Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యోఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||
పదమూడవ కాండము
మొదటి అనువాకము
మొదటి సూక్తము
ఉదేహి వాజిన్యో అస్స్వన్తరిదం రాష్ట్రం ప్రవిశ సూనృతావత్ |
యో రోహితో విశ్వమిదం జజాన సత్వారాష్ట్రాయ సుభృతం బిభర్తు ||
వేగవంతా! అంతరిక్షపు జలములందున్నవాడవు. ఉదయించుము. సత్య నిష్ఠమగు రాజ్యమున ప్రవేశించుము. ఈ విశ్వమును సృష్టించిన రోహితుడు రాజ్యమును పోషించుటకు శక్తిని ప్రసాదించునుగాక.
వినియోగము - ఈ సూక్తము రోహిత, దేవతాకము. ఉదయించు సూర్యుడు రోహితుడు అనబడు చున్నాడు. రోహితుని సాహచర్యమున మరుత్తులు, ఇంద్రుడు, అజ, ఏకపద, అగ్ని, సవిత, మిత్రావరుణ, క్రవ్యాదాగ్ని, సూర్యాది దేవతలను ఆహ్వానించుటయు, వర్ణించుటయు జరిగినది. సూక్తమును నలు దిశల పరిశీలించగా రోహితుని, తత్సంబంధ దేవతల వర్ణన వలన ప్రయోజనము రాజు రాజ్యమును పాలించుట అని విదితమగుచున్నది.
యాజ్ఞికులు దీని వినియోగమును ఇట్లు చెప్పుచున్నారు:-
ధనమును కోరువాడు 1-20 ఋక్కులచే ఉదయించు సూర్యుని ఉపస్థానము చేయునది. ధనమును ఎత్త దలచినవాడు స్నానము చేసి వీనితోనే ఉపస్థానము చేయునది. ధన సిద్ధి కోరువాడు చిరగని బట్ట కట్టి వీనితోనే ఉపస్థానము చేయునది.
తన ప్రయోజన సిద్ధిని కోరువాడు వీనిచే వస్త్రమును అభిమంత్రించి కప్పునది. విద్రావణాది విషయ శాంతిని కోరువాడు వీనిచే వస్త్రమును అభిమంత్రించి దానము చేయునది.
25,26 మంత్రముల వినియోగమునకు మొదటి కాండ - 5 వ సూక్తము చూచునది.
28 - 32 మంత్రముల వినియోగమునకు మూడవ సూక్తము చూచునది.
2. వేగవంతా! అంతరిక్ష జలమునుండి వెడలుము. నీవు వేనికి మూలము అగుచున్నావో వానిని ఆరోహింపుము.
సోముని ధరించి చతుష్పాత్తులు, ద్విపాత్తులందు ప్రవేశించుము.
3. మరుత్తులారా! మీరు ఉగ్రులు. పృశ్ని మాతరులు. ఇంద్ర సహితులై శత్రువులను వధించండి. మీరు ముప్పదేడుగురు, స్వాదు పదార్థమోదకులు. సువృష్టి కలిగించువారు. రోహితుడు మీ మాటను ఆలకించునుగాక.
4. రోహితుడు ఉదయించినాడు. ఎక్కుచున్నాడు. ఉత్పత్తి కారకముల గర్భములందు ప్రవేశించుచున్నాడు. వానితో కలసినవాడై 'షడుర్వులను సాధించుచు రాజ్యమును దర్శించుటకు ఏతెంచినాడు.
5. నీ రాజ్యమున సూర్యుడు ప్రవేశించినాడు. నిలిచినాడు. నీవు యుద్ధములందు నిర్భయుడవైనావు. ద్యావాపృథ్వులు తమ కాంతులచే నీకు ధనమును ప్రసాదింతురుగాక. నీ కోరికలు తీర్చెదరుగాక.
6. రోహితుడు ద్యావాపృథ్వులను సృష్టించినాడు. పరమేష్ఠి వానిని విస్తృతము చేసినాడు. అజ ఏకపదుడు వానిని ఆశ్రయించినాడు. ద్యావాపృథ్వులకు బలము కలిగించి దృఢ పరచినాడు.
7. రోహితుడు ద్యావాపృథ్వులను దృఢపరచినాడు. దుఃఖమెరుగని స్వర్గమును నిలిపినాడు. అతడే అంతరిక్షమును, అన్య లోకములను కల్పించినాడు. అతని వలననే దేవతలకు అమృతత్వము కలిగినది.
8. రుహ, ప్రరుహలను ప్రకటించుచు రోహితుడు సమస్త రూపములను తాకినాడు. ఆకాశమునకు ఎక్కిన మహా మహితాత్ముడు, నీ రాజ్యమును ఘృత, దుగ్ధములచే నింపునుగాక.
9. ఏవి నీకు రుహ, ప్రరుహ, ఆరోహములు అగుచున్నవో, దేనిచే నీవు దివిని, అంతరిక్షమును పాలించుచున్నావో వానియందు ఋక్కులు, పాలు వర్థిల్లునుగాక. రోహితుని రాజ్యమును 'జాగృహి...' అప్రమత్తుడవగుము.
10. నీ తపస్సు కారణముగ సమస్త ప్రజ వ్యక్తమైనది. వారు గాయత్రీ రూపవత్సముతో ఇచటికి వచ్చియున్నారు. వారు సన్మనస్కులై నీయందు ప్రవేశింతురుగాక. తల్లి, దూడతో కూడ రోహితుడు విచ్చేయునుగాక.
11. రోహితుడు పెరిగినాడు. నాకమున నిలిచినాడు. "యువాకవిః" యగు నాతడు విశ్వములను కల్పించినాడు. అగ్ని జ్యోతిష్మంతములగు తన వంకర కిరణములచే మూడవ లోకమునకు ముదము కూర్చుచున్నాడు.
12. జాతవేదాగ్ని సహస్ర కిరణుడు. వరదుడు. ఘృతాహుతుడు. సోమపృష్ఠుడు. సువీరుడు. అతడు నన్ను విడువకుండునుగాక. నాకు గోసమృద్ధి, పుత్ర పౌత్ర సమృద్ధి కలిగించునుగాక.
13. రోహితుడు యజ్ఞ కారకుడు. యజ్ఞముఖము. అతనిని వాక్కు, శ్రవణము, మనసులతో ఆహ్వానించుచున్నాను. సమస్త దేవతలు ప్రసన్న మనస్కులై రోహితుని చేరుచున్నారు. అతడు నన్ను ప్రాదుర్భవముల సహితముగ యుద్ధములందు చేర్చునుగాక.
14. రోహితుడు విశ్వ కర్మ కొరకు యజ్ఞమును పరిపుష్ఠ మొనర్చినాడు. ఆ యజ్ఞ తేజములు నన్ను చేరుచున్నవి. 'భువనస్యాధిమజ్మని' యగు అతని నాభిని కీర్తించుచున్నాము.
15. జాతవేద అగ్నీ! బృహత్, పంక్తి, కకుప్, ఉష్ణిహ ఛందస్సులు, అక్షరము వషట్కారము నీయందు ప్రవేశించుచున్నవి. రోహితుడు తన తేజస్సుచే నీయందు ప్రవేశించుచున్నాడు.
16. ఇతడు పృథ్వి గర్బమున ఉన్నాడు. ద్యులోకమున, అంతరిక్షమున ఉన్నాడు. ఇతడు విష్టపమున, సమస్త స్వర్గములందున వ్యాపించి ఉన్నాడు.
17. వాచస్పతీ! పృథివి, యోని, శయ్య మాకు సుఖకరములు అగునుగాక. ప్రాణములు ఇచటనే ఉండును గాక. పరమేష్ఠీ! అగ్ని నీకు వర్చస్సు, ఆయుష్యము ప్రసాదించునుగాక.
18. వాచస్పతీ! విశ్వకర్మలచే ఐదు ఋతువులు వ్యక్తమైనవి. అవి మాకు మిత్రులు అగునుగాక. మా ప్రాణములు మా యందే ఉండునుగాక. పరమేష్ఠీ! రోహితుడు నీకు వర్చస్సు, ఆయుష్యము కలిగించునుగాక.
19. వాచస్పతీ! మా మనసు సుమనస్సు అగునుగాక. మా గోష్ఠమును గోవులతో నింపుము. మాకు సంతానము కలిగించుము. మాకు మిత్రులుగ మా ప్రాణములు మాయందే నిలుచునుగాక. పరమేష్ఠీ! నీకు వర్చస్సు, ఆయుష్షు కలిగించుచున్నాను.
20. సవితా దేవత నిన్ను సకల దిశలందు శక్తివంతుని చేయునుగాక. అగ్నియు మిత్రావరుణులు నీకు పుష్టి కలిగింతురుగాక. మీరందరు శత్రువులను అణచుచు ఈ రాజ్యమునకు విచ్చేయండి. ఈ రాజ్యమును సత్య సంపన్నము చేయండి.
21. రోహితా! నిన్ను పృషతి రథమున ప్రష్టి వహించుచున్నది. నీవు జలములందుండియు శుభములు కలిగించుచున్నావు.
22. రోహిణి సూరి - సువర్ణ - బృహతి - సువర్చ, ఆమె రోహితుని - చంద్రుని అనుసరించుచున్నది. ఆమె వలన వేగవంతులగు విశ్వరూపులను గెలుచుచున్నాము. సకల సేనలను అణచుచున్నాము.
23. ఇది రోహిణి - రోహిణుల సదనము. ఇది పృషతి సాగు మార్గము. దానిని కశ్యప, గంధర్వులు పైకి తీసికొని పోవుచున్నారు. విద్వాంసులు దానికి ప్రమాదము కలుగకుండ రక్షించుచున్నారు.
24. సూర్యుని అశ్వములు వేగవంతములు. కేతుమంతములు. అమరములు. అవి సదా సుఖముగ రథమును వహించుచున్నవి. ఘృతసముడు, భ్రాజమానుడగు రోహితుడు పృషతిని ద్యులోకమున ప్రవేశపెట్టినాడు.
25. రోహితుడు వరదుడు. వంకర కిరణముల వాడు. సూర్య, అగ్నులవైపు ఉండువాడు. అతడే ద్యావాపృథ్వులను నిలిపి ఉంచినాడు. అతని వలననే దేవతలు సృష్టిని రచించుచున్నారు.
26. రోహితుడు మహాసముద్రము నుంచి ద్యులోకమునకు ఎక్కుచున్నాడు. రోహితుడు రోహణశీలుడై సమస్తమును ఆరోహించుచున్నాడు.
27. దేవధేనువు ఘృత పూజిత. పయస్వతి. అనపసృక. నీవు దానిని అర్పించుము. ఇంద్రుడు సోమపానము చేయునుగాక. అగ్ని క్షేమంకరుడు అగునుగాక. వారు నిన్ను ప్రశంసింతురుగాక. నీవు యుద్ధమున శత్రువును అణచుము.
28. అగ్ని ప్రదీప్తుడు. ఘృత వృద్ధుడు. ఘృతాహుతుడు. సకల శత్రువులను జయించువాడు. సర్వజిత్తు. అతడు నా శత్రువులను సంహరించునుగాక.
29. అగ్ని శత్రువులను హతమార్చునుగాక. శత్రు సేనను భస్మము చేయునుగాక. మేము క్రవ్యాదాగ్నిచే శత్రువులను భస్మము చేయుచున్నాము.
30. ఇంద్రా! నీవు భుజ బల సంపన్నుడవు. నీ వజ్రాయుధమున నీచ శత్రువులను సంహరించుము. అగ్నిదేవా! నీ జ్వాలలచే మా శత్రువులను భస్మము చేయుము.
31. అగ్నీ! మా శత్రువులను నేల రాల్చుము. బృహస్పతీ! మా సజాత శత్రువులను బాధించుము. ఇంద్రాగ్ని మిత్రా వరుణులారా! మా మీద క్రోధము చూపు శత్రువు నేల రాలునుగాక.
32. సూర్యదేవా! ఉదయించుము. మా శత్రువులను సంహరించుము. వారిని రాళ్లతో బాదుము. వారు అధమ తమస్సున పడిపోవుదురుగాక.
33. విరాటుని బిడ్డ - బుద్ధిమంతులకు వరదుడు - శుపృష్టుడు అంతరిక్షమున ఎక్కినాడు. సూర్యుని ఘృతమున అర్చించి బ్రహ్మవత్సమున మంత్రములచే వర్ధిల్లచేయుచున్నారు.
34. దివమును, పృథివిని, రాష్ట్రమును, ద్రవిణమును ప్రజలను, అమృతమును అధిష్ఠించుము. రోహితుడు నీ దేహమును తాకునుగాక.
35. రాష్ట్ర భృతులగు ఏ దేవతలు సూర్యుని చుట్టూ ఉన్నారో వారి సహితముగ రోహితుడు మంచి మనసు గల వాడై రాజ్యమునకు పుష్టి కలిగించునుగాక.
36. మంత్రపూతములగు యజ్ఞములు, దారిలో సాగు అశ్వములు నిన్ను వహించుచున్నవి. వంకరగా నిలిచి సముద్రమునకు పరమశోభ కలిగించుచున్నావు.
37. రోహితుని యందు ద్యావాపృథ్వులు, వసుజితి, గోజితి, సంధానజితులు చేరి ఉన్నవి. అతని యొక్క ఏడు వేల జన్మములను నేను వర్ణించుచున్నాను. ఇతరులు సహితము వర్ణించుచున్నారు.
38. నీవు దిశా, ప్రదిశలందును, పశువులందును, మానవులందును, స్థావరములందును యశస్సు కలిగి ఉన్నావు. నేను సహితము అఖండనీయ యగు భూమాత వడిలో సవిత వలె కాంతిమంతుడనై ఉందునుగాక.
39. పైన నిలిచి ఇచటి వృత్తాంతములను ఎరుగుచున్నావు. ఇచటి నుండి అచటి వరకు సర్వమును వీక్షించుచున్నావు. ఇచటి వారు విద్వాంసుడగు సూర్యుని చూచుచున్నారు.
40. ఒక పాదమున అన్నము అన్యపాదమున వత్సమును ధరించిన శ్వేతగోవు ఉదయించినది. ఆ 'కద్రీచి' ఒక అర్ధ భాగమునకు పోవుచున్నది. ఒక చోట పడుచున్నది. యూధమున మాత్రము కాదు.
42. అది ఏకపది, ద్విపది, చతుష్పది, అష్టపది, నవపది అగుచున్నది. సహస్రాక్షర, భువనస్య పంక్తి, మేఘములందు క్షరించుచున్నది.
43. మంత్రపూత యజ్ఞము, దారిలోని అశ్వములు నిన్ను దహించుచున్నవి. నీవు అమృతుడవు. ద్యులోకమునకు ఎక్కుచున్నావు. నా వాక్కును బ్రోవుము. 'ప్రావమేవచః'
44. నీవు అమరుడవు. స్వర్గమును ఆక్రమించినావు. నీ స్థానము పరమ వ్యోమమగుచున్నది. "వేదతత్" అది
నాకు తెలియును.
45. సూర్యుడు ద్యులోకమును చూచుచున్నాడు. భూమి, జలములకు సాక్షీభూతుడు అగుచున్నాడు. సూర్యుడు సకల భూతములకు ఏకమాత్ర చక్షువు అగుచున్నాడు. అతడే మహిని, దివిని ఆరోహించుచున్నాడు.
46. ఉర్వులు పరిధులు కాగా భూమి వేదిగా ఏర్పడినది. రోహితుడు అచట అగ్నులను - హిమమును, దివారాత్రులను కల్పించినాడు.
47. హిమమును, దివమును ఆధానము చేసి పర్వములను యూపములను చేసి వర్షాజ్య అగ్నిని యజించినవారు రోహితుని స్వర్గమునకు చేరుచున్నారు.
48. స్వర్విదోరోహితస్య మంత్రమున అగ్ని ప్రజ్వరిల్లుచున్నది. దానినుండియే దినములు, హిమము, యజ్ఞము వ్యక్తములైనవి.
49. రోహిత స్వర్గము కోరువారు అగ్నిని మంత్రములచే ఆహ్వానించి, మంత్రములచే పెరిగిన అగ్నిని మంత్రములచే వర్ధిల్లచేయుచు మంత్ర ప్రజ్వలితాగ్నిని పూజించుచున్నారు.
50. సత్యమున ఒక అగ్ని - సముద్రమున ఒక అగ్ని ఉన్నది. రోహిత స్వర్గము కోరువారు మంత్ర సమృద్ధ అగ్నులను అర్చించుచున్నారు.
51. ఎవరిని వాయువు, ఇంద్రుడు, బ్రహ్మణస్పతి శోభిల్లచేయదలతురో అట్టివారు రోహిత స్వర్గము కొరకు మంత్ర సమృద్ధ అగ్నిని అర్చించుచున్నారు.
52. రోహితుడు భూమిని వేదిని ద్యుమ దక్షిణను దినమును అగ్నిని చేసి వర్ష రూప ఘృతమున విశ్వమును ఆత్మన్విదము చేసికొన్నాడు.
53. వర్షమును ఆజ్యముగను, దినమును అగ్నిని భూమిని వేదిగ చేసినాడు. అగ్ని స్తుతిమంతుడై పర్వతములను ఎత్తుగ చేసినాడు.
54. స్తుతులతో ఉన్నతము చేసిన భూమితో రోహితుడు ఇట్లన్నాడు.
పుట్టిన పుట్టనున్న ప్రాణులు నీ మీద నిలుచునుగాక.
55. అతడు ప్రథమ యజ్ఞమున, భూత, భవ్యముగ అవతరించినాడు. ఈ వెలుగు చూచునదంతయు అతని నుండియే ఆవిర్భవించినది. దీనిని ఋషియగు రోహితుడే పరిపుష్టము చేసినాడు.





