Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
18. ప్రాచీన ఋషులు ఏ ప్రతిష్టచే ప్రాశనము చేసినారో దానితో కాక అన్యముచే ప్రాశనము చేసినవాడు ప్రతిష్ఠారహితుడు అగుచున్నాడు.
నేను అవాఙ్ముఖముగ గాని, పత్యఙ్ముఖముగ గాని, పరాఙ్ముఖముగ గాని పాశనము చేయలేదు. ప్రతిష్ఠా పూర్వకముగనే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి ఏవం వేద"
మూడవ సూక్తము - 10
వినియోగము :- మొదటి సూక్తమున చెప్పబడినది.
1. ఈ ఓదనమే సూర్యమండల మధ్యవర్తి యగుచున్నది.
2. ఓదనము సూర్యమండల మధ్యవర్తియని తెలిసినవాడు సూర్యలోకము అగుచున్నాడు.
3. ప్రజాపతి ఈ ఓదనముననే ముప్పదిమూడు మంది దేవతలను, లోకములను కల్పించినాడు.
4. ఆ లోకముల ప్రజ్ఞానము కొరకు యజ్ఞమును సృష్టించినాడు.
5. ఈ విషయములను తెలిసికొన్న విద్వాంసునకు విఘ్నము కలిగించు వాని ప్రాణములు నిరోధించ బడుచున్నవి.
(ఇది అనిష్టాచరణమగుచున్నది.)
6. ప్రాణ నిరోధము మాత్రమే కాదు; సర్వము కోల్పోయిన వాడు అగుచున్నాడు.
7. ప్రాణనిరోధము, సర్వము కోల్పోవుట మాత్రమే కాదు అకాల మరణము ప్రాప్తించుచున్నది.
నాలుగవ సూక్తము - 11
వినియోగము :- 11 - 13 సూక్తములకు ఒకే వినియోగము.
ఈ సూక్తమును ఉపనయన కర్మయందు బాలకుని నాభినిస్పృశించి ఆచార్యుడు జపించునది. దీనిచే బాలుని కుడిచెవిలో అనుమంత్రించునది. ఋషి హస్తముచే ఆయుష్కాముని శరీరమును అనుమంత్రించునది. ఆయుష్కర్మమున దీని వినియోగము అమృత మహాశాంతి యందు దీనిచే ధాన్యము యవల మణిని కట్టునది. గ్రహ యజ్ఞమున దీనిచే శనిగ్రహమునకు ఘ్రుత హోమము, సమిదాధానము లేక ఉపస్థానము చేయునది. శాంతి కొరకు చేయు లక్ష హోమమున దీని వినియోగము.
1. ఇది సర్వము ఎవని వశమునందున్నదో, ఈ ప్రాణులందరకు సర్వేశ్వరుడు ఎవడో, ఎవని యందు ఇది సాంతము నిలిచిఉన్నదో అట్టి ప్రాణమునకు నమః
2. ధ్వని చేయు ప్రాణమునకు, గర్జించు ప్రాణమునకు నమస్కారము. విద్యుత్ ప్రాణమునకు, వర్షించు ప్రాణమునకు ప్రణామము.
3. ప్రాణము ఉరిమినంత ఓషధులు శబ్దించుచున్నవి. గర్భములు దాల్చి ధాన్యాదులను పండించుచున్నవి.
4. కాలము ననుసరించి ప్రాణము ఓషధుల కొరకు ఉరుముచున్నది. అప్పుడు భూమిని ఆశ్రయించి ఉన్న సమస్తము సంబర పడుచున్నది.
5. ప్రాణము వర్షము కురిపించి మహా పృథివిని తడిపినపుడు తమకు మహోత్సవము జరుగునని పశువులు సంబర పడుచున్నవి.
6. ప్రాణముచే అభిషిక్తలైన ఓషధులు ప్రాణముతో ఇట్లనుచున్నవి:-
"ప్రాణమా! మాకు ఆయువు కలిగించుము మాకు సువాసనలు కూర్చుము"
7. ప్రాణమా! లోనికి వచ్చుచున్న, బయటికి పోవుచును నీవు నమస్తే నిలిచిన నీకు నమస్తే కూర్చున్న నీకు నమస్తే.
8. ప్రాణమునకు ప్రణామము అపానమునకు ప్రణామము ప్రాణమా! బయట ఉన్న నీకు ప్రణామము. నడుమన ఉన్న నీకు ప్రణామము. సమస్తమగు నీకు ప్రణామము.
9. ప్రాణమా! తనువు నీకు ప్రియము, ఊపిరి ప్రేయసి అగుచున్నారు. మమ్ము బ్రతికించుటకు గాను నీ వద్దనున్న ఓషధులను మాకు అందించుము.
10. పుత్రుడు తండ్రికి ప్రియుడైనట్లు ప్రాణములు ప్రజకు ప్రియములగుచున్నవి. చరాచర జగత్తుకు ప్రాణమే సర్వేశ్వరుడు అగుచున్నాడు.
ఐదవ సూక్తము - 12
వినియోగము :- 4వ సూక్తము వలె.
1. ప్రాణమే మృత్యువు. ప్రాణమే బాధ. ప్రాణమునే దేవతలు ఉపాసించుచున్నారు. ప్రాణమే సత్య భాషణునకు ఉత్తమ లోకములు కలిగించుచున్నది.
2. ప్రాణో విరాట్ ప్రాణో దేష్ట్రీ ప్రాణం సర్వ ఉపాసతే |
ప్రాణోహ సూర్యశ్చన్ధ్రమాః ప్రాణమాహుః ప్రజాపతిమ్ ||
3. ప్రాణాపానములు ధాన్యములు, యవలు అనడ్వాన్ ప్రాణము అనబడుచున్నది. యవలు ప్రాణము, ధాన్యము అపానము అనుచున్నారు.
4. గర్భమందున్న వానికి ప్రాణాపానములు కలుగుచున్నవి. ఏ విధముగ నీవు ప్రాణమును ఆహారమును, భుజించుచున్నావో ఆ విధముగనే అది మరల జన్మించుచున్నది.
5. ప్రాణం ఆహుః మాతరిశ్వానం వాతః హ ప్రాణ ఉచ్యతే |
ప్రాణే హ భూతం భవ్యంచ ప్రాణే సర్వం ప్రతిష్టితమ్ ||
6. ప్రాణమా! నీవు వర్షించినపుడు అధర్వ, అంగిరస, దేవ మనుష్యుల కల్పించిన ఓషధులు మొలుచుచున్నవి.
7. ప్రాణము మహా పృథ్విని వర్షముతో తడిపినపుడు ఓషధులు, తలలు పుట్టుచున్నవి.
8. ప్రాణమా! నీ మహత్తును ఎరిగిన వారిని, నీవు ప్రతిష్టితమై ఉన్న వారిని సమస్త దేవతలు ఉత్తమ లోకములకు చేర్చుచున్నారు.
9. ప్రాణమా! సమస్త ప్రజ నీకు అన్నము మున్నగునవి సమర్పించునట్లు నీ ప్రభావమును వీనుల విందుగా వినిపించు వానికి సమర్పింతురు గాక.
10. దేవతల అంతర్గర్భమున సంచరించు ప్రాణమే భూతముగ పరివర్తన చెంది జన్మించుచున్నది. తండ్రి తన సమస్త అవయవములచే పుత్రుని యందు ప్రవేశించినట్లు భూత భవిష్యత్తులు ప్రాణము నందు ప్రవేశించుచున్నవి.
ఆరవ సూక్తము - 13
వినియోగము :- 4వ సూక్తము వలె.
1. జలము నుండి హంస శరీరము నుండి ప్రాణము ఒక పాదము ఎత్తి ఎరిగినను దానికి నేడు, రేపు రాత్రింబవళ్ళు లేకున్నవి. చీకట్లు విడిపోకున్నవి.
2. ఎనిమిది చక్రములు, ఒకనేమి, సహస్రాక్షర, ముందు, వెనుకకు వర్తించునది. తన అర్ధభాగమున విశ్వభువనములను సృష్టించినది. మిగిలిన అర్ధభాగమును ఎవడు ఎరింగినాడు?
3. ప్రాణము విశ్వజన్ముడు. ఈశుడు. విశ్వచేష్టితుడు. త్వరగా అన్యుల లోనికి ప్రవేశించువాడు. అట్టి ప్రాణమునకు నమస్కరించుచున్నాను.
4. సర్వజన్మ, ఈశాన, విశ్వచేష్టిత ప్రాణము అతంద్రుడు, బ్రహ్మ, ధీరుడై నాయందు నిలుచును గాక.
5. నిద్రా పరవశుడైనవాడు ఏమియు ఎరుంగకున్నాడు. ప్రాణమా అట్టి నిద్రితుని మేల్కొల్పుటకు అప్రమత్తుడవగుము. నిద్రించు వాని ప్రాణము నిద్రించునని ఎవడు కన్నాడు?
6. ప్రాణమా! నా నుంచి ముఖము మళ్ళించకుము. నీవు నా కన్న వేరుకావు కదా! జల గర్భమున అగ్నివలె నిన్ను నాకు కట్టుకొని జీవించుచున్నాను.
మూడవ అనువాకము
మొదటి సూక్తము - 14
వినియోగము :- 1-3 సూక్తములందు బ్రహ్మచారి మహాత్మ్యము తెలుపబడినది. బ్రహ్మ యజ్ఞమున వీని వినియోగము.
1. బ్రహ్మచారి తన తపస్సుచే ద్యావాపృథ్వులందు వ్యాపించి సంచరించుచున్నాడు. సమస్త దేవతలు అతనిని సమానముగ అనుగ్రహించుచున్నారు. అతడు తన తపము చేత దివిని, భువిని భరించుచున్నాడు. తన ఆచార్యుని పోషించుచున్నాడు.
(బ్రహ్మచారీ బ్రహ్మణీ వేదాత్మకే అధ్యేతవ్యే చరితుంశీలం అస్య తథోక్తః ఇతి సాయణాచార్యః వేదాత్మక బ్రహ్మను అధ్యయనము చేయు, ఆచరించు స్వభావము కలవాడు బ్రహ్మచారి అగుచున్నాడు.)
2. బ్రహ్మచారిని రక్షించుటకు పితరులు, దేవజనులు దేవతలు అతనిని అనుసరించి సంచరించుచున్నారు. గంధర్వులు అతని వెంట ఉన్నారు. బ్రహ్మచారి తన తపో మహిమచే ముప్పది ముగ్గురు, మూడు వందలు, ఆరు వేల సమస్త దేవతలను పోషించుచున్నాడు.
3. ఆచార్యుడు బ్రహ్మచారికి ఉపనయనము చేసి తన కడుపున పెట్టుకొనుచున్నాడు. అట్టు మూడు రాత్రులు కడుపునా పెట్టుకొని విద్యాజన్మ నిచ్చిన బ్రహ్మచారికి దేవతలు అభిముఖులై వచ్చుచున్నారు.
4. పృథివి బ్రహ్మచారి యొక్క మొదటి సమిధకాగా, ద్యులోకము రెండవ సమిధ అగుచున్నది. అతడు ద్యావాపృథ్వుల మధ్యనున్న సమిధచే లోకములను తృప్తి చెందించుచున్నాడు. అతడు సమిధయను మేఖల, శ్రమ యను తపస్సుచే లోకములను పోషించుచున్నాడు.
5. తొలుత బ్రహ్మచారి బ్రహ్మవలన వెలువడినాడు. అతడు దీప్తిని ధరించినాడు. తపస్సు వలన వర్ధిల్లినాడు. అతని నుండియే బ్రాహ్మణులు, బ్రహ్మ, సమస్త దేవతలు అమృత సహితముగ అవతరించినారు.
6. బ్రహ్మచారి సమిధను వెలిగించి, కృష్ణాజినము ధరించి, దీర్ఘశ్మశువై, దీక్షితుడు అగుచున్నాడు. అతడు పూర్వసముద్రము నుండి ఉత్తర సముద్రము వరకు వ్యాపించుచున్నాడు. లోకములను హస్తమున ధరించి అవలోకించుచున్నాడు.





