Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
మూడవ సూక్తము
వినియోగము :-
తొలి ఋక్కుచే దరు ఉద్వాసనము చేయునది. 2వ మంత్రముచే చరుస్థాలికి ప్రదక్షిణము చేయుచు దానిని చుట్టు త్రిప్పునది. 4వ మంత్రముచే స్రవమును వేదిపై ఉంచునది. 5వ ఋక్కుచే నలుగురు ఆర్షేయ బ్రాహ్మణులను ఆసీనులను చేయునది. 6వ మంత్రముచే నలుగురు ఆర్షేయ ఋత్విక్కులను పిలుచునది. 7వ మంత్రముచే ఆ ఋత్విజులకు అర్ఘ్యము ఇచ్చునది. 8వ మంత్రముచే అన్నమున సువర్ణమును, దాతచే తొలి పాదము చదివించుచు పెట్టునది. మధ్య పాదములచే కుశలపై నున్న అన్నమును కొద్దిగ గుంజునది.
8వ మంత్రము దాత వదనమున వినియోగము.
9వ మంత్రపు తొలి పాదము 'తుష' లను అగ్నియందు హోమించునది. మిగిలిన మూడు పాదములచే ఫలీకరణాన్ ఉదూహయేత్'
దశమ ఇత్యాది ఋక్కులు ఓదన సంపాతమున "వికల్పేన వినియుక్తాః"
1. అన్నమా! అగ్ని మీదినుంచి లెమ్ము. వేది మీద ఆసీనవగుము. ఇతని సంతానమును వర్ధిల్లచేయుము. రాక్షసులను హతమార్చుము. ఈమెకు అధిక పుష్టి కలిగించుము. మేము మాతో సమానులకన్న ఉత్తములము అగుదుము గాక. ద్వేషించువారిని కూల్చుచున్నాము.
2. బ్రహ్మౌదనమా! వీరి పతీ పత్నుల కొరకు పశువుల సహితముగ విచ్చేయుము. దేవతల సహితముగ విచ్చేయుము.
దంపతులారా! ఇతరుల క్రోధము మిమ్ము చేరకుండును గాక. ఇతరులు చేసిన అభిచారము మీ వైపు త్రొక్కకుండును గాక. ఆరోగ్యముగా విరాజిల్లండి.
3. ఈ వేది ఋతముచే నిర్మితము. మనసున నిలిచినది. బ్రహ్మౌదనము ఉంచుటకు ఏర్పడినది.
నారీ! శుద్దమగు వేది వద్దకు రమ్ము. దైవానాం ఓదనమును ఆ వేదిమీద ఉంచుము.
4. భూతకృతులగు సప్తర్షులు ఈ 'సృచ' మును అదితి యొక్క ద్వితీయ హస్తముగా నిర్మించినారు. ఈ దర్వి ఓదన గాత్రమును ఎరింగినదై దానిని వేదిమీద స్థాపించును గాక.
5. ఓదనమా! నీ వద్దకు ఆరాధనీయ దేవతలు వచ్చెదరు గాక. నీవు అగ్నినుంచి బయటపడి వారిని చేరుము. సోమముచే పునీతవై ఆర్షేయ బ్రాహ్మణుల ఉదరమున చేరుము. భుజించిన వారిని బాధించకుము.
6. సోమముచే విరాజమానమగు బ్రహ్మౌదనమా! ఈ సద్బ్రాహ్మణులకు జ్ఞానము కలిగించుము మోహమున ముంచకుము. తపసు నుండి పుట్టిన ఆర్షేయ బ్రాహ్మణులను, చక్కగా ఆహ్వానించు పత్నినగు నేను మరల మరల ఆహ్వానించుచున్నాను.
7. ఈ జలము శుద్దము. పూతము. యోషిత. యజ్ఞియ. దీనిని బ్రాహ్మణుల చేతులకు వేరువేరుగా అందించుచున్నాను.
జలమా! నేను దేనిని కోరి మిమ్ము అభిషించితము చేయుచున్నావో అట్టి నా కోరికలను మరుత్తుల సహితుడగు ఇంద్రుడు తీర్చును గాక.
8. నాయొక్క హిరణ్యము 'జ్యోతిరమృతం'. ఈ వంటకము సుక్షేత్రముల నుండి వచ్చిన కామధేనువు. పితరులకు స్వర్గమార్గము కలిగించుటకు గాను ఈ ధనమును బ్రాహ్మణులకు ఇచ్చుచున్నాను.
9. హే ఋత్విక్! జాతవేదియగు అగ్నియందు 'తుష'లను వేయుము. కంబూకములను కాలిచే దూరము జరుపుము. ఇది గృహరాజు భాగమని వినియున్నాము. ఇంకను నిర్రుతి భాగధేయమని తెలియుచున్నాము.
10. దీక్షతోను, శ్రమచేసి వండిన బ్రహ్మౌదనము సోమాభిషదము అగుచున్నది. ఓదనమా ! నీవు ఇతనిని స్వర్గమార్గమును అధిరోహింప చేయుము. ఈ రోహణము వలన పక్షి ఆకసమునకు ఎగిరినట్లు ఇతడు పరమపదమగు నాకమునకు చేరును గాక.
నాలుగవ సూక్తము
వినియోగము :- బ్రహ్మౌదన సవమున ఈ సూక్తము ఈ కాండపు తొలి సూక్త సహితముగ వినియోగము చెప్పబడినది.
తొలిఋక్కుచే అన్నమును గుంత చేయునది. రెండవ పాదముచే ఘ్రుతముచే అన్నమును విష్యందితము చేయునది. చివరి పాదమును దాతచే చదివించునది. తొలి ఋక్కు ఇత్యాదులచే అన్నమును అనుమంత్రించునది. 6వ మంత్రముచే ఓదనమును అనుమంత్రించునది.
1. అధ్వర్యు ఋత్విక్! విద్వాంసుడవగు నీవు అన్న ముఖమున ఆజ్యార్ధము గుంత చేయుము. అట్లే అన్నపు సర్వగాత్రములకు అన్నపు పూత పూయండి. అది పితరులకు స్వర్గమార్గమగును గాక.
2. బ్రహ్మౌదనమా! అబ్రాహ్మణులు నిన్ను భుజించుటకు చేరినచో వారికి రాక్షస బాధ కలిగించుము. నీ వద్ద కూర్చున్న ప్రథాన ఆర్షేయ బ్రాహ్మణులు పుత్రవంతులు అగుదురు గాక. బ్రాహ్మణ భోక్తలను బాధించకుము.
(అబ్రాహ్మణులు అనిన భోక్తలు కానివారు అని అర్ధము కావచ్చును. భోక్తలకు బాధకలిగించరాదను భావము కావచ్చును.)
3. అన్నమును ఆర్షేయులకు పెట్టుచున్నాను. ఈ విషయమున అనార్షేయుల ప్రసక్తిలేదు. ఈ వంటకమును అగ్ని, మరుత్తులు, సమస్త దేవతలు, విశ్వేదేవతలు రక్షింతురు గాక.
4. ఈ బ్రహ్మౌదనము యజ్ఞోత్పాదకము, నిత్యప్రవృద్దము, పుంగవరూపము, ధనసదనము అగుచున్నది. అది మాకు ప్రజామృతత్వమును, దీర్ఘాయువును, ధనపుష్టిని కలిగించును గాక.
5. బ్రహ్మౌదనమా! నీవు వరప్రదవు. ఆర్షేయ ఋషుల సహితముగ స్వర్గమునకు చేరుము. సుకృతుల లోకమునకు చేరి మేము నిన్ను దర్శింతుము.
6. ఓదనమా! నీవు సకలమును కూర్చుకొని గంతవ్వుల వద్దకు వెళ్ళుము. అగ్నిదేవా! దీని కొరకు దేవయాన మార్గమును కల్పించుము. మేము సుకృతులను అనుసరించి యజ్ఞము వెంట వెంట సప్తరశ్ముల నాకమునకు చేరుదుము గాక.
7. బ్రహ్మౌదనమును పచనము చేసిన దేవతలు సుకృతులలోకమగు జ్యోతిష ద్యులోకమునకు చేరినారు. మేమును అట్లే సుకృతలోకమగు నాకమను స్వర్గమునకు చేరుదుము గాక.
ఐదవ సూక్తము
వినియోగము :- 5 - 7 వరకు గల మూడు సూక్తములు అర్ధసూక్తములు అనబడుచున్నవి.
స్వస్త్యయనము కోరువాడు ఈ సూక్తముచే ఘ్రుత పురోడాశాది 13 పదార్ధములను ఒకటిగా ఆహుతి ఇచ్చునది.
రుద్ర, భూత, ప్రేత, రాక్షస, లోకపాలాదుల అభిఘాతమందు స్వస్త్యయనమునకు ఏకరూపవత్స, గోవు పాలతో చేసిన చరును మూడు భాగములు చేసి అర్ధసూక్తముచే రుద్ర దేవత కొరకు మూడు ఆహుతులను హోమించునది.
మాంస ముఖాగ్రపతన అద్భుతపు శాంతి కొరకు దీనిచే రుద్రునకు ఘ్రుతాహుతులు ఇచ్చునది.
అగ్ని చయనమున రుద్రసంబంధ ఇటుకను దీనిచే అనుమంత్రించునది.
సర్వకామప్రాప్తి కొరకు లేక శాంతి కొరకు చేయు లక్ష హోమమున దీని వినియోగము.
1. భవశర్వులారా! మమ్ము రక్షించండి. భూతపతి, పశుపతులకు నమః! మీరు ఎక్కుపెట్టిన బాణము మా మీద ప్రయోగించకండి. మమ్ములను, మా ద్విపద, చతష్పదులను హింసించకండి.
2. పశుపతీ! మమ్ము కుక్కలు, నక్కలు, మాంసభక్షక గ్రద్దలు, మాంసము కోరు కాకులు తాకకుండును గాక. ఈగలు, పక్షులు మమ్ము అన్నముగ భావించి బాధించకుండును గాక.
3. రుద్రదేవా! నీయొక్క గర్జనకు, ప్రాణములకు, భవ్యశరీరమునకు, సహస్రాక్షమునకు, అమరత్వమునకు నమస్తే.
4. నీ తూర్పు, ఉత్తర, దక్షిణములకు నమః దివి మీద అంతరిక్షమున ఉన్న నీకు నమః.
5. పశుపతీ! నీ ముఖమునకు నమః నీ దృష్టికి, నేత్రములకు నమః నీ చర్మమునకు, రూపమునకు, సమ్యక్ దృష్టికి ప్రత్యగాత్మ రూపమునకు నమః.
6. నీ అవయవములకు, ఉదరమునకు, జిహ్వకు ముఖమునకు, దంతములకు, గంధమునకు నమః.
7. రుద్రదేవుడు 'అస్త్ర' నీలశిఖండి, సహస్రాక్షుడు, వేగవంతుడు, సేనా నాశకుడు అతడు మమ్ము బాధించకుండును గాక.
8. భవుడు మమ్ము సమస్త ఉపద్రవముల నుంచి రక్షించును గాక అగ్ని నీటిని విడిచినట్లు అతడు మమ్ము విడుచును గాక బాధించకుండును గాక. నమో అస్త్వస్మై". అతనికి నమస్కరించుచున్నాను.
9. భవునకు నాలుగు మారులు, ఎనిమిది మారులు నమస్కరించుచున్నాము. పశుపతికి పది మరులు నమస్కరించుచున్నాము. గోవులు, అశ్వములు, ప్రజలు, మేకలు, గొర్రెలు ఈ పంచ పశువులను రక్షించును.
10. నీవే చతుర్ధిశలు, ద్యులోకము, భూమి, విశాల అంతరిక్షము అగుచున్నావు. భూమి మీద ఉన్న సకల ప్రాణ జాలము నీవే అగుచున్నావు.
ఆరవ సూక్తము
వినియోగము :- అస్యసూక్తస్య పూర్వసూక్తేన సహ ఉక్తో వినియోగః.
1. పశుపతీ! విశ్వభువనములు నిలిచి ఉన్న వసుధయను మహాకోశము నీవే యగుచున్నావు. నీకు నమస్కరించుచున్నాము. మమ్ము కాపాడుము. మాంస భక్షక శ్వానములు తలలు విరియబోసుకొని ఏడ్చు పిశాచములు మా నుంచి దూరమగును గాక.
2. రుద్రుని ధనుస్సు హరితము. హిరణ్మయము. సహస్రప్రఘ్ని. శతవధము దానికి బాణము ఎక్కుపెట్టి ఉన్నది. దేవతల ఆయుధమగు ఆ అమ్ము ఎటు ఎక్కుపెట్టబడినదో ఆ 'దిశకు నమస్కరించుచున్నాము.





