Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

28.    మేము కుడి, ఎడమ కాళ్ళచే నడుచుచున్నాము. కూర్చొను చున్నాము. నిలుచుచున్నాము. త్రొక్కుచున్నాము తల్లీ! ఇది నీకు బాధ కలిగించకుండునుగాక.
   
29.    వేదములచే వర్ధిల్లునది, పరమ పవిత్ర క్షమా గుణ ధరిత్రిని స్తుతించుచున్నాము. అమ్మా! అన్న రసమును - బలమును ధరించు నీకు ఘ్రుతాహుతులు అర్పించుచున్నాము.
   
30.    మా మీద పడినది పావన జలము మా దేహము నుండి జారిన జలమునకు మా శత్రువునకు ఇచ్చుచున్నాము. భూమీ! మేము పవిత్రముచే మమ్ము పవిత్రులము చేసికొనుచున్నాము.
   
31.    భూమీ! పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలు మేము నడుచునపుడు సుఖ ప్రదలగునుగాక. భువనము మీద ఉన్న మేము పడిపోకుందుముగాక.
   
32.    భూమీ! నాకు తూర్పున నిలువుము. ఉత్తరమున నిలువుము. దక్షిణమున నిలువుము. పడమట నిలువుము. నాకు శుభములు కలిగించుము. నేను దొంగల పాలపడకుందునుగాక. వికట వధను నా నుంచి దూరమున ఉంచుము.
   
33.    భూదేవీ! మిత్రుడగు సూర్యుని ముందు నిన్ను చూచుచున్నంత వరకు రానున్న సంవత్సరములందు నా నేత్రములు క్షీణించకుండునుగాక.
   
34.    భూమీ! నీవు ఎల్లరకు ప్రీతి కలిగించుదానవు. నేను శయనించి కుడికి ఎడమకు తిరుగుచున్నాను. వత్తిగిలి పాడుకొనుచున్నాను. అప్పుడు మమ్ము హింసించకుము.
   
35.    భూమీ! నేను నిన్ను త్రవ్వినప్పుడు వెంటనే నిండుదువు గాక అమ్మా! నేను నీ యొక్క మర్మ స్థానమగు హృదయమును నింపలేకున్నాను.
   
36.    భూమీ! గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర, వసంత ఋతువులు, రాత్రింబవళ్ళు, సంవత్సరములు నీ కొరకే విహితములు. అవి మాకు ఫల ప్రదములు అగునుగాక.
   
37.    ఈ పృథివి పవిత్రశీల సర్పము వలె, మెల్లగ కదులునది. జలములందున్న అగ్నియే భూమియందున్నది. ఇది దేవతలను హింసించు దస్యులకు ఫలములివ్వకున్నది. ఆమె వృత్రుని వరించలేదు. ఇంద్రుని వరించినది. ఈ పృథివి ధర్మాత్ముడగు పురుషుని అధీనమున ఉంటున్నది.
   
38.    ఏ భూమి మీద హవిస్సులు అర్పించుటకు యజ్ఞ మండపములు నిర్మించబడుచున్నవో, దేని మీద యూపములు నిలుపబడుచున్నవో, బ్రాహ్మణులు ఋగ్యజుస్సామములు గానము చేయుచున్నారో, ఋత్విజులు ఇంద్రునకు సోమము అర్పించుచున్నారో -
   
39.    ఏ భూమి మీద పూర్వము ప్రాణులను కల్పించిన ఋషులు సప్త సత్ర యజ్ఞములు, తపస్సులు చేసినారో -
   
40.    అట్టి భూమి మాకు మేము కోరిన ధనములను ఇచ్చునుగాక. భాగ్యము మాకు ప్రేరణ కలిగించగా ఇంద్రుడు మా ముందు నడచును గాక.
   
41.    ఏ భూమి మీద మంచి నేత్రముల నరులు ఆడుచున్నారో, పాడుచున్నారో, యుద్దములు చేయుచున్నారో, కేకలు పెట్టుచున్నారో, దుందుభులు మ్రోగించుచున్నారో, అట్టి పృథివి నా శత్రువులను గెంటివేయునుగాక. ఈ పృథివి నాకు శత్రు రహితము అగునుగాక.
   
42.    పృథ్వి మీద అన్నము, యవలు, ధాన్యము పంచ కృషులు కలుగుచున్నవి. పర్జన్యుడు వర్షము కలిగించి భూమిని పోషించుచున్నాడు. అట్టి భూమికి ప్రణమిల్లుచున్నాను.
   
43.    ఈ భూమి మీద దేవకృత మృగములు ఆటలాడుచున్నవి. సమస్త విశ్వమును తనలోన ధరించు పృథివి యొక్క దిశలను ప్రజాపతి, మా కొరకు, రమణీయములను చేయునుగాక.
   
44.    అనేక నిధులను తనలో దాచుకున్న భూమి నాకు మణులు, హిరణ్యము ఇచ్చునుగాక. ధనములనిచ్చు భూదేవి ప్రసన్నమనమున నాకు సంపదలనిచ్చునుగాక.
   
45.    ఈ భూమి నానా భాషలు, నానా ధర్మముల జనులను పోషించుచున్నది. కదలక పాలిచ్చు గోవు వలె భూదేవి నాకు సహస్రధారల ద్రవ్యమును ఇచ్చునుగాక.
   
46.    భూమీ! నీ మీద సర్పములు ఉన్నవి. కాటు వేయు కీటకములు ఉన్నవి. హేమంతమున దాగి వర్షమున బయటపడు వృశ్చికములున్నవి. అవి నా దరి చేరకుండునుగాక. శుభములు కూర్చువానితో మమ్ము రక్షించుము.
   
47.    నేల తల్లీ! నీమీద నరులు నడచు రథములు వాహనములు సాగు - పుణ్యాత్ములు, పాపకర్ములు నడుచుదారులున్నవి. వానిలో శుభంకరములు, అతస్కరములు, శత్రు రహితములగు భద్రమార్గముల మీద మమ్ము నడిపించుము.
   
48.    శత్రువులను భరించునట్టి, పుణ్య పాపములను సహించునట్టి, మహా మహా పదార్ధములు కలిగినట్టి, వరాహము అన్వేషించునట్టి భూమి వరాహమునకు అందునుగాక.
   
49.    భూమీ! నరభక్షక వ్యాఘ్రాది ఆరణ్యక మృగములను, 'ఉలు' నామక పశువును, తోడేలును, ఋక్షీకను, రాక్షసులను మాకు దూరముననే హింసించుము. దగ్గరకు రానీకుము.
   
50.    గంధర్వ, అప్సర, దాన ప్రతి బంధక రాక్షస, సకల పిశాచములను మాలో చేరనీయకుము.
   
51.    భూమి మీద ద్విపాద జంతువులు, హంసలు, గ్రద్దలు, కాకులు, గూటి పక్షులు, పక్షులు సంచరించుచున్నవి. వాయువు దుమ్ము లేపుచున్నది. చెట్లు విరుచుచున్నది. గాలి దరికి చేరినంత నిప్పు మండుచున్నది.
   
52.    భూమి మీద రేయి నలుపు ప్రొద్దు పొదుపు ఎరుపు కలియుచున్నవి. వర్షము చేత భూమి వ్యాప్తమగు చున్నది. అట్టి మేదిని మాకు శుభ ప్రదములగు వసతులను ప్రసాదించునుగాక.
   
53.    ద్యావాపృథ్వులు, అంతరిక్షము, అగ్ని, సూర్యుడు, జలము, మేఘము, విశ్వే దేవతలు మాకు చలన శక్తి కలిగించినారు.
   
54.    నేను అణచగలవాడను. ఉత్తరుడను పేర భూమి మీద ప్రసిద్దుడను. నేను శత్రుదమనుడను సర్వదమనుడను. ప్రత్యేక దిశయందలి శత్రువును అణచి వేతును గాక.
   
55.    నీవు విస్తరించుచున్నపుడు దేవతలు నీతో "మహీ! విస్తరింపుము" అన్నారు. అప్పుడు నీయందు సుందర ప్రాణులు ప్రవేశించినారు. అప్పుడే నీవు చతుర్ధిశలను ఏర్పరచినావు.
   
56.    భూమి మీద గ్రామములు, అరణ్యములు, సభలు, సంగ్రామములు, యుద్దతంత్రములు వర్థిల్లుచున్నవి. అట్టి భూమిని మేము అందముగ వర్ణించుచున్నాము.
   
57.    భూమిలో పుట్టినవి, భూమిపైన నివసించునవి - గుర్రము వలె - దుమ్ము రేపుచున్నవి. ఈ పృథివి - మంద్ర ఇత్వరి - ఇది ఓషధులు, వనస్పతులచే లోకములను పోషించుచున్నది.
   
58.    నా మాటలు మధురములు అగునుగాక. నా చూపు పడినవాడు నన్ను సేవించునుగాక. నేను దీప్తివంతుడను, వేగవంతుడనై ఇతరులను రక్షింతునుగాక. నన్ను భయపెట్టువారిని సంహరింతునుగాక.
   
59.    భూమి శాంతమయి. సుఖదాయిని. అన్నవతి ఆమె నాకు తన పాలవంటి రసవత్పదార్దములనిచ్చి నా పక్షమున పలుకునుగాక.

60.    దాచి ఉంచిన భోజన పాత్ర భోజన సమయమున బయటపడినట్లు, సముద్రమున ఉన్న భూమిని విశ్వకర్మ హవిస్సులచే ఉద్దరించినాడు.
   
61.    పృథివీ! నీవు భువనములకు క్షేత్రమవు. అధీనవు వరప్రదాయినివి. విశాలమవు. నీయందలి తరిగిన భాగమును ఋతము నుండి తొలుత పుట్టిన ప్రజాపతి పూరించునుగాక.
   
62.    పృథివి ఫలించునుగాక. మేము ఆరోగ్యవంతులము అగుదుముగాక. యక్ష్మ రోగరహితులము అగుదుముగాక. మేము దీర్ఘాయుష్కులమై పృథివికి బలులు అర్పించువారలము అగుదుము గాక.
   
63.    భూమాతా! నాకు శుభంకర ప్రతిష్ట కలిగించుము. స్వర్గము కలిగించుము. సిరిసంపదలు కలిగించుము.
   
                                     రెండవ అనువాకము
                                     మొదటి సూక్తము - 2

   
    ఇది క్రవ్యాది నామక అగ్నిసూక్తము. "ఏనపురుషం దహన్తి సక్రవ్యాద్." నరుని తగులపెట్టునది క్రవ్యాదాగ్ని.
   
1.    క్రవ్యాదాగ్నీ! నీవు తుంగ చాప నెక్కుము. ఇది నీ స్థానముకాదు. సీసము నీ స్థానమగుచున్నది. ఇచటికి రమ్ము గోవుల, నరుల యందున్న యక్ష్మ సహితముగ బయటపడుము. దూర ప్రదేశములకు సాగిపొమ్ము.
   
2.    పాపములను, దుష్క్రుత్యములను తొలగించునట్టి నా కుడి, ఎడమ చేతులచే సమస్త యక్ష్మలను తొలగించుచున్నాను. మృత్యువును దూరమునకు విసరుచున్నాను.
   
3.    మృత్యువును దూరము చేయుచున్నాము. పాప దేవతను పారగొట్టుచున్నాము. శత్రువును తొలగించుచున్నాము.
   
    అగ్నీ! మమ్ము ద్వేషించువైర్ని భక్షింపుము. మేము ద్వేషించువారిని నీకు వప్పగించుచున్నాము.
   
4.    ఈ గోష్టమున క్రవ్యాదాగ్ని గాని వ్యాఘ్రము గాని, మరొక చోటు దొరకక ప్రవేశించినచో వానిని మసిచేయుచున్నాను. అవి జలములందలి అగ్నియందు చేరునుగాక.
   
5.    మనిషి చచ్చినంత క్రోధము గల నిన్ను రగిల్చినాము. నీ పనితీరినది. అగ్నీ! మరల నీతోనే నిన్ను వెలిగించుచున్నాము.
   
6.    అగ్నీ! ఆదిత్య, రుద్ర, వసు, బ్రహ్మ, వసునీతి, బ్రాహ్మణస్పతి నిన్ను దీర్ఘాయుత్వాయ శతశారదాయ మరల స్థాపించినారు.
   
    (శవమును కాల్చు పని ముగిసినది. మరల మనిషిని బ్రతికించు అగ్నిని స్థాపించినారు. అగ్ని ఒకటియే - విధులు వేరు.)
   
7.    క్రవ్యాదాగ్ని మరొక అగ్నిని దర్శించుటకు మా గృహమున ప్రవేశించినచో దానిని పిత్రు యజ్ఞమునకని దూరమునకు పంపుచున్నాను. అది పరమ వ్యోమమున ప్రదీప్తమగునుగాక.
   
8.    క్రవ్యాదాగ్నిని దూరస్థానమునకు పారద్రోలుచున్నాను. అది పాపమును వెంట పెట్టుకొని యమరాజును చేరునుగాక.
   
    ఇచట మరొక జాతవేదాగ్ని దేవతలకు హవిని చేర్చునుగాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.