Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


      

              యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్ |
                నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

                                 పన్నెండవ కాండ
                                      మొదటి అనువాకము
                                       మొదటి సూక్తము

   
   
    సత్యం బృహదృత ముగ్రం దీక్షాతపో బ్రహ్మ యజ్ఞః పృథివీం ధారయంతి |
    సానో భూతస్య భవ్యస్య పత్న్యురుం లోకం పృథివీనః కృణోతు ||
   

1.    సత్యము, బృహదృతము, ఉగ్రదీక్ష, తపము, బ్రహ్మ యజ్ఞమును భూమిని నిలుపుచున్నవి. అట్టి భూమి మాకు భూత భవిష్యత్తులను పాలించునట్టి విశాల స్థానమును కల్పించునుగాక.
   
వినియోగము : ఇది భూమి సూక్తము దీనియందు ఎక్కువగా పృథివి యొక్క నిసర్గ వర్ణనము ఉన్నది. కొన్ని పౌరాణిక కథలు లక్ష్యముగా వర్ణన చేయబడినది. చాలా చోట్ల ఋషి పృథ్విని వరములు అడిగినాడు.
   
    సంప్రదాయానుసారము ఈ సూక్తమునాకు అనేక ప్రకారముల వినియోగములు కలవు. ఈ సూక్తపు పాఠము వస్తోష్పత్య గణములందు ఉన్నందున వినియోగమునకు మూడవ కాండపు పన్నెండవ సూక్తము చూచునది.
   
    ఆగ్రహాయణీ కర్మమున రాత్రిపూట అభ్యాతానము వరకు చేసి మూడు చరులను ఏర్పరచునది. ఈ అనువాకముచే అగ్నికి వెనుకగల గుంతయందు దర్భలు పరచి చరులో మూడింటి ఒక భాగము నిశ్సేషముగ దర్భలమీద ఉంచి హోమించునది. రెండవ భాగపు చరును దీనిచే సంపాతిత, అభిమంత్రణలు చేసి భుజించునది. మూడవ భాగపు చరును 1-7 మరియు 63 వ మంత్రముచే మూడుసార్లు ఆహుతులు ఇచ్చునది. అగ్ని వెనుక దర్భల మీద చాపపరచి 29వ మంత్రముచే ఉపవేశనము చేయునది. 34వ ఋక్కుచే పర్యావర్తనము చేయునది. 1-9, 60 మరియు 3వ కాండ 31 సూక్తపు 10,11 ఋక్కులచే ప్రాతః కాలమున లేచునది. 7-55-7 వ మంత్రముచే నడుచునది. ఈ సూక్తపు 28వ మంత్రముచే బయటికి నడుచునది.
   
    పుష్టిని కోరువాడు ఉన్నత స్థానమునకు ఎక్కి 34వ మంత్రముచే చూడవలెను.
   
    ఈ అనువాకముచే పూర్ణ కుంభమును సంపాతితము చేసి అగ్ని ముందున్న నాగలిని ప్రోక్షించునది.
   
    ఈ అనువాకముచే కృషి కర్మ చేయబడును. వివరములకు 3 -17 చూచునది.
   
    పుత్ర, ధనాది ఫల ప్రాప్తికి 38,39,40 ఋక్కులచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
   
    ధాన్యము, అన్నము కోరువాడు 42వ మంత్రముచే పృథివిని ఉపస్థానము చేయునది.
   
    మణి, సువర్ణాదులు కోరువారు 44,45 మంత్రములచే పృథివిని ఉపస్థానము చేయునది.
   
    మణి, సువర్ణ లాభము తరువాత పైన చెప్పి ఋక్కులచే స్నానము చేయునది.

    పుష్టి కోరువాడు వృష్టి సమయమున 52వ ఋక్కుచే కొత్తనీటిని అభిమంత్రితము చేసి ఆచమనము చేయునది. స్నానము చేయునది.
   
    గ్రామ నగరాదుల రక్షణ కొరకు ఈ అనువాకముచే నాలుగు పురోడాశములను 'అశ్మోత్తరము' చేసి నాలుగు మూలలందు పాతిపెట్టునది. అందుకొరకే ఒక్కొక్క పురోడాశము యొక్క రాతిని పైకి పట్టుకొని రెండింటిని సంపాతితములు చేసి మూలలందు పాతిపెట్టునది. సర్వత్ర ప్రత్యేక ద్రవ్యము మీద సూక్తమును ఆవృత్తము చేయునది.
   
    అగ్ని గృహమున వేడి లేనిచోట పడుకొని ఈ అనువాకమును జపించునది.
   
    భూకంపము కలిగినపుడు ఈ అనువాకము హోమమున వినియోగమగును.
   
    సోమ యజ్ఞమున మూత్ర, పురీష శుద్ది కొరకును లోష్ఠ దానమునను దీని వినియోగము.
   
    భూమి కోరువాని పార్ధివీ శాంతి యందు దీని వినియోగము.
   
2.    పృథివి మానవుల మధ్యనే ఉన్నది. అయినను బాధించదు. ఇది ఒక చోట మరింత ఎత్తుగ, మరొక చోట మరింత పల్లముగ ఉండును. ఇది శక్తిమంతములగు ఓషధులను కలిగిఉన్నది. అట్టిపృథ్వి మా కోరికలను తీర్చునుగాక.
   
3.    పృథివి మీద సముద్రము, నదులు, జలములు, వ్యవసాయము, అన్నము ఉన్నవి. ఈ పృథివి మీదనే సమస్త ప్రాణులు జీవించుచున్నవి. అట్టి పృథివి మమ్ము రసవత్పదార్దములందు నిలుపును గాక.
   
4.    పృథివి మీదనే దిశలు ఉన్నవి. అన్నము ఉన్నది. పృథివే సమస్త ప్రాణులను భరించుచున్నది. ఆ భూదేవి మాకు గోవులు, అన్నము కలిగించునుగాక.
   
5.    పృథివి యందు పూర్వ పురుషులు నివసించినారు. దేవాసురులు యుద్దములు చేసినారు. దానిమీద గోవులు, అశ్వములు, పక్షులు నివసించుచున్నవి. అది మాకు ధనము, తేజస్సు కలిగించునుగాక.
   
6.    పృథివి విశ్వంభర వసుంధర హిరణ్య వక్ష వైశ్వానరుని, ఇంద్రుని అగ్నిని భరించునది. అట్టి భూమి మాకు ధనమును ప్రసాదించునుగాక.
   
7.    అనిమిషులగు దేవతలు భూమిని అప్రమత్తులై రక్షించుచున్నారు. అట్టి భూదేవి మాకు ప్రియమగు మధువును, వర్చస్సును కలిగించునుగాక.
   
8.    పృథివి తొలుత జలములందు ఉండెను. మహా పురుషులు తమ ప్రభావమున దీనిపై సంచరించినారు. భూమాత హృదయము సత్యమయము. అమృతమయము. అది పరమ వ్యోమమున ప్రతిష్టితమై ఉన్నది. అట్టి భూమి మాకు ఉత్తమ రాజ్యమున నివాసము కల్పించునుగాక. దీప్తిని, బలమును ప్రసాదించునుగాక.
   
9.    పృథివి మీద నలువైపుల జలములు అహోరాత్రులు సమానముగా ప్రవహించుచు ప్రమాదములు కలిగించకున్నవి. అట్టి భూరి ధారల భూమి పాల వంటి సారభూత, ఫలములను ప్రసాదించునుగాక. మమ్ము వర్చస్సంపన్నులను చేయునుగాక.
   
10.    దేనిని అశ్వినులు నిర్మించినారో, దేనిపై విష్ణువు విశ్రమించినాడో, ఇంద్రుడు దేనిని శత్రురహితము చేసి తన వశమునందుంచుకున్నాడో అట్టి భూదేవి తల్లి బిడ్డకు పాలిచ్చినట్లు, రసవత్పదార్దములను ఇచ్చునుగాక.
   
11.    భూదేవీ! నీ యొక్క గిరులు, పర్వతములు, హిమవంతము, అరణ్యములు మాకు సుఖప్రదలు అగునుగాక. బభ్రు - కృష్ణ - లోహిత - విశ్వరూప - ఇంద్ర రక్షిత - ధృవ భూమి మీది మేము అక్షయ, అజిత, అహతులమై నివసింతుముగాక.

12.    అమ్మా! భూమీ! నీ యొక్క మధ్య భాగమున నాభి భాగమున, నీయందు కలుగు పుష్టి ప్రద పదార్ధములందు మమ్ము నిలుపుము. పాపనులను చేయుము. భూమి మాకు తల్లి పర్జన్యుడు మాకు తండ్రి అగుచున్నారు. వారు మమ్ము రక్షింతురుగాక.
   
13.    భూమి మీదనే వేదము పరిఢవిల్లుచున్నది. సమస్త కర్మలు, యజ్ఞములు ప్రవర్తిల్లుచున్నవి. ఆహుతులు ఇచ్చుటకు ముందు యజ్ఞ స్తంభములు నిలుపబడుచున్నవి. అట్టి వర్ధమాన భూమి మమ్ము వర్దిల్లచేయునుగాక.
   
14.    భూమాతా! మమ్ము ద్వేషించు వారిని, మాకు వ్యతిరేకముగ సేనలు కూర్చువారిని, మమ్ము వధించ సంకల్పించువారిని హతమార్చుము.
   
15.    భూదేవీ! నీ నుండి పుట్టిన మానవులు నీ మీద సంచరించుచున్నారు. ద్విపాత్తులను, చతుష్పాత్తులను భరించుచున్నావు. ఎవరి కొరకు సూర్యుడు ఉదయించి వెలుగును, అమృతమును ప్రసాదించుచున్నాడో అట్టి పంచ జనులు నీవారలే.
   
16.    సూర్య కిరణము మాకు సంతానమును, మధుర వాక్కును ప్రసాదించునుగాక. భూమీ! నీవు నాకు మధుర పదార్ధములను ప్రసాదించుము.
   
17.    పృథివి సమస్త ధనము. ఓషధులకు మూలము. ధర్మమును ధరించునది. ధ్రువ, శివ, సుఖదాయిని. అట్టి భూమి మీద సర్వత్ర మేము సంచరించ కలుగుదుముగాక.
   
18.    భూమీ! నీవు మహా ఆవాసమవు. మహా వేగవంతవు. కంపనవు. మహా ఇంద్రుడు నిన్ను అప్రమత్తుడై రక్షించుచున్నాడు. మాకు బంగారము వంటి తేజస్సు కలిగించుము. మమ్ము ఎవడును ద్వేషించకుండునుగాక.
   
19.    అగ్ని భూమి యందున్నది. జలములందున్నది. శిలలందున్నది. పురుషులందున్నది. గోవులందున్నది. అశ్వములందు కూడ అగ్నులు ఉన్నారు.
   
20.    అగ్ని స్వర్గమున మండుచున్నాడు. అతడు విశాల అంతరిక్షమున ఉన్నాడు. ఘ్రుత ప్రియుడు, హవ్యా వాహనుడగు అగ్నిని మర్త్యులు ప్రజ్వలింపచేయుచున్నారు.
   
21.    అగ్ని దేనియందు వసించుచున్నాడో, ఏది అగ్ని యొక్క ధూమమును తెలియుచున్నదో అట్టి భూమి మమ్ము దీప్తివంతులను, శక్తివంతులను చేయునుగాక.
   
22.    భూమి మీద అలంకృత యజ్ఞములందు దేవతలకు హవి అర్పించబడుచున్నది. మర్త్యులగు మానవులు భూమి మీద జలము, అన్నము వలన జీవించుచున్నారు అట్టి భూమి మాకు ప్రాణమును, ఆయువును ప్రసాదించి, మమ్ము వార్ధక్యము వరకు జీవింప చేయునుగాక.
   
23.    భూమీ! నీవు సుగంధివి. నీ సుగంధమును ఓషధులు, జలము, గంధర్వులు, అప్సరసలు ఆస్వాదించుచున్నారు. అట్టి సుగంధమును నాకు కలిగించుము. నన్ను ద్వేషించువాడు లేకుండునుగాక.
   
24.    నీ సుగంధము కమలములందున్నది. 'సూర్య' వివాహమున అది మర్త్యులకు లభించినది. అట్టి సుగంధమును నాకు కలిగించుము. నన్ను ద్వేషించువాడు లేకుండునుగాక.
   
25.    భూమీ! పురుషులందు, స్త్రీలయందు, స్వాదు పురుషులందు, భగుని యందు, అశ్వములందు, వీరులందు, మృగములందున్న నీ సుగంధమును, కన్యలయందున్న వర్చస్సును మాకు కలిగించుము. నన్ను ద్వేషించువాడు లేకుండునుగాక.
   
26.    సువర్ణ వక్ష ధరిత్రీ! నీ మీద శిలలున్నవి. గులకరాళ్ళున్నవి. ధూళి ఉన్నది. నీవు నానా రూపముల దానవు. నీకు నమస్కరించుచున్నాను.
   
27.    దేని మీద ఓషధులను కలిగించు వృక్షములు ధ్రువముగా నిలిచి ఉన్నవో, ఏది సమస్తమును వహించుచున్నదో అట్టి భూమి ముందు నిలిచి స్తుతించుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.