Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
12. పంచదిశ దేవేరులు, ద్వాదశమాస దేవతలు, సంవత్సర దంష్ట్రలు మాకు సదా శుభంకరులు అగుదురు గాక.
13. మాతల ఏ అమృతమయభేషజములను కొన్నాడో, ఏ భేషజములను ఇంద్రుడు జలములందు ప్రవేశపెట్టినాడో ఆ జలము మాకు ఓషధము అగును గాక.
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 19
వినియోగము :- 1-3 సూక్తములు బ్రహ్మౌధన నామక సవ, సవ యజ్ఞమున హోమించగా మిగిలిన ఓదనమును, సర్వ జగత్కారణభూత బ్రహ్మము యొక్క భేద రాహిత్యమును స్తుతించబడినది. వానియందే వీని వినియోగము.
1. ఇది ఉచ్చిష్ట, శేష నామము గలది. దీనియందు లోకము, ఇంద్రాగ్నులు - విశ్వమంతయు సమాహిమై ఉన్నది.
2. ఉచ్చిష్టమునందే ద్యావాపృథ్వులు, విశ్వము, భూతములు, జలము, సముద్రము, చంద్రుడు సమాహితులై ఉన్నారు.
3. ఉచ్చిష్టము నందే సత్, అసత్తులు, మృత్యువు, మృత్యుబలము, ప్రజాపతి, లోకులు, వరుణుడు, సోమద్రవములు సమాహితములు అవి మాకు సిరుల నిచ్చును గాక.
4. దృఢదేహులు, స్థిరులు అగు జగములను సృష్టించు తొమ్మిదిమంది బ్రహ్మలు - వారిని సృష్టించిన దశమ బ్రహ్మ ఉచ్చిష్టమందు నిలిచి ఉన్నారు. ఇంకను చక్రమునకు నాభివంటి సమస్త దేవతలు ఉచ్చిష్టమున సమాహితులగుచున్నారు.
5. ఋగ్యజుస్సామములు, ఉద్గీథలు, ప్రస్తుతములు, స్తుతములు, హింకారములు, స్వరములు, సామములు, మేడులు - దీని యందే ఉన్నవి.
(ఉద్గాత పాడునది ఉద్గీథ. ప్రస్తోత పాడునది ప్రస్తుతము ఉద్గాతము యొక్క ఆదియందు ప్రయుజ్య మాన 'హిం' శబ్దము 'హింకారము' స్వరములు ఏడు ఋక్కులను అక్షరములకు గానములకు కలుపునది "మేడి".")
6. ఇంద్రాగ్నులు, పవమానము, మహా నామదీక్ష, యజ్ఞాంగములు, తల్లి గర్భమున వలె, ఉచ్చిష్టమున ఉన్నవి.
7. రాజసూయము, వాజపేయము, అగ్నిష్టోమము, అధ్వరము, అర్కయజ్ఞము, అశ్వమేధము, జీవబర్హి, మదింతమములు దీనియందే నిక్షిప్తములు.
8. అగ్న్యాధేయ, కోరికలు తీర్చు ఛందోసహిత దీక్ష, ఉత్పన్నము, యజ్ఞములు, సత్రములు "ఉచ్చిష్టే సమాహితమ్."
9. అగ్ని హోత్రము, శ్రద్ద వషట్కారము, వ్రతము తపస్సు, దక్షిణ, ఇష్ట్రి, వాపీకూపాది నిర్మాణము, - "ఉచ్చిష్టే సమాహితమ్"
10. ఏకరాత్రము, ద్విరాత్రము, సద్యఃక్రీః, ప్రక్రీః, ఉక్ధ్యః, అన్నియు నిహిత ముచ్చిష్టే యజ్ఞాణువులు విద్యయందు నిక్షిప్తములు.
(సద్యఃక్రీః - వెంటనే సోమము క్రయమాణమగునది. ప్రక్రీః - ప్రకృష్టముగ సోమము క్రయమాణమగునది.)
రెండవ సూక్తము - 20
1. చతుః రాత్రః - పంచరాత్రః - షట్ రాత్రః -వీనికి రెండింతల రాత్రులు - షోడశి - సప్తరాత్రమను అమృతమునందున్న సకల యజ్ఞములును ఉచ్చిష్టమున సమాహితములు.
2. ప్రతీహరి -నిధనము - విశ్వజిత్ - అభిజిత్ - సాహ్నము - అతిరాత్రము - ద్వాదశాహము ఉచ్చిష్టమునందే సమాహితములు.
3. సూనృతా - సంనతిః - క్షేమః - స్వధ - అన్నము - అమృత సహితముగ అన్నియు ఉచ్చిష్టమునందే ఉన్నవి. ఇవి కోరికలను తీర్చి తృప్తి కలిగించుచున్నవి.
4. నవఖండ భూమి, సముద్రము, దివి ఉచ్చిష్దేధిశ్రితా. సూర్యుని ప్రకాశము, రాత్రింబవళ్ళు దానియందే ఉన్నవి. అవి నాయందు చేరును గాక.
5. ఉపహవ్యం, విఘావంతం, ఇంకను గుహ్యములగు యజ్ఞములు ఉచ్చిష్టమందున్నవి. ఉచ్చిష్టమే సమస్త లోకములను పోషించు భర్తయు, సృష్టించు పితయు అగుచున్నారు.
6. ఉచ్చిష్టము తన స్రష్టకు పితయగుచున్నాడు. ప్రాణము పౌత్రుడు, పితామహుడు అగుచున్నారు. అది విశ్వములకు ప్రభువై, నష్టపరచక, వర్షించుచు భూమి మీద ఉండును.
7. ఋతం సత్యం తపో రాష్ట్రం శ్రమో ధర్మశ్చ కర్మచ |
భృతం భవిష్యదుచ్చిష్టే వీర్యం లక్ష్మీర్బలం బలే ||
8. సమృద్ది, ఓజస్సు, సంకల్పము, క్షాత్రము, ఆరు ఉర్వులు, సంవత్సరము, ఇడ, ప్రైష, గ్రహ, హవి అన్నియు ఉచ్చిష్ట మందున్నవి.
9. చతుర్హోతలు, అక్షయ చాతుర్మాస్యములు, నీవిదః, యజ్ఞములు, హోతలు, పశుబంధఇష్టులు ఉచ్చిష్టమునందే సమాహితములు.
10. అర్ధమాసములు, మాసములు, ఋతువులు, ఋతుసంబంధములు, ఘోషించు జలము, ఉరుముల మేఘము, శృతి, మహి ఉచ్చిష్టమును ఆశ్రయించి ఉన్నవి.
మూడవ సూక్తము - 21
1. గులక రాళ్ళు, ఇసుక, మంచిరాళ్ళు, ఓషధులు, లతలు, తృణములు, మేఘములు, విద్యుత్తు, వర్షము "ఉచ్చిష్టే సంశ్రితా శ్రితా".
2. పూర్ణ సిద్ది, ప్రాప్తి, సమాప్తి, వ్యాప్తి, అత్యాప్తి, తేజస్సు, ప్రగతి, సమృద్ది "ఉచ్చిష్టే నిహితా హితా"
3. ఊపిరి పీల్చి జీవించువారు, కంటితో చూచువారు "దివికి సంబంధించిన దివియందు స్థిరులైన దేవతలు ఉచ్చిష్టము నుండియే పుట్టినారు.
ఉచ్చిష్టాజ్జజ్ఙిరే సర్వే దివి దేవా దివిశ్రితః
4. ఋచః సామాని చ్చన్దాంసి పురాణం యజుషాసహ |
"ఉచ్చిష్టాజ్జజ్ఙిరే సర్వే దివి దేవా దివిశ్రితః"
5. ప్రాణాపానములు, నేత్రములు, కర్ణములు, క్షితాక్షితము.
ఉచ్చిష్టాజ్జజ్ఙిరే సర్వే దివి దేవా దివిశ్రితః
6. ఆనందము, మోదము, ప్రమోదము, అభియోగము.
ఉచ్చిష్టాజ్జజ్ఙిరే సర్వే దివి దేవా దివిశ్రితః
7. దేవాః పితరో మనుష్యా గన్దర్వాప్సరసశ్చయే |
ఉచ్చిష్టాజ్జజ్ఙిరే సర్వే దివి దేవా దివిశ్రితః
ఉచ్సిష్టము ఎంగిలి కాదు. మిగిలిన పదార్ధము. మిగిలిన పదార్ధము వృథాచేయుట నష్టపరచుట అగుచున్నది. శేషపదార్ధమును వాడుకలోనికి తెచ్చుట సమాజమునకు హితకరమగుచున్నది. ఈ మూడు సూక్తములు దానిని ప్రతిపాదించినట్లున్నది. ఒక పదార్ధమునకు పవిత్రత కలిగించినచో దాని మీద పూజ్యభావము గౌరవము ఏర్పడును. మన జీవితమును కాపాడు అన్న శేషమును సదుపయోగము చేయవలెను.
"తపసా చీయతే బ్రహ్మ తతోన్నం అభిజాయతే
అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మను చామృతమ్ ||
నాలుగవ సూక్తము - 22
వినియోగము :- 4 - 6 అర్ధసూక్తములు బ్రహ్మ యజ్ఞజపమున వినియోగము.
1. మన్యువు సంకల్పము గృహమున జాయను వివాహమాడినారు. అప్పుడు బంధువులు, వరుని పక్షపు వారు, పెద్దలు ఎవరైనారు?
(సృష్టేః ప్రాక్ కస్యచిదపి అభావాద్ ఏవం ప్రశ్నః - సృష్టికి ముందు ఏదియు లేనందున ఈ ప్రశ్న అని సాయణాచార్యుని వ్యాఖ్య.)
2. తపస్సు, కర్మ బంధుజనులు అయినారు. సముద్ర మధ్యము స్థలమైనది. వరుని తరపువాడు బ్రహ్మకాగా వధువు పక్షపు పెద్ద 'జ్యేష్టుడు' అయినాడు.
3. పూర్వము దేవతల కన్న మొదలు పదిమంది దేవతలు ఆవిర్భవించినారు. పరోక్షముగ వానిని గ్రహించినవాడు మహా విద్వాంసుడు అగుచున్నాడు.
(5 జ్ఞానేంద్రియములు +5 కర్మేంద్రియములు ఇట్లు పది ఇంద్రియములు పది దేవతలు అయినారని సాయణుడు.)
4. ప్రాణ, అపానములు, చక్షువులు, శ్రోత్రములు, క్షయ, అక్షయములు, వ్యాన, ఉదానములు, వాక్కు, మనస్సు ఇవి మానవుని సంకల్పమును ఫలింప చేయుచున్నవి.
5. ఋతువులు, ధాత, బృహస్పతి, ఇంద్రాగ్నులు, అశ్వినులు "అజాతా" - అప్పటికి పుట్టలేదు. అట్లగుటచే వారు తమ ఉత్పత్తికని ఏ మహామహుని ఉపసించినారు?
6. అప్పటికి మహార్ణవ మధ్యము, తపస్సు, కర్మ ఉండినవి. వారు తపము కర్మము తోనే "జ్యేష్టము పాసత"
7. ఈ భూమికి పూర్వము ఉండిన భూమిని తెలిసినవాడు విద్వాంసుడు అగుచున్నాడు. వీటిని పరిపూర్ణముగా తెలిసిన వానిని 'పురాణవిత్' అనుచున్నారు.
8. ఇంద్రుడు, సోముడు, అగ్ని, త్వష్ట, ధాతా ఎట్లు సంభవించినారు?
9. పూర్వ కల్పపు ఇంద్రుని నుంచి ఇంద్రుడు, సోమము నుండి సోమము, అగ్ని నుండి అగ్ని, త్వష్ట నుండి త్వష్ట, ధాత నుండి ధాత ప్రభవించినారు.
(కల్పారంభమున సృష్టి కల్పాంతమునకు పూర్వము ఉన్నట్లే జరుగుచున్నది. ఇదొక ఆవర్తము. అంతర్హితములు ఆవిర్భవించుచున్నవి.)
10. పూర్వము దేవతల కన్నముందు పుట్టిన పదిమంది దేవతలు లోకమునకు పుత్రులను ఇచ్చి ఏ లోకమునకు ఏగినారు?





