Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
రెండవ సూక్తము - 9
ఓదనపు భోజ్య, భోక్తృత్వములను వాద ప్రతివాదములచే సమర్ధించుచున్నాడు :-
1. నీవు పూర్వ ఋషులు భుజించిన నోటితోనే భుజించినావా? అన్య ముఖమున భుజించినావా? అట్లైనచో జ్యేష్టుని సహితముగ నీ సంతానము మరణించును.
నేను ఓదనమును అవాఙ్ముఖముగ గాని ఆత్మ ముఖముగ గాని భుజించలేదు. బృహస్పతి ముఖముచే భుజించినాను. కావున ఆహారము చేరవలసిన స్థానమునకు చేరినది. అట్టి ఆహారము సర్వాంగ, సర్వపరుయుక్తమై పరిపూర్ణ దేహము కలది అగుచున్నది.
ఈ విషయములు తెలిసికొన్నవాడు సర్వాంగుడు, సర్వపరుడు, పరిపూర్ణ దేహి అగుచున్నాడు.
2. ద్యావాపృథ్వులు ఓదనమునకు చెవులు అన్న విషయమును వాద ప్రతివాదనల రూపమున నిరూపించుచున్నాడు :-
పూర్వ ఋషులు ఏ చెవులతో ప్రాశనము చేసినారో వానితో కాక అన్యకర్ణములతో ప్రాశనము చేసినచో నీవు బధిరుడవు అగుచున్నావు.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, ఆత్మముఖముగ గాని ప్రాశనము చేయలేదు. ద్యావాపృథ్వుల శ్రోత్రములతోనే ప్రాశనము చేసినాను. వానితో దానిని యథాస్థానమునకు చేర్చినాను. కావున ఈ ఒధానము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
ఇది తెలిసినవాడు సర్వాంగుడు, సర్వపరుడు, పరిపూర్ణ శరీరి అగుచున్నాడు.
3. సూర్యచంద్రులు ఓదన నేత్రములని నిరూపించుచున్నాడు :-
పూర్వ ఋషులు ఏ కనులతో చూచినారో వాటితో కాక అన్యముతో ప్రాశనము చేసినవాడు అంధుడు అగుచున్నాడు.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, ఆత్మ ముఖముగ గాని ప్రాశన చేయలేదు. సూర్య చంద్రుల కనులతోనే ప్రాశనము చేసినాను. వానితోనే దానిని యథా స్థానమునకు చేర్చినాను. అట్టి ఓదనము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
ఇది తెలిసినవాడు సర్వాంగ, సర్వపరు, పరిపూర్ణ శరీరుడు అగుచున్నాడు.
4. "బ్రహ్మముఖమ్" అను దానిని నిరూపించుచున్నాడు :-
పూర్వ ఋషులు ఏ ముఖముతో ప్రాశనము చేసినారో దానితో కాక అన్యమున ప్రాశనము చేసినవాని ముఖమువలెనే అతని సంతతి చచ్చుచున్నది.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, ఆత్మ ముఖముగ గాని ప్రాశన చేయలేదు. బ్రహ్మ ముఖమున ప్రాశనము చేసినాను. దానితోనే ఓదనమును యథా స్థానమునకు చేర్చినాను. అప్పుడు అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువు అయినది.
ఇది తెలిసిన వారు సర్వాంగ, సర్వపరు, పరిపూర్ణ శరీరుడు అగుచున్నాడు.
5. పూర్వ ఋషులు ఏ జిహ్వచే ప్రాశనము చేసినారో దానితో కాక అన్యమున ప్రాశనము చేసినవాని నాలుక చచ్చిపోవుచున్నది.
నేను అవాఙ్ముఖమున గాని, ప్రత్యఙ్ముఖమున గాని, ఆత్మ ముఖముగ గాని ప్రాశనము చేయలేదు. నేను అగ్ని జిహ్వతోనే ప్రాశనము చేసినాను. అట్లగుటచే ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువు అయినది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సం భవతి య ఏవం వేద"
6. పూర్వ ఋషులు ఏ దంతములతో ప్రాశనము చేసినారో వానితో కాక అన్యముతో ప్రాశనము చేసిన వాని దంతములు రాలిపోవుచున్నవి.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, ఆత్మముఖముగ గాని ప్రాశనము చేయలేదు. ఋతువుల దంతములతోనే ప్రాశనము చేసినాను. అట్టి ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అట్లగుటచే ఓదనము సర్వాంగము, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
7. పూర్వ ఋషులు ఏ ప్రాణాపానములతో ప్రాశనము చేసినారో వానితో కాక అన్యముతో ప్రాశనము చేసిన వానిని ప్రాణాపానములు విడుచుచున్నవి.
నేను అవాఙ్ముఖమున, ప్రత్యఙ్ముఖమున, అంతర్ముఖమున ప్రాశనము చేయలేదు. సప్తర్షుల ప్రాణాపానములతోనే ప్రాశనము చేసినాను. అట్టి ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
8. పూర్వ ఋషులు ఏ అంతరిక్షాత్మక రూపమున ప్రాశనము చేసినారో అట్లుకాక అన్యముతో ప్రాశనము చేసిన రాజయక్ష్మ నిన్ను అంతమొందించుచున్నది.
నేను అవాఙ్ముఖమున గాని, ప్రత్యఙ్ముఖమున గాని, ఆత్మ ముఖముగ గాని ప్రాశనము చేయలేదు. అంతరిక్షాత్మక రూపమునచే ప్రాశనము చేసినాను. ఓదనము యథాస్థానమునకు చేర్చినాను. అట్లగుటచే ఓదనము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
9. పూర్వ ఋషులు ఏ పృష్ఠముతో ప్రాశనము చేసినారో దానితో కాక అన్యముతో ప్రాశనము చేసినవారు పిడుగుపడి చచ్చుచున్నారు.
నేను అవాఙ్ముఖమున గాని, ప్రత్యఙ్ముఖమున గాని, అంతర్ముఖమున గాని ప్రాశనము చేయలేదు. నేను ద్యురూప పృష్ఠముతోనే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అట్లగుటచే ఓదనము సర్వాంగము, సర్వపరు, సర్వతను అగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
10. పూర్వ ఋషులు ఏ ఉరమున ప్రాశనము చేసినారో దానితో కాక అన్యముతో ప్రాశనము చేసినచో కృషి యందు సఫలుడు కాకున్నాడు.
నేను అవాఙ్ముఖమున, ప్రత్యఙ్ముఖమున, అంతర్ముఖమున ప్రాశనము చేయలేదు. పృథ్వీరూప ఉదరముననే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన ఓదనము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
11. ప్రాచీన ఋషులు ఏ వాస్తిచే ప్రాశనము చేసినారో దానితో కాక అన్యమున ప్రాశనము చేసినచో జలమున పడి మరణించుచున్నాడు.
నేను అవాఙ్ముఖమున, ప్రత్యఙ్ముఖమున, అంతర్ముఖమున ప్రాశనము చేయలేదు. సముద్రరూప వస్తితోనే ప్రాశనము చేసినాను. ఒదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన ఓదనము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
(వస్తిః మూత్రాశయః అని సాయణుడు.)
12. ప్రాచీనఋషులు ఏ ఉదరమున ప్రాశనము చేసినారో దానితో కాక అన్యమున ప్రాశనము చేసిన అతిసార వ్యాధి వలన మరణించుచున్నాడు.
నేను అవాఙ్ముఖమున, ప్రత్యఙ్ముఖమున, ఆత్మ ముఖమున గాని ప్రాశనము చేయలేదు. సత్యరూప ఉదరముననే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన ఓదనము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
13. ప్రాచీన ఋషులు ఏ ఊరువున ప్రాశనము చేసినారో దానితో కాక అన్యముతో ప్రాశనము చేసిన వాని ఊరువులు చచ్చుచున్నవి.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, ఆత్మ ముఖముగ గాని ప్రాశనము చేయలేదు. మిత్రావరుణ రూప ఊరువులచే పాశనము చేసినాను ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన ఓదనము సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
14. ప్రాచీన ఋషులు ఏ జానువులతో ప్రాశనము చేసినారో దానితోకాక అన్యముచే ప్రాశనము చేసినవాని జానువులు ఎండిపోవుచున్నవి.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, ఆత్మముఖముగ గాని పాశనము చేయలేదు. త్వష్టజానువులచే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువు అయినది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
15. ప్రాచీన ఋషులు ఏ పాదములచే ప్రాశనము చేసినారో వానితో కాక అన్యమున ప్రాశనము చేసినవాడు బహుసంచారి అగుచున్నాడు.
నేను అవాఙ్ముఖమున గాని, ప్రత్యఙ్ముఖమున గాని, పరాఙ్ముఖముగ గాని ప్రాశన చేయలేదు. అశ్వినుల పాదములచే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను అందువలన అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
16. ప్రాచీన ఋషులు ఏ పాదాగ్రములచే ప్రాశనము చేసినారో వానితో కాక అన్యమున ప్రాశనము చేసిన వానిని సర్పము చంపుచున్నది.
నేను అవాఙ్ముఖముగ, ప్రత్యఙ్ముఖముగ , పరాఙ్ముఖముగ గాని ప్రాశనము చేయలేదు. సవితా దేవత పాదాగ్రములచే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"
17. ప్రాచీన ఋషులు ఏ హస్తములచే ప్రాశనము చేసినారో వానితోకాక అన్యమున ప్రాశనము చేసిన వానికి బ్రహ్మహత్యా పాతకము కలుగుచున్నది.
నేను అవాఙ్ముఖముగ గాని, ప్రత్యఙ్ముఖముగ గాని, పరాఙ్ముఖముగ గాని ప్రాశనము చేయలేదు. ఋతము యొక్క హస్తములతోనే ప్రాశనము చేసినాను. ఓదనమును యథాస్థానమునకు చేర్చినాను. అందువలన అది సర్వాంగ, సర్వపరు, సర్వతనువగుచున్నది.
"సర్వాంగ ఏవ సర్వపరుః సర్వతనూః సంభవతి య ఏవం వేద"





