Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

4.    అర్భుదా! నీ కాటువలన భర్తలు చావగా భార్యలు ముఖము కట్టుకొని, గుండెలు బాదుకొని, నేలను చరచుచు, వెంట్రుకలు విరయ బోసుకుని మొత్తుకొనుచు భర్తల వైపునకు ఉరుకుదురు గాక.
   
5.    కుక్కలు గల అప్సరసలను - మాయా మూర్తులను - వట్టి గిన్నెలను నాకుచు గాల తిరుగుడు తిరుగు వశగోవులను - ఉల్కాపాతాది ఉత్పాతములను అర్భుదా! మా శత్రువులకు దృష్టి గోచరము చేయుము.
   
6.    అర్భుదా! ఆకసమున ఉండి ఇటనట కనిపించు వారిని అల్పహస్తులను, అల్ప శబ్దము చేయువారిని, యక్షరాక్షసులను, అంతర్హితులను, గంధర్వ, అప్సరసలను, సర్పములను, అన్యులను చూపి శత్రువులను భయపెట్టుము.
   
7.    నాలుగు కోరల వారిని, నల్లని కోరల వారిని, కుంభముష్కులను, నెత్తుటి ముఖము వారిని, భయంకరాకారులను, భయపెట్టు వారిని శత్రువులకు చూపించుము.
   
8.    అర్భుదా! నీవు శత్రుసేనలను గడగడలాడించి ఏడిపించుము. ఇంద్రమిత్రులగు అర్భుద, న్యర్భుదులారా! మా శత్రువులను ఓడించండి. మాకు గెలుపు కలిగించండి.
   
9.    న్యర్భుదా! మా వైరులు భయభీతులు అగుదురు గాక. వారి అవయవములు చూర్ణములు అగును గాక. వారు చచ్చి పడుదురుగాక. శత్రుసేనను జయించు మా సేనల వెంట ధూమ శిఖ, అగ్నిజిహ్వులు ఉందురు గాక.
   
10.    అర్బుదా! ఇంద్రుడు శత్రువులందు శ్రేష్టులను హతమార్చును గాక. అతడు శత్రువులను వెదకి వెదకి ఒక్కడు కూడ మిగులకుండ హతమార్చును గాక.
   
                                    మూడవ సూక్తము - 27
   

1.    శత్రువుల మనసులు తనువును వీడును గాక. ప్రాణములు ఎగిరి పోవును గాక. ముఖము ఎండిపోవును గాక మా మిత్రులకు అట్లు కాకుండును గాక.
   
2.    అర్భుదా! ధీరులు - అధీరులు - పరాఙ్ముఖులు - బధిరులు - చీకట్లవారు - శృంగభంగులు - మేక అరుపుల వారి నందరిని భయపెట్టుము - వారికి ఉత్పాతములు చూపుము.
   
3.    అర్భుధ, త్రిసంధి దేవతలారా! మా శత్రువులను నానా ప్రకారములుగ వధించండి. వృత్రహంత ఇంద్రా! మేము శత్రువులను వేలరీతుల వధించునట్లు నీవు వారిని బాధించుము.
   
4.    అర్భుదా! వనస్పతులను, వాని సంబంధులను, ధాన్యములను, లతలను గంధర్వులను, అప్సరసలను, దేవతలను, యక్షులను, పితరులను మా శత్రువులకు చూపుము. వారికి ఉత్పాతములను కూడ కనబరచుము.
   
5.    అర్బుదా! నీకు మరుత్తులు, ఆదిత్యులు, బ్రహ్మణస్పతి ఈశానులు అగుదురు గాక. ఇంద్రుడు, అగ్ని, ధాత, మిత్రుడు, ప్రజాపతి ఈశానులగుదురు గాక. ఋషులు నీకు ప్రభువులు అగుదురు గాక. శత్రువులకు వారిని చూపుము. నీ కాటు వేయుము.
   
6.    అట్టి ఈశానులు మాకు మిత్రులగు దేవజనులారా! లేవండి. ఈ యుద్దమున మాకు జయము కలిగించి మీ మీ లోకములకు వెళ్ళండి.
   
                                    నాలుగవ సూక్తము - 28
   
1.    వీర సైనికులారా! ఉత్తిష్ఠత. పతాకముల సహితముగ కదలండి. సర్పములు, ఇతర జనులు, రాక్షసులు శత్రువులను తరిమెదరు గాక.
   
2.    శత్రువులారా! మీ రాజ్యమును త్రిషంధి దేవత ఎరుంగును గాక. త్రిషంధీ! అంతరిక్షమున, దివి యందు, భువియందు, మానవులయందున్న అరుణ పతాకను అందుకొని శత్రువులమనసులందు పీడలు కలిగించుము.
       
3.    త్రిషంధి యొక్క వజ్రము వంటి అయోముఖ, సూచీముఖ, వికంకతీ ముఖ గ్రద్దలు మున్నగు పక్షులు గాలివేగమున వచ్చి శత్రుసేన మీద వాలును గాక.
   
4.    జాతవేదాగ్నీ! ఆకాశమున గల ఆదిత్యుని ఆచ్చాదించుము. త్రిషంధుని సేనలు నా అధీనమున ఉండును గాక.
   
5.    దేవజన అర్బుదా! సేనా సహితుడవై ఉత్తిష్ఠ తిషంధీ! ఇదిగో నీకు ఆహుతి అర్పించుచున్నాము. అది నీకు ప్రియమగును గాక.
   
6.    తెల్లని పాదముల గోవు శరసమూహమై శత్రువు మీద పడును గాక. కృత్యా! నీవు త్రిషంధీ సేనా సహితవై కదలుము.
   
7.    పొగ కమ్మి శత్రువుల కనులు కనిపించకుండును గాక. భేరీ ధ్వనులకు వారి చెవులు వినపడకుండును గాక. త్రిషంధి సేనా సహితుడై జయించును గాక. అతని పతాకములు అరుణములు అగును గాక.
   
8.    శత్రు శవముల కొరకు అంతరిక్షమున, దివి యందు సంచరించు పక్షులు క్రిందకు దిగునుగాక. శ్వాపదములు, మక్షికములు, గృధములు సహితము శత్రు శవముల మీద పడును గాక.
   
9.    బ్రహ్మ, ఇంద్ర, బృహస్పతులు ఎట్టి సంధాన క్రియా రూప ప్రతిజ్ఞ చేసినారో, నాకు విజయము కలిగించుమని దానితోనే దేవతలను ఆహ్వానించుచున్నాను.
   
10.    అంగిర పుత్రుడు, దేవ మంత్రియగు బృహస్పతియు, మంత్రానుష్టానులగు ఇతర ఋషులును, అసుర క్షయమునకు గాను త్రిషంధుని దేవలోకమున ప్రతిష్టించినారు.
   
                                     ఐదవ సూక్తము - 29
   
1.    త్రిషంధియే ఇంద్ర, ఆదిత్యులను రక్షించి స్వర్గమున నిలిపినాడు. దేవతలందరు ఓజస్సు, బలము కొరకు త్రిసంధినే ఉపాసించుచున్నారు.
   
2.    ఈ పృషదాజ్య హోమము వలననే దేవతలు సకల లోకములను జయించినారు. అంగిర పుత్రుడగు బృహస్పతి అసురవధకును, అసుర క్షయమునకును వజ్రాయుధమును నిర్మించినాడు.
   
3.    అంగిర పుత్రుడగు బృహస్పతి అసురవధకును అసురక్షయమునకును నిర్మించిన వజ్రాయుధముతోనే నేను శత్రుసేనలను నష్టపరచుచున్నాను. హతమార్చుచున్నాను.
   
4.    ఏ దేవతలు వషట్క్రుతమును అనుభవించుచున్నారో - వారు శత్రుసేనను జయించుచు మా వైపు వచ్చుచున్నారు. దేవతలారా! మా సేనలకు విజయమును, శత్రుసేనలకు పరాజయమును కలిగించుము.
   
5.    సమస్త దేవతలు శత్రువును అతిక్రమించి మా వైపునకు వచ్చెదరు గాక. మా ఆహుతులు త్రిషందికి ప్రియములు అగును గాక.
   
    దేవతలారా! పూర్వము మీరు అసురులను గెలుచుటకు ప్రతిజ్ఞచేసినట్లే మాకు జయము కలిగించుటకు మమ్ము రక్షించుటకు ప్రతిజ్ఞ చేయండి.
   
6.    వాయువు శత్రువుల బాణములకు అడ్డు తగిలి గురి తప్పించును గాక. ఇంద్రుడు శత్రువు భుజములను నిర్వీర్యము చేసి, బాణము ఎక్కుపెట్టకుండునట్లు చేయును గాక. సూర్యుడు శత్రువు ఆయుధములను నాశనము చేయును గాక. చంద్రుడు దారులు మూయును గాక.
   
7.    దేవా! శత్రువులు మంత్రకవచము ధరించినచో, తనూనపాత, పరిపానములు చేసి ఉన్నచో వానిని నిష్ఫలము చేయుము.
   
8.    త్రిషంధీ! శత్రువులను పచ్చిమాంసము తిను రక్కసుల కర్పింపుము. చావును వారి ముందుకు తోలుము. నీ నీసేనతో యుద్దము చేయుము. మాకు విజయము చేకూర్చుము.
   
9.    త్రిషంధీ! శత్రువులను చీకట్లలో త్రోయుము. పృషదాజ్యమున హతులైన శత్రువులలో ఒక్కడు కూడ మిగుల కుండును గాక.
   
10.    మా ఆయుధముల తాకిడికి బాధలు పడు శత్రు సమూహమున శితపద గోవు దూకునుగాక. న్యర్భుది దేవా! శత్రుసేనలు దూరము నందే మతి తప్పినవి అగును గాక.
   
                                   ఆరవ సూక్తము - 30
   
1.    న్యర్బుదా! అమిత్రులను మూఢులను చేయుము. వారిని వెదికి, వెదికి హతమార్చుము. నీ సేనతో వారిని పరిమార్చుము.
   
2.    కవచములున్న, కవచము లేని, రథము గల, శత్రువు రథపు పగ్గములు, కవచ పగ్గములచే కట్టుబడును గాక.
   
3.    అర్భుదా! కవచాములున్న, కవచము లేని, అన్య రక్షణలున్న శత్రువులందరను హతమార్చుము. నేలమీద పడిన వారి శవములను కుక్కలు, నక్కలు తినును గాక.
   
4.    రథికులను, అరథికులను, పగ్గమలు కల వారిని, లేని వారిని అందరిని, చచ్చినవారిని గ్రద్దలు, నక్కలు, కాకులు తినును గాక.
   
5.    శత్రుసేనను మా సేన తాకి మా ఆయుధములచే వేలమంది హతులై క్రూర జన్ములు అగుతురు గాక.
   
6.    మా పృషజాద్యాహుతిని త్రిప్పి పంపి మాతో యుద్దము చేయదలచు శత్రువు యొక్క మర్మ స్థానములు బాణములచే ఛిన్నా భిన్నమగును గాక. ఆ బాధనే వారు మొత్తుకొనుచు నేల కూలినంత వారిని కుక్కలు నక్కలు తినును గాక.
   
7.    దేనిని దేవతలు నిర్మించినారో, దేనికి ఎదురన్నది లేదో అట్టి త్రిషంధి వజ్రమున వృత్రహంతయగు ఇంద్రుడు మా శత్రువులను హతమార్చును గాక.
   
   

    విద్వాంసుడు, బహు భాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటక కర్త, విమర్శకుడు, చలనచిత్ర రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రగతి పథగామి, ప్రసన్నుడు, శకుంతల, మాళవిక, అగ్ని మిత్రుడు - విక్రముడు ఊర్వశి - వివేకానందుడు, మహాత్ముడు - శ్రీవేంకటేశ్వరుడు మున్నగు బాలసాహిత్య కారుడగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత యందలి పదకొండవ కాండ సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.