Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
7. బ్రహ్మచారి జనించి బ్రాహ్మణులకు తీర్ధవసతిని, ప్రజాపతిని, లోకమును, పరమేష్టిని విరాజిల్లవేయుచున్నాడు. అతడు గర్భుడై సృష్టికి మూలమగు చున్నాడు. ఇంద్రుడై అసుర సంహారకుడు అగుచున్నాడు.
8. ఆచార్యుడు విశాల ఆకాశమును, గంభీర పృథ్విని క్షణములో కల్పించినాడు. అట్టి ఆచార్యుని సహితము బ్రహ్మచారి తన తపస్సుచే రక్షించుచున్నాడు. అతనిని సమస్త దేవతలు సమానముగ అనుగ్రహించుచున్నారు.
9. బ్రహ్మచారి తొలుత ఈ విశాల పృథ్విని భిక్షగా గ్రహించినాడు. తదుపరి దివిని, అతడు అట్టి ద్యావాపృథ్వులను సమిధలను వేసి అగ్నిని ఉపాసించినాడు. ఈ సమస్త భువనములు దానియందే ప్రతిష్టితములై ఉన్నవి.
10. పైన ఉన్న ద్యులోకము, క్రిందనున్న భూలోకములందలి నిధులు బ్రహ్మాణుని హృదయ కుమారమున నిక్షిప్తములు. బ్రహ్మచారి ఆ నిధులను తన తపస్సుచే రక్షించుచున్నాడు. అది మాత్రమే అతనిని బ్రహ్మ - వేదవిధుని చేయుచున్నది.
రెండవ సూక్తము - 15
1. పృథివి యొక్క అధః ప్రదేశమున ఒక అగ్ని పృథివి పైన ఒక అగ్ని ఉన్నవి. ద్యావాపృథ్వుల మధ్య ఆ ఉభయ అగ్నులు కలుసుకొనుచున్నవి. అట్లగుటచే కిరణములు దృఢ పడుచున్నవి. ఉభయాగ్నుల ప్రభావము గల పృథివి మీద బ్రహ్మచారి తపస్సంపన్నుడై విరాజిల్లుచున్నాడు.
2. వరుణుడు ఉరుముచు, మేఘములందు మెరయుచు బృహత్ ప్రజననమగు వర్షమును భూమి మీద కురిపించుచున్నాడు. బ్రహ్మచారి తన తపో మహిమచే సానువులను నేలను తడుపుచున్నాడు. దాని వలననే చతుర్ధిశలు 'జీవన్తి'.
3. అగ్నియందు, చంద్రునియందు, వాయువునందు, జలములందు బ్రహ్మచారి సమిధలను అర్పించుచున్నాడు. ఆ సమిధల దీప్తులు ఆకసమున ధనురాకారములు అగుచున్నవి. వాని యందున్న శక్తి వర్షరూపమున దిగుచున్నది.
4. ఆచార్యుడు మృత్యువగుచున్నాడు. వరుణుడగుచున్నాడు. సోముడు అగుచున్నాడు. ఓషధులు అగుచున్నాడు. క్షీరములు అగుచున్నాడు. వరుణరూప ఆచార్యుని శక్తి జీమూతమగుచున్నది. దాని వలననే సకల జగములు జీవించుచున్నవి.
5. వరుణుడు ఆచార్యుడై అక్షయ జలసంపన్నుడు అగుచున్నాడు. ఆ వరుణుడే తన జనకుడగు ప్రజాపతి నుండి ఆ వరమే కోరినాడు. మిత్రుడు బ్రహ్మచారియై గురువగు వరుణునకు తన శరీరమును కూడ లక్ష్యపెట్టక గురుదక్షిణ సమర్పించినాడు.
6. ఆచార్యుడు బ్రహ్మచారియు, బ్రహ్మచారి ప్రజాపతి అగుచున్నారు. ప్రజాపతి స్వతంత్రుడై, విరాట్ రూపుడై, ఇంద్రుడై విరాజిల్లుచున్నాడు.
7. బ్రహ్మచర్యము, తపస్సుచే రాజు రాజ్యమును రక్షించుచున్నాడు. ఆచార్యుడు బ్రహ్మచర్యమును ఆచరించుచునే బ్రహ్మచారికి ఉపదేశించవలెను.
8. కన్య బ్రహ్మచర్యమును అవలంబించుట వలననే యువకుడగు పతిని పొందుచున్నది. ఎద్దు, అశ్వము సహితము బ్రహ్మచర్యము వలననే గడ్డి తినుచున్నవి.
9. బ్రహ్మచర్యము వలననే దేవతలు మృత్యువును జయించినారు. బ్రహ్మచర్యము వలననే ఇంద్రుడు దేవతలకు స్వర్గమును ఏర్పరచినాడు.
10. ఓషధులు, భూత భవిష్యత్తులు, అహోరాత్రులు, వనస్పతులు, ఋతుసహిత సంవత్సరములు బ్రహ్మచర్యము నుండియే అవతరించినవి.
మూడవ సూక్తము - 16
1. భువిమీద, దివి మీద ప్రాణులు అరణ్య మృగములు, గ్రామజంతువులు, రెక్కలు లేని, రెక్కలు ఉన్న ప్రాణులన్నియు బ్రహ్మచర్యము నుండియే సంభవించినవి.
2. వేరు వేరు ప్రజాపతులందరు తమ ప్రాణములను పోషించుకొనుచున్నారు. వారి నందరను బ్రహ్మచారి యందు గల బ్రహ్మ రక్షించుచున్నాడు.
3. అతనిని దేవతలు దర్శించినారు. అతడు అపరాజితుడు, రోచమానుడై వర్థిల్లుచున్నాడు. అతని నుండియే దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మజ్యేష్టుడు మున్నగు వారందరు అమృత సహితులై అవతరించినారు.
4. బ్రహ్మచారి దేదీప్యమానుడగు బ్రహ్మను తనయందు దర్శించుచున్నాడు. అతని యందు సమస్త దేవతలు సంబద్దులై ఉన్నారు. అతడు ప్రాణా పానములను, వ్యానం - వాచం -మనః హృదయం - బ్రహ్మ - మేధాం సృష్టించినాడు.
5. మాకు చక్షుః శ్రోతమ్, యశః ప్రసాదించుము. అన్నము, రేతస్సు, దేహము, ఉదరము ప్రసాదించుము.
6. బ్రహ్మచారి పై వానిని కల్పించుచు జలమధ్యమున నిలిచి తపస్సు చేయుచు సముద్రమున వర్తిల్లుచున్నాడు. అతడు స్నాతుడై, బభ్రు, పింగళ వర్ణుడై భూమి మీద ప్రకాశించుచున్నాడు.
(ఈ మూడు సూక్తములందు విద్యామహిమను, జ్ఞాన ప్రకాశమును, మాహాత్మ్యమును వర్ణించినాడు. విద్యా, జ్ఞాన, వివేక ప్రచారమునకు అతిశయోక్తులున్నను జ్ఞాన పిపాసికి అవి సహజోక్తులే అగుచున్నవి.)
నాలుగవ సూక్తము - 17
వినియోగము :- 4, 5 అర్ధసూక్తములు బృహద్గణ, లఘు గణములందు వీని పాఠమున్నందున శాంత్యుదకాభిమంత్రణమున వినియోగము. విధి చెప్పబడని అన్ని దానములందు ఆజ్య తంత్రమగు ఈ సూక్తముచే హోమము చేయునది.
1. అగ్నిని - వనస్పతులను - ఓషధులను - లతలను - ఇంద్రుని - బృహస్పతిని - సూర్యుని స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః" వారు మమ్ము పాపవిముక్తులను చేయుదురు గాక.
2. రాజా వరుణుని, మిత్రుని, విష్ణువును, భగుని, అంశుని, వివస్వతుని స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
3. సవితాదేవుని, ధాతను, పూషను, అగ్రియుడగు త్వష్టను స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
4. గంధర్వాప్సరో బ్రూమో అశ్వినా బ్రహ్మణస్పతిం |
ఆర్యమానామ యో దేవస్తేనో ముంచన్త్వం హసః ||
5. అహోరాత్రే ఇదం బ్రూమః సూర్యా చన్ధ్రమసా వుభా |
విశ్వానాదిత్యాన్ బ్రూమస్తేనో ముంచన్త్వం హసః ||
6. వాతం బ్రూమః పర్జన్య మన్తరిక్షమథో దిశః |
ఆశాశ్చ సర్వా బ్రూమస్తే నో ముంచన్త్వం హంసః ||
7. శాపము వలన కలిగిన పాపము నుంచి నాకు రాత్రింబవళ్ళు, ఉషస్సు, సోమదేవత, చంద్రుడు విముక్తి కలిగింతురు గాక.
8. దివి, భువి మీది వారిని, ఆరణ్యక మృగములను, పశువులను, శకుంతములను, పక్షులను స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
9. భవుని - శర్వుని - పశుపతియగు రుద్రుని స్తుతించుచున్నాము. వారును, మాకు తెలిసిన దేవతల ఆయు, ధనములను మాకు సదా శుభములు కలిగింతురు గాక.
10. దివిని, భువిని, నక్షత్రములను, పర్వతములను, నదులను, వాగులను స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
ఐదవ సూక్తము - 18
వినియోగము :- పూర్వసూక్తమున చెప్పబడినది.
శ్రౌత దర్శపూర్ణమాసపు పాశిత్ర భక్షణ పిదప 13 ఋక్కుచే బ్రహ్మ జలమున మార్జనము చేయునది.
1. సప్తర్షులను, జలదేవతలను, ప్రజాపతిని, పితరులను, శ్రేష్టుడగు యముని స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
2. ద్యులోకమునందలి దేవతలు అంతరిక్షము నందలి వారు, పృథివి యందలి సమర్దులగు దేవతలు "తేనో ముంచన్త్వం హసః"
3. ఆదిత్యులు, రుద్రులు, వసువులు, దివి యందలి దేవతలు, అథర్వ, అంగిర ఋషులు, మనీషులు "తేనో ముంచన్త్వం హసః"
4. యజ్ఞమును, యజమానిని, ఋక్కులను, సామములను, యజుస్సులను హోతను స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
5. ఓషధుల పంచరాజ్యములను, లతలందు శ్రేష్ఠమగు సోమమును, దర్భలను, భంగములను, యవలను సహములను స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
6. బాధించువారిని, రాక్షసులను, సర్పములను, పుణ్య జనులను, నూటొక్కమృత్యువులను స్తుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
7. ఋతువులను, ఋతుపతులను, చాంద్రమాన, సౌరమన సమ సంవత్సరములను, మాసములను నుతించుచున్నాము. "తేనో ముంచన్త్వం హసః"
8. దక్షిణ దిశయందున్న, పశ్చిమ దిశయందున్న, ఉత్తర దిశయందున్న, ప్రాగ్దిశయందున్న దేవతలారా! విచ్చేయండి. "తేనో ముంచన్త్వం హసః"
9. విశ్వేదేవతలను, సత్యసంధులను, యజ్ఞవర్దకులను స్తుతించుచున్నాము. వారు సమస్త పత్నుల సహితముగ "తేనో ముంచన్త్వం హసః"
10. సమస్త దేవతలను, సత్య సంధులను, యజ్ఞవర్దకులను స్తుతించుచున్నాము. వారు భార్యల సహితులై "తేనో ముంచన్త్వం హసః"
11. భూతములను, భూతపతిని, భూతనేతను నుతించుచున్నాము. సర్వ భూతములు కలసి "తేనో ముంచన్త్వం హసః"





