Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


   

                యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్ |
                 నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

                       
                         శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత
                                  పదకొండవ కాండ
                               మొదటి అనువాకము
                                మొదటి సూక్తము

   
    అగ్నే జాయస్వాదితిర్నాథితేయం బ్రహ్మౌదనం పచతి పుత్ర కామా |
    సప్త ఋషయో భూతకృతస్తే త్వా మన్దన్తు ప్రజయా సహేహ ||

   
1.    అదితి పుత్రకామయై ప్రార్దించుచు బ్రహ్మౌదనమును పచనము చేయుచున్నది. అగ్నీ! ఆవిర్భవింపుము. భూతకృతులగు సప్తఋషులు ప్రజాసహితుడవై వచ్చుటకు నిన్ను మథింతురు గాక.
   
వినియోగము :-

   
    ఈ అనువాకపు మొదటి నాలుగు సూక్తములు అర్ధ సూక్తములు అనబడుచున్నవి.
   
    ఈ అర్ధసూక్తముచే బ్రహ్మౌదన సవమున హోమించుటకు ముందు హావిని అభిమర్సన, సంపాతన, దాతృవచన, దానములు చేయునది.
   
    మొదటి ఋక్కుచే బ్రహ్మౌదనాది సవ యజ్ఞములందు మథించబడు అగ్నిని అనుమంత్రించునది. రెండవ ఋక్కుచే మథన సమయమున వెలువడు ధూమమును అనుమంత్రించునది. మూడవ ఋక్కు యొక్క మూడు పాదములచే మథించగా పుట్టిన అగ్నిని అనుమంత్రించునది. "అస్యై రయిమ్' అను నాలుగవ పాదముచే పత్ని కొరకు ఫలము కోరుచు అగ్నిని అనుమంత్రించునది. నాలుగవ మంత్రముచే పుల్లలచే మండు నిప్పును అనుమంత్రించునది. "ఉత్తమం నాకమ్" ఈ నాలుగవ పాదమును దాతచే అనిపించునది.
   
    బ్రహ్మౌదన సవయజ్ఞమున కర్త ధాన్యమును దేవత, మానవ, పితరులకని మూడు భాగములు చేసి ఆరవ మంత్రపు మూడు పాదములచే అనుమంత్రించునది. "అగ్నీ సహస్వాన్" అను నాలుగవ పాదముచే అనుమంత్రించి దాత దేవ భాగమును 'కుంభ' లో వేయునది. ఏడవ ఋక్కుచే హోమించుటకు ముందు ధాన్యమును రోటిలో వేయునది. బ్రహ్మౌదన అగ్ని వెనుక ఎద్దు చర్మము పరచి యజమానిచే ఎనిమిదవ మంత్రము చదివించునది. తొమ్మిదవ ఋక్కు మొదటి పాదముచే పరచిన చర్మము మీద రోలు రోకలి పెట్టి మిగిలిన మూడు పాదములచే ధాన్యమును దంచునది. పదవ ఋక్కు మొదటి సగముచే దంచుటకు గాను రోకలిని పత్నిచే పట్టించునది. రెండవ సగముచే నిర్వాపనానంతరము వరుని వరించు వారిని అనుమంత్రించునది.
   
2.    కోరికలు తీర్చువారును. జగన్మిత్రులును అయిన ఋత్విజులారా! అగ్నిని మథించి పొగను కల్పించండి. అగ్ని సత్పురుషుల రక్షకుడు. స్తుతులు విని వారి శత్రుసేనను అణచువాడు. అగ్ని యొక్క వీర భటుల సేనయే దస్యులను అణచి వేసినది.
   
3.    అగ్ని మథనమున ఆవిర్భవించువాడు మహా వీర్యప్రదాత.
   
    జాతవేదాగ్నీ! భూత కృతులగు సప్తర్షులు నిన్ను వ్యక్తము చేసినారు. "అస్యైరయిం సర్వవీరం నియచ్చ" ఈమెకు ధనమును వీర సంతతిని ప్రసాదించుము.
   
4.    అగ్నిదేవా! సమిధలచే సమిద్దుడవై ప్రజ్వరిల్లుము. విద్వాంసులగు దేవతలకు హవిని అందించుము.
   
    జాతవేదా! దేవతల కొరకు హవిని సిద్దపరచుము. యజమాని దేహము పతనమైనంత అతనిని స్వర్గమున కెక్కించుము.
   
5.    దాన్యమును పూర్వము వలె దేవతలకు, పితరులకు, నరులకని మూడు భాగములు చేసినాను. దేవతలారా! మీ భాగములను గుర్తించండి. స్వీకరించండి. యజమాన పత్నికి ఇష్ట ఫలప్రాప్తి కలిగించండి.
   
6.    అగ్నిదేవా! నీవు శత్రు దమనుడవు మా శత్రువులను రాల్చుము. ఈ గృహము కొలతల ప్రకారము నిర్మించబడినది. ఇందు బంధువులు ఆనందింతురు గాక.
   
7.    యజమానీ! నీవు బంధువుల సహితము సారవంతుడవై వర్ధిల్లుము. నీ ధర్మపత్ని తల ఎత్తు కొనునట్లు చేయుము. దేహము రాలిపోయిన పిదప విష్టప స్వర్గలోకమని దేనిని అనుచున్నారో అట్టి ఊర్ధ్వ నాక లోకమునకు అధిరోహించుము.
   
8.    ఈ భూమి చర్మమును స్వీకరించును గాక. తదుపరి భూమాత మమ్ము అనుగ్రహించును గాక. అథ గచ్చామ సుకృతస్య లోకమ్" తదుపరి సుకృతుల లోకమునకు వెళ్ళుదుము గాక.
   
9.    ఋత్వికా! రాతి రోలు రోకళ్ళను యజమానికి శుభము కలుగుటకు గాను చర్మము మీద పెట్టుము.
   
    పత్నీ! నీవు నా బంధువులను హతమార్చదలచిన వారిని హతమార్చుము. తదుపరి రోకలిని ఎత్తి నా ప్రజలను ఉన్నతులను చేయుము.
   
10.    వీర అధ్వర్యూ! సుకృతలగు రోలు రోకళ్ళను నీ చేతులతో ఎత్తుము. యజ్ఞయోగ్య దేవతలు యజ్ఞమునకు వచ్చి ఉన్నారు.
   
    యజమానీ! కర్మ సమృద్ది, ఐహికసమృద్ది, ఆముష్మిక సమృద్ది అను మూడు వరములు కోరుము. వానిని నీ కొరకు సాధించుచున్నాము.
   
    రెండవ సూక్తము
   
    వినియోగము :- దీని వినియోగము బ్రహ్మౌదనమున అని పూర్వ సూక్తమున చెప్పబడినది.
   
    మొదటి మంత్రపు సగభాగముచే చేటలోనికి బియ్యము తీసికొనునది. రెండవ సగముచే వ్యర్ధములను తొలగించునది. 2వ మంత్రముచే వ్యర్ధములను తీసివేయునది. 3వ మంత్రముచే నీరు తెచ్చి నారిని పిలుచునది. 4వ మంత్రపు తొలి పాదముచే వచ్చుచున్న పత్నిని అనుమంత్రించునది. తదుపరి రెండు పాదములచే పత్నిని ఆహ్వానించునది. చివరి పాదముచే పత్ని కర్తను పిలుచునది. నీటి కుండను కర్తకు అందించునది. 5వ మంత్రము యొక్క తొలి పాదముచే నీటి కుండను నేలమీద ఉంచి మిగిలిన మూడు పాదములచే కుండను చర్మము మీద పెట్టునది.
   
    పైతృ మేధిక చయన కర్మమున 5వ మంత్రముచే అస్థికలను రాళ్ళు లేక ఇటుకలచే కప్పునది.
   
    6వ మంత్రముచే చరు స్థాలిని నిప్పుమీద పెట్టునది. దర్శపూర్ణ మాసపు దర్వాధి శ్రయణమున దీని వినియోగము.
   
    బ్రహ్మౌదనసవము నందే 7వ మంత్రముచే అధిశ్రిత చరుపాత్రలో నీరు పోయునది. 8వ మంత్రముచే చెదిరిపడిన నీటిలో బియ్యము వేయునది. దర్శపూర్ణ మాసపు చరు స్థాలి యందు నీరు, బియ్యము వేయునపుడు 7, 8 మంత్రముల వినియోగము.
   
    9వ మంత్రముచే చరు వండునది. ఆ కర్మముననే ఇది దాతృ వచనమున వినియోగమగును.
   
1.    చేటా! బియ్యపు వ్యర్ధములను తొలగించుట నీ కార్యము చెరుగుట కారణము. వీరపుత్రి యగు అదితి నిన్ను అందుకొనును గాక. ఈ పత్నిని హింసించుటకు సేనను సమకూర్చు వారిని తిరస్కరించుటకు బియ్యమును, వ్యర్ధమును వేరు చేయుము. ఈమెకు ధనమును, శూర సంతతిని ప్రసాదించుము.
   
2.    తండులములారా! మీరు స్థిరపడుటకు మిమ్ము వర్ధిల్ల చేయుచున్నాము. యజ్ఞమున వినియోగమగు మీరు వ్యర్దములను తొలగించుకొనండి. మేము సిరిగల వారమై సమానులను దాటిపోదుము గాక. శత్రువుల కాళ్ళు విరిచి పడవేయుచున్నాము.
   
3.    నారీ! నీరు తెచ్చుటకు వెళ్ళుము. నీరు నింపుకొని త్వరగా రమ్ము నీటి వద్దనున్న గోవులు కుండను నీతలకు ఎత్తుదురు గాక. వానిలో యజ్ఞయోగ్య జలమును గ్రహించుము. కాని వానిని విడువుము.
   
4.    అలంకరించుకున్న యువతులు వచ్చినారు. పత్నీ! నీవు హాయిగా లెమ్ము. ఉపక్రమించుము. పతితో కూడి సుపత్ని వగుము. సంతానముతో కూడి సంతానవతివి అగుము. రమ్ము. నీకు యజ్ఞఫలము కలుగునట్లు యజ్ఞ కుంభమును పట్టుము.
   
5.    జలములారా! మీలో సారవంతమగు శక్తిని ఋషులు మంత్ర ప్రభావమున ప్రవేశపెట్టినారు. మీరు చర్మము మీద ఆసీనులు కండి. ఈ యజ్ఞము మాకు గోవులను, ఫలితములను, సంతానమును, పశువులను వీరులను ప్రసాదించును గాక.
   
6.    అగ్నీ! ఈ యజ్ఞార్హమగు చరు స్థాలి నీ మీద నిలుచును గాక. నిర్మలము, తపింపచేయు నీ వేడిచే ఈ చరును ఉడికించుము. ఆర్షేయులు, దేవతలు తమ భాగములు తీసికొని దీనిని ఉడికింతురు గాక. వసంతాది ఋతువులును దీనిని తపింప చేయుదురు గాక.
   
7.    ఈ జలము శుద్దము, పవిత్రము, యోషి ద్రూపము, యజ్ఞియము, ఇది చరుస్థాలి యందు చేరును గాక. అట్టి జలము మాకు పుత్రులను, బహు పశువులను ఇచ్చును గాక. ఓదనము వండిన యజమానికి సుకృత లోకములు కలుగును గాక.
   
8.    ఈ తండులములు మంత్రపూతములు. శుద్దములు ఘ్రుత, సోమాంశములు. ఇవి చరు స్థాలి యందున్న నీటియందు చేరును గాక. చరుస్థాలి తండులములను స్వీకరించును గాక. కర్తకు సుకృత లోకములు కలుగును గాక.
   
9.    ఓదనమా! నీకు పుణ్యఫలప్రాప్తి కలుగును గాక. నీవు స్వర్గమున నీ మహిమచే సహస్ర విధములుగ విస్తరిల్లుదువు గాక. నీ వలన ఏడు తరముల పితరులు, ఏడు తరముల పుత్రులు సంత్రుప్తులు అగుదురు గాక. పదిహేనవ వాడనైన నేను కూడ తృప్తుడనగుదును గాక.
   
10.    ఈ యజ్ఞము సహస్ర పృష్ఠము. శతధారలది అక్షయము. ఈ బ్రహ్మౌదనము దేవయానము - స్వర్గము. బలిహరణమునకు ఈ ఇంట మా వాళ్ళను ఉంచుచున్నాను. నాకు సుఖములు ప్రసాదించుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.