నవో "తస్యదేవస్య............"

    4. ఎవడు చంపుచున్నాడో, ఎవడు జీవింపచేయుచున్నాడో, ఎవడు సమస్త భువనములను బ్రతికించుచున్నాడో

    "తస్యదేవస్య.........."

    5. ఎవని యందు విరాట్ పరమేష్ఠి, ప్రజాపతి, అగ్ని, వైశ్వానరుడు వరుసగా నిలిచి ఉన్నారో, ఎవడు పరమ ప్రాణమును, పరమ తేజమును దాల్చినాడో

    "తస్యదేవస్య.........."

    6. ఎవని యందు ఆరు ఉర్వులు, ఐదుదిశలు, నాలుగు జలములు, యజ్ఞపు మూడు అక్షరములు ఉన్నవో, ఎవడు క్రోధభరితుడై ద్యావాపృథ్వుల మధ్య నేత్రమై ఉన్నాడో

    "తస్యదేవస్య.........."

    7. ఎవడు అన్నమును పాలించుచున్నాడో, అన్నభక్షకుడు అగుచున్నాడో, ఎవడు బ్రహ్మణస్పతియు, భూతభవిష్య భువనములకు ప్రభువో

    "తస్యదేవస్య.........."

    8. ఎవడు ముప్పది రాత్రింబవళ్ల సముదాయమును ఏర్పరిచినాడో, ఎవడు పదమూడవ, అధిక మాసమును కల్పించినాడో

    "తస్యదేవస్య.........."

    9. ఎవని కిరణములు జలములను పీల్చి ద్యులోకమునకు చేరి మరల నీటితో తిరిగి వచ్చుచున్నవో -

    "తస్యదేవస్య.........."

    10. కశ్యపా! ఏది నీ యొక్క రోచమాన, ఆహ్లాద సంహిత పుష్కల చిత్ర భానువై యున్నదో. ఎందు సప్త సూర్యులు సమర్పితులో

    "తస్యదేవస్య.........."

    11. దేనిని 'బృహద్' అనుకూలమై ఆచ్చాదించుచున్నదో, 'రథంతరము' వెనుక నుండి గ్రహించుచున్నదో, ఈ రెండు ప్రమాద రహితములైన జ్యోతులతో ఆచ్చాదించబడు చున్నవో

    "తస్యదేవస్య.........."

    12. దేవతలు రోహితుని ఆవిర్భవింప చేసినపుడు 'బృహద్' రథంతరములు అతనికి రెండు పక్షములు అయినవి. అవి సబల సధ్రీచులు అయినవి.

    "తస్యదేవస్య.........."

    13. అతడు వరుణుడై సాయంకాల అగ్ని అగుచున్నాడు.అతడే ఉదయమున ఉదయించి మిత్రుడు అగుచున్నాడు. అతడు సవితయై అంతరిక్షమధ్యమున, ఇంద్రుడై స్వర్గమధ్యమున ఉన్నాడు.

    "తస్యదేవస్య.........."

    14. స్వర్గమునకు సాగు గమనశీల, పాపనాశక సూర్యుని ఉభయ పక్షములు వేల రోజులు వరకును నియంత్రితమై ఉన్నవి. ఇతడు దేవతలను తనలో లీనము చేసికొని, సమస్త ప్రాణులను వీక్షించుచు సాగుచున్నాడు.

    "తస్యదేవస్య.........."

    15. ఈ సమస్త భువనములను వెలువరించిన వాడు జల మధ్యమున ఉన్నాడు. ఇతడు "సహస్రమూలః పురుశాకో అత్రిః" అగుచున్నాడు.

    "తస్యదేవస్య.........."

    16. దివియందు వర్చస్సుచే భ్రాజమానుడగు వానికి ధవళ కిరణములు రసమును చేర్చుచున్నవి. ఆ కిరణములు పైన ఉన్న దేవత దేహమును తపింప చేయుచున్నవి. సువర్ణవర్ణలై క్రింద వెలుగు కలిగించుచున్నవి.

    "తస్యదేవస్య.........."

    17. ఎవని వలన ఆదిత్యుని అశ్వములు వహించుచున్నవో - విద్వాంసులు యజ్ఞములు చేయుచున్నారో - "యదేకం జ్యోతిర్భహుధా విభాతి" ఏ ఒకే జ్యోతి బహుధా ప్రకాశించుచున్నదో

    "తస్యదేవస్య.........."

    18. ఏకచక్రపు రథము. దానిని ఏడు అశ్వములు లాగు చున్నవి. దానికి ఏడుగురు నమస్కరించుచున్నారు. త్రినాభిచక్రము అజరము, అనర్వము అగుచున్నది. వీనియందే సమస్త భువనములు నిలిచి ఉన్నవి.

    "తస్యదేవస్య.........."

    19. అగ్ని అష్ట విధములుగా వహించుచున్నాడు. అతడు ఉగ్రుడు. దేవతల పిత, విద్వాంసుల మాత అగుచున్నాడు. మాతరిశ్వ ఋతపు తంతువులు మనసున ధరించి సమస్త దిశలను పావనము చేయుచున్నాడు.

    "తస్యదేవస్య.........."

    20. గాయత్రిలోన, అమృతగర్భమున, దిశలందు పూజనీయమగు జలతంతు

    "తస్యదేవస్య.........."

    21. అగ్నిదేవా! నీ యొక్క మూడు అవతారములను, మూడు మార్గములను, మూడు కాంతులను, మూడు దేవాంగములను, మూడు రీతులను, మూడు స్వర్గములను తెలియుచున్నాము.

    "తస్యదేవస్య.........."

    22. ఎవడు తాను అవిర్భవించి పృథివియందు వ్యాపించినాడో, ఎవడు సాగర జలమును అంతరిక్షమునకు చేర్చినాడో

    "తస్యదేవస్య.........."

    23. అగ్నీ! నీవు క్రతువులందున్నావు. కిరణములందున్నావు. సమిద్ధుడవై ఆకసమున వెలుగుచున్నావు. రోహితుని ఆవిర్భవింప చేసిన దేవతలు, పృశ్నిమాతృకలగు మరుత్తులు నిన్ను అర్చించినారా?

    "తస్యదేవస్య.........."

    24. ఎవడు ప్రాణాదాతయో, బలదాతయో, ఎవనిని విశ్వములు ఉపాశించుచున్నవో, దేవతలు అర్చించుచున్నారో ఎవడు ద్విపాద, చతుష్పాద ప్రాణులకు ప్రభువు అగుచున్నాడో

    "తస్యదేవస్య.........."

    25. ఏక పాదులు ద్విపాదులందు, ద్విపాదులు త్రిపాదులందు, ద్విపాదులు షట్పాదులందు చేరుచున్నారు. వారందరు ఏకపాద బ్రహ్మచే ఉపాసించుచున్నారు.

    "తస్యదేవస్య.........."

    26. కృష్ణ పుత్రుడగు అర్జునుడు రాత్రికి వత్సయై అవతరించినాడు. అతడు ఆకసమున ఎదుగుచున్నాడు. రోహితుడు ఉన్నత స్థానముల ఆరోహించుచున్నాడు.


                                   నాలుగవ అనువాకము

                                 మొదటి పర్యాయ సూక్తము - 4


    ఇది రోహిత దేవతాకము. స్వర్గకామి దీనిని జపించునది.

    1. ఇతడు సవిత. స్వర్గమున వెలుగుచున్నాడు. అదిగో అతడు వచ్చుచున్నాడు.

    2. ఇతడు కిరణములచే ఆకసమును కమ్మినాడు. ఇతని కిరణములు ఈశ్వర సంపన్నములు.

    3. అతడు ధాత. అతడు విధర్త. అతడు వాయువు. అతడు ఆకాశము.

    4. సోర్యమా సవరుణః సరుద్రః సమహాదేవః

    5. సో అగ్నిః స ఉసూర్య స ఉఏవ మహా యమః


    6. అతనిని ఒక తల గల, పది తలలు గల ప్రజ ఉపాసించుచున్నారు.

    7. కిరణములు అతనిని వెనుకనుండి చుట్టుకొనును. ఉదయించినపుడు ప్రకాశించును.

    8. మరుత్తులు అతని 'శిక్యాకృతు' లు. వారు వచ్చుచున్నారు.

    9. ఇతడు మహేంద్రావృత కిరణములచే ఆకాశమున వ్యాపించుచున్నాడు.

    10. అతనివి తొమ్మిది కోశములు. విష్టంభములు తొమ్మిది విధములు.

    11. అతడు సమస్త స్థావర జంగములను చూచుచున్నాడు. సాక్షియై ఉన్నాడు.

    12. సమస్తము అతనినే చేరుచున్నవి. అతడు ఒక్కడే ఏకవృతుడు. ఒక్కడే అతడు.


                                  రెండవ పర్యాయ సూక్తము - 5

    1. అతడే కీర్తి, యశస్సు, జలము, ఆకాశము, బ్రహ్మ తేజము, అన్నము, అన్నము ఉడుకుట యగుచున్నాడు.

    2. ఏకవృత దేవతను తెలిసిన వాడు.

    3. రెండవ వాడు, మూడవ వాడు, నాల్గవ వాడు అనబడుట లేదు.

    4. ఐదవవాడు, ఆరవవాడు, ఏడవవాడు అనబడుట లేదు.

    5. నఅష్టమః న నవమః దశమః న అపి ఉచ్యతే ||


    6. అతడు సమస్త స్థావర జంగమములను దర్శించుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.