Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

22.    "యత్ తే పృచ్చం యేతే బాలా య దూధో యేచతేస్తనాః |
    ఆమిక్షాం....."

   
23.    "యాస్తే జంఘాయాః కుష్టికా ఋచ్చరా యే చ తే శఫాః |
    ఆమిక్షాం......"

   
24.    అవధ్య శతౌదనే! నీ చర్మము, లోమములు దాతకు క్షీర, ఘ్రుత, మధు, అమిక్షలను ప్రసాదించును గాక.
   
25.    దేవీ! నీ క్రోడములు నేతితో పురోడాశమగును గాక. క్రోడములను రెక్కలు చేసికొని పాచకుని సహితముగ స్వర్గమునకు చేరుము.
   
26.    రోలు, రోకలి, చేట యందు మిగిలిన బియ్యమును, వాత, మాతరిశ్వ, పవమానములు తోలకున్న - అగ్ని సుహుతము చేయును గాక.
   
27.    జలదేవిని, మధుమతిని, ఘ్రుతశ్చుతము బ్రాహ్మణుల చేతికి వేరువేరుగా ఇచ్చుచున్నాము. బ్రాహ్మణులారా! మేము కోరినన్నియు మాకు కలిగించండి. "వయం స్యామపతయో రయీణామ్" మేము ధనపతులము అగుదుము గాక.
   
                                           రెండవ సూక్తము - 10
   
    పూర్వసూక్తమున చెప్పిన 'వశ' కేవలము మేధ్య మాంసాత్మక గోవు మాత్రము కాదు. విశనానంతరము ఆమె మహా దేవతయై దేవతలందు సర్వాత్మిక యగుచున్నది. యజ్ఞియులందు యజ్ఞియ యగుచున్నది. ఈ సూక్తమున ఆమె ప్రశంస మాహాత్మ్యము చెప్పబదినది.
   
1.    అఘ్న్యే! పుట్టిన, పుట్టనున్న నీకు దండము. నీ రోమములకు, ఖురములకు, రూపమునకు దండము.
   
2.    వశకు దగ్గర ఉండవలసిన ఏడింటిని, దూరము ఉంచవలసిన ఏడింటిని, యజ్ఞ శిరమును తెలిసినవాడు వశాపరిగ్రహణము చేయగలవాడు అగుచున్నాడు.
   
3.    నేను దగ్గర ఉండవలసిన ఏడింటిని, దూరము ఉంచవలసిన ఏడింటిని, యజ్ఞ శిరమును, వాని యందలి సోమమును సహితము తెలిసినాను.
   
4.     ఏ వశయందు ద్యౌ, పృథివీ, జలము రక్షితమై ఉన్నదో అట్టి సహస్ర ధారను మంత్రముచే సంబోధించుచున్నాము.
   
5.    ఆమె పృష్ఠమున "శతం కంసాః శతం దోగ్ధారః శతం గోప్తారో" ఆమెను ప్రాణనము వేయు దేవతలకు వశ ఒక విధముగ తెలియును.
   
6.    వశ యజ్ఞపది. ఇర - క్షీర - స్వధ - ప్రాణ - మహీలుక ఆమె పర్జన్యుని రక్షించుచున్నది. మంత్రశక్తిచే దేవతలకు తృప్తి కలిగించుచున్నది.
   
7.    వశా! నీ యందు అగ్ని, సోములు ప్రవేశించి ఉన్నారు. పర్జన్యుడు నీ నూపురము, మెరుపులు నీ స్తనములు అగుచున్నవి.
   
8.    వశా! నీవు మొదలు జలమును, తదుపరి శక్తిని, మూడవదిగా రాజ్యమును, చివరకు పాలు, అన్నము ప్రసాదించుచున్నావు.
   
9.    ఋతావరీ! ఆదిత్యులచే పిలువబడి నీవు వారి వద్దకు చేరినపుడు ఇంద్రుడు నీకు వేయి పాత్రల సోమము త్రావించినాడు.
   
10.    నీవు అనూచీ ఇంద్రుని వద్ద ఉన్నప్పుడు ఋషభుడు నిన్ను ఆహ్వానించినాడు. అందువలననే వృత్రుడు కోపమున "పయః క్షీరం" దొంగిలించినాడు.
   
11.    వశా! ధనపతి క్రోధమున నీ క్షీరములను వశపరచుకున్నాడు. వానిని స్వర్గము మూడు పాత్రలందు రక్షించుచున్నది.
   
12.    అథర్వుడు దీక్షయందు రమణీయ కుశలపై ఆసీనుడై ఉన్నప్పుడు వశ అచటి సోమమును మూడు పాత్రల లోనికి నింపినది.
   
13.    వశ సోమముతో పాటు సకల 'పద్వతు' లతో కలసిపోవు చున్నది. ఆమె సముద్ర మధ్యస్థులైన గంధర్వులతోను "కలిభిః" కలిసి ఉంటున్నది.
   
14.    వశ వాయువుతోను - రెక్కల ప్రాణులతోను కలిసి ఉంటున్నది. ఋక్సామములను ధరించి సముద్రమున నాట్యము చేయుచున్నది.
   
15.    భద్రవశ సూర్యునితో కలసి, అందరి నేత్రములతో కలిసి, జ్యోతులను ధరించి సముద్రమున కన్న ప్రఖ్యాతమైనది.
   
16.    ఋతావరీ! నీవు హిరణ్యావృతవై నిలిచి నపుడు వేగవంత సముద్రము నీ భుజములంతది అయినది.
   
17.    అథర్వ దీక్షయందుండి రమణీయ కుశలపై అసీనుడైనపుడు వశ "ద్వేష్టి" స్వధ, కళ్యాణకరి అగుచున్నది.
   
18.    వశ రాజన్యులకు తల్లి - స్వధకు మాత అగుచున్నది. వశ యొక్క ఆయుధము యజ్ఞము దాని నుండి 'చిత్తమజాయత' విత్తము పుట్టినది.
   
19.    బ్రహ్మ కకుదము నుండి ఒక బిందువు పైకి ఎగిసినది. అది వశ అయినది - హోత అయినది.
   
20.    వశా! నీ ముఖము నుండి గాధలు, 'ఉష్ణిహ' నుండి బలము, బలము నుండి యజ్ఞము వ్యక్తములైనవి. నీ స్తనముల నుండి రశ్ములు వెలువడినవి.
   
21.    వశా! 'ఈర్మ్య' 'సక్థుల' నుండి అయనములు, ఆంత్రముల నుండి 'అత్రము', ఉదరము నుండి లతలు కలిగినవి.
   
22.    వశా! నీవు వరుణుని ఉదరమున ప్రవేశించినపుడు బ్రహ్మ నిన్ను పిలిచినాడు. అతడే నీ నేత్రమును తెలియ గలిగినాడు.
   
23.    సమస్త ప్రాణులు గర్భము నుండి పుట్టుటకు భయపడుచున్నవి. వశయే వానిని పుట్టించుచున్నది. బ్రహ్మ ఆమెకు బంధువగుచున్నాడు.
   
24.    ఒకడు 'యుధ' ను సృజించుచున్నాడు. ఆ ఒక్కడు వశయే యగుచున్నాడు. వశీ తరాంసి యజ్ఞము - తరసాం నేత్రము అగుచున్నది.
   
25.    వశయే యజ్ఞమును ప్రతిగ్రహించుచున్నది. వశయే సూర్యుని నిలిపి ఉంచినది. పడిపోకుండగ అని. బ్రహ్మ మరియు అన్నము వశయందే ప్రతిష్టితములు.
   
26.    వశామేవామృతమాహుర్వశాం మృత్యు ముసాసతే |
    వశేదం సర్వమభవద్ దేవా మనుష్యా అసురాః పితర ఋషయః ||

   
27.    ఈ విషయములను గ్రహించినవాడు వశను ప్రతి గ్రహించువాడు అగుచున్నాడు. అప్పుడు యజ్ఞము పరిపూర్ణమై దాతకు సకల ఫలములు కలుగుచున్నవి.
   
28.    వరుణుని నోటి యందు మూడు నాలుకలు వెలుగుచుండును. వానిలో మధ్యన శోభిల్లునది "సావశా దుష్ప్రతిగ్రహా".
   
29.    వశ యొక్క రేతస్సు నాలుగ భాగములైనది. ఒకటి జలము, రెండవది అమృతము, మూడవది యజ్ఞము, నాల్గవది పశువు అగుచున్నది.
   
30.    వశా ద్యౌర్వశా పృథివీ వశా విష్ణుః ప్రజాపతిః | వసువులు, సాధ్యులు వశ పాలే త్రాగుచున్నారు.
   
31.    సాధ్యులు, వసువులు వశపాలు త్రావి, సూర్య మండలమందుండి వశను ఉపాసించుచున్నారు.
   
32.    ఒకడు వశనుండి సోమము పితికినాడు. ఒకడు ఆమె ఘ్రుతమును ఉపాసించినాడు. ఈ విషయముల తెలిసి వశను దానము చేసినవాడు "త్రిదివం దివః" కు చేరుచున్నాడు.
   
33.    వశయందు తపస్సు, బ్రహ్మ, సత్యము నిలిచి ఉన్నవి. వశను బ్రాహ్మణులకు దానము చేసినవాడు సర్వలోకములను అనుభవించుచున్నాడు.
   
34.    వశాం దేవా ఉప జీవన్తి వశాం మనుష్యా ఉత |
    వశేదం సర్వమభవద్ యావత్ సూర్యో విపశ్యతి ||

   
    వశ వలెనే దేవతలు, మనుష్యులు ఉపజీవించుచున్నారు. సూర్యుడు ఎంతవరకు చూచుచున్నాడో అదంతయు వశయే అగుచున్నది.
   
వ్యాఖ్య :- తొలి సూక్తమున "తస్యా వధేన తస్యా మాంసాహుత్యాచ యద్యజనం తద్ అగ్నిష్టోమాదపి అతిరాత్రా దపిచ శ్రేష్ఠం ఇత్యాది రూపా ప్రశంసా" అన్నాడు.
   
    అట్లనుట వలన గోవధ ఎక్కువైనట్లున్నది. గోవును రక్షించుటకు గోవును ప్రశంసించినట్లున్నారు. రక్షించవలసిన దానిని ప్రశంసించుట నేటి అత్యాధునిక ప్రచార సాధనములు సహితము చేయుచున్నవి.
   
                                                  ఇది ఒక ఆలోచన.
   
   
   
     దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును, కమలానామ్నిధర్మ పత్నీ సమేతుండునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన అథర్వ వేదసంహిత యందలి పదవకాండ సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.