Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

   (దేవతల కన్నముందు మనిషి ఆవిర్భవించి నాడని చెప్పుచున్నాడు. దీనికి 23వ సూక్తపు 3వ మంత్రము ప్రత్యుత్తరమగుచున్నది.)
   
                                      ఐదవ సూక్తము - 23
   
1.    కేశములు, అస్థులు, స్నావములు, మాంసము, మజ్జను నింపి శరీరమును కల్పించి కాళ్ళ మీద నిలిపినవాడు "కం లోకమను ప్రావిశత్" ఏ లోకమున ప్రవేశించినాడు?
   
    (శరీరమునందే ప్రవేశించినాడని సృష్టికర్త సృష్టి యందే ఉన్నాడని.)
   
2.    కేశములను, స్నానములను, అస్థులను, అంగపర్వములను, మజ్జను, మాంసమును ఎవడు, ఎట్లు ఏర్పరచినాడు?
   
3.    'సంసిచులు' అని దేవతలు మజ్జ, మాంసాదులను నింపి మర్త్యుడగు మానవుని కల్పించి అతనియందు ప్రవేశించినారు.
   
4.    ఊరువులు, పాదములు - అష్టీవంతములు, శిరస్సు, నోరు, పృష్టము, జిహ్వ, పార్శ్వములను విజ్ఞుడగు ఏ ఋషి కూర్చినాడు?
   
5.    శిరస్సు, చేతులు, ముఖము, జిహ్వ, గ్రీవము, కీకసములను తోలుతో కప్పి 'సమదధాన్మహీ" భూమి సిద్దము చేసినది. "మహతీ సంధాన కర్త్రీ దేవతా సమదధాత్" అని, సాయణుడు.
   
6.    ఆ విధముగా గొప్పగా కూర్చబడిన శరీరము ఏ విధముగా రోచమానమగుచున్నది? దీనికి వర్ణమును ఎవరు ఏర్పరచినారు?
   
7.    దేవతలు సమిష్టిగా వధూవరులను సృష్టించినారు. సమస్త విశ్వములను నియంత్రించు దేవి వానికి వర్ణమును ఏర్పరచినది.
   
8.    త్వష్టను అతని తండ్రి యగు త్వష్ట సృష్టించిన రీతి మర్త్యుని దేహమున గృహము చేసికొని దేవతలు అందు ప్రవేశించినారు.
   
9.    అట్టి దేహమునందు స్వప్నము, తంద్రత, విర్రుతి, పాపము అను దేవతలు ప్రవేశించినారు. అట్లే జర ఖాలత్యము, పాలిత్యము శరీరమున ప్రవేశించినవి.
   
10.    చౌర్యము, దుష్క్రుతము, దుష్క్రుత్య పాపము, సత్యము, యజ్ఞము, బృహత్ యశము శరీరమున ప్రవేశించినవి.
           
                                       ఆరవ సూక్తము - 24
   
1.    సమృద్ది, అసమృద్ది - మిత్రులు, అమిత్రులు - ఆకలి - సకల తృష్టలు "శరీరమను ప్రావిశన్"
   
2.    నింద, అనింద - హర్షము, హర్షము కానిది - దక్షిణ - శ్రద్ద, అశ్రద్ద, "శరీరమను ప్రావిశన్"
   
3.    విద్య, అవిద్య - ఉపదేశ్యము, అనుపదేశ్యము - బ్రహ్మ - ఋగ్వజుస్సామములు "శరీరమను ప్రావిశన్"
   

4.    ఆనందము - మోదములు - ప్రమోదము - అభిమోదము - ముదము - హాసము - వాసనలు - నృత్యములు "శరీరమను ప్రావిశన్"
   
5.    ఆలాపము, ప్రలాపము, అభిలాపము, లపము, ఆయుజము, ప్రయుజము, యుజము అన్నియు శరీరమున ప్రవేశించినవి.
   
6.    ప్రాణము, అపానము, చెవులు - కన్నులు, అక్షితి, క్షితి, వ్యానము, ఉదానము, వాక్కు, మనసు దేహంలో ప్రవేశించును. అవి తమ తమ విధులందు నిమగ్నములు అగును.
   
7.    ఆశిషములు, ప్రశిషములు, సంశిషములు, విశిషములు, విత్తములు, సకల సంకల్పములు "శరీరమను ప్రావిశన్"
   
8.    స్నాన యోగ్యములు, అయోగ్యములు, వేగవంతులు, కృపణములు, గుహ్యములు, శుక్రములు, స్థూలములగు జలములు బీభత్సమగు మానవ శరీరమున చేరినవి.
   
9.    అస్థులను సమిధలను చేసి, ఎనిమిది జలములను చేర్చి, శక్తిని ఆజ్యము చేసి దేవతలు పురుషుని యందు ప్రవేశించినారు.
   
10.    జలములు, దేవతలు, విరాట్ బ్రహ్మ, ప్రజాపతియు బ్రహ్మ శరీరమున ప్రవేశించినారు.
   
11.    మానవుని కన్నులను సూర్యుడు, ప్రాణములను వాయువు పంచుకున్నారు. పాంచభౌతిక శరీరమును అగ్నికి వప్పగించినారు.
   
12.    సమస్త దేవతలు, గోవులు, గోష్ఠములు ఈ దేహమునందున్నందున "విద్వాన్ పురషమిదం బ్రహ్మేతి మన్యతే" విద్వాంసుడగు వాడు మానవుని బ్రహ్మయని భావించుచున్నాడు.
   
13.    మరణానంతరము ప్రాణము మూడుగా విభజించబడి పోవుచున్నది. "అద ఏకేన గచ్చత్యద ఏకేన గచ్చతీ హైకేన నిషేవతే" ఒకటి పోవుచున్నది, మరొకటి పోవుచున్నది. ఇంకొకటి ఇచటనే అనుభవించుచున్నది.
   
    (ఒకటి స్వర్గమునకు, ఒకటి నరకమునకు పోయి మూడవది ఈ లోకమున అనుభవించుచున్నదని సాయణ వ్యాఖ్య.)
   
14.    సకలమును ఆర్ధ్రము చేయు వర్ధన జలముల మధ్య శరీరము నిలిచి ఉన్నది. బలాత్మక సూత్రాత్మ దేహములోనను, బయటను ఉన్నాడు. కావుననే అతడు "శవః" అనబడుచున్నాడు.
   
                                   అయిదవ అనువాకము
                                      మొదటి సూక్తము - 25

   
వినియోగము :-

   
    1 - 3, 4 - 6 అర్ధ సూక్తములు అనబడును. విజయము కోరు రాజు యుద్ద సమయమున ఈ రెండు అర్ధ సూక్తములచే అంగానుసారము తన భటులను గూర్చి సంప్రైష మరియు జపము చేయునది. శత్రుంజయ కర్మమున ఈ అనువాకముచే ఘ్రుత బిందువులను, సత్తులను ఆహుతి ఇచ్చునది. దీనిచే ధనురూపి ఇంధనము గల అగ్ని యందు పృషదాజ్యమున తడిసిన ధనుష సమిధలను వేయునది. బాణరూప ఇంధనముల అగ్నియందు పృషదాజ్యమున తడిసిన బాణ సమిధలను వేయునది. ఈ అనువాకముచే పృష దాజ్యమున ధనుస్సును సంపాతిత, అభిమంత్రిత, విమార్జనము చేసి విజయాభిలాషి యోద్దకు ఇచ్చునది. దీనిచే జనుమును పృషదాజ్యముచే సంపాతిత, అభిమంత్రితములు చేసి శత్రుసేనలు తిరుగుచోట వేయునది. మూంజ పాశములను, పచ్చి పాత్రలను, మూడు చోట్ల అతికిన ఇనుప చువ్వను పృష దాజ్యముచే ఈ అనువాకమున సంపాతిత, అభిమంత్రితములు చేసి యుద్దభూమి మీద వేయునది. శితిపది గోవును ఈ అనువాకము, పృషదాజ్యముచే సంపాతిత, అభిమంత్రితములు చేసి రాజు యొక్క కేతుదండము నందు ఏకాంతమున కట్టి వేయునది. రెండవ దానిని అట్లే చేసి శత్రుసేనా మధ్యమున విడుచునది. తదుపరి యుద్దము చేయుటకు సేనా నాయకుని పంపునది.
   
1.    అర్భుదా! మా సైనికుల బాహువులు, వారి అమ్ములు, ధనుస్సులు, శౌర్యము, పరశువులు, అన్య ఆయుధములు, ఆత్మస్థైర్యము అన్నింటిని మా శత్రువుల గుండెలందు చేర్చుము. వారికి ఉత్పాతములు చూపుము.
   
    (అర్భుదః కాద్రవేయః సర్పఋషిర్మన్త్రకృత్ - అర్భుదుడు కద్రువ కొడుకు - సర్పర్షి మంత్రకృతుడు అని సాయణ వ్యాఖ్య.)
   
2.    మాకు మిత్రులగు దేవజనులారా! లేవండి. యుద్ద సన్నద్ధులు కండి. మా భటులను చక్కగ చూడండి. వారిని రక్షించండి.
   
    అర్భుదా! మాకు మిత్రులగు వారికి హాని కలిగించకుము.
   
3.    అర్భుదా! లెమ్ము యుద్దము సాగించుము. ఆదాన, సందాన రజ్జువులతో శత్రుసేనను కట్టివేయుము.
   
4.    అర్బుద దేవత, న్యర్భుద్ది యను ఈశానులను ద్యావాపృథ్వులు, అంతరిక్షము చుట్టియున్నవి. వారి బలమున మా సేనచే శత్రువును జయించుచున్నాము.
   
    (అర్భుదన్యర్భుదులు కద్రువ పుత్రులు.)
   
5.    దేవా జనులైన అర్భుదా! సేనా సహితముగ ఉత్తిష్ఠ శత్రుసేనలను భంగపరచుము. ఆ శత్రుసేనలను సర్ప పరివేష్టము చేయుము.
   
6.    న్యర్భుదమా! చూపును మందగింప చేయు ఏడు ఉత్పాతములను శత్రువునకు చూపుము. మా ఘ్రుతాహుతులందుకొని ఆ ఉత్పాతముల సహితముగ మా సైన్యము వెంట ఉత్తిష్ఠ.
   
7.    అర్భుదా! నీవు శత్రుసేన యందలి పురుషులను కాటువేయగా వారి భార్యలు కన్నీరు కార్చుచు, కర్ణాభరణ రహితలై, తలలు విరియబోసుకుని ఏడ్చెదరు గాక.
   
8.    అర్భుదా! నీ కాటుకు శత్రుస్త్రీలు గొల్లుమని ఏడ్చుచు వారి పుత్రులను, పతిని, అన్నదమ్ములను తలచుకొని ఏడ్చెదరు గాక.
       
9.    అర్భుదా! నీ కాటుకు చచ్చిన శత్రుసేనలను కాకులు, గద్దలు తిని కడుపు నింపు కొనును గాక.
   
10.    అర్బుదా! నీ కాటునకు చచ్చిన శత్రుసేనల పీనుగులను కుక్కలు, నక్కలు, చీమలు, దోమలు తిని తృప్తి చెందుదురు గాక.
   
                                    రెండవ సూక్తము - 26       
   
1.    న్యర్బుద, అర్భుదులారా! శత్రువుల ప్రాణాపానములను పట్టండి. వానిని సమూలముగ పెరికి వేయండి.
   
    అర్బుదా! నీవు కాటు వేసిన చోటును పట్టుకొని, శత్రువులు మొత్తుకొందురు గాక.
   
2.    న్యర్భుదా! నీవు మా శత్రువును గడగడలాడించుము. వారు స్థానభ్రష్టులై విచలితులు అగుదురు గాక. వారు మమ్ము చూచి బెదురునట్లు చేయుము. శత్రువుల కాలు సేతులు విరిచి కదలకుండ చేయుము.
   
3.    అర్భుదా! నీవు కాటు వేసినంత శత్రువు బాహువులు అచేతనములు అగును గాక. వారి సంకల్పములను వారు మరుతురు గాక. ఇక వారిని నిశ్శేషముగ హతమార్చుము.   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.