Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అడిగిన సామాను ఇవ్వనందుకు గులాబ్ చంద్ అనే మార్వాడీ వృద్దున్ని దెబ్బలు కొట్టారు.
మల్లారెడ్డిని కమ్యూనిస్టులు చంపారు. బదులుగా బుచ్చయ్యను చంపి - అతని కొంప తగలబెట్టారు.
గిరిజనులను బాధించిన తీరు వర్ణనాతీతం.
శ్రీనివాసరావు అనే పోలీసు అధికారి ఉండేవాడు. అతనికి - ఎందుకో - నేనంటే అభిమానం! అతను బేతాళునిలా ఉండేవాడు. నన్ను అవలీలగా ఎత్తుకునేవాడు. వాళ్ళు కమ్యూనిస్టులమీద దాడికి అనేకసార్లు వెళ్లారు. ఒకసారి నన్ను తీసికెళ్లాడు!
అవి బయ్యారం గుట్టల ప్రాంతం లారీలు - జీపులు - మందీ మార్బలంతో అక్కడికి చేరాం. భోజనాదుల ఏర్పాట్ల అట్టహాసం జరిగింది. కొందరు గిరిజనులను పట్టితెచ్చారు. కమ్యూనిస్టుల తావరం చూపవలసిందని వైర్ని నానాయాతనలు పెట్టారు. ఆ హింసలకు తాళజలక ఒకడు అంగీకరించాడు!
అది తమ ఘన విజయంగా భావించారు పోలీసులు. ఆ రాత్రి పార్టీ చేసుకున్నారు. బాగా రాత్రి అయింది. పోలీసుల వలయం మధ్య అధికారుల గుడారాలున్నాయి. నేను శ్రీనివాసరవు గుడారంలో ఉన్నాను. అందరూ పడుకున్నారు - కాపలా వారు తప్ప!
అర్ధరాత్రి దాటింది. అడవి నిశ్శబ్దంగా ఉంది. పోలీసులు భయం భయంగా ఉన్నారు. గుండె చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అలాంటిస్థితిలో తుపాకులు పేలిన శబ్దం. అధికారులు దడుచుకున్నారు. లేచారు. Fire అని ఆదేశించారు. త్రీనాట్ త్రీలు స్టెన్నులు - బ్రెన్నులు వందల సంఖ్యలో పోలీసులు పేలుస్తున్నారు. పోలీసులు సమావేశం అయినారు. వారికీ బెదురే! ఏ చెట్టుచాటు నుంచి వస్తారో! ఏ పుట్టనుంచి వస్తారో! ఏ కొండమీది నుంచి వస్తారో! ఎంత మంది వస్తారో!
ఫైరింగు ఆపమన్నారు. ఆగింది. అంతా నిశ్శబ్దం. అందరి ప్రాణాలూ బిలబిల మంటున్నాయి. అంతా ఊపిరి బిగపట్టి ఉన్నారు.
మరొక దిశనుంచి కమ్యూనిస్టుల కాల్పులు!
మళ్ళీ పోలీసుల తుపాకులు ప్రేలాయి ఎన్ని? ఎందుకు? ఎటు? ఎంత సేపు? పోలీసుల తుపాకులు నిలిచాయి! అంతా నిశ్శబ్దం. అందరి ప్రాణాలూ బిలబిలమంటున్నాయి. అంతా ఊపిరి బిగపట్టి ఉన్నారు.
మరొక దిశనుంచి కమ్యూనిస్టుల కాల్పులు!
మళ్ళీ పోలీసుల కాల్పులు! అలా ఆటలాడించారు కమ్యూనిస్టులు. వారి ఆటలతో తెల్లవారింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇహ పోలీసుల రాజ్యం!
కొండ చుట్టిన పోలీసులు కొందరు గిరిజనులు వెంట కదిలారు. గిరిజనులు అవలీలగా కొండలు ఎక్కుతున్నారు. పోలీసులు అధికారులు కష్టంగా కదులుతున్నారు.
అందరూ ఒక గుహకు చేరారు. చాల జాగ్రత్తగా తుపాకులు కలుస్తూ గుహలో ప్రవేశించారు. "శ్రీనివాసరావూ! చస్తావు. వెనక్కు మళ్ళు" అని గోడలమీద వ్రాసి ఉంది. భోజనాలు చేసిన పచ్చి విస్తళ్ళు - పదార్ధాలు మిగిలిన కుండలూ ఉన్నాయి. వాళ్ళు రాత్రి అక్కడే ఉన్నారు! పోలీసులు నిర్ధారించుకున్నారు. అప్పుడూ ఈ కొండ మీదే ఉన్నారు. అదీ తేల్చుకున్నారు అయినా మనం ముందుకు పోలేం. అదీ నిర్ణయించుకున్నారు.
పోలీసులు వెనకడుగు వేశారు! కొండ దిగారు! కొండను తవ్వారు. ఎలుక కూడా దొరకలేదు. ఎలామరి? రిక్తహస్తాల్తో కదలరాదు. నంజప్ప దొరకు సమాధానం చెప్పాలి. అతనికి పీనుగులను అప్పగించాలి!
నిన్న పట్టుకున్న గిరిజనులను వదిలాం అన్నారు. వాళ్ళను పరిగెత్తమన్నారు. పరిగెత్తేవాళ్ళమీద కాల్పులు జరిపారు! ఇద్దరు అమాయక గిరిజనులు కూలారు!
వారినే కమ్యూనిస్టులు అన్నారు. వారు ఎదురు కాల్పుల్లో కూలారు అన్నారు. మానుకోటలో ప్రదర్శన ఏర్పాటు చేశారు!
నేను ఆ దురంతాలను ప్రత్యక్షంగా చూచాను. వారం రోజులు మనిషిని కాలేదు. మళ్ళీ శ్రీనివాసరావు వంక చూడలేదు!
ఇన్ని ఆకృత్యాలు - దుష్క్రుత్యాలు - నీచకృత్యాలు - అమానుషాలు - దుర్మార్గాలు - దుహ్రత్వాలు - రాక్షసాలు - పీశాచకృత్యాలు జరుగుతున్నా స్వతంత్ర భారత ప్రజ - స్వతంత్ర భారతనేతలు కిమ్మనలేదు!
స్వాతంత్ర్యం ఇందుకోసమే వచ్చిందా అని తల్లడిల్లాడు ఒక గాంధీవాది. అతని మనసు తుకతుకలాడింది. మిన్నకుండలేకపోయాడు. సుందరరావుగారు ఖమ్మంలో - ఈ హింసాకాండకు వ్యతిరేకంగా - ఆమరణ నిరశన వ్రతం సాగించారు.
మనిషి ఒక్కడే - దుర్భలుడు - నిరాయుధుడు - దండెత్తనూ లేడు - అన్నం మానేశాడు. అంతే!
సుందరరావుగారి నిరశనం ఢిల్లీ దర్భారును కదిలించింది! ఢిల్లీ నుంచి మాటలు ముచ్చట్లు - సంప్రదింపులు - రాయబారాలు సాగేయి.
సుందరరావుగారు నిరసన వ్రతం ముగించారు
సుందరరావు గారి నిరశన వ్రతం సాధించిన విజయాలు.
1. ముళ్ళ తీగల జేళ్ళు - కాన్సంట్రేషన్ క్యాంపులు - ఎత్తివేశారు.
2. జేళ్ళలో ఉన్న వేలాది మందిని - వారి కేసులను విచారించదానికి కమిటీలు ఏర్పడ్డాయి. వాటిలో కాంగ్రెస్ వారు జొరపడ్డారు. అది వేరే కథ! ఎన్ని కథలని వ్రాయడం?!
3. పోలీసుల అత్యాచారాల మీద విచారణ జరపడానికి కమిటీలు ఏర్పడినాయి. ఆ కమిటీలలో పోలీసులకు సారథ్యం వహించిన నిన్నటి దొరలు - నేటి ఖద్దరు దారులను నియమించారు! అది వేరే కథ!! ఎన్ని కథలని వ్రాయడం?!
ఇంతటి రాక్షసత్వంలో సహితం మానవత మెరుపులు కనిపిస్తాయి!
మలయాళ సాయుధ పోలీసు గార్లలోని ఒక పేదింటి పిల్లను ప్రేమించాడు. అమ్మాయి ఆంద్రదేశం వదిలి మళయాళ దేశం వెళ్ళడానికి సిద్దం అయింది. వారు పూలదండలు మార్చుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు!
దాడిలో ఒక జవాను కాలు విరిగింది. పోలీసులు అతన్ని వదిలి వెళ్ళిపోయారు. గిరిజనులు అతన్ని కాపాడారు. చికిత్స చేశారు. బాగు చేశారు. జవాను గిరిజనులను విడిచి పోలేదు. వారితోనే ఉండిపోయాడు!
పోలీసులు దాడిలో ఒక ఊరిని ధ్వంసం చేశారు. వారు ఊరు విడిచి సాగుతున్నారు. కూలిన ఇంట్లోంచి పసిపాప కేక వినిపించింది. పోలీసులు నిలిచి పోయారు. పాపను తెచ్చారు. పాప తల్లి దాడిలో అశువులు బాసింది. ఒక పోలీసు ఆ పాపను తెచ్చుకున్నాడు! పోలీసు క్యాంపులో పాప!
కమ్యూనిస్టులు కూడా తప్పులు చేశారు! పోలీసు చర్య తరువాత పోరాటం మానుకొని ఉంటే ఇంత ధ్వంస రచన జరిగేది కాదేమో!
కమ్యూనిస్టులు తప్పులు చేశారు. అది వారికే తెలుసు. కాని వారి తప్పు ఇంత ధన - మాన - ప్రాణ నష్టానికి దారి తీసింది తెలంగాణలో మాత్రమే! ఇదీ తెలంగాణ ప్రత్యేకత!
1. వారు అంతర్జాతీయంగా వ్యవహరించారు. అది విహంగ విహారం!
2. వారికి జాతీయ పరిస్థితులు కనిపించలేదు. వారు గుర్తించలేదు. ఇది నేల విడిచిన సాము.
3. భారతదేశానికి స్వతంత్రం రావాలన్నారు. పాకిస్తాన్ ఏర్పడాలన్నారు. తీరా స్వాతంత్ర్యం వచ్చింతరువాత అది 'స్వాతంత్ర్యంకాదు' అన్నారు!
4. పోలీసు చర్య వరకు వారు నిజాముకు వ్యతిరేకంగా పోరారు. అన్ని పార్టీలూ పోరు సలిపాయి. అది తెలంగాణ ప్రజల జాతీయ పోరాటం. పోలీసు చర్య తరువాత మిగతా పార్టీలు పోరాటాలు మానుకున్నాయి. కమ్యూనిస్టులు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం సాగించినట్లు?
5. వచ్చింది స్వతంత్రం కాదన్న భారత కమ్యూనిస్టుపార్టీ పిడివాదాన్ని - తెలంగాణం పరిస్థితులు అర్ధం చేసుకోకుండా - తెలంగాణ ప్రజలమీద రుద్దారు!
6. అంతటి భారత ప్రభుత్వాన్ని - తెలంగాణలోని రెండు జిల్లాల పోరాటంతో కూల దోయగలం అనుకోవడం భ్రమమాత్రం అగును. హేతువాదం ఏ మాత్రం కాదు!
7. పోరాటకాలంలో పేదలకు పంచిన భూములను రక్షించడానికి పోరాటం కొనసాగించాం అనే ఒక సాకు ఉంది. సోషలిస్టు ప్రభుత్వాలు తప్ప - అన్ని ప్రభుత్వాలూ స్వంత ఆస్తి సంరక్షణకే ఉంటాయి. వారు ముద్రవేసిన 'బూర్జువా భారత ప్రభుత్వం' పంచిన భూములను రక్షిస్తుంది. అనుకోవడంలో వివేకం ఎంత?
8. పోరాటం జరుగుతున్నది తెలంగాణలో తెలంగాణలో పార్టీ నిర్మాత రావి నారాయణరెడ్డి పోలీసు చర్య తరువాత పోరాటం కొనసాగించడాన్ని వారు వ్యతిరేకించారు. "ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకొని, చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఉచితంగా ఉండేది. అలాంటిదేమీ జరుగలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు నాయకులు ఈ నిర్ణయాన్ని తీసుకొని అసంఖ్యాకులైన ప్రజల నెత్తిన రుద్దారు" అన్నారు రావివారు.





