Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
56. ఆవును తన్నినవానిని, సూర్య ముఖుడై మూత్రించు వారిని మూలముతో పెకిలించుచున్నాను. వాని మీద నా నీడ పడనీయును.
57. నా నీడను దాటువానిని, నాకు అగ్నికి మధ్య నుంచి పోవు వానిని నిర్మూలించుచున్నాను. వాని మీద నా నీడ పడనీయను.
58. సూర్యదేవా! మన ఉభయుల నడుమ వచ్చువానికి దుస్వప్న పాపము, దుష్కర్మము కలిగించుచున్నాను.
59. ఇంద్రా! మేము సోమ, యజ్ఞ మార్గముల నుండి తప్పకుందుముగాక. శత్రువులు మా స్థానములందు చొరకుందురుగాక.
60. ఏ యజ్ఞపు ప్రసాధన తంతు దేవతల వద్ద ఉన్నదో, అట్టి యజ్ఞము మాకు లభించునుగాక.
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 2
వినియోగము : ఇది సవితా దేవతాకము. యాజ్ఞికులు దీని వినియోగమును ఇట్లు చెప్పుచున్నారు.
మొదటి కాండపు 5వ సూక్తము చూచునది.
ఉపనయనమున బాలకుని ఆయువు కొరకు ఈ అనువాకముచే త్రికాలములందు సూర్యుని ఉపస్థానము చేయునది.
చాతుర్మాస్యపు సాకమేధ కర్మమున పిత్ర్యష్టి అయిన తరువాత జరుగు ఆదిత్యోపస్థానమున దీని వినియోగము.
1. ఆదిత్యుడు మహిమాన్వితుడు. సేచకుడు. కర్మసాక్షి. అతని నిర్మల కిరణములు ఆకసమున ప్రకాశించుచున్నవి. అవి అతనిని పైకి ఎక్కించును.
2. సూర్యుడు దిశల ప్రజ్ఞాని. కిరణముల స్వరవంతుడు. సుపక్షుడు. అతని కిరణములు సముద్రమున పడుచున్నవి. అతడు సకల దిశలను ప్రకాశింపచేయువాడు. భువన రక్షకుడు. అట్టి సూర్యుని స్తుతించుచున్నాము.
3. స్వధ చేత ప్రాక్, పశ్చిమములకు వడివడిగా సాగుచున్నావు. నీ మహిమచే రాత్రింబవళ్లను నానా రూపలను చేయుచున్నావు. ఆదిత్యా! అది నీ మహత్తు. నీ మహా యశస్సు. అట్టి వాడవు నీవు ఒక్కడవే. మరొకడు పుట్టలేదు.
4. ఆదిత్యుడు విపశ్చితుడు తరుణుడు. భ్రాజమానుడు. అశ్వములచే వహించబడువాడు. సప్తాగ్ని. అతడు సముద్రము నుండి ఆకాశమునకు ఆరోహించుచున్నాడు. 'ఆజి' లోనికి పయనించు ఆదిత్యుని మేము దర్శించుచున్నాము.
5. సూర్యదేవా! నీవు 'ఆజి' లోనికి వెళ్లునపుడు ఆటంకములు లేకుండునుగాక. దుర్గమ ప్రదేశములను దాటిసాగుము. నీవు దివిని, దేవియగు పృథ్విని రాత్రింబవళ్లచే కొలత వేయుచు సాగుచున్నావు.
6. సూర్యదేవా! నీవును, నీరథమును సముద్రపు అంతములను చూచుచు సాగుచున్నారు. మీ ఉభయులకు స్వస్తి. నిన్ను వహించు బలిష్ఠములగు వంద అశ్వములకు సప్తాగ్నులకు స్వస్తి.
7. సూర్యదేవా! నీ రథము సుఖకరము. అంశుమంతము. శుభంకరము. సువహ్ని. వేగవంతము. దానిని నీవు అధిష్ఠించుము. నిన్ను బలిష్ఠములగు వంద అశ్వములు లేక సప్తవహ్నులు లాగుచున్నవి.
8. సూర్యుడు తన రథమునకు హిరణ్య వర్ణలగు సప్తాశ్వములను కట్టుచున్నాడు. అట్లు పయనించి చీకట్లను తరిమి, అశ్వములను వదలి, స్వర్గమున ప్రవేశించుచున్నాడు.
9. ఎగురుచున్న మహాకేతనము గల సూర్యదేవుడు విచ్చేయుచున్నాడు. అతడు చీకట్లను తరుము చున్నాడు. వెలుగులను పరచుచున్నాడు.
సూర్యుడు దివ్యుడు. సుపర్ణుడు. వీరుడు. అదితి పుత్రుడు. అతడు సమస్త లోకములందు ప్రసిద్ధుడు.
10. సూర్యదేవా! నీవు కిరణముల సహితముగ ఉదయించుచున్నావు. అన్ని రూపముల ప్రాణులను పోషించుచున్నావు. నీవు ఉభయ సముద్రములను సమస్త లోకములను ప్రకాశింపచేయుచున్నావు.
11. ఈ రెండును బాలల వలె క్రీడించుచు ప్రాక్, పశ్చిమ సముద్రములకు చేరుచున్నారు. వారిలో ఒకడు సమస్త లోకములను వెలిగించుచున్నాడు. ఒకదానిని బంగారు రంగు గుర్రములు లాగుచున్నవి.
12. సూర్యదేవా! మాసములు కల్పించుమని అత్రి నిన్ను ఆకసమున నిలిపినది. అట్టి నీవు అచట ఉండి తపించుచు వచ్చుచున్నావు. సమస్త ప్రాణులను ప్రకాశింపచేయుచున్నావు.
13. బిడ్డ తలిదండ్రులను చేరినట్లు వారిద్దరు సముద్రాంతములకు చేరుచున్నారు. దేవతలు ఇతనినే సనాతన బ్రహ్మముగా భావించుచున్నారు.
14. సూర్యుడు ఏ మార్గమున సముద్రమునకు సాగుచున్నాడో దానిని వెలుగులతో నింపుచున్నాడు. ఇతని పూర్వాపర మార్గములు ఎంతో విస్తారములు.
15. నీవు అట్టి మార్గమును జవనాశ్వముల మీద ముగించుచున్నావు. అట్లు పయనించునపుడు దేవతల అమృత సేవనమునకు అడ్డు తగులకున్నావు.
16. జాతవేదసియగు దేవత ఉదయించగా సూర్యుని సమస్తమునకు దర్శింపచేయుటకు కిరణములు అతనిని వహించుచున్నవి.
17. రాత్రి ముగిసినంత దొంగలు పారిపోయినట్లు, సర్వ ద్రష్ట సూర్యుడు ఉదయించగనే చుక్కలు పారిపోవుచున్నవి.
18. జ్ఞానదాయినులగు సూర్యకిరణములు జనులను భ్రాజంతమగు అగ్నుల వలె చూచుచున్నవి.
19. సూర్యదేవా! నీవు నావవంటివాడవు. విశ్వదర్శితుడవు. జ్యోతిష్కృతుడవు. విశ్వమును కాంతిచే ప్రకాశింపచేయుచున్నావు.
20. నీవు దేవప్రజ, మానవ ప్రజను దృష్టిలో ఉంచుకొని ఉదయించుచున్నావు. విశ్వమును వీక్షించుటకు ఉదయించుచున్నావు.
21. పావకుడగు సూర్యుడు జనులను ఏ దృష్టితో చూచుచున్నాడో, వరుణుడు ఆ దృష్టితోనే చూచుచున్నాడు.
22. సూర్యదేవా! జనులను, జన్మలను చూచుచు రాత్రింబవళ్ళు కలిగించుచు ముల్లోకములందు సంచరించుచున్నావు.
23. సూర్యదేవా! నీవు కిరణ్మయుడవు. ద్రష్టవు. నీ రథమును సప్తాశ్వములు వహించుచున్నవి.
24. పవిత్రలు, రక్షకులు అగు సప్తాశ్వములను సూర్యుడు తన రథమునకు కట్టినాడు. స్వయుక్తులచే నడిపించుచున్నాడు.
25. తపము చేసి తపస్వియైన రోహితుడు స్వర్గమును ఆరోహించినాడు. అతడు తన యోనికి చేరుచున్నాడు. మరల పుట్టుచున్నాడు. 'సదేవానామథిపతిర్భభూవ' అతడు దేవతలకు అధిపతియైనాడు.
26. అతడు విశ్వచర్షణి. విశ్వతో ముఖుడు. విశ్వతస్పాణి. విశ్వస్పృధుడు. అతడు తన కిరణములచే ద్యావాపృథ్వులను కల్పించినాడు. భుజస్కంధముల మీద భువనములను వహించుచున్నాడు. 'దేవఏకః' అతడు ఒక్కడే దేవుడు.
27. ఏకపాదుడు ద్విపాదులలో - ద్విపాదుడు త్రిపాదులలో - మరల ద్విపాదుడు షడ్పాదులందు చేరుచున్నారు. వారందరు ఏకపాద తన్వునే బ్రహ్మమునే ఉపాసించుచున్నారు.
28. అతంద్ర సూర్యుడు సాగునపుడు, విశ్రమించునపుడు రోచమానుడై ద్విరూపుడు అగుచున్నాడు. ఆదిత్యా! కిరణ పతాకను దాల్చి ఉదయించు నీవు సకల లోకములను అదుపునందుంచుకొని భాసిల్లుచున్నావు.
29. ఆదిత్యా! నీవు మహానుడవు. ఇది సత్యము. సూర్యా! నీవు మహానుడవు. ఇది సత్యము. మహానుడవగు నీ మహిమ మహత్తరము. "త్వమాదిత్య మహాఁ అసి"
30. ద్యులోకమున అంతరిక్షమున భూమి మీద జలములందు నీవు వెలుగుచున్నావు. నీ ప్రకాశము ఉభయ సముద్రములకు వ్యాపించుచున్నది. దేవో దేవాసి మహిషః స్వర్జిత్ - దేవతలకు దేవతవు. స్వర్గమును గెలిచిన మహితాత్ముడవై ఉన్నావు.
31. సూర్యుడు దక్షిణగామియై వడివడిగా బాటను దాటుచున్నాడు. అతడు వ్యాపకుడు. విశేష జ్ఞానవంతుడు. శక్తివంతుడు. అతడు తన జ్ఞాన బలమున సమస్త చలన జగత్తులను అణచి పెట్టుచున్నాడు. అధీనమందుంచుకున్నాడు.
32. సూర్యుడు పూజనీయుడు, జ్ఞానవంతుడు, మహిమాన్వితుడు, సుందర పక్షులు. అతడు ద్యావాపృథ్వులను ప్రకాశింపచేయుచున్నాడు. రాత్రింబవళ్ళు ఇతనినే ఆశ్రయించి నిలిచినవి. సమస్త బలమును ఇతని యందే ఉన్నవి.
33. సూర్యుడు కుటిల కిరణములచే ప్రకాశించుచున్నాడు. దేహములను పరిశుద్ధములను చేయుచున్నాడు. మానవులను పలికించుచున్నాడు. అతడు ప్రకాశవంతుడు. సంచరించువాడు. మహిమాన్వితుడు. అన్నములకు పుష్టిదాత. అతడు సకలదిశలను కల్పించి నిలిచి ఉన్నాడు.
34. సూర్యుడు దేవతలందు దర్శనీయుడు. వారి యందు పతాక ప్రాయుడు. ఉదయించినంతనే దిక్కులను కాంతిమంతము చేయుచున్నాడు. దివాకరుడగు సూర్యుడు తన ప్రకాశమున అంధకారములను, దురితములను దూరము చేయుచున్నాడు.
35. దేవతలకు దర్శనీయుడు కాంతి పుంజముతో ఉదయించినాడు! ఇతడు అగ్నికి, మిత్రావరుణులకు నేత్రము అగుచున్నాడు. స్థావర జంగమ జగత్తు సూర్యునకు ఆత్మయగుచున్నది. అతడు ద్యావాపృథివ్యంతరిక్షములందు వ్యాపించి ఉన్నాడు.
36. పైన ఉన్నవానిని, కిరణ్మయుని, అరుణుని, సుపర్ణుని, దివి మధ్య భ్రాజమానుని దర్శించెదముగాక. జ్యోతిస్స్వరూపుడు, సవితను దుఃఖము నెరుగని అత్రి పొందుచున్నది.
37. నేను భయభీతుడను. ఆకసమున పరుగులిడు, సువర్ణుడగు, అదితి పుత్రుడగు ఆదిత్యుని అర్చించుచున్నాము. అతడు మాకు దీర్ఘాయువు కలిగించునుగాక. హింసితులము కాకుందుముగాక. ఆదిత్యుని సుమనస్సున ఉందుముగాక.
38. సూర్యుడు స్వర్గామి. కదలువాడు. పాప నాశకుడు. అతని రెండు - ఉత్తర, దక్షిణాయన, పక్షము వేల దినముల వరకు నియమితములు. అతడు సకల దేవతలను తనయందుంచుకొని సమస్త ప్రాణులను చూచుచు పయనించును.
39. తొలుత రోహితుడే "కాలము" అయినాడు. ప్రజాపతి అయినాడు. యజ్ఞముఖము అయినాడు. రోహితుడే స్వర్గమును పోషించుచున్నాడు.
40. రోహితుడు లోకము అగుచున్నాడు. దివియందు తపించుచున్నాడు. రోహితుడు తన కిరణములచే సముద్రము, భూమి మీద సంచరించుచున్నాడు.
41. స్వర్గాధిపతియగు సూర్యుడు సర్వ దిశలందు ద్యులోకమునుంచి సముద్రము వరకు సంచరించుచున్నాడు. సకల ప్రాణులను, భూమిని రక్షించుచున్నాడు.
42. అతంద్ర, నిర్మల సూర్యుడు తన అశ్వముల మీద రెండు రూపములచే రోచమానుడగుచున్నాడు. ఆదిత్యుడు పూజ్యుడు. మహిమాన్వితుడు. చలనశీలి. 'యావతో లోకానభియద్ విభాతి - ఎన్ని లోకములున్నవో అన్నింటిని ప్రకాశింపచేయుచున్నాడు.
43. దివారాత్రులను పూజనీయమున కల్పించిన సూర్యుని ఒక రూపము మనముందుండి - రెండవ రూపము కదలుచుండును. స్వర్గమార్గ సంచారి. అంతరిక్ష నివాసి యగు సూర్యుని ఉపాసించుచున్నాము. ఆహ్వానించుచున్నాము.
44. భూపాలుడు, మహిమామయుడు, భక్త శరణ్యుడు, అహీన చక్షువగు భానుడు విశ్వమగుచున్నాడు. విశ్వనేత్రుడు, సువిద్యావంతుడు, పూజనీయుడగువాడు నా విన్నపమును ఆలకించునుగాక.
45. ఇతని మహిమ సర్వత్ర వ్యాప్తమై ఉన్నది. అతడు తన జ్యోతిచే సముద్రం ద్యామంతరిక్షములను ప్రకాశింపచేయుచున్నాడు. సర్వద్రష్ట. సువిద్యాశాలి. పూజనీయుడు నా విన్నపమును లంకించునుగాక.





