Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
3. రుద్రదేవా! నీ ముందు నిలువలేక చాటునుంచి నిన్ను బాధించదలచిన వానిని దెబ్బతిన్నవాడు కొట్టిన వాని అడుగుల గుర్తుల ననుసరించి వానిని పట్టి కొట్టినట్లు తగు రీతిని శిక్షించుచున్నావు.
4. భవ, రుద్రులు మిత్రులు ఏకమనస్కులు. ఉగ్రులు వారు సాహస కృత్యములకు సంచరించుచున్నారు. వారు ఏ దిశన సంచరించుచున్నారో ఆ దిశకు ప్రణామము.
5. రుద్రదేవా! నీవు మా ఎదుట ఉన్నను, వెనుక ఉన్నను నమస్తే. కూర్చున్న నీకు, నిలుచున్నా నీకు నమస్తే.
6. నమః సాయం నమః ప్రాతః నమః రాత్ర్యా నమః దివా
భవాయచ శర్వాయచ ఉభాభ్యాం అకరం నమః ||
7. రుద్రుడు సహస్రాక్షుడు, పరమ సూక్ష్మదర్శి తూర్పునకు బహుబాణములు విడుచువాడు. జిహ్వాగ్రమున సమస్త లోకములను తినగలవాడు. అట్టి రుద్రుని వద్దకు మేము చేరకుందుము గాక.
8. రుద్రుడు నల్లనివాడు. కపిశవర్ణాశ్వుడు. అసిత పరిచ్చిదుడు. హింసకుడు. భయంకరుడు. కేశిరక్కసి రథమును నేల కూల్చినవాడు. అట్టి రుద్రుని అన్య దేవతలకన్న ముందే స్తుతించుచున్నాము. నమస్కరించుచున్నాము.
9. పశుపతీ! నమస్కారము. మేము మర్త్యులము. మా మీద కోపించకుము. బాణములు విడువకుము. దివ్యశాఖ వంటి నీ ఆయుధములను అన్యదిశకు విసరుము.
10. రుద్రదేవా! హింసించకుము. కోపించకుము అనుగ్రహించుము. మేము నిన్ను చేరకుందుము గాక.
ఏడవ సూక్తము
వినియోగము :- 5వ సూక్తము వలె.
1. రుద్రదేవా! మా గోవులను, ప్రజను, మేకలను, గొర్రెలను కాంక్షించకుము. ఉగ్రా! నీ ఆయుధమును అన్యత్ర ప్రయోగించుము. దేవ హింసకుల ప్రజలను వధించుము.
2. రుద్రుని ఆయుధము వ్యాధి. అది దగ్గు రూపమున వచ్చి మనిషిని గుర్రము వలె సకిలింప చేయుచున్నది. అది అభిపూర్వముగ సాగి నాశము చేయుచున్నది. అట్టి రుద్రుని ఆయుధమునకు నమస్కారము.
3. రుద్రుడు ఆధార రహిత అంతరిక్షమున ఆధారభూతుడై నిలిచి ఉన్నాడు. అతడు యజ్ఞము చేయని వారిని, దేవతలను బాధించువారిని హింసించుచున్నాడు. అట్టి రుద్రునకు చేతులు జోడించి ప్రణమిల్లుచున్నాము.
4. పశుపతీ! నీ కొరకు ఆరణ్యక పశువులు, వన్య మృగములు, హంసలు, గ్రద్దలు, కాకులు, వన్య పక్షులు ఏర్పడి ఉన్నవి. నీ దివ్య రూపము జలములందున్నది. నీ అభిషేకమునకే జలములు వర్ధిల్లి ప్రవహించుచున్నవి.
5. శింశు మారములు, అజగరములు, పురీకయములు, జషములు, మత్స్యములు మున్నగు జలచరములు నీకు ఆహారము అగుచున్నవి.
రుద్రదేవా! నీకు దూరము, దగ్గర లేకున్నవి. సర్వమును చూచుచున్నావు. భూమండలమును క్షణములో చూచుచున్నావు క్షణములో పూర్వ సముద్రమునుండి ఉత్తర సముద్రమునకు చేరుచున్నావు.
6. రుద్రదేవా! మాకు కష్టములు కలిగించకుము. విషము, పిడుగులను మా వద్దకు చేరనీకుము. ఈ పిడుగును మరొక చోట పడవేయుము.
7. భవుడు దివికి, పృథివికి, అంతరిక్షమునకు ప్రభువు అగుచున్నాడు. అతడు ఏ దిశన ఉన్నాడో ఆ దిశకు నమస్కరించుచున్నాము.
8. భవరాజా! యజమానికి సుఖము కలిగించుము. పశువులకు సుఖము కలిగించి పశుపతివగుము. శ్రద్దాళువులు, దేవతల భక్తుల ద్విపదులకు, చతుష్పదులకు సుఖము కలిగించుము.
9. మా కన్న పెద్ద వారిని హింసించకుము. చిన్నవారిని హింసించకుము. బరువులు మోయువారిని, జనులను మోయువారిని హింసించకుము. మా తల్లిదండ్రులను, మా దేహములను హింసించకుము.
10. రుద్రుని ప్రమథగణములకు నమస్కారము. కటు భాషణల రుద్ర గణములకు నమస్కారము. భయంకర ముఖము గల కుక్కలకు నమస్కారము.
11. రుద్రదేవా! నీ యొక్క ఘోషించు సేనకు, కేశినీ సేనకు, నమస్కృత సేనకు, మీ సహితముగ భుజించు సేనకు నమస్కరించుచున్నాను. ఇవి కాక నీకున్న ఇతర సేనలకు నమస్కారము. మాకు శుభములు, అభయము కలుగును గాక.
రెండవ అనువాకము
మొదటి సూక్తము -8
వినియోగము :- 8-11 సూత్రముల వినియోగము ఒకే తీరుది.
ఈ సూక్తముచే బృహస్పతి సవనామక సవ యజ్ఞమున అభిమర్సన, సంపాత, దాత్రువచనాది కర్మలు చేయునది.
అభిచార కర్మమున నవ విధానముచే అన్నము వండి నేయి వెన్న చల్లి దీనిచే అభిమర్సన, సంపాతిత, అభిమంత్రితములు చేసి శత్రువునకు ఇచ్చునది. లేదా శత్రువును దీనిచే అభిమర్సనము చేయునది. లేదా హుతాజ్య శేషమున సంపాతితము చేయునది.
1. ఈ ఓదనమునకు బృహస్పతి శిరము - బ్రహ్మ ముఖము అగుచున్నారు.
2. ద్యావాపృథ్వులు చెవులు, సూర్య చంద్రులు కనులు, సప్తర్షులు ప్రాణాపానములు అగుచున్నారు.
3. రోకలి నేత్రములు, రోలు కోరిక.
4. దితి శూర్పము, అదితి శూర్పగ్రాహి, గాలి చెరుగుట అగుచున్నారు.
5. అశ్వములు కణములు, గోవులు తండులములు, దోమలు తుషలు.
6. కబ్రు ఫలీకరణము, శిరసు అభ్రము అగుచున్నవి.
7. నల్లని ఇనుము దీని మాంసము, లోహితము దీని రోమములు.
8. సీసము దీని భస్మము, రంగు హరితము, దీని గంధము కమలగంధము.
9. చెరుగు చోటు పాత్ర, స్ఫ్య భుజములు, ఇషములు అనూక్యములు.
10. ఆంత్రణులు పగ్గములు, గుదము తోలుత్రాళ్ళు
11. ఈ ఓదనము ఉడికించు కుండ భూమి దీని మీద మూత ద్యావాపృథ్వులు అగుచున్నవి.
12. నాగటి చాళ్ళు పార్శ్వములు, ఇసుక ఊబధ్యము అగుచున్నవి.
13. ఉదకము అర్ఘ్యము, కుల్య ఉపసేచనము.
14. కుంభి ఋగ్రూప అగ్ని మీద నిలిచినది. యజురగ్ని మీద "ప్రేషితా"
15. అథర్వమున గ్రహించబడినది. సామముచే పరివేష్టితమైనది.
(పాత్రకు అనుగుణమగు సాధనములను చెప్పుచున్నాడు.)
16. బృహత్సామము అన్నము కలుపు పుల్ల. రథంతార సామము అన్నము వెలికి తీయు దర్వి
17. ఋతువులు పాచకులు. అహోరాత్రులు వెలిగించునవి.
18. పంచబిల ముఖ చరును ఘర్మము ఉడికించుచున్నది.
(ఇది వత్తిడిచే ఉడుకు ప్రెజర్ కుకర్ వలె ఉన్నది.)
ఓదనము సర్వలోక ప్రాప్తి సాధనమని చెప్పుచున్నాడు.
19. ఓదనము వలన, యజ్ఞము వలన కలుగు లోకములన్నియు కలుగుచున్నవి.
20. ఏ ఓదనమున సముద్రము, అంతరిక్షము, ద్యులోకము నిలిచి ఉన్నవో -
21. దేనియందు నాలుగు వందల ఎనుబది మంది దేవతలు ఉన్నారో -
22. అట్టి ఓదనపు మహా మహిమ ఏమి? అని నిన్ను అడుగుచున్నాను.
23. ఈ ఓదనపు మహిమ తెలిసినవాడు.
24. దీనిని అల్పమని, అనుపసేచితమని, అనిర్దిష్టమని చెప్పరాదు.
("ప్రాదుక్త ప్రకారేణైవ సార్వా త్మ్యం బ్రూయాద్ ఇత్యర్ధః - పూర్వము చెప్పిన రీతి ఇది సర్వాత్మకమని చెప్పమని సాయణాచార్యుల వ్యాఖ్య.)
అధికముగ కూడ చెప్పరాదనుచున్నాడు.
25. దాత ఏ ఫలమును మనసున కోరుచున్నాడో అంతకు మించినదని చెప్పరాదు.
ఓదన భక్షణమును గురించి బ్రహ్మవాదులను రెండు ప్రశ్నలు అడుగుచున్నారు :-
26. బ్రహ్మవాదులు అడుగుచున్నారు:- ఓదనము పరాఙ్ముఖముగ నున్నదా? ఆత్మ ముఖముగ ఉన్నదా?
ఇక రెండవ ప్రశ్న :-
27. నీవు అన్నము తిన్నావా? నిన్ను అన్నము తిన్నదా?
మొదటి ప్రశ్నలోని ప్రథమ కల్పము నందలి దోషమును చెప్పుచున్నాడు.
28. పరాఙ్ముఖమున భుజించిన వానిని ప్రాణవాయువులు విడుచుచున్నవని విద్వాంసులు చెప్పవలెను.
రెండవ కల్పమును చూపి దూషించుచున్నాడు :-
29. ఆత్మ ముఖమున భుజించిన అపాన వాయువు విడుచుచున్నవని విద్వాంసులు చెప్పవలెను.
ద్వితీయ ప్రశ్నః అనంగీకారపరాస్త ఇత్యాహ.
30. నేను అన్నము తినలేదు. అన్నము నన్ను తినలేదు. అట్లయిన భోజనము ఎట్లైనది చెప్పుచున్నాడు.
31. ఓదన ఏవౌదనం ప్రాశీత్.
బోక్త్రృభోక్తవ్య ప్రపంచాత్మక ఓదన ఇతి ఉక్తమ్, ఓదనము భోక్త, భోజనము అని చెప్పబడినదని సాయణుడు.
అట్లనుట వలన అన్నమే అన్నమును తిన్నది.





