Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam


 
    గద్వాలలో మంగలి కానీకి ఇద్దరికి గొరుగుతాడు. ఒకడు గొరిగించుకున్నాడు. కాణీ ఇచ్చాడు. మంగలి దగ్గర ఏగాణి - అంటే కాణీలో సగం - లేదు ఆసామి అది వదలదలచలేదు తన భార్య బుర్ర గొరిగించాడు!
    
    మొత్తంమీద నవాబులు లుచ్చాలు - దుర్మార్గులు - దుష్టులు - నీచులు - దౌర్జన్యపరులు అందువల్ల వారికీ నష్టపరిహారంలో జాగీర్లలో ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలు చేపట్టాలని వాదించాను.
    
    'సారథి' అని కాంగ్రెస్ వారు - ఆ రోజుల్లో - ఒక వారపత్రిక నడిపించారు. దానికి తాళ్ళూరి రామానుజస్వామి సంపాదకులు. దానిలో ఒక సుదీర్ఘవ్యాసం వ్రాశాను. అందులో జాగీర్ల పుట్టుపూర్వోత్తరాలు వివరించాను. వారికి నష్టపరిహారం ఎందుకు చెల్లించరాదో చెప్పాను. ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరాన్ని చూపించాను. "జాగృతి"కి కూడా ఒక వ్యాసం వ్రాశాను.
    
    అది కమ్యూనిస్టులను అణచడానికి ప్రభుత్వం అతిక్రూరంగా విజ్రుంభించిన కాలం అప్పుడు అలా వ్రాయడం సాహసం. అలా వ్రాసినందుకు నాకు కమ్యూనిస్టు ముద్ర గుద్దారు. మా ఇల్లు సోదా చేశారు. దమ్ములేక నన్ను అరెస్ట్ చేయలేకపోయారు.
    
    అప్పటి పరిస్థితులలో ఏ రాజకీయ పార్టీ నా వాదనను బలపరచలేకపోయింది.
    
    జాగీర్దార్లకు నష్టపరిహారం చెల్లించారు.
    
    అయినా జాగీర్ల రద్దు విప్లవాత్మక చర్య!
    
    తెలంగాణలో కమ్యూనిస్టులను అణచడానికి ప్రభుత్వం అమానుషమూ అతిక్రూరమూ - పైశాచికమూ అయిన మార్గాలను అవలంబించింది. ఈ విషయంలో అది హిట్లరు భూతం వద్ద పాఠాలు నేర్చుకుంది.
    
    నియమ నిబంధనలు, శాసనం - చట్టం ఉన్నది అనే విషయం పూర్తిగా మరిచిపోయింది. ఒక్క వ్యక్తి - సర్దార్ పటేల్ అభీష్టం మేరకు ప్రజలపై మధ్యయుగాలను మరిపించే దౌర్జన్యాలకు, నీచాతినీచ కృత్యాలకు దిగింది.
    
    ఈ వివరాలు నా "జనపదం" నవలలో వర్ణనాత్మకంగా - విశదంగా - వివరించాను. "జనపదం" 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, పోలీసులు నక్సలయిట్లను అణచడానికి - అలాంటి పద్ధతులనే అనుసరిస్తున్నారని - అనేక మంది లేఖలు వ్రాశారు.
    
    ప్రభుత్వం - దౌర్జన్యాలు జరపడంలో - నిజామును, రజాకార్లను - బ్రిటీషు ప్రభుత్వాన్ని - నాజీ హిట్లరును తల తన్నింది.
    
    i) ప్రభుత్వం - పోలీసుల సహితంగా - స్థానికులను ఎవరినీ విశ్వసించలేదు. సర్దార్ పటేల్ కెప్టెన్ నంజప్పను - సర్వాధికార సమన్వితుని చేసి - కమ్యూనిస్టులను రూపుమాపడానికి - హైదరాబాదుకు పంపించారు. నంజప్పకు ఎలాంటి అడ్డు ఆటంకాలు లేవు అతడు విశృంఖలంగా ప్రవర్తించాడు.
    
    మద్రాసు - మలబారు - కర్ణాటక - మహారాష్ట్ర సాయుధ పోలీసులను తెలంగాణలో దింపారు. ప్రతి ఊరిలో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. పరిపాలన సాంతం సాయుధ పోలీసుల అధీనంలో ఉండేది. వారిది ఎదురులేని అధికారం!
    
    ii) ఆ కాలంలో అడవులు ఎక్కువగా ఉండేవి నంజప్ప - రోడ్డుకు ఇరువైపుల వందగజాల వరకు - అడవులను నరికి వేయించాడు. ఇది కమ్యూనిస్టుల నుండి పోలీసులను రక్షించడానికి తీసుకున్న చర్య.
    
    iii) నంజప్ప - కమ్యూనిస్టులను ఎదురుకాల్పులపేర హతమార్చడానికి - ఆదేశించిన మొట్టమొదటి ప్రబుద్దుడు.
    
    vi) పోలీసులు - కమ్యూనిస్టుల మధ్య ప్రజలు నలిగిచచ్చారు. పగలంతా పోలీసులు - ప్రజలను కమ్యూనిస్టుల ఆచూకీ తెలుపమని బాధించేవారు. మా ప్రాంతంలో బాధించేవారిని 'దొర' అంటాం. ప్రజలు పోలీసులకు "పగటి దొరలు" అని పేరు పెట్టారు. రాత్రిపూట కమ్యూనిస్టులు గ్రామాలలోకి వచ్చేశారు. పోలీసులకు సమాచారం అందించారని ప్రజలను బాధించేవారు. ప్రజలు కమ్యూనిస్టులకు "రేయి దొరలు" అని పేరు పెట్టారు.
    
    పగటి దొరలు - రేయిదొరల మధ్య ప్రజలు చస్తున్నారని ఉభయులూ గుర్తించలేదు. పోలీసు చర్య తరువాత అన్ని పార్టీల ఉద్యమాల్లోను "ప్రజలు" ఆవిరి అయిపోయారు! పేరుకు మాత్రం ఉద్యమాలు మిగిలాయి!

    v) కమ్యూనిస్టులు ఉద్యమకాలంలో దొరల భూములను పంచిపెట్టారు. దొరలు గ్రామాలు వదిలి పారిపోవడం కామ్రేడ్లకు ఉపకరించింది. దొరలు సాయుధ పోలీసుల వెంట తిరిగి వచ్చారు. భూములను లాక్కున్నారు. గడీలు బాగుచేసుకున్నారు. సాయుధ పోలీసు క్యాంపులను - సాయుధ గుండాలను గడీల్లో పెట్టుకున్నారు. వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కద్దరు ధరించారు. వారి తాబేదార్లతో ఊళ్ళో కాంగ్రెస్ కార్యాలయాలు ఏర్పరచారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తల పని, అందినవరకు కాజేయడం - సాయుధ పోలీసులకు సాయపడడం మందు, మగువ సహితంగా అన్నీ సాయుధభటులకు సరఫరా చేయడం.
    
    Vi) సాయుధ పోలీసులు - కాంగ్రెస్ కార్యకర్తలు లారీలలో తెల్లవారు జామున బయల్దేర్తారు. ఎంచుకున్న అయిదారు ఊళ్ళను చుట్టుముడ్తారు. గ్రామప్రజలను - స్త్రీ పురుషబాలవృద్దుల సహితంగా ఒకచోట చేరుస్తారు. వారిని నానా విధాలుగా హింసిస్తారు.
    
    తుపాకి మడమలతో - కర్రలతో - చింత బరికెలతో విచక్షణారహితంగా కొడ్తారు.
    
    మనుషులను - ఒకరు కాళ్ళు, ఒకరు చేతులు పట్టుకొని - ఊయల ఊపి విసురుతారు.
    
    ప్రజలను చెట్ల కొమ్మలకు తలక్రిందుగా వ్రేలాడతీసి బెత్తాలతో కొడ్తారు.
    
    ప్రజలను బోర్ల పడుకోబెడ్తారు. వారిమీది నుంచి బూట్లకాళ్ళతో నడుస్తారు.
    
    ఎర్రటి ఎండలో ఏటి ఇసుకలో పడుకోపెడ్తారు. పైనుంచి ఇష్టం వచ్చినట్లు బాదుతారు.
    
    లారీ నడిపిస్తారు. ముందు జనాన్ని ఉరక మంటారు. ఉరకలేనివారు లారీకింద నలుగుతారు.
    
    కమ్యూనిస్టులు అని అనుమానించినవారి పంట కుప్పలు తగలపెడ్తారు. ఇళ్ళు దగ్ధం చేస్తారు. ఒకచోట వేరు శనగ గిడ్డంగి తగలపెట్టి - కాలిన వేరుసెనగ కాయలు ఏరుకు తిన్నారు!
    
    అనుమానించినవాణ్ణి ముందు పరిగెత్తమని వెనుక కాల్చి చంపుతారు.
    
    ప్రజలను విచక్షణారహితంగా అరెస్టు చేస్తారు. ఆ విధంగా 50,000 మందిని అరెస్టు చేసి కాంపుల్లో పెట్టారు. క్యాంపు అంటే ముళ్ళతీగ మధ్య పెట్టడం. వాళ్ళకు గిద్దెడు జొన్న గుగ్గిళ్ళు - లోటా నీళ్ళు ఇస్తారు. అన్నీ క్యాంపులోనే ఎండకు వానకు తడిసి - కలరా వచ్చి అనేకులు చచ్చారు. వారి లెక్కలు లేవు.
    
    గ్రామాలలో ఒకచోట చేర్చి హింసించిన ప్రజలను ముందు తోలుకుంటూ పోలీసులు - కమ్యూనిస్టుల కోసం - కొండలూ, కోనలూ గాలిస్తారు. వారిలోనే కొందరిని హతమారుస్తారు. కమ్యూనిస్టులను చంపామని చాటుకుంటారు. రజాకార్ల ఆయుధాలు తామే పెట్టి - పట్టుకుంటారు. కమ్యూనిస్టుల ఆయుధాలు పట్టుకున్నట్లు చాటుకుంటారు. పోలీసు అధికారులు ప్రమోషన్లు ఆర్జించుకుంటారు.
    
    కొన్ని ఊళ్ళలో ప్రజలను దిగంబరంగా ఊరేగించారు. వారిని ఇనుపరాడ్లతో కొట్టారు.
    
    స్త్రీల మానభంగలను గురించి చెప్పుకోవడానికి సభ్యసమాజం తలవంచుకుంటుంది. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణానికి కౌరవ సభ సాంతం క్రుంగిపోయింది. కాని ఆనాడు జరిపిన సామూహిక మానభంగాలకు ప్రజాప్రభుత్వం కనీసం సిగ్గు ప్రకటించలేదు.
    
    ఒక నిరపరాధిని - స్త్రీని - అనేకులు మానభంగం చేశారు!
    
    అనేక మంది - అనేక మంది స్త్రీలను, ఒకేచోట చెరిచారు!!
    
    పసికూనలున్న బాలెంతలను సహితం మానభంగం చేశారు.
    
    పసి - పన్నెండు, పదమూడేళ్ళ బాలికలను రాక్షసంగా చెరిచారు. వాళ్ళ బతుకులు బుగ్గిచేశారు!!!
    
    వేయి మంది మహిళల మానభంగం జరిగినట్లూ -వంద మంది మరణించినట్లూ అంచనా.
    
    గార్ల ప్రాంతం కమ్యూనిస్టులకు నెలవు. అందుకు ఆనాటి కారణం అక్కడి అరణ్యాలు కాని ఈనాటికీ అది కమ్యూనిస్టులకు పెట్టని కోటయే ఇంతవరకు అక్కడి నుంచి కమ్యూనిస్టేతరుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. కమ్యూనిస్టుపార్టీ ఎమ్.ఎల్.ఎ. గెలిచిన ఏకైక నియోజక వర్గం ఇల్లందు. గార్ల ఇల్లందులో అంతర్భాగం.
    
    తొలినాళ్ళలో గార్ల ప్రాంతంలో కమ్యూనిస్టు మర్రి విత్తనాలు నాటింది మేమే అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం!  ఆ రోజుల్లో కాంగ్రెసువారు గార్ల స్టేషనులో దిగడానికి జంకారు!! రైలులో వచ్చి - రైలు కదిలింతరవాత కరపత్రాలు చల్లిపోయారు!!!!
    
    గార్లలో మలబారు సాయుధ పోలీసు క్యాంపు పెట్టారు. దేవినేని నారాయణ పెద్దభూస్వామి. జాతీయవాదిని అనేవాడు. కద్దరు తప్ప కట్టి ఎరుగడు! అతని స్థలంలో పోలీసు క్యాంపు పెట్టించాడు. వరు జరిపిన దౌర్జన్యాలకు అంతులేదు. గ్రామాన్ని చిత్రగుప్తుడు లేని యమపురి చేశారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.